26, అక్టోబర్ 2024, శనివారం

30వ సామాన్య ఆదివారం

30వ సామాన్య ఆదివారం 
యిర్మియా 31:7-9, హెబ్రీ 5:1-6, మార్కు 10:46-52
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని నమ్ముకుని ఆయన మీద ఆధారపడినటువంటి వారికి చేసేటటువంటి మేలులను తెలియజేస్తున్నాయి. మానవ శక్తి మీద, ఆలోచన మీద కాక సంపూర్ణముగా దేవుడి మీద ఆధారపడితే ప్రభువు వారిని ఆశీర్వదిస్తారు. 
ఈనాటి మొదటి పఠణంలో యిర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు సంతోషకరమైన వార్తను తెలియజేస్తున్నారు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం నుండి 34వ అద్యాయాలను ఓదార్చేపుస్తకమని, ప్రశాంత పరిచే పుస్తకమని అదేవిధంగా ఇశ్రాయేలీయులను తిరిగి తమ వారితో ఐక్యపరిచుటను తెలియచేయు పుస్తకమని అంటారు. ఎందుకనగా ఈ నాలుగు అధ్యాయాలలో ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు సంతోషకరమైనటువంటి మాటలను తెలియజేశారు.యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అస్సిరీయుల బానిసత్వం నుండి వారి యొక్క సొంత భూమికి తీసుకొని వెళతారు అనే సంతోషకరమైన విషయం తెలుపుచున్నారు. ఈ యొక్క అస్సిరీయులు, ఇశ్రాయేలును పూర్తిగా ధ్వంసం చేసి అక్కడివారిని బానిసలుగా కొనిపోయారు. ఇలాంటి ఒక బాధకరమైన సమయంలో యిర్మియా ప్రవక్త దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానము మరువడని, ఆయన దయ కలిగిన దేవుడని, ప్రజల యొక్క పాపములను క్షమించి మరలా వారిని తన చెంతకు చేర్చుకుంటారని ప్రవచించారు. దేవుడు ఎవరిని మరువకుండా, విడిచిపెట్టకుండా, కుంటి వారిని, గ్రుడ్డివారిని ఏ విధముగా గర్భవతులను సైతము అందరిని కూడా సొంత భూమికి తీసుకొనివస్తారని వాగ్దానం చేశారు. ప్రభువు ఇస్రాయేలు ప్రజల పట్ల ఎల్లప్పుడూ విశ్వాసనీయుడుగానే ఉన్నారు ఆయన సీనాయి పర్వతం దగ్గర చేసినటువంటి వాగ్దానమును ఎన్నడూ మరువలేదు. ప్రభువు వారిని విముక్తులను చేసినందుకుగాను ప్రతిఫలముగా ఇశ్రాయేలు ప్రజలు ప్రభువునకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థనలు సమర్పిస్తారన్నారు. అదే విధముగా దేవుడే స్వయముగా తన ప్రజలను నడిపిస్తారని తెలిపారు అలాగే వారు పడిపోకుండా, మార్గము తప్పిపోకుండా ఆయనే ఒక మార్గ చూపరిగా ఉంటూ తమ యొక్క సొంత ప్రాంతమునకు నడిపించారు అని యిర్మియా ప్రవక్త ఆనాటి ప్రజలకు ఈ యొక్క సంతోషకరమైన అంశమును తెలియజేశారు. తండ్రి తన బిడ్డలను చూసుకున్న విధముగా దేవుడు కూడా ఇశ్రాయేలును తన సొంత బిడ్డల వలె కాచి కాపాడుతూ వారి వెన్నంటి ఉంటారని పలికారు. 
ఈనాటి రెండవ పఠణంలో  యాజకత్వమును గురించి తెలుపుచున్నది. ప్రతి యాజకుడి యొక్క యాజకత్వము దేవుడి నుండి వచ్చినదని తెలుపుతూ వారు బలహీనులైనప్పటికీ తమ కొరకు తాము, తన పాపముల కొరకు అదేవిధంగా ఇతరుల యొక్క పాపముల కొరకు బలిని అర్పింపవలెనని తెలిపారు. యాజకత్వము అనే దైవ పిలుపు ప్రభువునుండే స్వయముగా వచ్చినది. దేవుడే ప్రతి ఒక్క యాజకుడిని నియమించారు. తండ్రి కుమారుడను నియమించిన విధముగా మనలను దేవుడు యాజకులుగా నియమిస్తున్నారు. 
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు బర్తిమయి అను గుడ్డివానికి దృష్టిని బసగిన అంశమును చదువుకుంటున్నాము. ఈయన యొక్క జీవితంలో మనము గ్రహించవలసినటువంటి కొన్ని అంశములు;
1. గ్రుడ్డివాడు గ్రహించగలిగాడు. బర్తి మయి అనే బిక్షకుడు తనకు చూపు లేకపోయినా యేసు ప్రభువు యొక్క దైవత్వమును గ్రహించగలిగాడు. ఎందరికో కన్నులున్నప్పటికీ వారు ఏసుప్రభు యొక్క కార్యములను చూసి గుర్తించలేకపోయారు కానీ ఈ బర్తిమయి కేవలం యేసు ప్రభువును గూర్చి విని ఆయన గొప్పతనం గ్రహించ గలిగాడు. వినుట వలన విశ్వాసము కలుగును.
2. విశ్వాసము కలిగి దేవుడిని ఆశ్రయించారు. బర్తిమయి ప్రభువు నందు ఆచంచలమైన విశ్వాసము కలిగి ఉన్నాడు కాబట్టే ప్రభువు తన చెంతకు వచ్చిన వెంటనే తనకు చూపునివ్వమని విశ్వాసముతో ప్రార్థించాడు. 
3. బర్తిమయి ప్రభువును తనకు ఏది ముఖ్యమో దాని కొరకు మాత్రమే ప్రార్థించారు. ఆయన ప్రభువుని దానం చేయమని అడగలేదు, తన యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని అడగలేదు కానీ తనకు చూడటానికి చూపును ఇవ్వమని కోరాడు. తన యొక్క జీవితంలో చూపు అనేది ముఖ్యము కాబట్టి దాని కొరకే బర్తిమయి ప్రార్థించాడు. బహుశా ఆయన కూడా ప్రభువుని చూడాలని ఆరాటపడి ఉండవచ్చు అందుకే కేవలం చూపు అని మాత్రమే ప్రసాదించమని అడిగాడు.
4. బర్తిమయి పట్టుదల - తన తోటి వారు తనను ఎంత నిశ్శబ్దముగా ఉండాలని ప్రయత్నం చేసిన  బర్తిమయి పట్టుదలతో ఎవరి మాటను పట్టించుకోకుండా ఆయన అనుకున్నది సాధించడానికి గొంతెత్తి మరి ప్రభువుని పిలిచారు. 
5. బర్తిమయి ప్రభువు యొక్క కనికరము కొరకు ప్రార్థించారు. ఆనాటి కాలంలో ఎవరికైనా ఏదైనా లోపం(అనారోగ్యం) ఉంటే దానిని దేవుని శిక్షగా భావించేవారు అందుకే ఒకవేళ ఆయన మీద దేవుని శిక్ష ఉండిన యెడల దానిని తీసివేయమని, కరుణతో క్షమించమని ప్రభువు కరుణ కొరకు వేడుకున్నాడు. 
6. ప్రభువుని అనుసరించుట- బర్తిమయి ఏసుప్రభు తన జీవితంలో చేసిన మేలులు తలంచుకొని ప్రభువుని వెంబడిస్తున్నారు. మేలులు పొంది తిరిగిపోయిన వారి కన్నా, మేలు చేసినటువంటి దేవుడిని వెంబడించినటువంటి గొప్ప వ్యక్తి ఈ బర్తిమయి.
7. ప్రభువు మన చెంతకు వచ్చినప్పుడు ఆయనను మనము భర్తిమయి వలే గుర్తించాలి. అనేక సందర్భాలలో దేవుడు దివ్య బలి పూజ ద్వారా, ప్రార్థన ద్వారా మన చెంతకు వస్తారు ఆయనను మనము గుర్తించి కలుసుకున్నప్పుడు మన యొక్క జీవితంలో భర్తిమయి వలె మేలులు కలుగును.
8. దేవుడి మీద ఆధారపడుట- బర్తిమయి సంపూర్ణముగా దేవుని యొక్క శక్తి మీదే ఆధారపడ్డాడు కాబట్టి ప్రభువు ఆయన్ను దీవించారు. 
మన యొక్క అనుదిన జీవితంలో కూడా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడుతూ, విశ్వాసముతో ప్రార్థిస్తూ, దేవుని యొక్క కరుణ కోరుకుంటూ ఆయన యొక్క దీవెనలు పొందాలి. 
Fr. Bala Yesu OCD.

లూకా 17:11-19

 సమరియుని కృతజ్ఞత  యేసు సమరియా, గలిలియా ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగనే పదిమంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదు...