11, మార్చి 2023, శనివారం

3వ తపస్సు కాల ఆదివారము

                                             3 తపస్సు కాల ఆదివారము

నిర్గమ 17 : 3-7

రోమా 5 :1 -2 , 5 -8

యోహాను 4 :5 -42 

ఈనాటి దివ్య పఠనాలు  దేవుడు ఇచ్చే  నీటి ద్వారా వచ్చే క్రొత్త జీవితం గురించి తెలుపుచున్నాయి. నీరు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో అవసరం, నీరు లేనిదే మానవ మనుగడలేదు. దివ్య పఠనాలలో దేవుడు నీటిని దయచేసి ప్రజల యొక్క దప్పికను తీర్చుతున్నారు.

ఈనాటి మొదటి పఠనం లో యావే  దేవుడు ఇస్రాయేలు ప్రజల యొక్క దాహం ను తీర్చిన విధానంను చదువుకుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఎడారి నుండి  వాగ్దాత భూమికి ప్రయాణం చేసి వెళ్లే సమయంలో వివిధ రకాలైన కష్టాలు అనుభవించారు, ఆకలితో ఉన్నారు, అదేవిధంగా దాహంతో ఉన్నారు, ప్రయాణం చేస్తూ సినాయి పర్వతం వద్దకు చేరారు, వారు ఎడారిలో ప్రయాణం చేసేటప్పుడు నీరు లేక నిరసించిపోయి సహనం కోల్పోయి దేవుని యొక్క ప్రవక్త మీద (మోషే మీద) ప్రజలు నేరము మోపారు.

ఇశ్రాయేలు ప్రజలకు ప్రయాణం చేసిన మొదటిలో అంతా మంచిగానే ఉంది ఎందుకంటే దేవుడు వారిని ఎర్ర సముద్రం గుండా అపాయం లేకుండా సురక్షితంగా కాపాడారు - నిర్గమ 14:16. 

అదేవిధంగా ఎడారిలో మన్నాను, పూరేడు పిట్టలను వారికి ఆహారంగా ఎడారిలో దయ చేసారు - నిర్గమ 16:16.

వాస్తవానికి మనం బ్రతకటానికి నీరు ఎంతో అవసరం, అందుకే ప్రజలు సహనం కోల్పోయారు కానీ ఇశ్రాయేలు ప్రజలు మరిచిపోయిన అంశం ఏమిటంటే దేవుడు తన ప్రజల కొరకు అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేశారు, కానీ వారు దేవుని యందు ఉంచవలసిన నమ్మకమును ఉంచలేదు, దేవుడు వారిని నడిపిస్తే వారికి కావలసిన దంత సమృద్ధిగా ఇస్తాడు అని వారు మరచిపోయారు.

దేవుడి తన ప్రజల కొరకు ఎడారిలో సైతం నీటిని కలుగజేస్తారు అనే  అంశమును వారు విశ్వసించలేకపోయారు. యేసయ్య ప్రవక్త అంటున్నారు ఎడారిలో నీటి ఊటలు పుట్టును, బీడు భూములలో నదులు ప్రవహించును  - యెషయా  35:5-7. అంటే దేవుడు తనను విశ్వసించే ప్రజల కొరకు ఎంతటి గొప్ప కార్యాలైనా చేస్తారు అని అర్థం.

దేవుడు ఇస్రాయేలు ప్రజల యెడల విశ్వాసనీయత కలిగి ఉన్నారు. ఆయనలో ఎటువంటి మార్పు లేదు కానీ మన జీవితంలోని కొన్ని అసంభావమైన కార్యాలు, కష్టాలు, నష్టాలు, బాధలు వచ్చినప్పుడు దేవుడిని విశ్వసించటం మరిచిపోతాం.

ప్రజలు అపనమ్మకముతో ఉన్న, దేవుడు మాత్రము సహనంతోనే ప్రేమతోనే ఉన్నారు అందుకే మోషే ఏ కర్రతో అయితే నైలునదిని రెండు పాయలుగా చీల్చారో  అదే కర్రతో హోరేబు కొండ దగ్గర రాతిని కొట్టమంటున్నారు ఆ యొక్క కర్రలో  దైవ శక్తి దాగి ఉంది, అదే విధంగా మోషేకర్రతో రాయిని కొడుతున్నారంటే ఆయన సంపూర్ణంగా దేవుని మీదనే ఆధారపడి ఉన్నారు, దేవునికి సంపూర్ణ విధేయత చూపించారు అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మరొక అద్భుతం చేశారు.

ఈ మొదటి పట్టణంలో మనం ముఖ్యంగా ఈ మూడు అంశాలు గ్రహించాలి.

1. దేవుడు నడిపిస్తే ఆయన అన్నీ ఇస్తారు.

2. దేవుని మీద ఆధారపడి విశ్వసిస్తే అసాధ్యమైనవి సాధ్యం చేస్తారు.

3. దేవుని ఎప్పుడు పరీక్షించకూడదు 

దేవుడు తన ప్రజల యొక్క దాహంను తీర్చి వారిని సంతృప్తి పరిచారు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసినా వారు ఆయన యొక్క మేలులు మరిచిపోయారు - యిర్మీయా  17:13.

ఈనాటి రెండవ పఠనము లో  పౌలు గారు దేవుని యొక్క మంచి స్వభావం గురించి తెలియజేస్తున్నారు.

మనం రక్షణ పొందాలంటే దేవుని యొక్క కృప వలన విశ్వాసం వలన నీతిమంతులుగా చేయబడాలి. యేసు క్రీస్తు ప్రభువు మన కొరకై అనుభవించిన సిలువ శ్రమల ద్వారా దేవునితో మనం సమాధానం ఏర్పరుచుకున్నాము దాని ద్వారా రక్షణ పొంది ఉన్నాము మరియు నీతిమంతులుగా చేయబడ్డాము.

అదేవిధంగా ఈ పఠనము లో పౌలు గారు దేవుని యొక్క ప్రేమ గురించి తెలియజేస్తున్నారు. మనందరం కూడా పాపాత్ములుగా ఉన్నప్పుడే మన మీద ఉన్న ప్రేమ వలన ఆయన మన కొరకు మరణించెను అని తెలిపారు, మనం అనర్హులము అయినా కానీ తన యొక్క అనంతమైన ప్రేమతో దేవుడు మనల్ని రక్షించారు.

ఈనాటి సువిశేష భాగంలో యేసు ప్రభువు సమరియ స్త్రీ యొక్క సంభాషణను వింటున్నాము, యేసు ప్రభువు ఆమె యొక్క దాహం తీర్చుటకు జీవజలంను ఇస్తాను అని సువిశేషంలో తెలుపుచున్నారు.

మనందరి దాహం తీర్చాలంటే మనం దేవుని దగ్గరకు రావాల్సిందే మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల యొక్క దాహం తీర్చుటకు దేవుని చెంతకు వెళ్లారు దాని ద్వారా దీవించబడ్డారు పవిత్ర గ్రంథంలో దేవుడు కొంతమందిని అనగా ఎవరైతే అసంపూర్ణ జీవితం జీవించి ఉన్నారు వారిని తన కొరకు తన పని నిమిత్తం ఎన్నుకుంటున్నారు.

- నోవా మత్తుగా త్రాగాడు

- అబ్రహాము అబద్దమాడాడు తన భార్య గురించి

- మోషే నరహత్య చేశాడు

- రేహాబు వ్యభిచారి

- దావీదు కూడా శారీరక వాంఛల వల్ల తప్పిదం చేసినవారే

- పేతురు ఏసుప్రభువును మోసం చేశాడు

- పౌలు క్రైస్తవులను హింసించారు

ఈనాటి సువిశేషంలో చెప్పబడిన సమరియ స్త్రీకి కూడా ఒక పాపపు జీవితగతం ఉంది అయినప్పటికీ దేవుడు వారిని సువార్త ప్రచారకులుగా తన సేవకులుగా ఎన్నుకుంటున్నారు. అదేవిధంగా పిలవబడిన వారు మరియు దేవునితో సంభాషించిన వారు తమ యొక్క పాపపు జీవితాలను విడిచిపెట్టారు.

సమరయ స్త్రీ మరియు ఏసుప్రభు యొక్క సంభాషణలు కొన్ని ప్రధాన అంశాలు మనం గ్రహించాలి.

- ఏసుప్రభువు యూదయ సీమ  యందలి గలిలీయకు ప్రయాణమైపోతూ సమారియా  అను పట్టణాలను చేరుకున్నారు అక్కడ యాకోబు భావి వద్ద మిట్ట మధ్యాహ్నం నీటి కొరకు వచ్చిన సమరియ స్త్రీని ఏసు ప్రభువు చూసి  తనతో సంభాషిస్తున్నారు.

- పవిత్ర గ్రంథములో  బావికి ఒక ప్రత్యేకత ఉన్నది, భావి ఎందుకంటే దాహంను తీర్చుకొనుటకు అదే విధంగా నీటిని తెచ్చుకొనుట కొరకు అనుదిన అవసరాల కోసం.

- యాకోబు కాలం నుండి నీటిని తోడుకొని వెళ్తున్నారు కాబట్టి ఆ బావికి యాకోబు బావి అని అర్థం వచ్చింది. నీరు తీసుకొని వచ్చే సమయం సర్వసాధారణంగా ఉదయం, సాయంత్రం ఉంటుంది ఇది మొదటి అర్థం బావికి ఉన్నది.

- రెండవ అర్థం ఏమిటంటే బావి దగ్గర ఒక భార్యను కనుగొంటారు.

- అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు కు భార్యను కనుగొనటానికి ఒక సేవకున్ని బావి దగ్గరకు పంపిస్తున్నారు - ఆది 24:10-67 అక్కడ రెబెకా ను కనుగొన్నారు.

- యాకోబు రాహేలును కూడా భావి దగ్గరే కనుగొన్నారు - ఆది 29:-17

- మోషే తన యొక్క భార్య అయినా జిప్పోరాను బావి దగ్గరే కలుసుకున్నారు - నిర్గమ 2:15-21

అలాగే ఏసుప్రభు ఒక సమారియా  స్త్రీని బావి దగ్గర కలుసుకుంటున్నారు, ఎందుకంటే తన జీవితంను మార్చుటకు అదే విధంగా తనను రక్షించుటకు తనకు జీవాహారం  నిచ్చుటకు.

- ఏసుప్రభు యాకోబు బావి దగ్గరకు వచ్చినప్పుడు ఏసుప్రభు దాహంతో ఉన్నారు అని యోహాను సువార్తికుడు తెలుపుచున్నారు, వాస్తవానికి ప్రభువుకు శారీరక దాహం అవ్వటం లేదు, ఆధ్యాత్మిక దాహం అవుచున్నది. ఆయన ఈ లోకం కు అందరినీ రక్షించడానికి వచ్చారు. యూదులకు సమరీయులకు మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగించి అందరిని రక్షించడానికి వచ్చారు.

- సమరియా స్త్రీ ఏసుప్రభుతో సంభాషించే సందర్భంలో కొద్దికొద్దిగా ఆమెలో విశ్వాసం బలపడుతుంది అదేవిధంగా ఆమె హృదయ పరివర్తనం చెందుతుంది.

- ఏసుప్రభు ఆమెతో సంభాషించే సందర్భంలో ఆమెను ఆమె జీవితంను చూసిన ప్రభువు నిరుత్సాహం పరచలేదు, ఆమె పాపాలను బట్టి ఆమెను ఖండించలేదు.

ఏసుప్రభు ఆమెకు జీవజలంను ప్రసాదిస్తానంటున్నారు. ఆ జీవజలం ఏసుప్రభు దేవుడే - యెషయా 7:37

- కీర్తన 36:9

- దర్శన 21:6

ఈ జీవజలంను దేవుడు ఉచితంగా ఇస్తున్నారు - యెషయా 55-1,ఎఫీసి 2-8-9

- సమరియ స్త్రీ ఏసుప్రభుతో సంభాషించే సందర్భంలో ఏడు ముఖ్యమైన పనులు చేస్తుంది.

1. ఆమె ఏసుప్రభుతో సంభాషించింది

2. ప్రభు యొక్క వాక్కును సావధానంగా ఆలకించింది

3. పాపి అని అంగీకరించింది

4. తన యొక్క కడవ విడిచిపెట్టి వెళ్ళింది

5. ఏసుప్రభు మెస్సయ్యని గుర్తించి ఆయన యందు విశ్వాసమును పెంపొందించుకుంది

6. ఏసుప్రభుకు సాక్షిగా మారింది

7. తన గ్రామస్తులందరినీ ఆమె మార్చింది

సమరియా స్త్రీ పాపి అయినప్పటికిని దేవునితో చేసిన ఒక మంచి సంభాషణ ద్వారా తన జీవితమును తన ప్రజల జీవితమును మార్చుతుంది.

- ఏసుప్రభువును తన దైవంగా స్వీకరించిన  తర్వాత ఎటువంటి దాహం గురించి వారు ఆలోచించటం లేదు.

-నూతన నిబంధన గ్రంథములో నీరు పవిత్రతకు గుర్తు, మానవాళికి నూతన జన్మ పవిత్ర ఆత్మ ద్వారా సంభవిస్తుంది.

- దేవుడి ప్రసాదించే పవిత్రాత్మ ద్వారా నూతన జీవితం జీవించాలి.

- దేవుడు సమరియా స్త్రీని అంగీకరించి తన పాపాలను క్షమించి ఆమెను రక్షిస్తున్నారు. యేసు ప్రభువు పలికిన ప్రతి ఒక్క వాక్కు తన జీవితం తాకింది అందుకే జీవితం మార్చుకుంది, దేవునికి సాక్షిగా జీవించింది.


FR. BALAYESU OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...