యెషయా 53:10-11
హెబ్రీయులకు 4:14-16
మార్కు 10:35-45
ఈనాటి దివ్యగ్రంథపఠనాల ద్వారా తల్లి శ్రీసభ, నిజమైనటువంటి నాయకుడు లేదా అధికారి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అన్న
అంశాలను గూర్చి తెలియ జేస్తుంది. దేవుని దృష్టిలో గొప్పనాయకుడు అంటే గొప్ప
సేవకుడు. సేవకునిలా సేవ చేస్తూ ఇతరుల కొరకు తన జీవితాన్ని సైతం త్యాగం చేయగలిగేటటువంటివాడే
దేవునియందు గొప్పవాడిగా పరిగణింపబడతాడు అని ఈనాటి వాక్యం మనకు బోధిస్తుంది.
పరలోక అధికారానికి, ఇహలోక అధికారానికి వ్యత్యాసం
ఇహలోక నాయకత్వానికి, పరలోక నాయకత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. మనం గమనించినట్లయితే నేటి సమాజంలో అధికారం అనే వ్యామోహాన్ని ప్రతిఒక్కరిలో మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలో నాయకత్వం అంటే అధికారం. ఆ అధికారంతోనే సామాన్యుల మీద పెత్తనం చెలాయించడం అన్న తలంపులతో ఉన్నాము. రాజకీయ నాయకులు అధికారం అనే పదవి కోసం ప్రజల చుట్టూ తిరిగి, ప్రజల అవసరాలు తీరుస్తాము అని ఎన్నో వాగ్ధానాలు, హామీలు ఇస్తుంటారు. కానీ ఒక్కసారి వారు ఆ అధికార పదవిని దక్కించుకున్నాక వారు వారిని గెలిపించినటువంటి సామాన్యులను, చేసిన వాగ్ధానాలు ఏవి గూడ వారికి గుర్తుకురావు. అన్ని మర్చిపోయి, అధికారం, దనం అనే వ్యామోహం లో జీవిస్తుంటారు. ప్రజలు ఎన్నుకున్న నాయకున్ని గూడ వారు కలవడానికి వీలులేనటువంటి పరిస్థితిలో మనం జీవిస్తున్నాము. ఈ అధికార వ్యామోహం అనేది మనందరిలో ఉండవచ్చు. అందరూ సేవచేయడానికి నాయకులమవ్వాలని అనుకుంటారు కానీ ఎక్కువగ వారి అధికారం చేత సేవించబడుటకే నాయకులు అవుతుంటారు. ఇటువంటి వ్యామోహం ఎప్పటినుంచో మానవాళి స్వభావం లో ఉంది. ఆదాము అవ్వ ఇద్దరు గూడ దేవుని లాగ, దేవునికంటే గొప్పవారు అవ్వాలనుకున్నారు అని ఆదికాండము లో చూస్తున్నాము. ఇటువంటి అధికార వ్యామోహాన్ని గురించి ఈనాటి సువిశేష పఠనంలో వింటున్నాము. కానీ పరలోక రాజ్యములో అందరూ సమానత్వం కలిగి దేవునియందు ఆనందంగా జీవిస్తారు అని పరిశుద్ధ గ్రంధంలో చదువుతున్నాము.
అధికార వ్యామోహం
క్రీస్తు ప్రభు శిష్యులలో యోహాను మరియు యాకోబు లు ఇద్దరు పరలోక రాజ్యంలో క్రీస్తు తన సింహాసనంలో ఆసీనుడైనప్పుడు వీరికి తన కుడి, ఎడమ వైపులా ఉండుటకు అధికారాన్ని ఇవ్వమని కోరుతున్నారు. ఈ తలంపు శిష్యులందరిలో ఉండవచ్చు, కానీ వీరిద్దరు మాత్రమే తమ కోరికను క్రీస్తు నందు వ్యక్తపరిచారు. ఎందుకు వీరిద్దరే ఆ కోరికను వ్యక్తపరిచారు అంటే క్రీస్తు చేత ప్రేమించబడ్డారు మరియు క్రీస్తు వారిని అన్నీ ప్రాంతాలకు తీసుకొని వెళ్లారు. క్రీస్తుప్రభువు వారి సమాజంలో బహిరంగంగా చేసిన గొప్ప అద్భుత కార్యాలను చూసి ఆయన తప్పకుండ రోమ్ సామ్రాజ్యానికి గొప్ప రాజు అవుతాడు అన్న దృఢ నమ్మకం వారికి కలిగింది. అందుకే వారు క్రీస్తుకి దగ్గరగ మంచిగా జీవిస్తున్నారు. ఆవిధంగా అయినా మంచి హోదా వారికి దక్కుతుందని. అదేవిధంగా మనము ధ్యానించినట్లయితే పరిశుద్ధగ్రంథంలో చూస్తూ ఉన్నాము యోహాను, పేతురు మరియు యాకోబులు ముగ్గురు క్రీస్తుకి చాలా దగ్గరగ జీవిస్తూ ఆయనను ఎక్కువ వెంబడించి క్రీస్తు యొక్క మహిమాన్వితాన్ని కళ్లారా చూసియున్నారు. కాబట్టి అందుకే వారు క్రీస్తునందు దగ్గరగ మంచివారిగా జీవించారు. ఆవిధంగా అయినా వారికి మంచి హోదా, అధికారం దక్కుతుందేమో అని.
అదేవిధంగా
మనము ధ్యానించినట్లయితే పరిశుద్ధగ్రంథంలో చూస్తూన్నాము యోహాను, పేతురు మరియు యాకోబులు ముగ్గురు గూడ క్రీస్తుకి చాలా దగ్గరగ
జీవిస్తూ ఆయనను ఎక్కువగ వెంబడించి క్రీస్తు యొక్క మహిమాన్వితాన్ని కళ్లారా
చూసియున్నారని లూకా సువార్త 9 : 28 -30 వరకు గల వచనాలలో చూస్తున్నాం. "ఆయన
పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థనచేయుటకు ఒక కొండ యెక్కెను. ఆయన ప్రార్థించు చుండగా
ఆయన ముఖరూపము మారెను; ఆయన
వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అను వారు". క్రీస్తు దివ్యరూపధారణ మొందిన తర్వాత మోషే ఏలీయా ప్రవక్తలు క్రీస్తుతో
మాట్లాడటం వారు చూసిన అనుభవంతో ఈయన నిజంగా పరలోక రాజ్యానికి అధిపతి అని
గ్రహించారు. అందుకే వారు క్రీస్తు యొద్దకు వచ్చి " మీరు మీ రాజ్యములో
మహిమాన్విత సింహాసనంపై ఆసీనులైనపుడు మమ్ము మీ కుడి ఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు
అని మార్కు 10 : 37 లో
చదువుకొనియున్నాము. కానీ పరలోక రాజ్యం ఇహలోక రాజ్యమువలె అధికారాలతో గాక అందరూ
సమానత్వం కలిగి ఉంటారని ఆ సమయంలో వారు తెలుసుకోలేకపోయారు.
గొప్పవాడు అంటే గొప్ప సేవకుడు
అందుకనే
క్రీస్తు ప్రభు తన రాజ్యములో గొప్పవారిగా ఉండాలంటే ఏ వింధంగా జీవించాలి అని
తెలియజేస్తున్నారు. గొప్ప నాయకుడు లేదా గొప్ప అధికారి అంటే సేవ, త్యాగం అనే లక్షణాలు కలిగినటువంటి గొప్ప సేవకుడు అని మత్తయి శుభవార్త 20 : 26
- 27 వచనాలలో ప్రభువు పలుకుతున్నాడు.
"మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను; మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండ
వలెను". అందుకు గొప్ప ఉదాహరణ క్రీస్తు ప్రభువు అని ఈ
నాటి మొదటి పఠనంలో యెషయా ప్రవక్త పలుకుల ద్వారా మనం వింటున్నాము. ఇదిగో ఇజ్రాయేలు
ప్రజలు బానిసలుగా ఎన్నో కష్టాలు బాధలు పడుతున్నటువంటి సమయంలో వారికి ఆశ, ఊరట, దైర్యం కలిగేలా
వారికి రక్షణ బడయుటకు బాధామయ సేవకుడు అంటే ప్రభుని సేవకుడు, రక్షకుడు రాబోతున్నాడు అని ప్రవచిస్తున్నాడు.
బాధామయ సేవకుడు {ప్రభుని సేవకుడు}
బాధామయ
సేవకుడు మనందరి బాధలను, పాపాలను తన మీద
వేసుకొని తన రక్తాన్ని చిందించి మనలను
రక్షింతును అని యెషయా ప్రవక్త తెలియపరుస్తున్నారు. ఆ బాధామయ సేవకుడు తన తండ్రి
సంకల్పం ప్రకారం మన పాపములకొరకు నలిగిపోయి తాను అనుభవించిన శిక్ష ద్వారా మనకు
సమాధానం కలిగించును. ఆయన తండ్రి సంకల్పము ప్రకారం బాధా భరితునిగా, తనను తాను పాపపరిహారబలి చేసి, పెక్కుమంది దోషములను భరించును, అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. ఆ విధముగా ప్రభుని సేవకుడు
ఆనందమొంది తన తండ్రిచేత గొప్పవానిగాను ఘనులలో నొకనిగా గణింపబడును అని తండ్రి
దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలుకుచున్నాడు. ఈ ప్రవచనాలు అన్ని గూడ క్రీస్తు
ప్రభువు జీవితంలో నెరవేరాయి. మత్తయి 20:28 లో క్రీస్తు ప్రభువు తన తండ్రి
సంకల్పాన్ని తెలియజేస్తున్నాడు. "మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు
రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము
నిచ్చుటకును వచ్చెనని చెప్పెను".
గొప్పవానిగా [సేవకునిగా] రెండు ముఖ్య లక్షణాలు
క్రీస్తు
అనుచరులమైన మనం పరలోకరాజ్యములో దేవుని యందు గొప్పవారిగా ఉండాలంటే ముందు ఒక గొప్ప
సేవకుని వలె జీవించాలి, క్రీస్తువలె మనం గూడా ఇతరులకు సేవ చేస్తూ మన ప్రాణాలను గూడా
త్యాగం చేయుటకు సిద్ధంగా ఉండాలి అని ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. క్రీస్తు
సేవకునిగా జీవించడం అంటే అంత సులువైనది కాదు. అందుకే ఈనాటి సువిశేషంలో ప్రభువు
ఇద్దరి శిష్యులను రెండు ముఖ్య లక్షణాలను గూర్చి అడుగుతున్నాడు. అవి 1 .
నా పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని. దీనికి అర్థం నేను పొందబోయే
శ్రమలను బాధలను మీరు గూడా భరించడానికి సిద్ధంగా ఉన్నారా అని. అందుకు వారు చేయగలం
అని సమాధానమిస్తున్నారు. నిజానికి వారు ఆ సమయంలో అర్థం చేసుకోలేకపోయారు. ఎప్పుడైతే
వారు క్రీస్తుని సిలువపై మరణించడం చూసారో అప్పుడే వారికి క్రీస్తు చెప్పిన మాటలకు
అర్థం తెలిసింది. ఆ తర్వాత వారు నిజమైనటువంటి క్రీస్తు సేవకులుగా, సేవ చేసి క్రీస్తుకి మాట ప్రకారం క్రీస్తు కొరకు వారి
ప్రాణాలు సమర్పించి క్రీస్తు లో బాగస్తులయ్యారు. 2 . రెండవది నేను పొందబోవు
బప్తిస్మమును మీరును పొందగలరా? అని. బప్తిస్మము అనగా మన పాపపు జీవితానికి మరణించి క్రీస్తులో నూతనంగా
జీవించడం. అంటే తనను తాను త్యజించు కొని తన సిలువని ఎత్తుకొని క్రీస్తుని
అనుసరించడం. ఈ రెండింటిని శిష్యులందరు వారి జీవితాలలో పాటించి పరలోక రాజ్యంలో
గొప్పవారిగా పరిగణింపబడ్డారు.
యోబు గారు గూడా ఒక మంచి సేవకునివలె
దేవుని యందు విశ్వాస పాత్రుడుగా జీవించాడు. ఆయనకు ఎన్నో శోధనలు బాధలు ఎదురయ్యాయి
అయినప్పటికీ తాను దేవునియందు విశ్వాసం కోల్పోకుండా నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యావే దేవుడే ఇచ్చెను యావే దేవుడే తీసికొని పోయెను, దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. అని జీవించాడు. అదేవిధంగా
ఎందరో పునీతులు తమ జీవితాలను త్యజించుకొని వారి సిలువను ఎత్తుకొని ప్రభుని
మార్గములో సేవకులుగా జీవించి ఈనాడు దైవ రాజ్యంలో దేవునితో కలసి జీవిస్తున్నారని
మనందరం విశ్వసిస్తున్నాము. మరి ఈనాడు క్రైస్తవులుగా మన గొప్పతనం దేనిలో
చూపిస్తున్నాము? పరలోకంలో పొందబోయే జీవితాన్ని
మరచిపోయి ఇహలోక జీవితమే శాశ్వతమైనది అన్న భ్రమతో, ధనం,
అధికారం అనే వ్యామోహంతో జీవిస్తున్నామా అని ఆత్మపరిశీలన
చేసుకోవాలి. క్రీస్తు ప్రభు ప్రకారం అధికారం అంటే సేవ. ఆ సేవ లో వచ్చే బాధలను
కష్టాలను ఎదుర్కొనుటకు కావలసిన శక్తీ ఉందా అని ప్రశ్నించుకోవాలి.
ప్రధానయాజకుడు
క్రైస్తవులమైన
మనందరం ఎటువంటి బాధలకు కష్టాలకు బయపడి లొంగిపోకుండా ఉండమని ఈ నాటి రెండవ పఠనములో
చూస్తున్నాం. ఎందుకంటే బలహీనులమైన మనలను బలపరుచుటకు మన ప్రధానయాజకుడు క్రీస్తు
ప్రభువు మనకు మధ్యవర్తిగా తోడుగా ఉన్నాడు. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని
వ్యక్తి కాడు. మనవలె ఆయన అన్ని విధాలుగా శోధింపబడియు, పాపం చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. ఆయన యందు దృఢమైన
విశ్వాసం కలిగి జీవించెదము. ఆయన తన అనుగ్రహమును మనకు దయచేయును అని హెబ్రీయులకు
రాసిన లేక 4 : 14 - 16 లో చూస్తున్నాము.
కనుక
క్రైస్తవులమైన మనం అనుదిన ప్రార్థన ద్వారా క్రీస్తువలె సేవకులకు సేవకులవలె
జీవించుటకు కావలసిన అనుగ్రహాలు దయచేయమని ప్రార్థిస్తూ ఆవిధంగా జీవించుటకు
ప్రయత్నించుదము.
ఎందుకంటే గొప్పతనానికి క్రైస్తవ మార్గం ఏమిటి అంటే, సేవ.
పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమెన్.
By Br. Vijay Talari OCD
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి