మత్తయి 9:14-17
యోహను శిష్యులు యేసును సమీపించి , మేము , పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసము ఉందుము గాని. మీ శిష్యులు ఎన్నడును ఉపవాసము ఉండరేల? అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఏల శోకింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. అపుడు వారు ఉపవాసము చేయుదురు. పాత గుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవడు ఉపయోగించును? అట్లు ఉపయోగించిన క్రొత్త గుడ్డ కృంగుట వలన ఆ పాత గుడ్డ మరింత చినిగిపోవును. క్రొత్త ద్రాక్షరసమును పాత తిత్తులలో ఎవరు పోయుదురు? అటుల పోసిన యెడల అవి పిగులును; ఆ ద్రాక్షరసము నేల పాలగును. తిత్తులు నాశనమగును. అందువలన, క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తిత్తులలో పోయుదురు. అపుడు ఆ రెండును చెడిపోకుండును అని యేసు సమాధానమొసగెను.
యోహను శిష్యులు యేసు ప్రభువు వద్దకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఆ ప్రశ్న ఏమిటి అంటే మేము మరియు పరిసయ్యులు ఉపవాసము ఉందుము కాని మీ శిష్యులు ఎందుకు ఉపవాసము ఉండరు? వారు ఈ ప్రశ్న అడగడానికి కూడా చాలా కారణాలు ఉండివుండవచ్చు. వాటిలో యేసు ప్రభువు మరియు ఆయన శిష్యులు అనేక సమయాలలో విందులయందు కనపడుతుంటారు .
కానా అనే ఊరిలో జరిగిన పెళ్ళిలో వీరు ఉన్నారు, సిమోను అనే పరిసయ్యుడు ఇచ్చిన విందులో ఉన్నారు, ఒక సుంకరి అయిన జక్కయ్య మార్పు చెందిన తరువాత ఇచ్చే విందులో యేసు ప్రభువు శిష్యులు ఉన్నారు. లెవీ యేసు ప్రభువు అనుచరుడిగా మారిన తరువాత ఇచ్చిన విందులో వీరు ఉన్నారు. ఈ విందులన్నీ చూసి వీరు ఉపవాసం చేయక, ఎప్పుడు విందులు వినోదలతో ఉన్నారు అని వారు భావించి ఈ ప్రశ్న అడిగి ఉండవచ్చు. లేక యేసు ప్రభువు శిష్యులు ఎందుకు ఉపవాసం చేయడం లేదో తెలుసుకోవడానికి ఈ ప్రశ్న అడిగి ఉండవచ్చు. యోహను శిష్యులు యేసు ప్రభువును తరువాత కూడా ఒక సారి ఓ ప్రశ్న అడుగుతున్నారు. అది ఏమిటి అంటే మా గురువు మిమ్ములను అడగమని పంపించారు, రానున్న రక్షకుడవు నీవేనా? లేక మేము ఇంకోకని కొరకు మేము వేచి చూడలా ? అంటే యేసు ప్రభువు దగ్గరకు వీరు అప్పుడప్పుడు వచ్చే వారు, వారి సమస్యలు గురించి చెప్పేవారు, ఆయనను ఒక రకముగా వారు తమ గురువు వలె గౌరవించారు.
యోహను శిష్యులు అడిగిన ప్రశ్నకు యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం ఏమిటి అంటే ? పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఏల శోకింతురు? దీని అర్ధం ఏమిటి? ఇది మనం యోహను నుండి తెలుసుకోవాలి. యోహను యేసు ప్రభువుని సాన్నిధ్యంను తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే గమనించి ఆనందంతో గంతులేశాడు. అంటే యేసు ప్రభువు సాన్నిధ్యం మనకు ఆనందం ఇస్తుంది. అది ఆనందించవలసిన సమయమే కాని దుఃఖించవలసిన సమయం కాదు. అంటే మనతో యేసు ప్రభువు మనతో ఉన్నంత కాలం మనం ఆనందించే సమయం.
పాత నిబంధనకాలంలో కూడా అనేక విధాలుగా ప్రజలు ఉపవాసం చేశారు, అది దేవుని నుండి, ఆయన ఆజ్ఞల నుండి దూరంగా వెళ్ళిన వారు అనేక కష్టాలు అనుభవించారు. వారు చేసిన పాపాలకు గాను దైవ సాన్నిధ్యం యెరుషలేము దేవాలయం నుండి వెళ్ళి పోతుంది. దేవుని సాన్నిధ్యం మన నుండి వెళ్ళిన , మనం దేవుని నుండి దూరంగా వెళ్ళిన దాని పర్యవసానం మనం అనేక కష్టాలకు , నష్టాలకు గురి అవుతాము. ఇది దేవుడు మనకు ఇచ్చే శిక్ష కాదు. మనం దేవుని నుండి దూరంగా వెళ్ళి మనం తెచ్చుకున్నవి. కాని మరలా దేవుని దగ్గరకు రావడానికి మనం చేసే ఒక పని నేను మీతో ఉండటానికి ఇష్టపడుతున్నాను అని తెలియజేయడం. ఇది తెలియజెసే ఒక విధానం ఉపవాసం. కాని దేవున్ని వారు దూరం చేసుకోకపోయిన దేవుని కోసం, ఆయన రాక కోసం , ఆయన వచ్చినప్పుడు యోగ్యరీతిగా ఆయనను స్వీకరించడానికి ఒక సాధనం ఉపవాసం. యోహను ఉపవాసం దీనిలో భాగమే. దేవుని నుండి దూరమై ఆయన కారుణ్యం పొందుటకు కూడా ఒక సాధనం ఉపవాసం, ఇది పాత నిబంధనలో నినివే ప్రజలు చేశారు.
యేసు ప్రభువు సమాధానం మనకు ఒక విషయం తెలియ జేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభువు శిష్యులు ఏ విధంగా కూడా ఉపవాసం చేయనవసరం లేదు. కారణం వారు ఇప్పుడు దేవునితో కలసి ఉన్నారు. దేవుని సాన్నిధ్యం పొందుతున్నారు. యోహను శిష్యులు యేసు ప్రభువు రాకకై సిద్దపడు ఉపవాసం చేస్తున్నారు. ఆయనను యోగ్యంగా స్వీకరించడానికి. కాని యేసు ప్రభువు శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు కనుక వారు ఉపవాసం చేయనవసరం లేదు.
కాని యేసు ప్రభువు చెప్పిన విధంగా "పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. అపుడు వారు ఉపవాసము చేయుదురు." అంటే యేసు ప్రభువు వారి నుండి వెళ్లిపోయినప్పుడు ఖచ్ఛితముగా వారు ఉపవాసం చేస్తారు. వారి నుండి యేసు ప్రభువు వెళ్లిపోతారు. అప్పుడు వారు ఆయన సాన్నిధ్యం పొందుటకు ఉపవాసం చేయాలి. మనం కూడా ఈ రోజు ఆయన సాన్నిధ్యం పొందక పోయిన యెడల ఉపవాసం , పాప సంకీర్తనం ద్వారా మనం ఆయన సాన్నిధ్యం పొందాలి.
"పాత గుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవడు ఉపయోగించును? అట్లు ఉపయోగించిన క్రొత్త గుడ్డ కృంగుట వలన ఆ పాత గుడ్డ మరింత చినిగిపోవును.క్రొత్త ద్రాక్షరసమును పాత తిత్తులలో ఎవరు పోయుదురు? అటుల పోసిన యెడల అవి పిగులును; ఆ ద్రాక్షరసము నేల పాలగును. తిత్తులు నాశనమగును. అందువలన, క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తిత్తులలో పోయుదురు. అపుడు ఆ రెండును చెడిపోకుండును అని యేసు సమాధానమొసగెను." ఈ వచనాలలో మనం ఎప్పడూ ఏమి చేయాలో తెలుసుకొని చేయాలి అని నేర్చుకుంటున్నాం.
ప్రార్ధన : ప్రభువా! మా జీవితంలో అనేక సమయాలలో మీరు మాతో ఉన్న విషయాన్ని గమనించలేక పోతున్నాను. మిమ్ములను మీ సాన్నిధ్యాన్ని పొందాలనే కోరిక మాకు ఎంతో ఉన్నా కాని మేము పొందలేక పోతున్నాము. మేము మిమ్ము గుర్తించే భాగ్యాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాము. మేము ఎందుకు ఉపవాసం చేయాలో , ఎప్పుడు ఉపవాసం చేయాలో తెలుసుకునే శక్తిని దయచేయండి. మాలో కొన్ని సార్లు నిజమైన మార్పు లేకున్నా , కేవలం బాహ్యంగా కొద్ది సేపు కనపడే మార్పులకు మేము పూర్తిగా మారిపోయాము అని బ్రమపడుతున్నాము. అటువంటి సమయాలలో మమ్ము మన్నించి మేము నిన్ను పూర్తిగా తెలుసుకొని, మీ సాన్నిధ్యం పొందే భాగ్యం దయచేయండి. ఆమెన్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి