1, ఏప్రిల్ 2023, శనివారం

 

తపస్సు కాలం 6వ ఆదివారం

మ్రానికొమ్మల ఆదివారం

యెషయా 50: 4-7

ఫిలిప్పి 2: 6-11

మత్తాయి 26: 14-27: 66

ఈరోజు తల్లి శ్రీసభ మ్రానికొమ్మల ఆదివారంను కొనియాడుచున్నది. దీనినే క్రీస్తుపాటులు ఆదివారం అని కూడా పిలుస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోష సమయాలు కొన్నివుంటాయి. ఈ మ్రానికొమ్మల రోజు కూడా ప్రభువు యొక్క జీవితంలో ప్రత్యేకమైనది, సంతోషకరమైనది  ఎందుకంటే ప్రజలు ఆయన్ను రాజుగా గుర్తించి 'హోసన్నా' పాడారు. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని అనుభవించినట్లే తరచుగా దుఃఖాన్ని గూడు పొందుతుంటాం. విచారం కలిగినట్లే ఆనందం కూడా కలుగుతుంది. 

ఈ రోజు మనందరం పవిత్ర వారంలోకి అడుగుపెడుతున్నాం/ ప్రవేశిస్తున్నాం. మన యొక్కా రక్షణ సంఘటనలు ధ్యానించుకోబోతున్నాం. యేసు ప్రభువు యొక్క రక్షణ ఘట్టాలను ధ్యానించుకోబోతున్నాం. ఆయన యొక్క సిలువ శ్రమలు మరణం పునరుత్తానం అదే విధంగా క్రీస్తుతో మన మరణ, పునరుత్తనాలు కూడా ధ్యానించుకోవాలి.

ఈ పవిత్ర వారం యొక్క ఘట్టాలు మనం శ్రద్ధగా ధ్యానిస్తే మనకు దేవునితో వున్నసంబంధం పెరుగుతుంది. దేవునిలో వున్న విశ్వాసం పెరుగుతుంది. దేవుని పట్ల ప్రేమ పెరుగుతుంది. మనలో కూడా హృదయ పరివర్తనం కలుగుతుంది. ప్రభువు నా కోసమే మరణించారు అనే  ఆలోచన మన జీవితాలను మార్చుతుంది.

ఈ మ్రానికొమ్మల ఆదివారం రోజుల రెండు ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

1.  ఆయన మహిమా సంఘటన

2.  ఆయన శ్రమల సంఘటన

మహిమా సంఘటన ఏమనగా ప్రజలు ప్రభువును రాజుగా గుర్తించి ఆయన్ను యెరూషలేముకు ప్రేమతో ఆహ్వానించారు. శ్రమల సంఘటన ఏమనగా ప్రభువును ద్రోహిగా నిందించి ఆయన్ను సిలువవేయుటకు పన్నాగం చేయుట.

ఒకటి సంతోషంకరమైనది రెండవది భాధాకరమైనది. మన శరీరంలో రక్తం నీరు ఎలాగైతే కలసివుంటాయో మన యొక్క జీవితంలో కూడా బాధ, సంతోషం కలసివుంటాయి. ఈరోజు మ్రానికొమ్మలతో ప్రదక్షణలో వచ్చే సమయంలో ఒక సువిశేష భాగం చదువుతాం, పూజలో శ్రమల వృతాంతం చదువుతాం. యేసు ప్రభువు అనేకసార్లు యెరూషలేము వెళ్లారు కానీ అన్ని సార్లు ఆయనకు ఆంత గొప్ప ఆహ్వానం ఇవ్వలేదు. కేవలం ఈ రోజున మాత్రమే వారు గుర్తిస్తున్నారు.

యేసు ప్రభువు పేదవారి పట్ల పోరాడిన విధానం, వారి పక్షమున నిలబడి వారికోసం జీవించే విధానం ప్రజల్లో ఒక నమ్మికను కలుగజేసింది. ఇతడు మాకోసం జీవిస్తాడు. అధికార బంధముల నుండి మమ్మల్ని విడిపిస్తాడు అనే ఆలోచన, నమ్మకం వారిలో కలిగింది.

ఈనాటి మొదటి పఠనంలో బాధామయ సేవకుని యొక్క జీవితం గురించి చదువుకున్నాం. యెషయా గ్రంధంలో  40 -  55 అధ్యాయాలలో నాలుగు బాధామయ సేవకుని గీతాలు మనం వింటున్నాం.  ఈనాటి మొదటి పఠనం 3 గీతం గురించి చదువుకుంటున్నాం.  క్రీస్తుపూర్వం 7 వ శతాబ్దంలో దేవుడు యెషయాను ప్రవక్తగా నియమించారు.

సోలోమోను రాజు తరువాత యిస్రాయేలు రెండుగా విభజించబడింది ప్రతి ఒక్క రాజ్యంకు వారి వారి ప్రవక్తలు, నాయకులు, మత పెద్దలు ఉండేవారు. యెషయా ప్రవక్త యెరూషలేములో పనిచేసిన ప్రవక్త . ఆయన అనేక మంది రాజులకు దేవుని యొక్క ప్రవచనాలు తెలిపారు. ఆయన కాలంలో అస్సిరియులు యిస్రాయేలును నాశనం చేసిన దానిని ఆయన కనులారా చూశాడు. అలాగే అస్సిరియులు యూదా మీదకు యుద్ధముకు రావటం చూశాడు. అప్పుడు హిజ్కియా రాజును లొంగిపోవద్దు అని తెలిపారు, దేవునికి ప్రార్ధించి ముప్పు తొలగించారు.

యెషయా ప్రవక్త ఈ సేవకుని యొక్క గీతము వ్రాసేటప్పుడు ఆయన మనస్సులో వున్నది ఇద్దరు వ్యక్తులు

1 యిస్రాయేలు ప్రజలు - ఎన్నుకొనబడిన ప్రజలు

2 మెస్సయ్యా

మెస్సయ్యా తాను అందరికోసం శ్రమలు అనుభవించి మరణిస్తారని ముందుగానే ప్రవక్త ప్రవచించారు అందుకే అంటారు ప్రవక్తలు ప్రవచనాలు నిజమేనని.

యిస్రాయేలు ప్రజలు కూడా తమ యొక్క జీవితంలో సేవకుల వలే బానిసత్వంలో అనేక శ్రమలు అనుభంవించారు. మరీ ముఖ్యంగా బాధామయ సేవకుని జీవితం  మెస్సయ్యా గురించి ఉద్దేశించబడినది.

ఈనాటి మొదటి  పఠనంలో రెండుభాగాలున్నాయి

1.  సేవకునికి అప్పజెప్పిన బాధ్యత

2. సేవకుని యొక్క త్యాగ జీవితం

సేవకునికి అప్పజెప్పిన బాధ్యత ఏమిటంటే ప్రకటించుట, బోధించుట దేవుని యొక్క రాజ్యం  గురించి, దేవుని ప్రేమ గురించి, ఆయన క్షమ గురించి రక్షణ గురించి ప్రకటించే శక్తిని దయచేశారు. ఆయన అలసిపోయిన వారికి ఓదార్పు దయచేస్తారు. మత్తయి 11 : 28

బాధలలో, కష్టాలలో, నిరాశలో, జీవితంలో అన్ని  సమస్యలు పడే వారిని దేవుడు ఈ సేవకుని ద్వారా ఓదార్చుతున్నారు. సహాయంలేని వారికి ఒక సహాయంగా ఉండుటకు ఎన్నుకొనబడినారు. ప్రేమలేని వారికి ప్రేమను పంచుటానికి ఎన్నుకొనబడిననారు. జీవితంలో ఆశలు కోల్పోయిన వారికి ధైర్యం నిచ్చుటకు ఈ సేవకుడు ఓదార్పును దయ చేస్తాడు.  సేవకుడు తన జీవితంలో దేవునికి  ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఆయన తండ్రి చిత్తము నెరవేర్చుటకు వచ్చియున్నారు. హెబ్రీ 10 : 7 , 5 : 8 .

ఆయన మరణం వరకు తండ్రికి అడ్డు చెప్పలేదు ఫిలిప్పి 2 : 8 .  ఆయన మాటను ఎల్లప్పుడూ నెరవేర్చారు. తనకు అప్పజెప్పిన పరిచర్య బాధ్యత సక్రమంగా నెరవేర్చాడు ఈ సేవకుడు.

రెండవ భాగంలో తన యొక్క సేవక బాధ్యతలు నెరవేర్చుటలో ఈ సేవకుడు ఎంతగానో శ్రమలను అనుభవించాడు, నిందలు భరించాడు. ఆయనను మొదువారికి వీపును అప్పగించారు అని 6 వ వచనంలో చెప్పబడింది అంటే ఎన్ని దెబ్బలైన భరించటానికి తనను తాను సమర్పించుకున్నారు. ఆయన ఎవ్వరికీ ఎదురు చెప్పలేదు మౌనంగా భరించాడు.

ఆయన గడ్డపు వెంట్రుకలు లాగేసారు, ఉమ్మివేసారు, ఆవమానించారు. ఇవన్నీ కూడా భరించటానికి కష్టం అయినా భరిస్తున్నారు. ఇది కేవలం ప్రేమ వలనే సాధ్యం. ప్రేమ సమస్తమును భరించును 1  కొరింతి 13 : 7 .

·         యేసుప్రభువు యొక్క జీవితంలో ఇవన్నీ జరిగాయి, ఆయన వస్త్రములు లాగారు. యెహాను 19 : 23 .

·         ఆయన మొహం మీద ఉమ్మివేశారు. మత్తయి 26 : 67

·         ఆయన్ను కొరడాలతో కొట్టారు. మార్కు 15 : 15 , యోహాను 19 : 1 .

ఇన్ని రకాలైన అవమానాలు తాను ఎదుర్కొన్నప్పటికీ ఆయన కృంగిపోలేదు, పారిపోలేదు అన్ని సహనంతో భరించాడు. ఇంత భాధలు పొంది వాటిని భరించాలంటే నిజంగా దైవశక్తి మనకు అవసరం.  బాధామయ సేవకుడు తండ్రిమీద వున్న గాఢమైన ప్రేమ వలన అదేవిధంగా తన ప్రజలను కాపాడాలనే ఉద్దేశం వలన ఎంతో భాధను భరించాడు. ఒక క్రొవొత్తి తాను కరుగుతూ ఎలాగైతే ఇతరులకు వెలుగునిస్తుందో అదే విధంగా ఈ సేవకుడు తన జీవితం, ప్రాణత్యాగం చేస్తూ ఇతరులకు రక్షణనిచ్చాడు.

రెండవ పఠనంలో పునీత పౌలుగారు యేసు ప్రభువు యొక్క సేవా జీవితం గురించి తెలుపుచున్నారు. యేసు ప్రభువు తండ్రి,  పవిత్రాత్మతో  అన్నింటిలోనూ సరిసమానంగా ఉన్నప్పటికీ తనను తాను తగ్గించుకొని జీవించారు. ఈ వాక్యాలలో పౌలు గారు దేవుని యొక్క వినయ జీవితం  గురించి మాట్లాడుతున్నారు. ఎవరు కూడా ఆయన వలే తగ్గించుకొని జీవించలేదు.

ఆయన దేవుడు అయినా మనిషిగా మన మధ్య జన్మించారు. పరలోకంలో జీవించే దేవుడు భూలోకంలో జీవించుటకు ఇష్టపడ్డారు. పరలోక మహిమను విడిచిపెట్టారు. భూలోక సిలువను మోశారు. పవిత్రమైన పరలోకంలో జీవించే దేవుడు పాపమలినం శోకిన ప్రజలు మధ్యకు వచ్చారు. అధికారం కలిగినప్పటికీ  అణిగిమణిగి వినయంతో జీవించారు.

ఆయన దేవుడే అయినప్పటికిని అన్నీ విడిచిపెట్టారు. మన మధ్యకు వచ్చారు ఫిలిప్పి 2 : 7 .

- సేవించబడాల్సిన దేవుడు సేవచేస్తున్నారు

- ప్రేమించబడాల్సిన దేవుడు మన మంచికై అని చేస్తున్నారు

- మనం ఎవరికోసం, ఎవరి రాక కోసం ఎదురు చూడాలో ఆయనే మనం కోసం ఎదురు చూస్తున్నారు.  మనం వెదికే దేవుడు మన కోసం వెదకుచున్నారు.

ఆయన అన్నింటిని త్యజించుకుని మన మధ్యకు వచ్చి జీవించారు. యేసు ప్రభువు అంతటి వినయమును చూపుతూ మన మధ్యలో  జీవించి తన  ప్రాణత్యాగం చేశారు. ఆయన స్వార్ధం వెదకలేదు సేవకుని వలే జీవించి  అంత దేవుని కొరకు ప్రజల కొరకు చేశారు.

యేసు ప్రభువు తండ్రి మాత్రమే  కాదు వినయం చూపినది మానవులకు, అధికారులకు వినయం చిపించారు. తనను హింసించిన వారికి,  చంపిన వారికి కూడా ప్రభువు వినయం చూపించారు.  ఆయనకు అధికారం ఉంది, ఆయన  సృష్టికర్త  అయినా కానీ అంతటి వినయం చూపించారు. యెహాను 10 : 18 , రోమి 5 19, హెబ్రీ 10 : 9

వినయం వలన ప్రాణత్యాగం చేశారు తనను తాను తగ్గించుకొని నిందలు మోశారు. తనను తాను  తగ్గించుకొని శత్రువుల చేతికి అప్పగింపబడినారు. తనను తాను తగ్గించుకొని అందరి పాపాలు తన మీద మోసుకున్నారు.

తనను తాను తగ్గించుకొని సిలువ భారం మోశారు, ఘోరమైన సిలువ మీద మరణం అంగీకరించారు. ఆయన పాపరహితుడైనప్పటికీ మన పాపాలకోసం అన్నీ భరించారు, మనల్ని రక్షించారు - 2  కొరింతి  5 : 12 , గలతి 3 : 13 , 1  పేతురు 2 : 24 , 1  పేతురు  3 : 18 .

యేసు ప్రభువు తన్ను తాను రిక్తుని  చేసుకున్నారు కాబట్టి తండ్రి కుమారుడిని అంతగా  సన్మానించారు.  చివరి వరకు సంపూర్ణ విధేయతను, వినయంను  చూపిన కుమారుడ్ని తండ్రి మిక్కిలిగా ప్రేమించారు. ఆయనకు సమస్తము ఇచ్చియున్నారు. ఎఫెసీ 1 : 22 , 1  పేతురు 3 : 22 , రోమా 14 : 11 .

 మనం ఒకరి ముందు తలవంచటానికి ఇష్టపడం కానీ యేసు ప్రభువు వినయంతో అందరిముందు తనను తాను తగ్గించుకొని జీవించారు.

ఈనాటి సువిశేష పఠనంలో ప్రభువు యొక్క సిలువ శ్రమలు ధ్యానించుకుంటున్నాం. ఈ రోజు ముఖ్యంగా మనందరం ధ్యానించుకోవాల్సిన అంశం ఏమిటంటే యేసు ప్రభువును ప్రజలు రాజుగా గుర్తించారు.

యేసు ప్రభువు చాలాసార్లు యెరూషలేము దేవాలయంకు వెళ్లారు. కానీ ఈ సమయంలో ఆయన్ను గొప్పగా ఆహ్వానించారు. 

ప్రభువు యెరూషలేమునకు వెళ్లిన సమయాలు:

1.       యెరూషలేము దేవాలయమును శుభ్రం చేసిన సమయం - యోహాను 2 : 13

2.       యెరూషలేములో కోనేటి వద్ద స్వస్థత నిచ్చినప్పుడు - యోహాను 5 :1

3.       యెరూషలేములో ఆయన దేవుని కుమారుడని ప్రకటించినవేళ - యెహాను 7 : 16 -17

4.       జీవజలపు ఊట అని చెప్పినప్పుడు - యోహాను 7 : 37 -39

5.       లోకానికి వెలుగు అని చెప్పినప్పుడు కూడా ప్రభువు యెరూషలేములో వున్నారు- యోహాను 8 : 12 , 9 : 5

ఇలా చాలా సందర్భాలలో ప్రభువు యెరూషలేములోని ఉన్నారు. కానీ ఇప్పుడు దానికి ప్రత్యేకత ఉంది.

ప్రభువు ఈ లోకంలో తండ్రి క్రియలు నెరవేర్చారు, అద్భుతాలు చేశారు. 

యూదుల విశ్వసం పెంచటానికి 7  అద్భుతాలు చేశారు.

1.       1. నీటిని ద్రాక్షారసముగా మార్చారు - యోహాను 2: 1-11

2.      2.  ప్రభుత్వ ఉద్యోగి కుమారునికి ్వస్థతనిచ్చుట  - యోహాను 4: 46-54

3.      3.  బేత్సయిదా వద్ద పక్షవాత రోగికి స్వస్థతనిచ్చుట - యోహాను 5: 1-15

4.      4.  5000 మందికి ఆహారం పెట్టుట - యోహాను 6: 5-14

5.       5.  నీటిమీద నడచుట - యోహాను 6: 16-24

6.       6. పుట్టు గ్రుడ్డివానికి చూపును దయచేయుట - యోహాను 9: 1-7

7.       7.  లాజరును జీవంతో లేపుటయోహాను 11: 1-45

ఇవన్నీ చేసిన తరువాత ప్రజలయొక్క ఆత్మ విశ్వాసం  పెరిగింది. ఆ కాలంలో ప్రభువు బలహీనులపట్ల, ప్రజల పట్ల పోరాడుచున్నారు కాబట్టి ఇతడు నిజంగా ప్రజల కోసం వచ్చారని, ప్రజల సమస్యలనుండి కాపాడుతారని నమ్మకం.

అందుకే ఆయన్ను రాజును చేయాలనుకున్నారు.  ఆయనయే తమ రాజాని ఆయన్ను స్తుతించారు. మాకోసం నిలబడే వ్యక్తి అని మాకోసమే పుట్టిన ప్రభువు అని అందరూ భావించారు. అందుకే ఆయన తమ యొక్క రాజాని గుర్తించారు. ఆ సందర్భంలోనే ఆయన్ను ఘనంగా ఆహ్వానించారు.

ప్రజలు యేసుప్రభువునకు హోసాన్నా పాడారు.  హోసాన్న అనగా 'మమ్ము ఇప్పుడు రక్షించు' అని అర్ధం. ఆయన వారిని రక్షిస్తాడని తెలుసుకున్నారు. పాపములనుండి రక్షిస్తాడని తెలుసుకొని రక్షించామన్నారు. అదేవిధంగా ఈ లోక బంధములనుండి, అధికారుల క్రిందనుండి రక్షించమని కోరారు. ఆయన ద్వారానే రక్షణ వస్తుందని రాజ్యాధికారం  ఈ లోక అధికారం కన్నా బిన్నంగా ఉంటుంది.

 ఈ రాజు రాజ్యాలు గెలిచే రాజుగా రావటం లేదు. ప్రజల యొక్క మనస్సు గెలిచే రాజుగా వస్తున్నారు. మన రాజు శ్రమలు అనుభవించారు, సుఖ సంతోషాలు విడిచిపెట్టారు. ఈ రాజు అందరికంటే ముందుగా నిలబడి తన ప్రజల కోసం పోరాడతారు.

ప్రభువు స్వయంగా గాడిదను ఎన్నుకొంటున్నారు ఎందుకంటే పూర్వం రాజులు యుద్ధం చేయటానికి వెళ్ళేటప్పుడు గుర్రం మీద వెళ్లేవారు. శాంతిని నెలకొల్పేటప్పుడు గాడిదమీద వెళ్లేవారు.

గాడిద వినమ్రుని, శాంతిపరుని సూచిస్తుంది. యేసు ప్రభువు ప్రపంచానికి శాంతి ప్రదాత. ఆయన ఇహలోక సంబంధమైన రాజు కాక పరలోక సంబంధమైన రాజు. ఆయన అందరికి రాజు. ప్రజలందరి పాపలు తన మీద మోసుకొని మరణించిన గొప్ప రాజు.

సొలొమోను తన తండ్రి గాడిద మీద వచ్చారు, సింహాసనాన్ని అధిష్టించే రోజును – 1 రాజు 1: 38-41

గాడిద మీద వచ్చిన వారు - న్యాయా 10: 4, 2 సమూ 17: 23, 2 సమూ 19: 26

ఈ లోకమును తన తండ్రితో సమాధానపరచుటకు ఆయన గాడిద మీద వస్తున్నారు - ఎఫెసీ 2: 13-18

గాడిదను ప్రభువు ఎన్నుకొనుటకు కారణాలు :

1.       గాడిద బరువు మోస్తుంది - అందరి భారం మోస్తుంది

2.       గాడిద సేవ చేస్తుంది - అందరికి సేవ చేస్తుంది

3.       గాడిద శాంతికి గుర్తు

4.       గాడిద పవిత్రతకు గుర్తు- వస్తువులను జంతువులను దేవునికి సమర్పించుటకు వాడతారు కాబట్టి అవి పవిత్రమైనవి

సంఖ్య 19: 2,  ద్వితీ 21: 3, 1 సమూ 6: 7

యేసు ప్రభువు వాడిన గాడిదను ఎవ్వరు ఎన్నడూ వాడలేదు. అది పవిత్రమైనది. మనం దేవుని ప్రేమను తెలుసుకొని ఆయన కొరకు మంచి జీవితం జీవించాలి.

                                                                                                                  Fr. Balayesu OCD                          

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...