19, అక్టోబర్ 2024, శనివారం

ఇరవై తోమ్మిదవ సామాన్య ఆదివారము

ఇరవై తోమ్మిదవ 
సామాన్యకాలపు ఆదివారము 

యెషయా 53:10-11
హెబ్రీయులకు 4:14-16
మార్కు 10:35-45

క్రీస్తునాధునియందు ప్రియ దేవుని బిడ్డలరా, ఈనాడు మనమందరము సామాన్య కాలపు ఇరవై తోమ్మిదవ ఆదివారంలోనికి ప్రవేశించి యున్నాము, ఈనాటి మూడు పఠనలు కూడా ఒకే తీరు మాటల గురించి మాట్లాడుతున్నాయి: అవి ఏమిటంటే త్యాగం, సేవ, మరియు విముక్తి అనే అంశాల గురించి మనకు వివరిస్తున్నాయి.
               ముందుగా మొదటి పఠనములో యెషయా గ్రంధములో మనము గమనించవలసిన అంశం చుసినట్లయితే యెషయా ప్రవక్త యేసు క్రీస్తు గూర్చి ముందుగా ప్రజలందరికి కూడా వివరిస్తున్నాడు. ఏవిధంగానంటే బాధామయ  సేవకుని జీవితంలో ఏవిధంగానైతే బాధలు అనుభవిస్తాడో అదేవిధమైనటువంటి బాధలను క్రీస్తు ఎదుర్కొంటాడు  అనే దానిని క్లుప్తంగా వివరిస్తున్నాడు. ఎందుకంటే, దేవుడు  తన సేవకున్నీ  బాధలు అనుభవింపచేల చేస్తున్నాడు . అందుకనే సేవకుడు తన ప్రాణాన్ని పాప బలిగా ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు, దేవుడు ఆయనకు తగిన ప్రతిఫలముగా సేవకుని మహిమపరుస్తాడు. ఎందుకంటే ఈ దుఃఖం, బాధ, వేదన ద్వారా దేవుడు తన ప్రణాళికను తన సేవకుని ద్వారా నెరవేర్చాడు. మన పాపాల కోసం క్రీస్తు తన జీవితాన్ని మరియు తన సర్వస్వాన్నీ ఇచ్చేందుకు వెనుకంజ వేయలేదు, అది దేవుని ప్రేమ, కృపా  సారాంశం. క్రీస్తు తన ప్రాణాన్ని అర్పించి, మన పాపాలను తుడిచివేశాడు మరియు తన అర్పణకు ప్రతిఫలంగా దేవుడు ఆయనకు విజయాన్ని ఇచ్చాడు. యేసు మన పాపాల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి, బాధను అనుభవించాడు. ఆయన త్యాగం ద్వారా మనకు విముక్తి మరియు క్షమాపణ లభించాయి.
       రెండొవ పఠనని గ్రహించినట్లయితే హెబ్రీయులకు వ్రాసిన లేకలో, యేసు మన ప్రధానయాజకుడిగా మన బలహీనతలను మరియు మనలో ఉన్న నైపుణ్యాలను అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే ఆయన కూడా ఒక మానవునివలె మన మాదిరిగా ఈ లోకానికి వచ్చి అన్ని పరీక్షల్ని, అవమానలను అనుభవించి కూడా ఏ  పాపం చేయలేదు. అందువల్ల,  ఆయనను ఆశ్రయించి, ఆయన వద్దకు వచ్చినవారికి ఆయన కృప తోటి సహాయపడతాడు. ఈ వచనాలు మనలను ఆయన  కాపాడే కృపను, అయన యొక్క దయను తెలుపుతున్నాయి. మనకు అయన కృపను అందించే ప్రయత్నం చేస్తాడు. ఆయన త్యాగం మనకు ధైర్యం, ఆశ కలిగిస్తుందని రెండొవ పఠనం మనకు పూర్తిగా వివరిస్తున్నాయి.
              చివరిగా సువిశేష పఠనములో యేసు ప్రభు ఒక నిజమైన సేవకుడిగా తన జీవితాన్ని త్యాగం చేయడం ద్వారా ఇతరులకు అయన ఒక ఉదాహరణ ఉంటున్నారు ఎందుకంటే మానవుల యొక్క బలహీనతలను అర్థం చేసుకుంటు, ఆయన కూడా మనవుని మాదిరిగా శరీరాన్ని  ధరించి అన్ని కష్టాలను, పరీక్షల్ని  అనుభవించాడు, కానీ అయన మాత్రం మనలాగా పాపం చేయలేదు. అందువల్ల,  ఆయనను ఆశ్రయించి, అయన యొక్క కృప మరియు దయను పొందేందుకు,  ఆయన దగ్గరకు వచ్చినవారికి ఆయన సహాయపడతాడు. ఈ వాక్యాలు అన్ని కూడా మనకు ఆయన  కృపను మరియు దయను తెలుపుతున్నాయి. యేసయ్య తన ప్రాణాన్ని అనేకమందికి రక్షణగా మరియు విముక్తిగా ఇచ్చాడు, ఇది క్రైస్తవ జీవితంలో అనుసరించాల్సిన మార్గాన్ని అయన మనకు ఒక ఉదాహరణగా తన జీవితం ద్వారా చూపిస్తున్నాడు.

           కాబ్బటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ, త్యాగం, మరియు సేవ మన జీవితాలలో కీలకమైనవి అని ఈయొక్క మూడు పఠనలు కూడా మనకు వివరిస్తున్నాయి. అందుకని మనము దేవునికి ఇష్టనుసరంగా జీవించలని మనం ఈ దివ్య బలి పూజలో ప్రార్దించుకుందాము.

Fr. Johannes OCD

29 వ సామాన్య ఆదివారం


యెషయా 53:10-11, హెబ్రి 4:14-16,మార్కు 10:35-45
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు ప్రభువుని అనుసరించేవారు సేవక రూపం కలిగి జీవించాలి అనే అంశమును, అదేవిధంగా అధికారం ఉన్నటువంటి వారు సేవకులు వలె తమ యొక్క అధికారమును సద్వినియోగపరుచుకోవాలని వినయంతో సేవ చేయాలని కూడా  తెలుపుతున్నాయి.
ఈనాటి మొదటి పఠణంలో  బాధామయ సేవకుని యొక్క జీవితం గురించి తెలుపుచున్నది ఈ యొక్క బాధామయ సేవకుడు మరెవరో కాదు క్రీస్తు ప్రభువే ఆయన అందరి కోసం అనుభవించేటటువంటి శ్రమలను గురించి యెషయా ప్రవక్త తెలియజేశారు. క్రీస్తు ప్రభువు యొక్క మరణము పాప పరిహార బలి అయ్యింది. అందరి యొక్క పాపముల నిమిత్తమై ప్రభువు మరణించారు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి కొందరికి సంతోషంగా ఉన్న సమయంలో శ్రమలు వస్తాయి, కొందరికి జీవితం యధావిధిగా సాగించే సమయంలో శ్రమలు వస్తుంటాయి. కొంతమందికి శ్రమలు అప్పుడప్పుడు మరి కొంతమందికి శ్రమలు తరచుగా వస్తాయి. కొంతమంది శ్రమలు తట్టుకొని జీవిస్తే మరి కొంతమంది శ్రమలను తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటారు. మరికొందరు విశ్వాసాన్ని కూడా కోల్పోతారు.
కొన్ని కొన్ని సందర్భాలలో మనము ఇతరులకు మేలు చేయుట కొరకు శ్రమలు అనుభవించవచ్చు. పునీత చిన్న తెరెసమ్మ గారు తన యొక్క జీవితంలో కొన్ని సందర్భాలలో తాను తప్పు చేయనప్పటికీ దానిని అంగీకరించుకొని ఆ యొక్క బాధలను పాపుల యొక్క హృదయ పరివర్తనం కొరకై సమర్పించేవారు. ఈనాటి మొదటి పఠణంలో బాధామయ సేవకుడు ఎటువంటి తప్పిదము చేయనప్పటికీ కేవలము ఇతరుల యొక్క శ్రేయస్సు కొరకై, రక్షణ కొరకై తన యొక్క ప్రాణములను త్యాగం చేశారు. ఈనాటి రెండవ పఠణంలో హెబ్రీలకు రాయబడిన లేఖలో రచయిత యేసు ప్రభువు యొక్క యాజకత్వమును గురించి తెలుపుచున్నారు. ఆయన మనవలె శోధింపబడినప్పటికీ పాపము చేయనటువంటి ప్రధాన యాజకుడు కాబట్టి ఆయన చెంతకు చేరి ఆయన కృపను పొందుదుమని తెలుపుచున్నారు. ఆయన ప్రధాన యాజకుడిగా ఉంటూ తానే ఒక బలిగా ఇతరుల కొరకు సమర్పించుకున్నారు.
ఈనాటి సువిశేష భాగములు యేసు ప్రభువు యొక్క శిష్యులు యోహాను యాకోబులు, ప్రభువు స్థాపించబోయే రాజ్యంలో అగ్రస్థానాల కొరకై ఆశపడ్డారు ఆయన రాజ్యాన్ని ఇహలోక సంబంధమైన రాజ్యముగా, సిరిసంపదలతో కూడిన రాజ్యముగా, శాంతిభద్రతలతో తులతూగే ఒక గొప్ప రాజ్యంగా భావించారు అట్టి రాజ్యములో వీరికి ముఖ్యమైనటువంటి స్థానములను ఇవ్వమని ప్రభువును అడుగుచున్నారు. యోహాను, యాకోబులకు దేవుడు మొదటి స్థానం పేతురుకు ఇచ్చారు అని తెలుసు తరువాత రెండవ- మూడవ స్థానములను యోహాను యాకోబులకు ఇవ్వమని వారు అధికారం కోసం అడుగుచున్నారు. అనేక సందర్భాలలో యోహానును యాకోబును ఏసుప్రభు తనతో తీసుకుని వెళ్లారు. పేతురు అత్త అస్వస్థతతో ఉన్న సమయంలో వీరిద్దరిని తనతో పాటు తీసుకెళ్లారు, యాయీరు కుమార్తె అస్వస్థతతో ఉన్న సమయంలో వీరిద్దరూ ప్రభువుతో ఉన్నారు, దివ్యరూపధారణ సమయంలో కూడా మీరు ఏసుప్రభు తోనే ఉన్నారు. కాబట్టి వీరు కూడా ప్రభువు మాకు ప్రాముఖ్యతనిచ్చారు అయినప్పటికీ అధికారం కొరకు ఆశించారు.
ఇక్కడ ఏసుప్రభు నిజమైన అధికారమంటే పెత్తనం చెలాయించటం కాదు సేవ చేయటం అని తెలియపరుస్తున్నారు. ఈ సువిశేష భాగములో మనము గ్రహించవలసినటువంటి కొన్ని విషయాలు. 
1. ప్రతి శిష్యుడు/ అధికారి సేవకు రూపం దాల్చాలి. దేవుడిని వెంబడించేటటువంటి సమయములో ఎటువంటి పదవులను ఆశించకుండా కేవలము సేవకుని వలె దేవుడి యొక్క బాధ్యతను నెరవేర్చాలి. 
2. ఇచ్చిన అధికారమును వినయముతో నెరవేర్చాలి. కొన్ని సందర్భాలలో అధికారము వచ్చిన తర్వాత అనేక మందికి గర్వం వస్తూ ఉంటుంది కాబట్టి ప్రభువు చెప్పే అంశం ఏమిటంటే వినయంతో అధికారమును వినియోగించుకోవాలి అని తెలుపుచున్నారు. తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క గొప్పతనము చాటి చెప్పాలి.
3. ప్రతి అధికారంలో త్యాగపూరితమైన ప్రేమ ఉండాలి అనగా ఇతరులకు మేలు చేయు సమయంలో తాను (అధికారంలో ఉన్న వ్యక్తి)ఎన్ని బాధలైనా పొందవలసి వస్తే పొందటానికి సిద్ధముగా ఉండాలి. 
4. ప్రతి సేవకుడిలో/అధికారి వినయం ఉండాలి ఎందుకంటే ఏసుప్రభు నేను ఈ లోకంలో సేవ చేయడానికి వచ్చాను సేవింపబడుటకు రాలేదు అని తెలిపారు. కాబట్టి ఏసుప్రభుని వెంబడించే ప్రతి ఒక్క శిష్యుడు- శిష్యురాలు ఆయన వలె వినియం కలిగి జీవించాలి. 
5. నిస్వార్థ సేవను చేయాలి. ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా ప్రభువు యొక్క సేవ చేయాలి.
6. ఏసుప్రభు వలై నిస్సహాయులను అనాధలను స్వీకరించి వారికి మేలు చేయాలి. 
ప్రతి క్రైస్తవుడు అధికారాన్ని సేవగా భావించి క్రీస్తు వలే కష్టాలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. సమాజములో జరుగుతున్నటువంటి అన్యాయమును ఎదుర్కొని న్యాయం కొరకు పోరాడాలి. పేదల పట్ల బలహీనుల పట్ల దయా కనికరము కలిగి వారి కొరకు పోరాడటానికి ప్రయత్నించాలి. 

Fr. Bala Yesu OCD

లూకా 17:11-19

 సమరియుని కృతజ్ఞత  యేసు సమరియా, గలిలియా ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగనే పదిమంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదు...