23, నవంబర్ 2024, శనివారం

34వ సామాన్య ఆదివారం

34వ సామాన్య ఆదివారం
విశ్వవిబుడైన క్రీస్తు రాజు యొక్క మహోత్సవము.
దానియేలు 7:13-14,దర్శన 1:5-8, యోహాను 18:33-34
1 కొరింతి 15:20-26, 28
మత్తయి 25:31-46

ఈరోజు తల్లి శ్రీ సభ క్రీస్తు రాజు యొక్క మహోత్సవమును కొనియాడుతున్నది, 1925 వ సంవత్సరంలో 11వ భక్తినాధ పాపు గారు  ఈ పండుగను ప్రారంభించియున్నారు. 20వ శతాబ్దంలో యూరప్ దేశములో అధికారుల యొక్క పాలన కఠినంగా ఉండటంవల్ల, అప్పటి అధికారులు ప్రజలకు ప్రాముఖ్యతను వారి యొక్క అధికారంకు ప్రాముఖ్యతనిచ్చి జీవించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదు, జాతుల మధ్య వివక్షతను తీసుకుని వచ్చి ఉన్నారు. కొంతమంది దేవుడంటే విశ్వాసము లేకుండా అవిశ్వాసముతో జీవించే వారు, అదేవిధంగా కొంతమంది యూదులను బంధించి చెరసాలలో వేసి చంపారు. ఈ విధంగా అధికారులు తమ యొక్క స్వార్థం కొరకై అధికారమును వినియోగించుకునే సందర్భంలో 11వ భక్తనాధ పాపు గారు ఆనాటి  అధికారులకు, ప్రజలందరికీ క్రీస్తు ప్రభువు యొక్క అధికారం  ఏ విధంగా ఉన్నది తెలియజేశారు. ఈ విశ్వమంతటికి క్రీస్తు ప్రభువే రాజు అని ప్రకటించి, మన హృదయ పీఠాలపై క్రీస్తు రాజుని ప్రతిష్టించుకోమని అదే విధముగా మన జీవితాలను ఆయన ఆధీనమునకు అప్పగించుమని పాపుగారు ప్రోత్సహించారు. 
పరిశుద్ధ గ్రంథం మరీ ముఖ్యంగా పాత నిబంధన గ్రంథం క్రీస్తు ప్రభువును రాజుగా చూపిస్తుంది,ఆయన రాజ్యపాలన గురించి ప్రవక్తలు ముందుగానే తెలియచేశారు.
యెషయా 9:6-7, యిర్మీయా 23:5, దానియేలు 7:13-14. అదేవిధంగా నూతన నిబంధన గ్రంథంలో కూడా గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు మరియ తల్లితో 'తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యుగయుగములు యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యముకు అంతమే ఉండదు అని తెలియజేశారు'. పిలాతు కూడా ఏసుప్రభువుతో సంభాషించేటప్పుడు "నీవు యూదుల రాజువా"? అని అడుగారు. నీవే అంటున్నావు కదా అని ఏసుప్రభు తెలిపారు. ఆయన రాజు అని పవిత్ర గ్రంథములో చెప్పబడినది కాబట్టి మనందరం కూడా ఆయన  మన యొక్క రాజు అని గ్రహించి  ఆయన చెప్పిన విధముగా జీవింపసాగాలి.
ఈ లోకంలో ఎంతో మంది రాజుల గురించి మనము చదువు కొని ఉండవచ్చు, విని ఉండవచ్చు. ఏసుప్రభు యొక్క రాజరికం ఈ లోక రాజుల యొక్క పాలనకు భిన్నంగా ఉంటుంది. సిలువయే ఆయన సింహాసనం, ముళ్ళ కిరీటమే ఆయన రాజు కిరీటం, చేతిలోని దండమే తన యొక్క అధికారమునకు గుర్తు. పేద సాధలే తన యొక్క ప్రజలు. పరలోకమే తన రాజ్యం.
 ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎలాంటి పాలన చేసి ఉన్నారో మనందరం గ్రహించాలి, ఆయన మరణము తర్వాత కూడా ఒక తీర్పరి అయిన రాజుగా మనలను పరిపాలన చేస్తారు.
క్రీస్తు ప్రభువు ఎలాంటి రాజు అని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. సేవ భావం కలిగిన రాజు- ఏసుప్రభు ఈ లోకమునకు వచ్చినది సేవ చేయుటకే కానీ సేవింపబడుటకు కాదు. ఈ లోకంలో ఉన్న రాజులు ప్రతినిత్యం కూడా ఎదుటి వారి యొక్క సేవలను అందుకునే వారే, వారి యొక్క సుఖభోగాలు పేరు ప్రతిష్టల కొరకు పాలన చేసేవారు కానీ క్రీస్తు ప్రభువు ప్రతినిత్యం ఇతరులకు సేవ చేస్తూ వారి శ్రేయస్సు కొరకు జీవించారు.
2. ఆయన క్షమించే రాజు- ఏసుప్రభు శిలువ మీద వ్రేలాడే సమయములో తండ్రికి ప్రార్థన చేసినది ఏమనగా 'తండ్రి వీరేమి చేయుచున్నారో, వీరు ఎరుగరు కావున వీరిని క్షమించు' అని ప్రార్థన చేశారు. తన ప్రజలు తనకు విరుద్ధముగా చేసినటువంటి పాపములను క్షమించమని క్రీస్తు రాజు తన తండ్రిని ప్రార్థించారు. ఆయన మనందరి పాపములను క్షమించే రాజు.
3. ప్రేమించే రాజు- నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు అని తెలుపుచు, వారి కొరకు తన ప్రాణమును త్యాగం చేసినటువంటి గొప్ప రాజు క్రీస్తు ప్రభువు. ఆయన ప్రేమ ఎటువంటి భేదము లేనటువంటి ప్రేమ, అవధులు లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ. అంతటి గొప్పదైన ప్రేమతో తన ప్రజలను పరిపాలించారు ఆయన మనందరిని  నిరతము ప్రేమించే రాజు.
4. నడిపించే రాజు- ఒక గొర్రెల కాపరి తన మందకు ముందుగా ఉండి గొర్రెలను ఏ విధముగా నైతే పచ్చిక బయలు వైపు నడిపిస్తారో అదే విధముగా క్రీస్తు రాజు  తన ప్రజలను పరలోకము వైపు నడిపిస్తారు, మంచి వైపు నడిపిస్తారు. మనము ఆయన స్వరమును విని నడుచుకోవాలి.
5. శాంతిని నెలకొల్పే రాజు-ఏసుప్రభు ఈ లోకమునకు వచ్చినది ఎందుకంటే మన అందరి జీవితాలలో శాంతి- సమాధానములు నెలకొల్పుట కొరకై. పాపము చేసిన మానవుడు దేవునికి దూరమైనప్పుడు శాంతి సమాధానము లేకుండా జీవించే సమయంలో మన అందరి కొరకై తన్ను తాను బలిగా సమర్పించుకుని మనలను తండ్రితో సఖ్యపరచి ఉన్నారు దాని ద్వారా ప్రతి ఒక్కరికి శాంతిని దయచేసారు.
6. వినయము కలిగిన రాజు-ఏసుప్రభు తనను తాను రిక్తుని చేసుకొని ఈ లోకంలో మానవునిగా జన్మించి సేవకు రూపం దాల్చి, శిష్యుల యొక్క పాదాలు కడిగి ఎంతో వినయముతో జీవించారు. అయిన పవిత్రుడైనప్పటికీ పాపాత్ములమైన మన మధ్య జీవించారు. ఇది ఆయన యొక్క వినయమునకు గొప్ప నిదర్శనం.
7. మనందరినీ తన బాగా మార్చే రాజు. క్రీస్తు ప్రభువు మనందరం కూడా తనలాగా మారాలని కోరుతున్నాను అందుకని ఈ భూలోకమునకు వచ్చి మనకు అనేక రకములైన విషయములు తెలియజేశారు. దేవుని యొక్క ప్రతిరూపమున జన్మించిన మనందరం ఆయనను పోలినటువంటి వ్యక్తులుగా జీవించినవి అని ప్రభువు కోరుకున్నావు. ఏ అధికారి కూడా తనున్న స్థానంలో వేరే వారు ఉండటానికి ఇష్టపడరు కానీ క్రీస్తు రాజు మనందరం కూడా తన రాజ్యంలో ఉండాలి అలాగే తనలా ఉండాలని కోరుకున్నారు. 12 మంది శిష్యులను పిలిచి వారు తనలాగా మారాలని కోరుతున్నటువంటి ప్రభువు మన క్రీస్తు రాజు.
ఈనాడు క్రీస్తు రాజు యొక్క పండుగను జరుపుకునే సందర్భంలో ఆయన ఏ విధముగా జీవించి ఉన్నారో మనందరం కూడా ఆయన రాజ్యమునకు చెందిన వారు అయినట్లయితే ఆయన ఇచ్చే సూచనలు, ఆజ్ఞలు పాటించి జీవించాలి. అప్పుడు మాత్రమే మనందరం పరలోక రాజ్యములో ప్రవేశించగలుగుతాం. క్రీస్తు ప్రభువుని నీ హృదయ రాజుగా అంగీకరిస్తున్నావా? దాని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నావా అని వ్యక్తిగతంగా ఆలోచించి మనందరం కూడా ఆయన వలె జీవించాలి. క్రీస్తు రాజును మన యొక్క హృదయములను పరిపాలించే విధముగా మనము ఆహ్వానించాలి. ఆయన మన హృదయములను పరిపాలించిన యెడల మనందరం సన్మార్గంలో నడవగలం.
Fr. Bala Yesu OCD

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం  బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గు...