1, జులై 2022, శుక్రవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

 మత్తయి 9:9-13 

తరువాత యేసు అటనుండి వెల్లుచు, సుంకపు మెట్టుకడ కూర్చున్న మత్తయి అనువానితో "నన్ను అనుసరింపుము"  అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఆ ఇంటిలో యేసు భోజనమునకు  కూర్చుండినపుడు సుంకరులును, పాపులును  అనేకులు వచ్చి ఆయనతోను, ఆయన శిష్యులతోను పంక్తియందు కూర్చుండిరి. అది చూచిన పరిసయ్యులు "మీ బోధకుడు ఇట్లు సుంకరులతో, పాపులతో కలిసి భుజించుచున్నాడేమి?" అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలను ఆలకించిన యేసు,  "వ్యాధిగ్రస్తులకేగాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు గదా!నాకు కారుణ్యము కావలయునుగాని, బలి అవసరము లేదు అను  లేఖనమునందలి  అర్ధమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువవచ్చితిని కాని, నీతిమంతులను పిలుచుటకు రాలేదు" అని పరిసయ్యులకు ప్రత్యుత్తరమిచ్ఛెను. 

మత్తయి అను సుంకరిని యేసు ప్రభువు పిలుస్తున్నారు, యేసు ప్రభువు పిలుపుకు మత్తయి వెంటనే స్పందిస్తున్నారు. నాకు వేరె పని ఉంది అని కాని , లేక ఇంటి వద్ద చెప్పి వస్తాను అని కాని ఏమి చెప్పలేదు. యేసు ప్రభువు అడిగిన వెంటనే యేసు ప్రభువును అనుసరిస్తున్నారు. యేసు ప్రభువుని  శిష్యుడు కావాలి అంటే ఇది ప్రధానమైన లక్ష్యం.  యేసు ప్రభువుని శిష్యుడు ఎప్పుడు విధేయుడగా , సంసిద్ధుడుగా ఉండాలి. విధేయత  మరియు సంసిద్ధత రెండు మనం మత్తయిలో చూస్తున్నాము. విధేయత యేసు ప్రభువు అప్పజెప్పిన పని చేయడానికి మరియు మన కర్తవ్యం మీదనే దృష్టి మరల్చకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. సంసిద్దత మనలను ఎప్పడూ కర్తవ్య నిర్వహణ చేయడానికి, వెనుకడుగు వేయకుండా వుండటానికి ఉపయోగపడుతుంది.  యేసు ప్రభువును అనుసరించే వారు ఎల్లప్పుడు ఈ విధానంగానే ఉండాలి. అడిగిన వెంటనే మారు మాటలేకుండా ప్రభువును అనుసరించడానికి సిద్దపడటమే క్రీస్తు నిజమైన శిష్యుడు చేస్తాడు. 

"మీ బోధకుడు ఇట్లు సుంకరులతో , పాపులతో కలిసి భుజించుచున్నాడేమి?" అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి.  నీతి మంతుడైన పరగణించపడుతున్న ఒక వ్యక్తి ఎందుకు పాపులు, సుంకరులతో కలసి భుజించుచున్నాడు అని వారు యేసు ప్రభువును అడుగుతున్నారు. ఎందుకు యేసు ప్రభువు సుంకరులు, పాపులతో భుజించడానికి కారణం ఆయన వారి కోసం వచ్చారు. సుంకరులు , పాపులు దేవునికి దూరంగా ఉన్నారు. వీరు చేసిన పనుల ద్వారా వారు దేవునికి దూరంగా ఉన్నారు. కాని దేవుడు వీరికి కరుణ చూపించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు. దేవుడు వీరి దగ్గరకు వస్తున్నారు. వారిని తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళడానికి యేసు ప్రభువు సిద్ధంగా ఉన్నానని తెలియజేయడానికి వస్తున్నారు. వీరు పాపములో ఉన్న దేవునికి దూరంగా ఉన్న వీరిని మరల తండ్రి దగ్గరకు పోవుటకు అర్హులుగా చేయడానికి వీరితో కలసి భుజిస్తున్నారు. వీరితో కలసి భుజించడం వల్ల యేసు ప్రభువు వారిని తనతో కలసి ఉండటానికి వారి పాత జీవితం వదలి వేయడానికి ఆహ్వానం ఇస్తున్నాడు.  . 

ఇది పరిసయ్యులు సరిగా అర్ధం చేసుకోలేకపోయారు. యేసు ప్రభువును అపార్ధం చేసుకొని వారు శిష్యులను ప్రశ్నిస్తున్నారు.    పరిసయ్యులు బహిరంగంగా దేవుని ఆజ్ఞలును దిక్కరించిన వారితో  ఎప్పుడు కూడా భుజించరు. కాని యేసు ప్రభువు వారితో కలసి భుజిస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభువు   హ్ోషయ ప్రవక్త మాటలను గుర్తుచేస్తున్నారు. "నాకు కారుణ్యము కావలయునుగాని, బలి అవసరము లేదు"  హ్ోషయ ప్రవక్త  6:6 .  దేవునికి కావలసినది కారుణ్యము , బలులు కాదు. ఎవరికి ఈ కారుణ్యము మనం చూపించాలి అంటే అది ఎవరు అయితే పాపం చేసి దేవునికి దూరముగా ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే ఆకలితో ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే అనారోగ్యంతో ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే  అవసరంలో ఉన్నారో వారికి కరుణ చూపించాలి.  యేసు ప్రభువు చూపించిన కరుణ ఇటువంటి వారికి. వీరికి నిజానికి సమాజంలో ఒక స్థానం లేదు, యేసు ప్రభువు వీరితో ఉండటం వలన వీరికి సమాజంలో ఒక స్థానం ఇస్తున్నాడు. సమాజం వీరికి విలువ ఇచ్చే విధంగా చేస్తున్నారు. 

ప్రార్ధన : ప్రభువా! అనేక సార్లు మీరు నన్ను పిలిచిన కాని నేను మీ మాట వినక, నన్ను ఎందుకు దేవుడు పిలుస్తాడు అని అనుకున్నాను. మీరు మత్తయిని  పిలిచినట్లుగా మీచేత పిలువబడడానికి మీరు నా పవిత్రతని చూడరని, నేను అపవిత్రంగా ఉన్న నన్ను పిలుచుటకు వెనుకాడని మీ ప్రేమకు కృతజ్ఞతలు. మత్తయిని పిలిచినట్లుగానే నన్నును మంచి జీవితానికి పిలువండి. మత్తయి వలె నేను కూడా మీరు పిలిచిన వెంటనే మారు మాటలాడకుండా నేను మిమ్ము అనుసరించే విధంగా చేయండి. ప్రభువా మీరు వచ్చినది నన్ను పిలువడానికని , నాకు మీ ప్రేమను అందించడానికని, నా పాపములు క్షమించడానికని తెలుసుకొని వీటిని మీ నుండి వాటిని పొందుటకు నన్ను సిద్దపర్చండి. ప్రభువా మీరు  ఈ లోకానికి వచ్చినది నా కోసం అని తెలుసుకొని నేను మీ దగ్గరకు రావడానికి నన్ను సిద్దపరచండి. మిమ్ము ఎప్పటికీ కోల్పోకుండ నన్ను దీవించండి. ఆమెన్. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...