యిర్మియా 23:1-6, ఎఫేసి 2:1-6, మార్కు 6:30-34
ఈనాటి పరిశుద్ధ గ్రంథము పఠణములు దేవుడు మంచి కాపరిగా ఉంటూ తన ప్రజలకు అన్నియు సమకూర్చి వారిని కాపాడుతుంటారు అని అంశమును తెలుపుచున్నవి. దేవునికి ప్రజలకు ఉన్నటువంటి బంధము ఏ విధంగా ఉన్నదంటే కాపరికి మందకు ఉన్నటువంటి బంధం ఇవి రెండూ కూడా ఎప్పుడు కలసి ఉంటాయి.
ఈనాటి మొదటి పఠణంలో యిర్మియా ప్రవక్త యొక్క మాటలను చదువుకుంటున్నాము. యిర్మియా ప్రవక్త క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో యూదా రాజధాని అయినటువంటి యెరుషలేములో పరిచర్యను చేశారు. ఆయన అనేక మంది రాజులను, ప్రజలను, నాయకులను దేవునికి విశ్వాస పాత్రులుగా జీవించమని తెలిపారు. దేవుని యొక్క దృష్టిలో ఏది ఉత్తమం దానిని ప్రకటించారు. యిర్మియ సత్యమును ప్రకటించుటవలన అనేక బాధలను అనుభవించవలసి వచ్చింది. యిర్మియా ప్రవక్త సెద్కియా కాలంలో ప్రవచించారు. ఆయన ఒక బలహీనమైన రాజు, నిలకడత్వం లేని వ్యక్తి. ప్రవక్త యొక్క సందేశాన్ని ఆలకిస్తాడు కానీ దానిని ఆచరణలో ఉంచడు. అప్పుడు యూదా రాజ్యం బాబిలోనియా చక్రవర్తికి లోబడుతుంది. యిర్మియా ప్రవక్త రాజును బాబిలోని రాజుకు లోబడి జీవించమని తెలిపినప్పుడు దానిని ఆచరించలేదు దానికి బదులుగా రాజభవనంలో ఉన్న కొంతమంది సలహాదారులు ఐగుప్తు సహాయం రాజు సహాయం కోరమని తెలియజేశారు కానీ యుద్ధం చేసిన తర్వాత యూదా ప్రజలు ఓడిపోయారు దానికి గాను బాబిలోనికి బానిసత్వానికి వెళ్లారు.
నాయకులు ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉండేవారు కాబట్టి ప్రభువే స్వయముగా తన గొర్రెలను ప్రోగు చేసి వారి కొరకు కాపరులను నియమిస్తాను అని తెలుపుచున్నారు. దేవుడే స్వయముగా ఒక కాపరిగా ఉంటూ తన ప్రజలకు అన్నియు సమకూర్చుతారు అనేటటువంటి అంశమును కూడా తెలుపుచున్నారు (కీర్తన 23). ఆయన యొక్క శ్రద్ధ వలన తన మంద పోషించబడుతుంది, అభివృద్ధి చెందుతుంది. తన మందను ఎన్నడూ విడిచి పెట్టినటువంటి కాపరులను కూడా నియమిస్తానని తెలుపుచున్నారు. యావే ప్రభువు తనకు ఉన్నటువంటి ప్రేమ వలన ప్రజల కొరకు మంచి కాపరులను నియమిస్తానని తెలుపుచున్నాను.
దేవుడు ఎవరికి అయితే తమమందనం చూసుకొనమని బాధ్యతను అప్పగించి ఉన్నారో వారు సరిగా వ్యవహరించకపోతే దేవుడు వారిని శాపగ్రస్తులుగా చేస్తుంటారు అని పలికారు. దేవుడు నమ్మి బాధ్యతను అప్పగించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానిని సక్రమంగా నెరవేర్చాలి. తండ్రికి కుటుంబ బాధ్యతను అప్పగించారు, గురువుకు విచారణ బాధ్యతను అప్పగించారు, ఉపాధ్యాయునికి పిల్లల బాధ్యతను అప్పగించారు, వైద్యులకు రోగుల బాధ్యతను అప్పగించారు, రాజకీయ నాయకులకు దేశ ప్రజల బాధ్యతను అప్పగించారు ఈ విధముగా చాలా విధములైనటువంటి బాధ్యతలు దేవుడు ఇచ్చి ఉన్నారు కాబట్టి వానిని మనము సక్రమముగా ప్రజల యొక్క, ఇతరుల యొక్క శ్రేయస్సు కొరకై వినియోగించాలి.
అందరి కొరకై దేవుడు దావీదు వంశము నుండి మంచి కాపరి అయినటువంటి ఏసుప్రభువును, మనలను పరిపాలించు నిమిత్తము పంపిస్తారు అని కూడా యిర్మియా ప్రవక్త ద్వారా తెలుపుచున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుడు ఉత్తమ కాపరిగా ఉంటూ యూదులను అన్యులను ఐక్యము చేశారు అని తెలిపారు. ఏసుప్రభు యూదులను మరియు అన్యులను సఖ్యపరచి వారిని ఒకటిగా చేశారు. ఏసుప్రభు నందు విశ్వాసము ఉంచినటువంటి వారందరూ కూడా ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఒకే ప్రజగా జీవిస్తారు అని తెలిపారు (గలతి 3:28-29). క్రైస్తవులుగా మారిన యూదులు ఏసుప్రభువును మెస్సయ్యగా గుర్తించి అంగీకరించారు, అదే విధముగా అప్పటివరకు అన్య దైవములను పూజించిన అన్యులు కూడా యేసు ప్రభువును రక్షకునిగా గుర్తించి విశ్వసించి ఆయనను వెంబడించారు.
ఈనాటి సువిశేష భాగంలో ఏసుప్రభు యొక్క శిష్యులు పరిచర్యను ముగించుకొని తిరిగి వచ్చినటువంటి సంఘటనను చూస్తున్నాం. శిష్యులు యేసు ప్రభువు యొక్క నామమున అనేక రకములైన అద్భుతములు చేసి దయ్యములను వెళ్లగొట్టి రోగులను స్వస్థపరచి తిరిగి వచ్చారు వారి యొక్క స్థితిని చూసినటువంటి ప్రభువు వారికి కొద్దిపాటి విశ్రాంతి కావాలి అని భావించారు. అందుకే ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని భావించారు కానీ అదే సందర్భంలో ప్రజలు అనేకమంది ప్రభువు కొరకు ఎదురుచూస్తూ ఉన్నారు.
ఇక్కడ గమనించవలసిన కొన్ని అంశములు ఏమిటంటే
1. ఏసుప్రభువుకు తన శిష్యులు మీద ఉన్నటువంటి గొప్ప ప్రేమ. ( వారి యొక్క శారీరక బలహీనతను అర్థం చేసుకున్నారు)
2. ప్రతి ఒక్కరి జీవితంలో కొద్ది సమయం విశ్రాంతి (A time of introspection) తీసుకోవాలి ఎందుకంటే ఆ విశ్రాంతి సమయంలో మనం ఎలాగ జీవించాము అని ఆత్మ పరిశీలన చేసుకొనుట కొరకై.
3. ప్రభువు తన యొక్క ప్రజల యొక్క అవసరతను గుర్తించి వారికి బోధించారు.
4. దేవుని యొక్క వాక్కు కొరకై ప్రజలకు ఉన్నటువంటి గొప్ప తపన.
5. దేవుని కొరకై తపించేవారు ఎప్పుడు దేవుని విషయంలో ముందే ఉంటారు. ప్రజలు ఏసుప్రభువు చూడటానికి వారి కంటే ముందుగా కాలినడక మీదనే వచ్చారు.
6. ఏసుప్రభు యొక్క సహనము మనము అర్థం చేసుకోవాలి అలసిపోయినప్పటికీ ప్రజల యొక్క పరిస్థితిని చూసినప్పుడు వారికి ఇవ్వవలసిన సమయం దేవుడు వారికి ఇస్తున్నారు.
7. ప్రభువు కాపరి వలె తన మందమీద కనికరమును చూపించారు మనం కూడా అదే విధంగా జీవించాలి.
ఈ యొక్క పరిశుద్ధ పఠణముల ద్వారా దేవుడు మనందరిని కూడా కాపరులుగా ఉంచుతూ మనకు ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమముగా నెరవేర్చమని తెలుపుచున్నారు.
యిర్మియా తన బాధ్యతను నెరవేర్చిన విధంగా, పౌలు తన బాధ్యతను నెరవేర్చిన విధంగా మరియు శిష్యులు తమకు ఇచ్చిన పనిని సక్రమంగా చేసిన విధంగా మనకి కూడా దేవుడు ఇచ్చిన ప్రతి బాధ్యతను కాపరి వలె మంచి చేస్తూ మంద కొరకు జీవించే వ్యక్తులుగా ఉండాలి.
Fr. Bala Yesu OCD