22, ఆగస్టు 2024, గురువారం

యెహెఙ్కేలు 36:23-28 మత్తయి 22:1-14

 యెహెఙ్కేలు 36:23-28 మత్తయి 22:1-14

యేసు ప్రజలకు మరల ఉపమానరీతిగా ప్రసంగింప ఆరంభించెను. "పరలోక రాజ్యము ఇట్లున్నది : ఓక రాజు తన కుమారుని పెండ్లికి విందును సిద్ధపరచి ఆహ్వానింపబడిన వారిని  విందుకు బయలుదేరిరండు అని చెప్పుటకు తన సేవకులను పంపెను కాని, వారు వచ్చుటకు నిరాకరించిరి. అందుచే అతడు, ఇదిగో! నా విందు సిద్దపరుపబడినది. ఎద్దులను, క్రొవ్విన దూడలును వధింపబడినవి. అంతయు సిద్ధముగా ఉన్నది. కనుక విందుకు రెండు అని మరియొకమారు వారితో చెప్పుడని మరికొందరు సేవకులను పంపెను. కాని పిలువబడినవారు దానిని లక్ష్య పెట్టక తమ తమ పనులకు పోయిరి. ఒకడు తన  పొలమునకు, మరి యొకడు తన వ్యాపారమునకు వెళ్లెను. తక్కినవారు అతని సేవకులను పట్టుకొని కొట్టిచంపిరి. అపుడు ఆ ప్రభువు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతకులను హత మార్చి వారి పట్టణమును తగులబెట్టించెను. అంతట, తన  సేవకులను పిలిచి నా విందు సిద్ధముగా ఉన్నది. కాని , నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులుకారు. ఇప్పుడు మీరు వీధి మార్గములకు పోయి, కనపడిన వారినందరిని పిలుచుకొనిరండు అని పంపెను. ఆ సేవకులు పురవీధుల లోనికి వెళ్లి మంచి , చేడు  తేడా లేక తమ కంటపడిన వారినందరను తీసికొనివచ్చిరి. ఆ కళ్యాణమండపము అతిథులతో నిండెను. అతిధులను చూచుటకు రాజు లోనికి వెళ్లి, వివాహవస్త్రము లేని వానిని ఒకనిని చూచి మిత్రమా! వివాహవస్త్రములేకయే నీవిచటికి ఎట్లు వచ్చితివి? అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనము వహించియుండెను. అపుడు ఆ రాజు తన సేవకులతో ఇతనిని కాలు సేతులు కట్టి వెలుపల నున్న చీకటిలోనికి త్రోసివేయుడు. అచట జనులు విలపించుచు పండ్లు  కోరుకుకొందురు అనెను. పిలువబడిన వారు అనేకులు కాని , ఎన్నుకొనబడినవారు కొందరే."

క్రిస్తునాధుని యందు ప్రియమైన విశ్వాసులారా! ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఇలా అంటున్నాడు. మీరు మీ పాప జీవితముల ద్వారా అనేక జాతుల మధ్య నా మహానామమునకు అపకీర్తి తెచ్చిరి. కాబట్టి నా నామము పవిత్రమైనది అని అన్య జాతులకు తెలియజేస్తాను అని ప్రభువు  తెలియజేస్తున్నాడు. నేను పవిత్రుడను అని జనులు తెలుసుకుంటారు. అది మీ ద్వారానే అని ప్రభువు అంటున్నాడు. పవిత్ర జలమును చల్లి మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేయుదును, నూతన ఆత్మను మీలో ఉంచెదను. కాబట్టి ప్రియ విశ్వాసులారా దేవుని పవిత్ర జలంతో మన పాపములను మాలిన్యములను దేవుడు శుద్ధి చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. మన పాపాల ద్వారా మనం పవిత్రమైన దేవుని మహా నామమును అపవిత్రం చేస్తున్నాం. దేవుడు మనలను తన బిడ్డలుగా చేసుకున్నాడు. మన తండ్రి పవిత్రుడు కాబట్టి మనం కూడా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండటానికి ప్రయత్నించాలి. అప్పుడు దేవుడు మనందరిలో పరిశుద్ధాత్మను అనగా తన ఆత్మను మనలో ఉంచుతాడు. 

దేవుడు అంటున్నాడు, మీ నుండి రాతి గుండెను  తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును. మనలో చాలా మంది రాతి గుండెను కలిగి ఉన్నాం. మనలో చాలా మందికి దైవ ప్రేమ లేదు, సోదర ప్రేమలేదు, స్వార్ధం, గర్వం, అసూయ అనేవి ఎక్కువైపోతున్నవి. మనుషుల మధ్య బంధాలు కూడా తగ్గిపోతున్నాయి. అందుకే దేవుడంటున్నాడు. మీలో నా ఆత్మను  ఉంచి నాఆజ్ఞలను పాటించునట్లు  చేయుదును. ఏమిటి దేవుని ఆజ్ఞలు అంటే అవి  దైవ ప్రేమ సోదర ప్రేమ మీద ఆధారపడి ఉంటాయి. నీ దేవుణ్ణి ప్రేమించు నీ పొరుగు వానిని ప్రేమించు ఇవే దేవుని ఆజ్ఞల సారాంశం. ప్రియ విశ్వాసులారా మనందరం దేవుని బిడ్డలుగా దేవుని ఆత్మతో నింపబడి పవిత్రులుగా జీవించడానికి ప్రయత్నించుదాం. అప్పుడు మనము దేవుని ప్రజలం అవుతాము. ఆయన మన ప్రభువు అవుతాడు. 

ఈనాటి సువిశేష పఠనములో యేసు క్రీస్తు ప్రభువు పరలోక రాజ్యము ఇలా ఉన్నది. అని ఉపమానాల  ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాడు. సిద్ధపరచిన పెండ్లి విందుకు రండి అని ఆహ్వానిస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా దేవుడు పరలోక రాజ్యపు విందునకు మనందరిని ఆహ్వానిస్తున్నాడు. దేవుడు ఎన్నుకొని ఆహ్వానిస్తున్న, వారు మాత్రం ఆ విందుకు రావడం లేదు. దేవుడు తన సేవకులను పంపి మనందరిని ఆహ్వానిస్తున్నాడు. అనేక సార్లు  దేవుడు తన సేవకులను పంపినప్పటికీ చాల మంది ఆ ఆహ్వానాన్ని అర్ధం చేసుకోలేక ఆ విందుకు రాలేకపోతున్నారు.  అదేవిధంగా దేవుడు తన సేవకులను ఈనాడు మనందరి దగ్గరకు పంపిస్తున్నాడు. మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఎంతమందిమి సిద్ధంగా ఉన్నాము,  ఆ పరలోక రాజ్యపు విందులో పాల్గొనడానికి ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

పిలువబడినవారు ఆహ్వానాన్ని లక్ష్య పెట్టకుండా, అంటే లెక్క చేయకుండా ఉన్నారు. మరి ఈనాడు నీవు నేను మనందరం దేవుని ఆహ్వానాన్ని స్వీకరించుచున్నామా లేదా ఆలోచించండి. లేదా అయోగ్యులుగా మారిపోతున్నామా? నీకు నాకు వివాహ వస్త్రము లేకపోతే దేవుడు నిన్ను నన్ను చీకటిలోకి త్రోసివేస్తాడు.  ఏమిటి  వివాహ వస్త్రం అంటే అది మన సిద్ధపాటు, మరియు  పవిత్రత.  మన జీవితాలలో, మన విశ్వాసపు ప్రయాణంలో ఈ విధమైన సిద్ధపాటు, అవిత్రత లేకపోతే మనం కూడా  చీకటిలోనికి త్రోసివేయబడతాం. కాబట్టి విశ్వాసులారా ధ్యానించండి, ఆలోచించండి మనం ఎలా ఉన్నాం. కేవలం పిలువబడిన వారిలా ఉన్నామా లేదా ఎన్నుకొనబడిన వారిలా ఉన్నామా ? ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ప్రార్ధన: పవిత్రుడవైన దేవా, నా పాప జీవితము ద్వారా నీ పవిత్ర నామమును అపవిత్రం చేసి నీకు ద్రోహము చేసి ఉన్నాము. మమ్ము క్షమించండి. ప్రభువా మాలో ఉన్న రాతి గుండెను తొలగించండి. మీ  ఆత్మతో  మమ్ము నింపండి మాంసపు గుండెను నాకు ప్రసాదించండి. మాకు పవిత్రతను, పవిత్ర జీవితమును జీవించే భాగ్యము మాకు దయచేయండి. మేము ఎన్నుకొనబడిన వారిగా ఉండే భాగ్యం మాకు ప్రసాదించండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

ఇరవై ఎనిమిదవ ఆదివారము

సొలొమోను జ్ఞానం గ్రంధం 7:7-11 హెబ్రియులు 4:12-13 మార్కు 10:17-30  క్రీస్తునాదునియాందు ప్రియా సహోదరి సహోధులరా, ఈనాడు మనమందరం కూడా సామాన్య కాల...