15, మే 2025, గురువారం

కలవరపడకుడు యేసు మీతో ఉన్నాడు

 యోహాను 14: 1-6 

యేసు వారితో "మీ హృదయములను కలవరపడనియకుడు. దేవుని విశ్వసింపుడు. నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. లేకున్నచో నేను మీతో అటుల చెప్పను. నేను మీకొక నివాసస్థానమును సిద్దము చేయబోవుచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి, మరల వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును  మీరు ఎరుగుదురు." అనెను. తోమా ఆయనతో "ప్రభూ! మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు. ఇక మార్గమేట్లు ఎరుగుదుము?" అనెను. అందుకు యేసు, "నేనే మార్గమును, సత్యమును, జీవమును నా మూలముననే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. 

శిష్యుల ఎందుకు కలవరపడుతున్నారు? 

యేసు ప్రభువు తన శిష్యులతో మీ హృదయములను కలవరపడనియకుడు అని చెబుతున్నారు. వీరు కలవరపడవలసిన పరిస్తితి ఎందుకు వచ్చినది? ఎందుకంటే యేసు ప్రభువు వారి నుండి వెళ్లిపోతున్నాను అని చెప్పారు. మూడు సంవత్సరాలు వారు యేసు ప్రభువుతో కలిసి జీవించారు. ఆయన చేసిన అన్ని అద్భుతకార్యములకు, ఆయన చూపిన కారుణ్యమునకు వీరు సాక్షులు. శిష్యులకు ఆయన జీవితం భరోసా అయ్యినది. అటువంటి ప్రభువు ఇప్పుడు వారి నుండి వెళ్లిపోతున్నారు. ఇంకా ఎందుకు వీరు కలవరపడుతున్నారు? యేసు ప్రభువుకి పరిసయ్యులు, ధర్మ శాస్త్ర భోదకులు కొంత మంది సద్దుకయ్యులు శత్రువులుగా మారిపోయారు. ఇప్పుడు యేసు ప్రభువు వీరి నుండి వెళ్లిపోతే యేసు ప్రభువు శిష్యులు వారికి శత్రువులుగా మారి వీరిని, శిక్షిస్తారు అని కలవరం వారికి ఉండవచ్చు.  యేసు ప్రభువుకు మరియు శిష్యులకు ఉన్న సంబంధం చాలా అన్యోన్యత కలిగిఉన్నది. ఈ అన్యోన్యత తెగిపోతుంది అని వారు కలవరపడి ఉండవచ్చు. 

ఎందుకు ప్రభువు శిష్యులు కలవరపడకూడదు 

యేసు ప్రభువుతో పేతురు తన కోసం మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, అందరు వెళ్ళిపోయిన, తాను వదలి వెళ్ళను అని అన్నాడు, దానికి యేసు ప్రభువు, పేతరు తనను ఎరుగనని చెబుతున్నారు ఏమి జరుగబోవుతుందో అని కలవరపడిఉండవచ్చు.  తమ గురువును వారే అమ్మబోవుతున్నారు అని యేసు ప్రభువు చెబుతున్నారు, అది తలచుకొని వారు కలవరపడి ఉండవచ్చు. ప్రతి ఒక్కరికీ ఒక్కో కారణం ఉండి ఉండవచ్చు కలవరపడటానికి , అది వారికి యేసు ప్రభువుకు మధ్య ఉన్న అన్యోన్యత మరియు ప్రేమ మీద ఆధారపడుతుంది. యేసు ప్రభువు వీరికి కలవరపడవద్దు అని చెబుతున్నారు. వీరు కలవరపడకుండా ఉండుటకు ఆయన కారణం చెబుతున్నారు. ఆయన వారి నుండి  పోవుతున్నది వారి కోసమే అని చెబుతున్నారు. వారు ఎందుకు కలవరపడనవసరం లేదంటే, ఆయన వారి నుండి వెల్లుతున్నది వారికి ఒక నివాసస్థానం ఏర్పాటు చేయడానికి. మరలా ఆయన వారి వద్దకు వచ్చును. ఆయన వుండే చోటునే వీరు కూడా ఉండే విధంగా ఆయన చేస్తారు. కనుక వారు కలవరపడనవసరం లేదు. 

యేసుప్రభువు  శాశ్వత నివాసము ఏర్పాటు చేయుటకు వెళుతున్నారు. 

"నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. లేకున్నచో నేను మీతో అటుల చెప్పను. నేను మీకొక నివాసస్థానమును సిద్దము చేయబోవుచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి, మరల వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును." నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. యేసు ప్రభువు తన తండ్రి గురించి ఎప్పుడు చెబుతూనే ఉన్నారు. ఇక్కడ కూడా మనం చూసేదీ తండ్రికి మరియు కుమారునికి మధ్యగల సంబంధం, అందుకే ఆయన "నా"తండ్రి గృహమున అనేక నివాసములు కలవు అని చెబుతున్నారు. ఈ సంబంధం గురించి ఆయన అనేక సార్లు చెప్పుటకు కారణం ఏమిటి అంటే తన తండ్రిని ఆయన అంతగా ప్రేమిస్తున్నారు అని తెలియచేయడమే, ఆయనే పనులను మాత్రమే కుమారుడు చేస్తున్నాడు. తండ్రికి తెలియకుండా ఏమి చేయుటలేదు. ఆయన తన తండ్రి గృహమున మనకు ఒక నివాసాన్ని ఏర్పాటుచేయడానికి కల్వరి కొండమీద శిలువ మరణం ద్వారా మనకు సిద్దపరుస్తున్నాడు. మూడు రోజులు భూగర్భంలో ఉండి మనకు నివాసాన్ని ఏర్పాటుచేస్తున్నాడు. 

యేసు ప్రభువుతో ఎల్లప్పుడు ఉండుట 

"నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును." యేసు ప్రభువు ఇక్కడ చేసిన ఈ వాగ్ధానం తన శిష్యులకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆయన తన శిష్యులను వదలి వేయడం లేదు. ప్రత్యేకంగా వీరి కొరకు వస్తాను అని చెబుతున్నారు. ఇది లోకాంతంలో కాదు. ఇది తన శిష్యులు ఎప్పుడు కూడా ఆయన సాన్నిధ్యం పొందేలా చేస్తుంది. అంతేకాక వీరిని తన వద్దకు చేర్చుకుంటాను అని చెబుతున్నారు. యేసు ప్రభువు తన శిష్యులను , మరియు తన శిష్యుల ద్వారా ఆయన అనుచరులు అయిన వారికి ఇచ్చిన ఒక గొప్ప వరం ఇది. నేను ఉండు స్థలమునే మీరును ఉండునట్లు నా వద్దకు చేర్చుకొందును అనే వాగ్ధానం మరల ఆయన శిష్యులు ఎవరు నీరుత్సాహంలో లేకుండే చేసే వాగ్ధానం. కాని దీనిని ఎల్లప్పుడు గుర్తుంచుకోవడంలో మనం విఫలం  చెందుతున్నాము. యేసు ప్రభువు చేసిన ప్రతి వాగ్ధానం మనం గుర్తు చేసుకొని మనం జీవించినచో మన జీవితంలో ఎటువంటి అపాయంలో కూడా మనం కలవరపడకుండా ఉండగలం. 

తోమా ఆయనతో "ప్రభూ! మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు. ఇక మార్గమేట్లు ఎరుగుదుము?" అనెను. తోమస్సు యేసు ప్రభువు చెప్పిన మాటలు అర్ధం చేసుకోలేక పోయాడు. అందుకే ఆయనే వేరే ఎక్కడకు వెళుతున్నారో తెలియదు అని చెబుతున్నారు. తోమసు మొదటి నుండి తనకు అర్ధం కాని విషయములను అడుగుటకు సిగ్గుపడలేదు. ప్రభువు ముందు తనను అప్పుడు గొప్పవాడిగా లేక మొత్తం తెలిసిన వానిగా చూపించుకోవాలని చూడలేదు, తన నిజ స్తితి ఎప్పుడు బహిర్గతం చేస్తునే ఉన్నాడు. అందుకే ప్రభూ మీరు ఎక్కడకు వెళుతున్నారో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లు ఎరగుదుము అని అంటున్నారు. అందుకు ప్రభువు నేనే మార్గము సత్యము జీవము. నా మూలమునే తప్ప ఎవడును తండ్రి దగ్గరకు రాలేడు అని చెబుతున్నాడు. 

యేసు ప్రభువు మాత్రమె దేవునికి మార్గం 

దేవున్ని మనం ఎలా తెలుసుకోగలము? ఆయన దగ్గరకు మనం ఎలా వెళ్లగలము? ఆయన ఎవరు? అనే ప్రశ్నలకు యేసు ప్రభువు మాటలలో మనకు సమాధానం దొరకుతుంది. అంతేకాక ఆ సమాధానం ఆయనే అవుతున్నారు. యేసు ప్రభువే తండ్రి దగ్గరకు వెళ్ళుటకు మార్గం, మరియు ఆయన మన గమ్యంగా ఉంటారు, ఎందుకంటే ఆయనను చేరుకున్నప్పుడు తండ్రిని చేరుకున్నట్లే, ఆయన తండ్రి యందు తండ్రి ఆయన యందు ఉన్నారు. ఆయనే సత్యము, ఆయన కేవలం సత్యమును తెలియజేయుటకు మాత్రమే రాలేదు, ఆయనే సత్యం, ఆయన మాత్రమే నిత్యుడు, ఆయన మనకు జీవం ఇచ్చువాడు మాత్రమే కాదు ఆయనే జీవము. కనుకనే యేసు ప్రభువు మాత్రమే తండ్రి దేవుని దగ్గరకు మార్గం, ఆయన ద్వారా మాత్రమే మనం తండ్రిని చేరుకోగలం. 

ప్రార్ధన : ప్రభువా! మీరు మీ శిష్యులకు కలవరపడకుడు అని చెబుతున్నారు, వారికి మరలా మీ దగ్గరకు వస్తాను అని అభయమిస్తున్నారు, వారికి నివాసస్థానము తయారు చేస్తాను అని వాగ్ధానం చేస్తున్నారు. మా జీవితములవ కూడా ప్రభువా మేము అనేక విషయముల గురించి కలవరపడుతున్నాము. మా జీవితములలో వచ్చే సమస్యలతో మేము కలవరపడుతున్నాము. అప్పుడు మాకు తోడుగా ఉండండి. మాకు కూడా మీ భరోసా ఇవ్వండి. మాకు కూడా మీ రాజ్యంలో నివాసస్థానం ఏర్పాటు అనుగ్రహించండి. మాకు మార్గ చూపరిగా ఉండండి. మాకు మార్గం, సత్యం, జీవమై మమ్ము దీవించండి. ఆమెన్. 

కలవరపడకుడు యేసు మీతో ఉన్నాడు

 యోహాను 14: 1-6  యేసు వారితో "మీ హృదయములను కలవరపడనియకుడు. దేవుని విశ్వసింపుడు. నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసములు కల...