యోహాను 3: 7-15
నీవు మరల జన్మింపవలయునని నేను చెప్పిన్నందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనటుల వీచును. నీవు దాని శబ్దమును వినెదవే కాని అది ఎక్కడనుండి వచ్చునో, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మవలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును" అనెను. "ఇది ఎటుల సాధ్యమగును?" అని నికోదేము అడిగెను. అందులకు యేసు: "నీవు యిస్రాయేలు బోధకుడవైయుండియు దీనిని ఎరుగవా? మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము. చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము. కాని, మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పిన మీరు నమ్ముట లేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన యెడల ఎట్లు నమ్మెదరు. పరలోకము నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. "మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యజీవము పొందుటకు అట్లే మనుష్యకుమారుడును ఎత్తబడవలెను.
నూతన జీవితం - క్రీస్తు ఎత్తబడటం
ఈ సువిశేష భాగంలో నూతన జీవితం ఎలా మొదలవుతుంది, దానికి ఏమి చేయాలి అని మరియు ఏవిధంగా క్రీస్తు మోషే కంచు సర్పమును ఎత్తినట్లు ఎత్తబడతాడు అనే విషయాలను మనము చూస్తాము. యేసు ప్రభువు నికోదేముకు ఎలా ఒక వ్యక్తి నూతనంగా జన్మించాలి అని చెబుతున్నాడు. అటులనే ఈ నూతన జీవితం పొందేవాడు నిత్యజీవానికి అర్హుడు అవుతాడు, ప్రభువు అందుకుగాను వారి కొరకై సిలువ మీదకు ఎత్తబడతాడు, ప్రభువుని సిలువ మరణం మానవునికి ఈ నిత్య జీవమును ఇచ్చుటకే అనే విషయం స్పష్టము అవుతుంది.
ఎందుకు మరల జన్మించాలి ?
యేసు ప్రభువు ఈ లోకంలో ఉండగా దేవుని రాజ్యం యొక్క గొప్ప తనాన్ని అందరికి ప్రకటించారు. ఆ రాజ్యంలో ప్రవేశించడానికి ఒక వ్యక్తి దేనినైన కోల్పోవడానికి సిద్ధంగా ఉంటాడు కాని ఆ రాజ్యం కావాలనికోరుకుంటాడు. దేవుని రాజ్యం అంటే అంతటి గొప్పది కనుక యేసు ప్రభువు చెప్పిన అనేక ఉపమానాలలో దాని విలువ తెలిసిన వ్యక్తులు, ఏమి కోల్పోయిన దానిని పొందుటకు ప్రయత్నిస్తారు. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ప్రధానమైన అర్హత నూతన జన్మను పొందాలి అని ప్రభువు చెబుతున్నారు. అందుకే ఈ నూతన జన్మ ముఖ్యమైనది. మానవుడు తన సొంత బలం ద్వారా ఈ నూతన జన్మను పొందలేడు, జీవించలేడు. దేవుని తోడ్పాటు ఎంతగానో అవసరం ఉంటుంది. ఇది పూర్తిగా హృదయ పరివర్తనతోనే మొదలవుతుంది, అందుకే ప్రభువు తన పరిచర్యలు మొదట హృదయ పరివర్తన పొందాలి అని చెబుతున్నారు.
ఆత్మతో జన్మించువారు
ఆత్మతో జన్మించువారిని ప్రభువు గాలితో పోల్చుతున్నారు. గాలి ఎక్కడ నుండి వస్తుందో, ఎక్కడకు వెళుతుందో మనకు తెలియదు, అటులనే ఆత్మతో జన్మించువారు, లేక నూతన జన్మ పొందిన వారు, మారు మనసు పొందినవారు ఎలా ఉంటారో మనము చూస్తాము. వారి జీవితాల్లో ఉన్న మార్పు, వారి పరివర్తన మనకు కనపడుతునే ఉంటుంది, అంటే మనం ఆత్మను చూడము కానీ వారి జీవితంలో వచ్చే మార్పును బట్టి వారు నూతన జీవితం జీవిస్తున్నారు అని తెలుసుకొనవచ్చు. మగ్దలా మరియ, పౌలు వారి జీవితాలలో వచ్చిన మార్పును, జక్కయ్య జీవితంలో వచ్చిన మార్పును మనం చూసినప్పుడు వారు, హృదయ పరివర్తన చెందారు అని , నూతన జీవితం వారు జీవిస్తున్నారు అని మనము తెలుసుకుంటాము. ఆత్మ ద్వారా జన్మించిన వారి జీవితాలలో కూడా ఈ మార్పును మనం చూడవచ్చు. ఆత్మ ఫలాలు వారి జీవితాల్లో సుష్పష్టంగా కనిపిస్తాయి. వారు పాపమునకు బానిసలుగా కాక స్వతంత్రంగా జీవిస్తారు.
యేసు ప్రభువు ఎదుట నికోదేము సందేహంను వేలిబుచ్చుట
యేసు ప్రభువు ఆత్మ వలన జన్మించుటకు గురించి చెప్పిన తరువాత నీకొదేము ఇది ఎలా సాధ్యము అని అడుగుతున్నాడు. ప్రభువు అతనికి అది క్రొత్త విషయము ఏమి కాదు అని తెలియజేస్తూనే, నీవు బోధకుడివి కదా! ఈ విషయం తెలియదా అని అడుగుచున్నాడు. పాత నిబంధనలలో కూడా మనం మారు మనస్సు గురించి వింటాము. మరి ఎందుకు వీరు అవి ఏమి తెలియక ఉన్నారు అంటే వారు ఎప్పుడు ఈ లోక విషయాలు, మరియు స్వార్ధ పూరిత ఆలోచనలతో ఉన్నారు. కానుక అనేక దైవ విషయాలు, దైవ జ్ఞానం గురించి అజ్ఞానములో ఉన్నారు. దైవ జ్ఞానము కోసం మనము ఎంతగానో శ్రమించాలి. ఆయనను వేదకాలి అటువంటి వారికి ప్రభువు ఆ జ్ఞానమును ఇస్తారు.
పరలోక విషయాల గురించి యేసు ప్రభువు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే ఆయన మాత్రమే పరలోకం నుండి వచ్చినవారు. ఆయనే చెప్పేవి మాత్రమే ప్రామాణికం, అటువంటి వాటి గురించి జ్ఞానము కావాలి అంటే ప్రభువుని మాటలను వినాలి. ప్రభువును విశ్వసించాలి, ప్రభువు చెప్పినట్లు చేయాలి. కాని అనేక సార్లు ప్రభువుని మాటలను మనం పెడచెవిన పెట్టి పరలోక జ్ఞానమును పోగొట్టుకుంటున్నాము. నికోదేముతో ప్రభువు అంటున్నారు మేము చూచిన విషయాలను చెప్పిన మీరు నమ్ముటలేదు అని. అంటే మనం కొన్ని సార్లు ఎంతో కరుడుగట్టిన హృదయాలు కలిగిన వారిగా ఉంటున్నాము. ప్రభువు మాత్రమే పరలోకము నుండి వచ్చినవాడు మరియు తిరిగి పరలోకమునకు వెళ్లినవాడు. ఆయనకు పోయిన చోటుకు వెళ్ళుటకు ఆయనను మాత్రమే అనుసరించాలి.
యేసు ప్రభువు ఎత్తుబడుట
పాత నిబంధనలో దేవునికి మాటకు ఎదురుతిరిగిన వారు పాము కాటుకు గురయ్యి మరణిస్తుంటే, మోషే దేవునికి మొరపెట్టగా, వారిని రక్షించుటకు మోషేతో దేవుడు ఒక కంచు సర్పము తయారు చేసి దానిని చూచిన వారు రక్షించబడ్డారు. అటులనే పాపం చేసిన మానవుని రక్షించడానికి ప్రభువు సిలువ మీద మరణించారు. ఇది ప్రభువును విశ్వసించువారు అందరు నిత్య జీవం పొందుటకు ఆయన సిలువ మీద మరణించారు. మనందరికీ ఆయన నిత్య జీవాన్ని సాధ్యం చేశారు.
ప్రార్ధన: ప్రభువా! మీరు నికోదేముతో మరల జన్మించుట యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. ప్రభువా మీ మాటలు విని అనేక మంది పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుటకు దేనిని కోల్పోవడానికి అయినా సిద్ధపడ్డారు. నేను కూడా నా జీవితాన్ని మార్చుకొని, నూతన హృదయం కలిగి జీవించి, మిమ్ములను అనుసరించి మీరు నా కోసం మరణించి, నాకు సాధ్యం చేసిన ఆ నిత్యజీవాన్ని పొందే అనుగ్రహం చేయండి. ఆమెన్