తపస్సు కాలపు మూడవ ఆదివారము
నిర్గమ 3:1-8, 13-15
1కొరింథీ 10:1-6, 10-12
లూకా 13:1-9
క్రీస్తునాధునియందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనము తపస్సు కాలపు మూడవ ఆదివారంలోనికి ప్రవేశించియున్నాము. ఈ నాటి మూడు దివ్యాగ్రంధ పఠనములు మనకు దేవునితో మన సంబంధం గురించి మరియు ఆయనకు మహిమను తెచ్చే జీవితాలను ఎలా జీవించాలని అనే ముఖ్యమైన అంశాల గురించి తెలియజేస్తున్నాయి.
అసలు దేవునితో సంబంధం అంటే ఏమిటి అని మనం గ్రహించినట్లయితే పునీత అవిలాపురి తెరెసమ్మ గారు ఈ విధంగా అంటున్నారు.
1. వ్యక్తిగత అనుభవం: ప్రతి ఒక్కరి జీవితములో కూడా దేవునితో ఒక వ్యక్తిగతమైన సబంధం ఉండాలని మరియు మన హృదయాలలో దేవునితో ఒక ప్రత్యేకమైన సంభందం ఉండాలని ఈ మొదటి మాటలో అంటున్నారు.
2. స్నేహం: ఆమె ప్రార్థన దేవునితో ప్రేమపూర్వకమైన స్నేహం అంటున్నారు. ఎందుకు ఆమె ఆలా అంటున్నారు అంటే స్నేహితులు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటారో, తమ సంతోషాలను మరియు బాధలను పంచుకుంటారో, అదే విధంగానే మనం కూడా దేవునితో మన హృదయాన్ని తెరవాలని ఒక స్నేహితునివలె మనము కూడా ఆయనతో మాట్లాడాలని తెలియజేస్తున్నారు.
3. ఆత్మ పరిశీలన: దేవునితో మన సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ఆత్మ పరిశీలన చాలా ముఖ్యమైన సాధనమని ఆమె అంటున్నారు. మన బలహీనతలను మరియు మన పాపాలను గుర్తుచేసుకొని వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి ఆమె మనకు తెలియజేస్తున్నారు.
ఈ విధమైనటువంటి సంబంధాన్ని మనం జీవిచాలని ఆమె అంటున్నారు. ఈ నాటి పఠనలుకూడా ఇదే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి.
ముందుగా మొదటి పఠనములో మోషే దేవుని యొక్క పిలుపును అందుకుంటాడు. దేవుడు మండుతున్న పొద రూపంలో మోషేకు ప్రత్యక్షమై, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్న వారిని విడిపించడానికి దేవుడు మోషేను ఎన్నుకుంటానాడు. ఇక్కడ, దేవుడు మోషేతో తనను తాను 'నేను ఉన్నవాడను' అని పరిచయం చేసుకుంటాడు, ఇది ఆయన శాశ్వతత్వాన్ని, స్వయం సమృద్ధిని మరియు విశ్వాసనీయతను తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుడు తన ప్రజల బాధలను చూసి, వారిని విడిపించడానికి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. అంతేకాకుండా ఇక్కడ దేవుని పిలుపు మరియు ఆయన శక్తిని ఈ సంఘటనద్వారా మనకు తెలియజేస్తుంది. ఇక్కడ మనము గమనించలసింది దేవుని పేరు యొక్క ప్రాముఖ్యత మరియు ఆయనతో మన సంబంధం గురించి ఇది తెలియజేస్తుంది.
రెండవ పఠనములో పౌలు ఇశ్రాయేలీయుల ఎడారి ప్రయాణం నుండి నేర్చుకోవలసిన గుణ పాఠాల గురించి కొరింథీయులకు గుర్తుచేస్తున్నాడు మరియు వివరిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని అద్భుతాలను చూసినప్పటికీ, వారు అవిధేయత, విగ్రహారాధన మరియు సణుగుడు ద్వారా పాపం చేశారు అని పౌలు గారు వారి అనుభవాలను మనకు హెచ్చరికగా ఉపయోగిస్తాడు, తద్వారా మనం అదే తప్పులు చేయకుండా ఉంటాము అని దేవునితో సభందం కలిగి జీవిస్తామని అంటున్నారు.
అంతేకాకుండా ఇక్కడ మనం దేవుని విశ్వాసనీయతను అంత తేలికగా తీసుకోకూడదు. మన హృదయాలను పాపం నుండి కాపాడుకోవాలి మరియు దేవునికి విధేయత చూపాలి అని అంటున్నారు. ఎందుకంటే గర్వం అనేది మన పతనానికి దారితీస్తుందని కాబట్టి మనం ఎల్లప్పుడూ వినయంగా ఆయనతో సంబంధం కలిగి ఉండాలని అంటున్నారు.
చివరిగా సువిశేష పఠనములో యేసు పీలాతు చేతిలో చంపబడిన గలిలయుల గురించి మరియు సిలోయము గోపురం కూలి చనిపోయిన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఈ సంఘటనలు ఎందుకు క్రీస్తు వారికీ తెలియజేస్తున్నాడంటే పాపులు పశ్చాత్తాపపడకపోతే వారు కూడా నాశనం అవుతారని హెచ్చరికగా ఉపయోగిస్తాడు. యేసు ఒక అంజూరపు చెట్టు ఉపమానాన్ని కూడా చెబుతాన్నాడు, ఇది దేవునిపట్ల మన పశ్చాత్తాపం మరియు ఫలాలను ఉత్పత్తి చేయడం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తుంది. మనం మన పాపాలను విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని వైపు తిరగాలుగుతామో. అపుడే దేవుడు మనకు పశ్చాత్తాపపడటానికి అవకాశాలను ఇస్తాడు, కానీ మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలి. మనం దేవునికి ఫలాలను ఇచ్చే విధంగా మనం మారాలని, అంటే మనం ఆయనకు మహిమ తెచ్చే జీవితాలను జీవించాలి తెలియజేస్తున్నాడు.
కాబట్టి ప్రియా దేవుని బిడ్డలరా ఇక్కడ మనం నేర్చుకోగల కొన్ని సాధారణ గుణాలు మనకు కనిపిస్తాయి. దేవుడు నమ్మదగినవాడు మరియు విశ్వాసనీయుడు. మనం పాపం నుండి పశ్చాత్తాపపడాలి మరియు దేవునికి విధేయత చూపాలి.
కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఈ తపస్సు కాలం మనం పశ్చాత్తాపాన్ని, విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవడానికి, దేవునిచే అనుగ్రహించబడిన సమయం కాబట్టి మన పాపాలను దేవుని ముందు ఉంచుతు పశ్చాత్తాపం పడి దేవునితో సంబంధం కలిగి జీవించాలని ప్రార్దించుకుందాము.
Fr. Johannes OCD