ఆమోసు 7:12-15, ఎఫేసి 1:3-14, మార్కు 6:7-13
ఈనాటి పరిశుద్ధ గ్రంధం పఠణములు, దేవుని పిలుపు- మానవ స్పందన గురించి తెలుపుచున్నాయి. ప్రతి పఠణం కూడా దైవ పిలుపును విశ్వాసముతో స్వీకరించి ప్రభువు యొక్క సేవ చేయాలి అనే అంశమును తెలియజేస్తున్నాయి.
మొదటి పఠణంలో యావే దేవుడు ఆమోసు ప్రవక్తను ఉత్తర ఇస్రాయేలు ప్రజలు చెంతకు పంపించిన విధానము చదువుకుంటున్నాము.
యావే ప్రభువు క్షీణించే ప్రజల మధ్యకు ప్రవక్తను పంపారు. ఆమోసు ప్రవక్త సామాజిక న్యాయం కొరకు పోరాడిన వ్యక్తి. గొర్రెల మందను కాసుకునేటటువంటి వ్యక్తిని దేవుడే స్వయముగా పరిచర్యకు పిలిచారు అని తెలిపారు. ఆమోస్ ప్రవక్త తాను భుక్తి కోసం పనిచేయటం లేదు కేవలము దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే నిస్వార్థముగా పనిచేస్తున్నాను అని తెలిపారు. క్రీస్తుపూర్వం ఎనిమిదివ శతాబ్దంలో పాలస్తీనా దేశం లో ఉత్తర రాజ్యంలో జేరోబవాము రాజు ఇశ్రాయేలు ప్రజలను పాలిస్తున్నారు. ఈ రాజు యొక్క పరిపాలన కాలంలో మత విలువలు అడుగంటిపోయాయి, అవినీతి పెరిగింది, ధనికులు అన్యాయంగా పేదవారిని దోచుకొనుట సాధారణమైంది. ఒక ప్రక్కన ధనికులు సుఖసంతోషాలతో జీవిస్తుంటే, పేదవారు మాత్రము ఆకలి బాధతో అలమటించేవారు. రాజు సైతం దేవుడిని మరచి అన్య దైవములను కొలవటం ప్రారంభించారు ఇట్టి సందర్భంలో ప్రభువు ఆమోస్ను ప్రజల యొక్క శ్రేయస్సు కొరకై, వారి జీవిత విధాన మార్పు కొరకై పంపిస్తున్నారు. ప్రవక్త ప్రజల యొక్క తప్పిదములను వారి అవినీతిని పండించారు, విగ్రహారాధనను రూపుమాపారు. యావే దేవుని యొక్క మాట విననట్లయితే బానిసత్వం లోనికి వెళ్ళవలసి ఉన్నది అని ప్రవక్త గట్టిగా ఉపదేశించారు, వాస్తవానికి అది జరిగినది కూడా. బేతేలు క్షేత్రం వద్ద పలికిన ఈ మాటలు అ అచ్చటి అర్చకుడైన అమాస్య ప్రవక్తకు నచ్చలేదు అందుకే ఆమోసుతో, నీవు నీ ప్రాంతమునకు వెళ్లి ప్రవచనములు పలుకుతూ భోజనమును సంపాదించుకోమని హేళనగా మాట్లాడారు, ఇకమీదట బేతేలులో ప్రవచించవద్దు అని కూడా హెచ్చరించారు కానీ ఆమోస్ మాత్రము ధైర్యముగా దేవుడు తనకు అప్పచెప్పిన బాధ్యతను నెరవేర్చారు.
ఆ రోజుల్లో కొందరు ప్రవక్తలు కేవలం పొట్టకూటిపై ప్రవక్తలగా చలామణి అయ్యేవారు రాజు యొక్క మెప్పు కొరకు పని చేసేవారు. రాజు ఏది చెబితే అదే దైవ చిత్తము గా బోధించారు రాజును మెప్పించుట కొరకు చెడును కూడా మంచిగానే బోధించేవారు ఇలాంటి ఒక పరిస్థితుల్లోనే దేవుడు అమోస్ ప్రవక్తను ఎన్నుకొని సత్యమును బోధించుటకు పంపించారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుని యొక్క పిలుపుని గురించి తెలుపుచూ ఆయన మనలను సృష్టికి పూర్వమే పవిత్రులుగా ఉండుటకు నిర్దోషులుగా ఉండుటకు ఎన్నుకున్నారు అని తెలిపారు. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా అనుగ్రహాలను వసగి ఉన్నారు. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులము కావించబడ్డాము, మన పాపాలు క్షమించబడ్డాయి.
ఈనాటి సువిశేష భాగములు యేసు ప్రభువు తన యొక్క అపోస్తులను సువార్త సేవకై పంపించిన విధానము చదువుకుంటున్నాము. ఆమోసు ప్రవక్తను ఇశ్రాయేలు ప్రజల వద్దకు పంపిన విధంగా, పౌలు గారిని అన్యుల వద్దకు పంపిన విధంగా, ఏసుప్రభు తన శిష్యులను కూడా దైవ సందేశ నిమిత్తమై వివిధ ప్రాంతాలకు ఇద్దరు చొప్పున పంపిస్తున్నారు. ఈ యొక్క సువిశేషంలో ధ్యానించవలసిన ప్రధానమైన అంశములు;
1. అందరూ రక్షింపబడాలి అన్నది ప్రభువు యొక్క ఉద్దేశం.
2. దేవుని యొక్క సందేశము ప్రతి ఒక్కరికి ప్రకటింపబడాలి అందుకే ప్రభు తన శిష్యులను పంపిస్తున్నారు.
3. శిష్యులు ప్రజలలో ఉన్నటువంటి వ్యాధి బాధలను, దయ్యములను పారద్రోలి వారికి మేలు చేయాలి.
4. అపోస్తులను ప్రతినిత్యము ఏసుప్రభు మీదే ఆధారపడి జీవించాలి.
5. దేవుని పనిలో కొన్నిసార్లు తిరస్కరణలు ఎదురైనా వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలి.
6. అపోస్తులు హృదయ పరివర్తనను ప్రకటించి అనేక మందికి స్వస్థత చేకూర్చారు.
7. దేవుడు ఎల్లప్పుడూ తాను ఎన్నుకున్న వారికి తోడుగానే ఉంటారు అనే విషయం మనం ప్రభువు వెల్లడిస్తున్నారు ఎందుకనగా ప్రజల జీవితంలో అద్భుతాలు జరగటానికి దేవుడు వారికి తోడుగా ఉన్నారు అనేటటువంటి ఒక కారణం.
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు ఏ విధముగానయితే దేవుని యొక్క సందేశము కొరకై పిలవబడిన వారి గురించి మరియు వారి యొక్క సేవ జీవితం గురించి తెలియచేయబడినదో మనము కూడా దేవుని చేత జ్ఞాన స్నానం ద్వారా ఎన్నుకొనబడినటువంటివారం కాబట్టి మనం దేవుని యొక్క ప్రేమను పంచాలి ఆయన సేవ చేయాలి.
Fr. Bala Yesu OCD.