నహుము 1:15,2:2;3:1-3,6-7 మత్తయి 16:24-28 (9 ఆగస్టు 2024)
"నన్ను అనుసరింపగోరువాడు తననుతాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడు కొనచూచు వాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును ధారపోయువాడు, దానిని దక్కించు కొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఈయగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతియొక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచునంతవరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను" అని యేసు పలికెను.
క్రిస్తునాధుని యందు ప్రియ స్నేహితులారా ఈనాడు కార్మెల్ సభకు ఎంతో పర్వదినం. కార్మెల్ సభ సభ్యులు ఎంతో సంతోషంగా పునీత ఎడిత్ స్టెయిన్ గారి పండుగను జరుపుకుంటారు.
ఆమె జీవితం: పునీత ఎడిత్ స్టెయిన్ గారు అక్టోబర్ 12 వ తేదీన 1891వ సంవత్సరంలో జన్మించారు. చిన్న వయస్సు నుండి ఎంతో జ్ఞానము కలిగిన వ్యక్తి. ఆమె హెడ్మాన్డ్ హస్రెల్ అనే గొప్ప తత్వవేత్త శిష్యురాలు. ఆమె కూడా త్తత్వవేత్తగా ప్రసిద్ధి చెందినవారు. 1904వ సంవత్సరంలో తనను తాను నాస్తికురాలిగా ప్రకటించుకుంది. కాని కాలక్రమేణా ఆమె గొప్ప జ్ఞానము కలిగిన విద్యార్థిగా , మరియు కళాశాల ఆచార్యరాలుగా గొప్ప మేధాసంపద కలిగిన వ్యక్తిగా మారింది. ఆమె 1921లో అవిలాపుర తెరాసమ్మ గారి జీవిత కథను, ఆత్మకథ పుస్తకం చూసి రాత్రికి రాత్రే ఆ పుస్తకాన్ని చదివి, ఆమె సత్యాన్ని కనుగొన్నది. ఆమె సత్యం కోసం అన్వేషిస్తుంది. తెరెసామ్మ గారి ఆత్మకథ ద్వారా క్రీస్తు ప్రభువు సత్యం అని కనుకొన్నది. ఆమె కార్మెల్ సభకు ఎంతో ఆకర్షితురాలైంది. 1982లో యూదా మతం నుండి కాథోలికురాలిగా మారింది. తదనంతరం ఆమె 1933లో కొలోన్లోని కార్మెల్ మఠంలో చేరింది. కార్మెల్ మఠంలో సిలువ తెరెసా బెనెడిక్తగా పేరును స్వీకరించింది. ఈ పేరుకు అర్ధం తెరెసా సిలువ ద్వారా ఆకర్షించబడింది అని అర్ధం. ఎడిత్ స్టెయిన్ గారు తన గొప్ప రచనల ద్వారా ఎన్నోసత్యాలను ప్రజలకు తెలియజేసినటువంటి వ్యక్తి. క్రీస్తు ప్రభువుని కోసం, క్రీస్తు ప్రభునిపై తనకు ఉన్న ప్రేమకోసం తన విశ్వాసాన్ని వదలక ఎన్నో కష్టాలను బాధలను ఏంతో సంతోషంతో ఎదుర్కొవడానికి, క్రీస్తు కొరకు తన ప్రాణాలను త్యాగం చేసి, సత్యం కొరకు సాక్షిగా నిలబడింది,ఈ గొప్ప పునీతురాలు. ఆమె ఆగస్టు 9, 1942 వ సంవత్సరంలో వేదసాక్క్షి మరణం పొందింది.
ఈనాటి మొదటి పఠనంలో యూదా ప్రజలకు శుభ వర్తమానమును ఈ విధంగా వినిపిస్తున్నాడు. దుష్టులు మీపై మరల దాడి చేయరు. వారు ఆడపొడ కానరాకుండా పోవుదురు. అదేవిధంగా మీకు మునుపు ఉన్న వైభవమును తిరిగి నెలకొల్పుదును. మరి మనము శుభ వర్తమానము వినగలుగుతున్నామా, దేవుడు మనలను రక్షిస్తున్నాడు. మనకు వైభవమును ఇస్తున్నాడు. దానిని మనము నిలుపుకోగలుగుతున్నామా? ఆలోచించండి. మనము దేవునికి దూరంగా వెళ్లిన , ఆయనను బాధపెట్టిన, ఆయన మాత్రం మనలను వదలి పెట్టరు. అదేవిధంగా విశ్వాస పాత్రంగా మనము కూడా జీవించాలి.
ఈనాడు సువిశేషం "పునీత ఎడిత్ స్టెయిన్ గారి జీవితంలో అక్షరాల నెరవేరింది. అదేమిటంటే క్రీస్తు ప్రభువు చెబుతున్నాడు "నన్నుఅనుసరించగోరువాడు తనను తాను పరిత్యజించుకొని, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించవలెను." పునీత ఎడిత్ స్టెయిన్ గారు క్రీస్తును తెలుసుకొని తనను తాను పరిత్యజించుకొన్నది. తన జీవితంలో వచ్చే శ్రమలను బాధలను కష్టాలను ఇబ్బందులను మోస్తూ సిలువను ఎత్తుకొని క్రీస్తు ప్రభువును అనుసరించింది. క్రీస్తు ప్రభువుని అడుగుజాడలలో నడిచి ఆయన సాక్షిగా మారింది. క్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా నా నిమిత్తము ఎవరైతే తమ ప్రాణాలను ధారా పోస్తారో వారు తమ ప్రాణాలను దక్కించుకొందురు అని అన్న మాటను నెరవేర్చింది. ఈలోకం మొత్తం పంపాదించి తమను కోల్పోతే లాభము ఏమిటి అనే సత్యాన్ని తెలుసుకొని తనను తాను దేవునికిసమర్పించుకుంది. వారి వారి పనులను బట్టి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడని మనము విన్నాం. ఆమె చేసిన గొప్ప పని ఏమిటంటే తాను సత్యాన్ని తెలుసుకొని సత్యస్వరూపుడైన క్రీస్తుని అనుసరించింది. అంతేకాక క్రీస్తుని కొరకు తన ప్రాణమును దారపోసింది. ప్రభువు చెప్పినట్లుగా ఆమె క్రియలను బట్టి ఆమె విశ్వాసాన్నిబట్టి ఆమె తిరుసభలో ఒక గొప్ప పునీతురాలుగా మారింది. మరి మనము నిజంగా దేవుణ్ణి అనుసరిస్తున్నామా!మనల్ని మనము పరిత్యజించు కొంటున్నామా? మన సిలువలు అనే బాధలు కష్టాలను ఎత్తుకొని క్రీస్తుని వెంబడిస్తున్నామా, ఈ కాలంలో చాలా మంది క్రీస్తు ప్రభువును అనుసరిస్తున్నారు. కాని తమను తాము ప్రరిత్యాజించుకోలేక పోతున్నారు. కేవలం నామ మాత్రంగా అనుసరిస్తున్నారు. ఆలోచించండి, మనము ఎలా ఉన్నాం? లోక సంపదలతో మన ఆత్మను కోల్పోతున్నాము. కాబట్టి ప్రియాబిడ్డలారా పునీత ఎడిత్ స్టెయిన్ గారి వలె జీవిస్తూ ఆమె వలె గొప్ప కార్యాలు చేస్తూ క్రీస్తు ప్రభుని నిజమైన అనుచరులుగా జీవించుదాం.
ప్రార్ధన : ఓ ప్రభువా మీరు మాకు ఎన్నోసార్లు నీతి మార్గంలో నడవమని పిలుపు ఇస్తున్నారు. కొన్ని సార్లు మమ్ము మేము పరిత్యజించుకోలేక పోతున్నాం. మా సిలువను మోయలేక పోతున్నాం. మా సిలువలు అనే బాధలతో నిన్ను అనుసరించలేక పోతున్నాం. కాని తండ్రి! భయంతో , దురాలోచనలతో లోక సంపదలతో పడి మా ఆత్మలు కోల్పోతున్నాము. ప్రభువా మంచి క్రియలద్వారా విశ్వాసంతో మిమ్ము అనుసరించి మీ రాజ్యంలో చేరే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆమెన్
ఫా. సురేష్ కొలకలూరి OCD