13, జూన్ 2025, శుక్రవారం

దేవుని ఆజ్ఞలు- బాహ్య ఆచరణ, ఆంతరంగిక శుద్ధి

 మత్తయి 5: 20-26

ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. "నరహత్యచేయరాదు, నరహత్యకావించు వాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాశింపబడిన మాట మీరు వినియున్నారుగదా!నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా: తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. అదే విధముగా తన సోదరుని 'వ్యర్థుడా!' అని అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. కనుక, బలిపీఠసన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్దయున్నట్లు నీకు స్ఫురించినచో, ఆ కానుకను పీఠము చెంతనే వదలిపెట్టి, పోయి,  మొదట నీ సోదరునితో సఖ్యపడి, తిరిగివచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగనే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును. న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.  నీవు చెల్లింపవలసిన ఋణములో కడపటి కాసు చెల్లించువరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నొక్కి వక్కాణించుచున్నాను.  

ఈ సువిశేషభాగంలో ఆంతరంగిక శుద్దిగురించి, మనం గొప్పవారిగా పరిగణించేవారి కంటే మనం మనం మంచి జీవితం జీవించాలని, సోదర ప్రేమ మరియు క్షమాగుణం కలిగి ఉండాలని, మొదట మనమే మనకు వ్యతిరేకంగా ఉన్నవారితో సఖ్యత ఏర్పరుచుకోవాలని ప్రభువు కోరుతున్నాడు. 

మీ నీతి బాహ్య ఆచరణ  లేక హృదయ శుద్ధి ఆవిష్కృతమా?

ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. యేసు ప్రభువు ప్రధానమైన బోధ పరలోక రాజ్యము. ఈ రాజ్యములో ప్రతివక్కరికి  శాంతి సమాధానము ఉంటుంది. ఈ రాజ్యములో ప్రవేశించడానికి ధర్మ శాస్త్ర బోధకులకంటే పరిసయ్యులకంటే నీతి వంతమైన జీవితం జీవించాలని ప్రభువు చెబుతున్నాడు.  పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు నీతివంతమైన జీవితంలో ఏమైన లోపమున్నదా?  అంటే మరియొక సందర్భంలో ప్రభువు వారు చెప్పునది చెయ్యండి కాని వారు చేసేది కాదని చెప్పారు. ఈ ధర్మశాస్త్ర బోధకులు మరియు పరిసయ్యులు బాహ్యంగా మంచి పేరు పొందాలనే ఆశతో అనేక ఆధ్యాత్మిక పనులు చేస్తూ ఉన్నారు కాని వారి నీతి హృదయపూర్వకమైనది కాదు, కేవలం బయట కనపడుటకు మాత్రమే చేస్తున్నారు. అందుకే ప్రభువు వారితో మీ నీతో వారికంటే గొప్పగా ఉండాలి అని చెబుతున్నారు. దీనికి మనం చేయవలసినది హృదయ పరివర్తన కలిగివుండటం. మనం చేసే పని హృదయపూర్వకంగా చేయడం. దేవుని ఆజ్ఞలను ప్రేమతో పాటించాలి. నీతి అంటే మనం చేయవలసిన పని , లేక బాధ్యతను ఖచ్చితంగా, ఎటువంటి కపటత్వం లేకుండా చేయడం. ఇందుకు మనలోని కోపం, అసూయ, మొహలను త్యజించుకోవాలి. 

నీ సోదరుని గౌరవించుట 

 "నరహత్యచేయరాదు, నరహత్యకావించు వాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాశింపబడిన మాట మీరు వినియున్నారుగదా!నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా: తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. అదే విధముగా తన సోదరుని 'వ్యర్థుడా!' అని అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును.  ఈమాటలు పాత నిబంధనలో ఉన్న నరహత్య చేయరాదు అనే ఆజ్ఞకు నూతన వివరణ ప్రభువు ఇచ్చాడు.  ఒక సోదరుని వ్యర్థుడా అని చెప్పిన కూడా అది నేరంగా పరిగణించబడుతుందని ప్రభువు చెబుతున్నాడు. దీనినుండి మనం ఏ వ్యక్తిని కించపరచడం లేక అవమానించడం అనేవి కూడా దేవుడు మన నుండి ఆశించడం లేదు. నరహత్య చేయువాడు తీర్పునకు గురియగును అని పాత నిబంధన చెబుతుంటే ప్రభువు సోదరుణ్ణి వ్యర్థుడా అని సంబోధించినవాడు నరకాగ్నిలో మండును అని చెబుతున్నాడు. మన సోదరులను, బంధుమిత్రులను లేక ఈ లోకంలో ఏ వ్యక్తిని కించపరచడం, అవమానించడం అనేవి మనలను నరకాగ్నిలో మండేలా చేస్తాయి. మన సోదరులను గౌరవిస్తూ, మనకు సాధ్యమైనంత వరకు వారికి మంచి చేయుటకు ప్రయత్నించాలి. 

సఖ్యత కలిగి ఉండాలి

బలిపీఠసన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్దయున్నట్లు నీకు స్ఫురించినచో, ఆ కానుకను పీఠము చెంతనే వదలిపెట్టి, పోయి,  మొదట నీ సోదరునితో సఖ్యపడి, తిరిగివచ్చి నీ కానుకను చెల్లింపుము. ఈ మాటలు మన సోదరులతో మనకు ఉండవలసిన బాంధవ్యాలను గురించి తెలియజేస్తుంది. పవిత్ర గ్రంథంలో సహోదరుల మధ్యలో అమరికలు ఉండటం ఒకరి నాశనము మరియొకరు కోరుకోవడం ఎప్పుడు హర్షించలేదు. వారిని శిక్షించుటకు వెనుకాడలేదు. దైవ రాజ్యంలో చేరుటకు, దేవుడు మన ప్రవర్తను హర్షించుటకు మరియు మనలను శిక్షించకుండ ఉండుటకు ఏమి చేయవచ్చో యేసు ప్రభువు ఈ సువిశేషభాగంలో తెలియజేస్తున్నాడు. అది ఏమిటంటే మన సోదరులతో ఎప్పుడు సఖ్యత కలిగివుండటం. మన సోదరులకు మన మీద మనస్పర్ధ ఉందని మనకు తెలిస్తే ఆ సోదరునితో మొదటగా సఖ్యపడాలి. సఖ్యత, సమాధానం మన సోదరులతో ఎల్లపుడు మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అది జరిగిన తరువాతనే మనం దేవునికి అర్పించే బలి అర్పించాలని చెబుతున్నారు. అపుడు దేవునికి బలి అర్పించే సమయంలో మన మనసులో ఏ చెడు ఆలోచనకాని, అసూయకాని మనలో ఉండదు. అది మనము పరలోక రాజ్యంలో చేరుటకు అర్హతను సాధిస్తుంది. 

నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగనే అతనితో సత్వరము సమాధానపడుము. ఏ వ్యక్తి కూడా నాశనము కావడం ప్రభువుకు ఇష్టంలేదు. కనుక యేసు ప్రభువు మనము ఏమి చేయాలో చెబుతున్నాడు. మన ప్రతివాదులతొ ముందుగానే సమాధాన పడాలి అని చెబుతున్నాడు. దాని ద్వారా మనం రానున్న శిక్షనుండి తప్పించుకొనవచ్చు. ఎల్లప్పుడూ మనం అందరితో సమాధానపడి జీవించుదాం. 

ప్రార్థన: 

ప్రభువా! మానవులు అందరు మీ రాజ్యంలో ఉండాలని కోరుకున్నారు. అందుకు మేము ఏమిచేయాలో నేర్పుతున్నారు. మా మనసు ఎల్లప్పుడు ఎటువంటి కల్మషం, అసూయా, ఇతరుల చేదు లేకుండా ఉండాలని కోరుతున్నారు.  మేము ఎటువంటి కపటత్వం లేకుండా ఉండాలని, హృదయ శుద్ధి కలిగి జీవించాలని కోరుతున్నారు. మా సోదరులలో సఖ్యత కలిగి ఉండాలని, ఎవరిని అవమానించకుండా, గౌరవించాలని నేర్పుతున్నారు. కేవలం చెప్పడమే కాక మీరు మాకు ఎలా జీవించాలో చూపించారు.  ప్రభువా మీరు చూపించిన జీవితానికి కృతజ్ఞతలు, మీ మాటలను, జీవితమును ఆదర్శముగా  తీసుకొని జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించండి. ఆమెన్ 

9, జూన్ 2025, సోమవారం

మరియమాత శ్రీ సభ తల్లి

 యోహాను 19: 25-34 

యేసు సిలువ చెంత ఆయన తల్లియు, ఆమె సోదరి, క్లొఫా భార్యయగు  మరియమ్మయు, మగ్ధలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు, తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట యేసు చూచి, యేసు తన తల్లితో, "స్త్రీ! ఇదిగో నీ కుమారుడు!" అనెను. ఆ తరువాత శిష్యునితో "ఇదిగో నీ తల్లి" అనెను. శిష్యుడు ఆ గడియనుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసికొనిపోయెను. పిదప, యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, "నాకు దాహమగుచున్నది." అనెను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని 'హిస్సోపు' కొలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు  ఆ రసమును  అందుకొని "సమాప్తమైనది" అని తలవంచి, ప్రాణము విడిచెను. అది పాస్కపండుగకు సిద్దపడు దినము. అందుచే యూదులు పిలాతును, "రేపటి విశ్రాంతి దినము గొప్పదినము. ఆనాడు దేహములు సిలువ మీద ఉండరాదు. కాళ్ళు విరుగగొట్టి వానిని దింపి వేయుటకు అనుమతినిండు" అని అడిగిరి. కావున సైనికులు వెళ్లి, యేసుతో పాటు సిలువవేయబడిన మొదటివాని కాళ్ళను, మరియొకని కాళ్ళను విరుగగొట్టిరి. కాని వారు యేసువద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి, ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు. అయితే, సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బళ్లెముతో పొడిచెను. వెంటనే రక్తము, నీరు స్రవించెను. 

మరియమాత శ్రీ సభ తల్లి 

యేసు ప్రభువు మరణించే ముందు సిలువ మీద ఉన్నప్పుడు తాను ప్రేమించిన శిష్యుడు యోహానును పిలిచి ఇదిగో నీ తల్లి అని, మరియు మరియమాతతో యోహాను చూపిస్తూ ఇదిగో నీ కుమారుడు అని చెబుతున్నాడు. మరియమాత మనకు తల్లిగా తిరుసభను అన్ని విధాలుగా మనలను ఆదరిస్తుంది. ఎప్పుడు తిరుసభకు తోడుగా ఉంటూ, తిరుసభకు అవసరమైన వాటికోసం ప్రార్థిస్తుంది. 

ఇదిగో నీ కుమారుడు: పునీత యోహాను యేసు ప్రభువు ప్రేమించిన శిష్యుడు, కడరా భోజన సమయంలో యేసు ప్రభువుని హృదయమునుకు దగ్గరగా ఉన్నవాడు, ప్రభువుని ముఖ్యమైన ముగ్గురు శిష్యులలో ఒకడు. యేసు ప్రభువుని శ్రమల సమయంలో రహస్యంగా ప్రభువును అనుసరించినవాడు. ప్రభువు సిలువ మీద ఉన్నప్పుడు సిలువ క్రింద ఉన్నవాడు. అటువంటి శిష్యుని ప్రభువు తన తల్లికి అప్పగిస్తూ ఇదిగో నీ కుమారుడు అని చెబుతున్నాడు. మరియమాతకు కుమారునిగా ఇచ్చినది కేవలం యోహానును కాదు, తాను ప్రేమించితిన శిష్యుడను,  ఇక్కడ ప్రభువుచే ప్రేమించబడిన ఆ శిష్యుడు తిరుసభకు గుర్తు. ప్రభువు మరియమాతకు ఇచ్చినది యోహాను రూపంలో తిరుసభను. యోహాను ప్రభువును విశ్వసించే ప్రతి విశ్వాసికి ప్రతిరూపంగా  ఉన్నాడు. 

నిన్ను వీడని తల్లి 

తల్లిగా మరియమాత ఎప్పుడు తన కుమారున్ని విడువలేదు. యేసు ప్రభువును ఈ లోకములోనికి తీసుకొనిరావడానికి మరియమాత తాను పొందబోయే అవమానమునుకాని కష్టమును కాని ఆమె పట్టించుకొనలేదు. కేవలం ప్రభువును అంటిపెట్టుకొని ఉండుటకు ఆమె ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చింది. యేసు ప్రభువు పసిబాలునిగా ఉన్నప్పుడు హేరోదు ఆయనను చెంపుటకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె యోసేపుతో కలిసి ప్రభువును కాపాడుటకు రాత్రి పగలు తేడాలేకుండా ప్రభువును తీసుకొని సురక్షితమైన ప్రాంతమునకు పోయేది. యేసు ప్రభువును అన్ని సమయాలలో ప్రభువును గురించే ఆమె ఆలోచించేది. ప్రభువు తన ప్రేషిత కార్యం ప్రారంభించినప్పుడు ఆయన గురించి తెలుసుకొనుటకు ప్రభువు దగ్గరకు వెళుతుంది. ప్రభువు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు శిష్యులు అందరు ఆయనను వదలి వెళ్ళిపోయినా తల్లి మాత్రము ఆయనను వెంబడిస్తూనే ఉంది. సిలువ క్రింద ప్రభువు చనిపోయే సమయంలో కూడా ఆమె ఉంది. ప్రభువును ప్రతి క్షణము అంటిపెట్టుకొని ఆమె జీవించేది. అటువంటి ఆమెను యేసు ప్రభువు తాను ప్రేమించిన శిష్యునికి తల్లిగా ఇస్తున్నాడు. ఆయనను ఎలా ఎప్పుడు వెన్నంటివున్నదో అదే విధముగా ఆ శిష్యునికి మరియు ఆయన శిష్యులందరికి ఆమె తోడుగా,  వారి బాధలలో ఓదార్పుగా, వారికి ఆదర్శముగా ఉండుటకు ప్రభువు ఆమెను తన శిష్యునికి తల్లిగా ఇస్తున్నాడు. 

తల్లిగా శ్రీ సభతో మరియమాత 

మరియమాత పెంతుకోస్తు రోజున శిష్యులందరు, యూదుల భయంతో ఉన్నప్పుడు, మరియమాత వారితో ఉండి ప్రార్ధన చేస్తుంది. పవిత్రాత్మతో తిరుసభ పుట్టిన రోజన మరియమాత అక్కడనే ఉన్నది. వారితో పాటు ఉండి వారికి ధైర్యమును ఇస్తుంది.  అందరు మనలను అపార్ధం చేసుకున్నాకాని ఎలా  దైవ చిత్తమును నెరవేర్చుటకు ధైర్యంగా ఉండాలో నేర్పుతుంది. శిష్యులు భయంతో ఉన్నప్పుడు ఆమె వారికి ధైర్యమును ఇస్తుంది.  ప్రభువును పవిత్రంగా ఈ లోకమునకు తీసుకురావడానికి ఆమె కన్యగా గర్భం ధరించడానికి ఆమె ధైర్యంగా ఒప్పుకున్నది. అలానే శిష్యులు ప్రభువు అజ్ఞానుసారం జీవించేలా ఆమె ధైర్యం ఇస్తుంది. ఆమె కేవలం వారికి తోడుగా మాత్రమేకాక తన జీవితం ద్వారా ఆదర్శమును చూపిస్తుంది.  

Fr. Amruth 

దేవుని ఆజ్ఞలు- బాహ్య ఆచరణ, ఆంతరంగిక శుద్ధి

 మత్తయి 5: 20-26 ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. ...