24, డిసెంబర్ 2021, శుక్రవారం

క్రీస్తు జయంతి మహోత్సవము

క్రీస్తు జయంతి మహోత్సవము
మన కోసము దేవుడు మానవుడై రక్షకునిగా జన్మించెను.

క్రిస్మస్ అర్ధరాత్రి పూజ      క్రిస్మస్ వేకువ జామున పూజ           క్రిస్మస్ పగలు పూజ
యెషయా 9:1-6                      యెషయా 62:11-12                     యెషయా 52:7-10
తీతు 2:11-14                          తీతు 3:4-7                                   హెబ్రీ 1:1-6
లూకా2:1-4                             లూకా 2:15-20                               యోహాను 1:1-18
ముందుగా మున్ముందుగా మీకందరికి క్రీస్తు జయంతి మహోత్సవ శుభాకాంక్షలు. క్రిస్మస్ అంటే అర్థమేమిటి? క్రిస్మస్(క్రీస్తు జయంతి) అంటే దేవుడు మానవుడై (యోహా 1:14) ఇమ్మానువేలుగా మన మధ్య, మనతో, మనలో ఉండటము (మత్తయి 1:22-23). ఆనందించడానికి, మహానందించడానికి సరియైన సమయమిది. ఎందుకంటే లోక రక్షకుడు మనకోసము, మన మధ్యలో, మనలో జన్మిస్తున్నారు. మనుష్యావతారము(దేవుడు మానవ రూపము దాల్చడము)  అనేది చరిత్రలో ఒక్కసారి మాత్రమే జరిగినది కాదు. ప్రతిరోజు జరుగుతున్నటువంటి ప్రక్రియ. చిన్నారి పొన్నారి బాలయేసు ప్రతి ఒక్కరి హృదయములో జన్మించేంతవరకు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. క్రీస్తు జయంతి కేవలము ఒక గొప్ప మహోత్సవము మాత్రమే కాదు, ఓ దైవానుభూతి. ఈ దైవానుభూతి క్రీస్తు మనలో జన్మించినప్పుడు మాత్రమే పొందగలము. లేదంటే ప్రతి క్రిస్మస్ పండుగ కేవలము ఒక మహోత్సవము లానే మిగిలిపోతుంది. కాబట్టి ఈ గొప్ప మహోత్సవ ప్రాముఖ్యతను, ఔన్నత్యాన్ని ఏ విధముగా మన జీవితాలకు అపాందించుకుని, ఆ క్రీస్తు జనన అనుభూతి ఏ విధముగా పొందాలో ఈ క్రింది మూడు అంశాల రూపేణా అర్ధము చేసుకుందాము. 
క్రీస్తు జనన ప్రవచనాలు, వాటి నెరవేర్పు
క్రీస్తు జయంతి పర్వము; మనకు ఆనందాల వరము
క్రీస్తు జయంతి పర్వము; మన రక్షణ చరిత్రలో ఓ అత్యుత్తమ ముఖ్య ఘట్టము 

క్రీస్తు జనన ప్రవచనాలు, వాటి నెరవేర్పు
క్రీస్తు జనన ప్రవచనాలు పాత నిబంధనలో లెక్కకు మిక్కుటము. కానీ మనము ఇక్కడ కొన్నింటిని మాత్రమే ధ్యానిద్దాము. చరిత్రలో ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించారు. కానీ ఏ వ్యక్తి గురించి కూడా ఈలాగున, ఈ సమయములో, ఈ స్థితిలో జన్మిస్తాడని ముందుగా ఏ ప్రవక్త ప్రవచించలేదు. కానీ క్రీస్తు ప్రభువు జన్మిస్తాడని కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచించారు.
"ప్రభువే మీకు ఒక గుర్తును చూపించును. యువతి గర్భవతియై ఉన్నది. ఆమె కుమారుని కనును. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుము" (యెషయా 7:14)
"మనకొక శిశువు జన్మించెను. మనము ఒక కుమారుని బడసితిమి. అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును" (యెషయా9:6-7)
"మీరు సీయోను కుమారితో ఇట్లు నుడువుము. ప్రభువు నిన్ను రక్షింప వచ్చుచున్నాడు." (యెషయా 62:11)
ఈ ప్రవచనాలు పొల్లుపోకుండా నెరవేరాయి.
ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు. అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను" (మత్తయి 1:22-23)
"నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టును. ఆయన క్రీస్తు ప్రభువు" (లూకా 2:11)
"ఆ వాక్కు (దేవుడై) మానవుడై మన మధ్య నివసించెను. (యోహాను 1:14)
క్రీస్తు జయంతి పర్వము; మనకు ఆనందాల వరము
క్రిస్మస్ దగ్గరకు వస్తుందంటే మనకు కలిగే ప్రథమ భావము, ఆనందము. క్రిస్మస్ మన జీవితాలలో చీకటిని తొలగించి వెలుగునిస్తుంది. నిరాశ,నిస్పృహలను తీసివేసి క్రొత్త ఆశలను చిగురింపజేస్తుంది. అశాంతిని తీసివేసి శాంతినిస్తుంది. పాపాన్ని ప్రక్షాళన గావించి రక్షణను ఇస్తుంది. దుఃఖాన్ని తీసివేసి ఆనందాన్నిస్తుంది. పునీత పౌలు గారు నుడువుచున్నారు,"ప్రభువు నందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు! మరల చెప్పుచున్నాను, ఆనందింపుడు (ఫిలిప్పు4:4), ఆనందించడానికి కారణము ప్రభవు దగ్గరలోనే ఉన్నారు (ఫిలిప్పు 4:5)." సీయోను కుమారి ఆనందనాదము చేయుము, ఇశ్రాయేలు హర్షద్వానము చేయుము, యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుము (జెఫ 3:14) ఎందుకనగా నీ దేవుడైన ప్రభవు నీ నడుమనున్నాడు(జెఫ 3:17). దేవదూత గొర్రెల కాపరులతో, "మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారము మీకు వినిపించెదను, మీకు ఒక రక్షకుడు జన్మించెను (లూకా 2: 10-11)
ఎందుకు   రక్షకుడు  నడుమనున్నాడని  అని ఆనందించాలి ? ఎందుకు అంటే  ఈ  రక్షకుడే  ఈలోక  సంతోషము కంటే అతీతమైన  ఆనందాన్నిస్తాడు.  ఈ ఆనందం ఏది,  ఎవరు  మననుంచి  తీసివేయలేరు.  ఇది  సత్యమైన  మరియు  శాంతియుతమైన  నిత్యానందం.  ఇమ్మానుయేలు  దేవునిగా  ప్రభు మనకోసం  మన మధ్య  జన్మించింది  మనతో ఉండడానికి (మత్తయి 1: 22 -23) మనలో  ఈ శాంతియుతమైన  నిత్యానందం నింపటానికి  దేవుడు మనతో  ఉండాలంటే  మనం దేవునితో వుండాలి.  మనం దేవునితో దేవుడు మనతో  ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తు జయంతి పర్వము మనకు ఆనందాల వరంగా మారుతుంది. అప్పుడు గొర్రెల కాపరులతో కలిసి 'మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగుగాక (లూకా 1:22-23)' అంటూ దేవుని స్తుతిస్తూ క్రీస్తు జయంతిని ఆనందముగా, మహానందముగా జరుపుకోగలము. 
ఈ లోకములో ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించారు. వీరందరూ జన్మించింది జీవించడానికి కానీ క్రీస్తు ప్రభువు జన్మించింది మరణించడానికి. తన జీవన, జీవిత, శ్రమల, మరణ పునరుత్తానాల ద్వారా మనకు రక్షణ తీసుకుని రావడానికి. మానవ రక్షణ చరిత్రలో క్రీస్తు జననము ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఒక మాటలో చెప్పాలంటే మానవ రక్షణ చరిత్రలో క్రిస్మస్ ఒక అత్యుత్తమ ఘట్టము. ఎందుకంటే స్వయానా లోక రక్షకుడు జన్మించిన తరుణము. ఈ తరుణము మానవులను పాప జీవితము నుండి పవిత్ర, పుణ్య జీవితానికి ఆహ్వానించే ముఖ్య సమయము. ఎందుకంటే రక్షింపబడాలంటే పవిత్ర జీవితము ఎంతో అవసరము. 
రక్షణలో రెండు పాత్రలున్నాయి. a. దేవుని పాత్ర, మరియు b. మానవ పాత్ర. 
దేవుని పాత్ర: దేవుడు లోక రక్షకుడు. మనలను రక్షింప జన్మించెను. అది మనకందరికీ తెలుసు. కాబట్టి మనము మన పాత్రపై మననము చేద్దాము. 
మానవ పాత్ర: లూకా19: 1-10 వచనాలలో జక్కయ ఇంటికి ఏ విధముగా రక్షణ వచ్చిందో మనము చదువుతున్నాము. జక్కయ సుంకరులలో ప్రముఖుడు, ధనికుడు(లూకా 19:1), యేసుని చూడాలనే కోరికతో ఉన్నాడు. ఆ కోరిక కార్య సాధనకు తన పొట్టి తనము అడ్డు రాలేదు, తన గురించి ఇతరులు ఏమనుకుంటారో అని తలంచలేదు. కానీ తన లక్ష్యము ఒక్కటే. యేసును చూడాలి. జనసమూహము ఎక్కువగా ఉండినను కూడా ముందుకు పరుగు తీసి మేడి చెట్టును ఎక్కాడు. అది చూచిన యేసు, “జక్కయ్య నీ ఇంటిలో ఉండ తలచితిని” అని చెప్పి పాపియైన జక్కయ ఇంటికి అతిధిగా వెళ్ళాడు. యేసు రాకతో జక్కయ జీవితము మారిపోయింది. ఒకనాడు అన్యాయముగా జనము నుంచి పన్ను తీసుకున్న జక్కయ్య ఇప్పుడు తన ఆస్తిలో సగము పేదలకు దానము చేయడానికి మరియు తాను ఎవరికైనా అన్యాయము చేసినచో నాలుగు రెట్లు కూడా ఇచ్చివేయుటకు సిద్ధముగా ఉన్నాడు. తన జీవితములో అచంచలమైన మార్పును చూసిన ప్రభువు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఏలన ఇతడును అబ్రాహాము కుమారుడే. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు, అని చెప్పారు. 
అవును క్రీస్తునందుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా మనము కూడా రక్షకుడిని స్వీకరించాలంటే బలమైన, ధృడమైన కోరికను కలిగి ఉండాలి. ఈ కోరిక కార్యసాధనకు శాయశక్తులా కృషించాలి. మన బలహీనతలను సహితము లెక్క చేయకూడదు. మన లక్ష్యము ఒక్కటై ఉండాలి. నేను నా కోసము జన్మించిన రక్షకుని నా జీవితములోనికి ఆహ్వానించాలి. నీ కృషిని చూసిన రక్షకుడు జక్కయ్యతో లాగానే నీతో కూడా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని ఓ శుభ సందేశాన్ని తెలియజేస్తాడు. 
కాబట్టి ఆ క్రిస్మస్ కేవలం ఓ మహోత్సవము లాగానే మిగిలిపోకూడదు. కానీ ఓ దైవానుభవముగా మారాలి. దైవానుభవముగా మారాలి అంటే క్రేస్తును స్వీకరించాలను నీ నిరీక్షణ నమ్మకముగా మారాలి, నీ నమ్మకము ఆనందముగా మారాలి, ఆనందము శాంతిగా మారాలి, శాంతి ప్రేమగా మారాలి. ఈ ప్రేమ క్రీస్తు కోసమై ఉండాలి. ఈ ప్రేమ నీలో క్రీస్తును జన్మింపజేస్తుంది. క్రీస్తులో నిన్ను జన్మింపజేస్తుంది. మరొకసారి మీ అందరికి క్రీస్తు జయంతి శుభాకాంక్షలు.
ఆమెన్.....
Br. Sunil Inturi OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...