February 26
సిరా 4:11-19
మార్కు 9:38-40
అంతట యోహాను యేసుతో "బోధకుడా! మనలను అనుసరింపని ఒకడు నీపేరిట దయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమి" అని పలికెను. అందుకు యేసు "మీరు అతనిని నిషేధింపవలదు, ఏలయన, నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధికానివాడు మన పక్షమున ఉండువాడు.
యోహాను యేసుతో, “బోధకుడా, దయ్యాలను వెళ్ళగొట్టే వ్యక్తిని మేము చూశాము. అతను మనల్ని అనుసరించడు కాబట్టి మేము అతన్ని ఆపడానికి ప్రయత్నించాము” అని చెప్పడంతో ప్రారంభమవుతుంది ఈనాటి సువిశేషం. ఆ వ్యక్తి దయ్యాలను వెళ్ళగొట్టే సామర్థ్యం పట్ల శిష్యులు అసూయపడుతున్నారా? వారు ఈ రకమైన శక్తిని కలిగి ఉండాలనుకుంటున్నారా? అనే ప్రశ్నలను అడిగితే ఆ వ్యక్తి వలే వీరుకూడా చేయాలి అని అనుకోని ఉండవచ్చు. యేసు యోహానుతో, “అతన్ని నిరోధించవద్దు. ఎవరైనా నా నామంలో మంచి పని చేస్తే, నా గురించి వారు ఎలా చెడుగా మాట్లాడరు” అని అంటాడు. తరువాత యేసు ఇలా అంటాడు: “మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్నాడు.”
ఈ రోజు యేసు ప్రభువు మనకు ఒక ముఖ్యమైన సూచన ఇస్తున్నాడు. మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్నాడని ఆయన మనకు చెబుతున్నాడు. సాధారణంగా చాలా మంది మానవులకు ఏ వ్యక్తులు తమను ఆదరిస్తారో తెలుసు. అయితే, ఏ వ్యక్తులు మనతో పోరాడవచ్చు, మనల్ని ఇష్టపడకపోవచ్చు లేదా మనల్ని విస్మరించవచ్చు అని కూడా మనకు తెలుసు. కాని ఈ రోజులలో మనతో మంచిగా మాటలాడి మనము లేని సమయంలో వ్యతిరేకంగా మాటలాడువారే ఎక్కువ మంది ఉండవచ్చు.
యేసు ప్రభువును అనుసరించకుండా, ఆయన నామమున ఒక వ్యక్తి దయ్యములను వెడలగొడుతున్నాడు అంటే ఆ వ్యక్తి యేసు ప్రభువును దేవునిగా , రక్షకునిగా అంగీకరించాడు. మరియు యేసు ప్రభువు మాటలను పాటించి జీవిస్తూ ఉండవచ్చు. ఎదో ఒక సమయంలో ప్రభువు మాటలను విని, ఆయన ఈ విధంగా చేస్తున్నాడు. ప్రభువు చెప్పినట్లు ఆ వ్యక్తి ప్రార్థన, మరియు ఉపవాసములతో జీవించేవాడు అయివుండవచ్చు ఎందుకంటే ప్రభువే చెబుతున్నాడు ఇటువంటివి కేవలం ప్రార్ధన మరియు ఉపవాసంతోనే సాధ్యమని కనుక ఆ వ్యక్తి ప్రభువుతో ఉండకపోయినా ప్రభువుని అనుచరుడే.
మానవులుగా, మనలో చాలామంది ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో దాని గురించి ఎక్కువగా శ్రద్ధ వహించవచ్చు. అయితే, యేసు తన శిష్యులు నిజంగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నాడు. వారు ఇతరుల పట్ల అసూయపడటం లేదా మరొకరి సామర్థ్యాలు మరియు బహుమతులను కోరుకోవడం ఆయనకు ఇష్టం లేదు. తన శిష్యులు తమ సొంత బహుమతులను మరియు ఇతరుల బహుమతులను కూడా అభినందించాలని యేసు స్పష్టంగా కోరుకుంటున్నాడు.
Br. Pavan OCD