12, ఫిబ్రవరి 2022, శనివారం

6 వ సామాన్య ఆదివారం ( ఏవరిని నమ్మాలి )

6 వ సామాన్య ఆదివారం 

యిర్మియా 17:5-8 1 కోరింథీ 15:12, 16-20, లూకా 6:17,20-26 

క్రీస్తు నాధుని యందు ప్రియ దేవుని బిడ్డలారా ఈనాడు తల్లి తిరుసభ  6 వ సామాన్య ఆదివారము లోనికి అడుగిడుతుంది. ఈనాటి దివ్య గ్రంధ పఠనాలు  అన్నీ దేవుని యందు విశ్వాసం గురించి భోదిస్తున్నాయి. ఈనాటి  మూడు పఠనాలు  మనము గమనించినట్లయితే మనకు ఒక సందేహము కలుగవచ్చు. అది ఏమిటంటే "ఎవరిని నమ్మాలి" అని ఎందుకంటే ఈనాటి మొదటి పఠనాన్ని గమనించినట్లయితే మొదటి పఠనం యిర్మియా గ్రంధము నుంచి తీసుకొనబడింది. యిర్మియా ఒక గొప్ప ప్రవక్త, దేవుని మాట కోసం తన జీవితాన్ని సైతం లెక్క చేయకుండ దేవుడు ప్రజలను  ఏవిధంగా శిక్షింపనున్నాడో , వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనభోతున్నారో తన జీవితం ద్వారా తెలిపిన  గొప్ప ప్రవక్త, ప్రజలను  దేవుని వైపు నడిపించడానికి తన ప్రాణములను సైతం పణంగా పెట్టిన గొప్ప ప్రవక్త. ఈ యిర్మియా  ప్రవక్త  రాజకీయంగా విఫలమైయాడు కానీ ఆధ్యాత్మికతలో మాత్రం దేవునికి ఏంతో దగ్గరయ్యాడు.  ఈనాటి మొదటి పఠనంలోని మాటలు యిర్మియా ప్రవక్త తానే స్వయంగా ప్రజలను హెచ్చరిస్తూ పలికిన మాటలు. ఎందుకంటే ఈ యూదా ప్రజలను దేవుడు బానిసత్వం  నుండి  తీసుకొని వచ్చి వారికి కావలసిన వన్ని ఇచ్చి వారికి అక్కున నిలిచాడు. 

ఈ యిస్రాయేలు  ప్రజలకు  ఏ ఆపదవచ్చిన వారికి సమీపమున లేదా సహాయముగా ఉండేది ఎవరు అంటే దేవుడు. దేవుడు వారికి అతి సమీప వ్యక్తి  పిలవగానే పలికే వ్యక్తి , వారికి ఏ ఆపద  వాటిల్లినా మొదటిగా తలచేది దేవుడినే చివరకు దేవుడు వారితో ఓడంబడిక కూడా  చేసుకున్నాడు. మీరు నా ప్రజలు , నేను మీ దేవుడను అని . ఈ ప్రజలకు  దేవుడు ఇంత చేసిన  తరువాత కూడా ఆపద వచ్చినప్పుడు దేవున్ని కాదని మానవుల సహాయం కొరకై వెళుతున్నారు. అది కూడా వారి శత్రువుల దగ్గరికి బాబిలోనియా రాజు యిస్రాయేలు ప్రజలను బానిసత్వమునకు తీసుకొని వెళ్ళాడు. ఆ బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించాడు. ఇప్పుడు బాబిలోనియా రాజు వారి మీదకు దండెత్తి వస్తున్నారని తెలిసి యిస్రాయేలు ప్రజలు ప్రాణముల మీద  తీపితో ఈజిప్టు దగ్గరకు సహాయముకై వెళుతున్నారు.  శత్రువులైన ఈజిప్టు రాజు నుండి కాపాడిన దేవుడిని మరచి ఈ ప్రజలు మానవుని సహాయము కొరకై పరుగు తీస్తున్నారు. 

దేవుడిని కాదని మానవుల మీద ఆధారపడిన వారు లేదా మానవులను నమ్మిన వారి గతి ఏ విధంగా ఉండునో దివ్య గ్రంధం చక్కగా వివరిస్తుంది. ఉదాహరణకు ఏసావు , యకొబును నమ్మితే, యాకోబు తన అన్న అయినటువంటి ఏసావును మోసం చేస్తున్నాడు. పాత నిభందనలోని యేసేపు తన అన్నలను నమ్మితే వారు యేసేపు చావుని కోరారు, సంసొను డెలీలా ను నమ్మితే డెలీలా సంసొనును మోసం చేసింది, ఇలా మనం నిజ జీవితంలో ఎన్నో చూస్తున్నాం, కొన్ని సార్లు అనుభవించే వుంటాం. కానీ దేవుడు మాత్రం వారు ప్రార్ధించిన ప్రతిసారీ, అడిగిన ప్రతిసారీ, మొరపెట్టుకున్న ప్రతిసారీ ఆలకించాడు,ఇచ్చాడు. వారి చెంతనే నిలిచాడు. పగలు మేఘ స్తంభం వలె రాత్రి అగ్ని స్తంభం వలె ఉంది కాపాడాడు. ప్రజలు ఎన్నిసార్లు మోసం చేసిన  దేవుడు మాత్రం దయ కలిగే ఉన్నాడు వారి యందు. ఈనాటి పఠనంలో కూడా తన ప్రవక్త అయిన యిర్మియాను పంపి తన ప్రజలను హెచ్చరిస్తున్నాడు. దేవునిపై నమ్మకము ఉంచి విశ్వసించువాడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టువలే ఎప్పుడు పచ్చగా ఉంటాడు, ఎప్పుడు ఫలిస్తూ ఉంటాడు, మానవులను నమ్మి వారిపై ఆధారపడువాడు  మరు భూమిలో ఉండు తుప్పలను పోలి ఉంటాడు అని హెచ్చరిస్తున్నాడు. కానీ యిర్మియా ప్రవక్త మాత్రం దేవుడిని చివరివరకు విడనాడలేదు  అందుకే యిర్మియాను ఒక గొప్ప ప్రవక్త గా భావిస్తుంటారు. 

ఈనాటి లూకా సువార్తలోని వచనాలు మనం మత్తయి సువార్తలో కూడా చూస్తాము. రెండు ఒకే విధంగా  ఉంటాయి. ఈ వచనాలు సరిగా చదివితే అవి విప్లవాత్మకంగా , సమాజ విలువలను గురించి  మాట్లాడినట్టుగా వుంటాయి. మత్తయి సువార్తికుడు ఆధ్యాత్మిక పేదరికం గురించి మాటలాడుతుంటాడు, కానీ లూకా సువార్తికుడు మాత్రం ఆనాటి కాలంలో జరుగుతున్న కలహాలు, హెచ్చుతగ్గులు గురించి మాట్లాడుతుంటాడు. నిజమైన పేదరికం గురించి వారు అనుభవిస్తున్న వాటి గురించి మాట్లాడుతున్నాడు. సువార్తలో ప్రభువు చెప్పినట్లు పేదరికం , ఆకలి, దాహం లాంటివి ఆనాటి కాలంలోని కలహాలు. ఆనాటి కాలం లోనే కాదు ఇప్పటికీ కొనసాగుతున్నావే ఇవి, మానవుడు దేవుని విలువలకంటే ప్రపంచ విలువులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అందుకే ప్రభువు అంటున్నారు ఆకలికొని ఉన్న వారులారా ఆనందపడుడు అని ధనికులకు శాపగ్రస్తులు అని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వస్తువులకు, విలువులకి ప్రాధాన్యత ఇచ్చేవాడు దేవుని  విలువులకు ప్రాధాన్యత ఇవ్వలేడు. హృదయాన్ని దేని మీద అయితే కేంద్రీకృతం చేస్తామో దాని కొరకై పరుగెడుతాము. ప్రపంచ వస్తువుల మీద అయితే వాటి కొరకై పరుగెడతాము కానీ వాటిని ఎప్పటికీ సాధించలేము, దేవుని మీద  అయితే మనం సాధించగలం. ఎందుకంటే మనం ఆయన ప్రజలం ఆయన మన దేవుడు. ఎవరైతే దేవుని విలువలకు ప్రాధాన్యత ఇస్తారో అట్టి వారు ఏటి ఒడ్డున నాట బడిన చెట్టు వలె నిరంతరం పచ్చిగా ఫలిస్తుంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారులారా ధన్యులు దైవ రాజ్యం అట్టివారిది. 

రెండవ  పఠనంలో పునీత పౌలుగారు క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థానమును  గురించి పునరుత్థానము నందు  విశ్వాసము గురించి ప్రస్తావించుచున్నారు. మొదటి కోరింథీయులు 15 వ అధ్యాయము అర్ధము చేసుకోవడానికి కష్టముగా ఉండేటువంటిది. అందులోని మర్మము అర్ధం కాదు. కొరయిన్థియ ప్రజలు శరీరము యొక్క ఉత్తానమును  తీరస్కరిస్తున్నారు. కానీ ప్రభువు యొక్క పునరుత్థానమును కాదు. పౌలు గారు చెప్పేది ఏమిటి అంటే శరీర ఉత్తానమును తీరస్కరిస్తే ప్రభుని పునరుత్థానమును కూడా తీరస్కరించినట్లే. శరీర ఉత్థానమును నమ్మని వాళ్ళు ప్రభుని పునరుత్థానమును ఎలా నమ్ముతారు? ఇలా అపనమ్మకము ద్వారా క్రైస్తవ సత్యాన్ని, నిజాన్ని, సందేశాన్ని  కించపరిచినట్లే. ఇప్పటి వరకు భోధించినది వ్యర్ధమైనట్లే ప్రభువు పునరుత్థానము కాకపోతే చేసే బోధన, విశ్వాసం అంతా వ్యర్ధమే. 

ఎందుకు పౌలుగారు ప్రభుని పునరుత్థానమునందు విశ్వాసాన్ని ముఖ్యముగా భావిస్తారు, అందులో దాగిన విలువలు, సత్యము ఏమిటి అంటే ప్రభువు అనేక సార్లు తన శిష్యులకు దర్శనమిచ్చారు.  

*క్రైస్తవులను హింసించే సౌలుకు సైతం దర్శనమిచ్చ పౌలుగా మార్చారు. 

*శిష్యులతో కలసి భుజించాడు, ప్రయాణించాడు ఇలా ఎన్నో జరిగాయి. 

*పునరుత్థాన సత్యము యూదులు చేసే అసత్య వాదనకన్నా బలమైనది, నిజమైనది. 

* ప్రభుని పునరుత్థానము మంచి చెడు మీద ఎంత బలమైనది అని నిరూపిస్తుంది. 

*ప్రభుని పునరుత్థానం ప్రేమ  అసహ్యం కంటే ఎంత బలమైనది అని నిరూపిస్తుంది. 

*ప్రభుని పునరుత్థానము బ్రతుకు చావు కంటే ఎంత బలమైనది అని నిరూపిస్తుంది. 

చివరిగా పౌలుగారు చెప్పేది ఏమిట అంటే  ఒక వేళ క్రీస్తు ప్రభుని పునరుత్థానం నిజము కాకుంటే , భోదించే సందేశం అబద్ధం అయితే పునరుత్థానంను విశ్వసించి చనిపోయిన వారి చావు, విశ్వాసం  వ్యర్ధమే వారి యొక్క విలువలు వ్యర్ధమే. 

పునరుత్థానమును జీవితంలో నుంచి తీసివేస్తే మనకు అయిన  క్రైస్తవ విశ్వాసాన్ని  చెడిపివేసినట్లే. "నేను కాదు జీవించేది నాలో జీవించేది క్రీస్తే" అని పౌలు గారి వలె మనము మన పునరుత్థాన విశ్వాసాన్ని చాటి చెప్పాలి. మనం మనయందును లేక మానవుల యందు కాక  దేవుని యందు నమ్మకం  ఉంచుదాం. ఆయనయందు  విశ్వాసంలో ధృడపడుదాం. 

Br. Lukas 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...