9, అక్టోబర్ 2021, శనివారం

28 వ సామాన్య ఆదివారం (2)

28 వ సామాన్య ఆదివారం (2)

ఈనాటి దివ్య పఠనాలు దేవుడిచ్చిన జ్ఞానము వలన మనయొక్క జీవితములో దేవునికి  ప్రాధాన్యతనివ్వాలి అనే అంశమును గురించి భోదిస్తున్నాయి. మన జీవితములో దేవుణ్ణి పొందు కొని ఉంటె సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు, అనుగ్రహాలు అన్ని కూడా దేవుడే సమకూరుస్తారు అనే అంశమును గురించి కూడా బోధిస్తున్నారు. ఈనాటి మొదటి పఠనములో సొలొమోను మహారాజుకు జ్ఞానం పట్ల ఉన్నటువంటి ప్రీతిని గురించి భోదిస్తుంది. సొలొమోను జ్ఞానము కోసము దేవునికి ప్రార్ధన చేస్తున్నాడు. తనయొక్క జీవితములో దేవుడిని సంపదలు ఇవ్వమని అడుగలేదు, కీర్తిప్రతిష్టలు పెంచమని అడుగలేదు, కేవలము నాకు జ్ఞానము ఇవ్వండి అని ప్రార్ధన చేస్తున్నాడు. ఈలోకములోని ఆస్తిపాస్తుల కంటే, సిరిసంపదలు కంటే దేవుడు ప్రసాదించే జ్ఞానము ఎంత గొప్పదో తెలియపరుస్తున్నారు. సొలొమోను జ్ఞానము యొక్క ఆవశ్యకతను గురించి తెలుసుకున్నారు. ఈలోకంలో మానవులు వీటిని విలువైనవిగా, అమూల్యమైనవిగా భావిస్తారో వాటన్నింటికంటే జ్ఞానము విలువైనది అని గ్రహించారు. 8 వ వచనంలో సొలొమోను అంటారు, "సిరిసంపదలు కంటెను బంగారము కంటెను లౌకిక సంపదల కంటెను మణుల కంటెను ఎక్కువగా కోరుకున్నది జ్ఞానమే". ఆరోగ్యము కూడా అడుగలేదు, కేవలము జ్ఞానమే. ఎందుకంటే దేవుడు ఒసగే జ్ఞానము గొప్పదని గ్రహించాడు.
దైవజ్ఞానము ఉంటె మంచి చెడులు గ్రహించవచ్చు. ఏది ఉత్తమమైనదో కాదో తెలుసుకోవచ్చు. ఈవిధమును ఎలా సరిచేసుకోవాచ్చో  అర్ధమవుతుంది. జ్ఞానము ఉంటె అన్ని కూడా వాటంతట అవే వస్తాయి అని అయన గ్రహించారు. అందుకనే సొలొమోను దేవుడిని జ్ఞానము అడుగుతున్నారు.
జ్ఞానము మనలను నడిపిస్తుంది.
జ్ఞానము మనకు నేర్పిస్తుంది
జ్ఞానము మనకు ఏది మంచో ఏది చేదు చూపిస్తుంది
జ్ఞానము మనకు సత్యములను బయలు పరుస్తుంది.
జ్ఞానము మనకు సరిగ్గా తీర్పు చెప్పుటకు సహకరిస్తుంది
జ్ఞానము మన ఎదుగుదలకు సహాయపడుతుంది సామెతలు 3: 35
జ్ఞానము మనము శ్రమలనుండి బయటకు రావడానికి సహాయపడుతుంది
జ్ఞానము మనలను రక్షిస్తుంది సామెతలు 2:11-16
జ్ఞానము అందరి మన్ననలను పొందేలా చేస్తుంది సామెతలు 14:35
అందుకే సొలొమోను రాజు దేవుణ్ణి జ్ఞానము కోసము అడిగాడు
ఈ సొలొమోను గ్రంధమును ఆ రాజు పేరిట యూదాజాతికి చెందిన ఒక భక్తుడొకడు రాసారని బైబులు వేద పండితులు అంటారు. దీని ద్వారా ఆయన తెలియజేసే విషయము ఏమిటంటే దేవుని యొక్క అనుగ్రహము ద్వారా పొందిన జ్ఞాన వరము ఎలాగా సొలొమోను దైవధిక్కార కారణమున కోల్పోయారో లోతుగా అలోచించి ధ్యానించి మనము అలాగా చేయకూడదని రచయిత యొక్క ఆలోచన, భావన. దేవుడు ఒసగిన జ్ఞానాన్ని సొలొమోను సరిగ్గా వినియోగించుకోలేదు. దాని మూలముగా దైవ ప్రేమను కోల్పోయాడు. అన్యదైవములను పూజించుట ప్రారంభిచారు.
గ్రంధ రచయిత అంటారు గ్రీకు ప్రజల తాత్విక జ్ఞానం కంటే దైవం ప్రసాదించిన జ్ఞానం గొప్పదని తెలియజేస్తున్నారు. మన జీవితంలో కూడా దైవ జ్ఞానం కోసం ప్రార్థించాలి. దేవుడిని అడగాలి. దేవునికి  ప్రార్ధించుట ద్వారానే మనకు జ్ఞానం కలుగుతుంది. యాకోబు 1 : 5  సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానమును సరిగా వినియోగించుకోలేదు. ఆయన ఏ జ్ఞానమును అయితే అడిగితే దేవునికి దగ్గరగా ఉండాలని కోరుకున్నారో అదే జ్ఞానం వల్ల పాపాలు చేసి దేవునికి దూరం అయ్యాడు. నిజానికి జ్ఞానం కోరుకుంటూ దేవునితో సత్సoబంధాలు కలిగే ఉంటె మిగతా వరాలన్నీ వాటంతట అవే వస్తాయి. దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా మనం ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుడే ముఖ్యమని గ్రహించి ఆయన్ను అంటిపెట్టుకొని  జీవించాలి. మనం పొందే జ్ఞానం మనలను దేవుని వైపుకు నడిపించాలి దేవుని యొక్క ప్రణాలికను జ్ఞానం వలన తెలుసుకొని ఆయన మార్గంలో నడవాలి. దైవ జ్ఞానం కోసం ప్రార్ధించాలి అందరూ ఈ దైవజ్ఞానం కోసం మనం ఎదురు చూడాలి. వాస్తవంగా చెప్పాలంటే యేసు క్రీస్తు ప్రభువే మనుష్యవతారం ఎత్తిన దైవజ్ఞానం. ఆయన్ను కలిగి ఉంటె చాలు అన్ని సమకూర్చబడతాయి.
ఈనాటి రెండవ పఠనంలో రచయిత దేవుని యొక్క వాక్కుకు గల మహత్తరమైన శక్తి గురించి తెలియజేస్తున్నారు. దేవుని యొక్క వాక్కు  సజీవమైనది - చైతన్యవంతమైనది, అది రెండంచుల ఖడ్గం కంటెను పదునైనది. దేవుని యొక్క వాక్కు మానవుని జీవితంలో ఒక కొత్తదనమను   పుట్టిస్తుంది. రెండంచులు గల ఖడ్గము రెండువైపులా కత్తిరిస్తుంది. అలాగే దేవుని యొక్క వాక్కు కూడా మానవుల జీవితాలను కత్తిరించి సరి చేస్తుంది.
దేవుని యొక్క వాక్కుకు పుట్టించే శక్తి ఉంది - లూకా 8 : 11
మనలో ప్రేమను పుట్టిస్తుంది
మనలో హృదయ పరివర్తనను పుట్టిస్తుంది
మనలో క్షమను పుట్టిస్తుంది
మనలో విధేయతను పుట్టిస్తుంది
అందుకే దేవుని యొక్క వాక్కు సజీవమైనది. మనలను బ్రతికించే వాక్యం.
దేవుని యొక్క వాక్కు మనలను నడిపిస్తుంది - కీర్తన 119 : 105
దేవుని యొక్క వాక్కు ఊరట నిచ్చేది - కీర్తన 138 : 7
కాబట్టి దేవుని యొక్క వాక్కును మనం శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకుంటే ఆ సజీవ వాక్కు మనలో క్రొత్త జీవితాన్ని ఏర్పరుస్తుంది దేవుని యొక్క వాక్కు మన పాపము జీవితాలను కట్ చేయాలి. స్వార్ధాలను కట్ చేయాలి అప్పుడు మనందరం కూడా దేవునికి దగ్గరగా ఉండి జీవించగలుగుతాం. దేవుని యొక్క వాక్కు మనలను పోషిస్తుంది, బలపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది కాబట్టి సావధానంగా విందాం, దాని ప్రకారం నడుచుకుందాం.
ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు దగ్గరకు ఒక ధనికుడు వచ్చి నిత్య జీవం పొందటానికి ఏమి చేయాలన్న విషయాన్ని సువిశేషంలో చదువుకున్నాం . మన జీవిత ప్రయాణంలో సంపదలు కలిగిన వ్యక్తులుగా మనం మారుతాం అయితే ఆ ధనం ఎలాగా సహాయం చేయుటకు వాడుకుంటున్నాం.
ఈ యువకుడు తన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని చేత అంగీకరించబడాలనుకున్నాడు, ఆయన శిష్యుడుగా ఉండాలనుకున్నాడు. ఆయన జీవితంలో ఎంత సంపాదించినా సరే ఆయనలో నిజమైన సంతోష లేదు. ఆయన పరుగెత్తుకుంటూ యేసు ప్రభువు వద్దకు వస్తున్నాడు. ఎంత ఆశతో, కోరిక కలిగి యేసు ప్రభువు దగ్గరకు వస్తున్నాడో మనం నిజంగా ఆలోచించాలి. క్రీస్తు ప్రభువును ప్రవక్తగా దేవునిగా భోధకునిగా బహుశా ఇతడు గుర్తించి ఉండవచ్చు అందుకే సద్భోధకుడా అని సంభోదించాడు. ఆ యువకుడు అన్ని మంచి పనులు చేసినా ఇంకా ఎందుకు ఆయనలో నిత్యజీవితము పొందుతానని నమ్మకము కలగలేదు? అతడు చిన్ననాటినుండి దైవ ఆజ్ఞలను తు.చ తప్పకుండ పాటించాడు. దొంగతనము చేయలేదు, అబద్ధము ఆడలేదు, వ్యభిచరించలేదు, తల్లిదండ్రులును గౌరవించాడు కానీ ఆయనకు నిత్యజీవితము పొందుతానని నమ్మకము కలగలేదు. అతడు ఇవన్నీ చేసినా సరే అతి ముఖ్యమైనది చేయవలసినదేమిటంటే పేదవారిపట్ల ప్రేమ చూపటం అన్నీ వదలి దేవుణ్ణి నమ్ముకొని అనుసరించడం. ఆయన జీవితములో ధనము ఉంది. దేవుడు ఇచ్చిన ధనము పేదలకు పంచకుండా స్వార్ధంతో జీవించారు. దేవుని యొక్క సేవకునిగా ఉండాలన్న నిత్య  జీవం పొందాలన్నా వారిలో పరిత్యజించుకునే గుణం ఉండాలి.
ఈ యువకుని యొక్క ఉద్దేశము నిత్య జీవితము పొందుట మరి దానికోసం ఎందుకు తన యొక్క ధనం ను  వదలి వేయుట లేదు. దేవుని రాజ్యం కన్నా  ధనమే ముఖ్యమై నదా ? నిత్య జీవం కనా సంపదలే ముఖ్యమా? కొద్దిగా ఇవ్వటము ఇష్ట మేమో  కానీ దేవుడు  సంపూర్ణముగా ఇచ్చే మంటున్నారు . మానవ జీవితములో  కూడా అందరి యొక్క ఆశ  పర లోక రాజ్యంలో  ప్రవేశించాలన్నది. కానీ  చాలా మంది ఆ యొక్క ఉద్దేశం కోసం పని చెయ్యరు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా , దేవుని శిష్యులుగా ఉండాలన్న అలాగే నిత్య జీవితం పొందాలనుకున్న మన జీవితములో కూడా కొన్ని సార్లు వదలి వేసుకోలేం. యేసు ప్రభువు అతనితో నీకున్నదంతా పేదలకు దానము చేయుము అంటున్నారు. ఇక్కడ ఉన్నదంతా అంటే కేవలం ధనము మాత్రమే కాదు. ఆయనలో ఉండే ప్రేమ అయ్యి ఉండవచ్చు, మంచితనం అయ్యి ఉండవచ్చు, సేవా భావం అయ్యి ఉండవచ్చు. కానీ ఇతడు ఇవ్వటానికి సిద్దంగా లేడు. ఆయన యొక్క ఉద్దేశం కోసం ఆయన పని చేయుటలేదు. ధనాన్ని త్యజించుట కన్నా క్రీస్తుని త్యజించుట మేలు అని అనుకోని  బాధ పడుచు  వెళ్లుతున్నాడు. యేసుప్రభువు  యొక్క ఉద్దేశం  ఏమిటంటే  ఈ యొక్క యువకుని గురించి  ఆయన శిష్యుడిగా ఉండాలంటే కేవలం మంచి  పేరు ఉంటే చాలదు, దానితో పాటు పేదలకు సాయం చేసే గుణం, ప్రేమ ఉండాలనుకున్నారు. దేవుడిచ్చిన సంపదలు కూడా పెట్టుకోవడానికి కాదు పంచుకోవడానికి , పేదలకు పంచడానికి . దేవుడు పేద వానిగా ఈ లోకానికి వచ్చి  తన అనుగ్రహాలను పంచుకున్నప్పుడు మనం కూడా మనయొక్క సంపదలను పేద వారితో పంచుకొని జీవించాలి.
ధనిక యువకుని జీవితంలో రెండు అంశాలు లోపించాయి.
1.        పేదల పట్ల కనికర భావం  కలిగి ఉండుట
2.      తనకు ఇచ్చిన సమృద్దిని పేదలతో పంచుకొను ట
సంపదలు అన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలే. దేవుడిచ్చిన ది వేరే వారితో  పంచుకొనటానికే. యేసు ప్రభువు శిష్యులతో అంటున్నారు 23 వ వచనం ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత కష్టం. ధనవంతులు అంటే కేవలం డబ్బు ఉన్నవారు మాత్రమే కాదు అధికంగా ఉన్నవారు. కొన్ని సార్లు మనమందరం కూడా ఉన్న వారమే.
-కోపం ఎక్కువగా ఉన్న వారమే
-ద్వేషం ఎక్కువుగా ఉన్న వారమే
-పగలు ఎక్కువగా ఉన్న వారమే
-పాపాలు ఎక్కువగా ఉన్న వారమే
-వ్యసనాలు ఎక్కువగా ఉన్న వారమే  ఇవన్నీ ఎక్కువగా ఉంటె మనం కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. అదే విధముగా దేవుడిచ్చిన సిరిసంపదలు  ఎవరైతే పేద వారితో పంచుకోరో వారు కూడ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఎందుకు ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించారు అంటే
1. వారు దేవుని మీద ఆధారపడరు
2.  సంపదలు ధనవంతుల జీవితాన్ని  ఈ లోకానికే  పరిమితం చేస్తుంది సంపద. మత్తయి 6:21
3.  సంపదలు మనిషిని స్వార్ధంతో   జీవించేలా చేస్తాయి. 
యేసు ప్రభువు ధనవంతులకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఆయన యొక్క స్నేహితుల్లో జక్కయ్య , నికోదెము, అరిమత్తయి యోసేపు వారు కూడా ధనవంతులే, కాకపోతే  దేవుడు ఖండించే విషయము ఏమిటంటే ధన వ్యామోహముతో జీవించుట. ధనమే శాశ్వతం అనుకోని దేవుడిని వద్దనుకునే వారి యొక్క ఆలోచనలు సరిచేసుకోవాలి. అని చెబుతున్నారు.
మానవ జీవితములో దైవమును ద్రవ్యమును ఒకే సారి పూజించలేరు. కాబట్టి ఒకటి వదలి వేసుకోవాలి. మత్తయి 6:24. ఈ ధనిక యువకునికి దైవ జ్ఞానము లేదు అది ఉంటే నిత్య జీవితం కోసం అన్నీ వదలి వేసుకునేవాడు. జ్ఞానం కలిగి ఉండినట్లయితే దేవుడు ఇంకా నాకు ఎక్కువగా ఇస్తాడు  అనే ఆలోచనతో తనకు ఉన్నదంతా దానం చేసేవాడు. పునీత ఆసీస్సీపుర ఫ్రాన్సిస్ గారు దేవుని కోసం తన యొక్క ఆస్తులను అన్నీ వదలి వేసుకున్నాడు. పునీత ఈజిప్టు ఆంథోనీ వారు అన్నీ వదలి వేసుకున్నారు. అందుకే దేవుడు వారిని  హెచ్చుగా దీవించారు.
సువిశేషంలో  పేతురు గారు దేవుని సేవ చేసేవారి గురించి ఒక ప్రశ్న అడుగుచున్నారు.  అంతయు విడిచి పెట్టి మేము నిన్ను అనుసరించితిమి అనెను. అప్పుడు ప్రభువు వారికి  చక్కని సమాధానం ఇస్తున్నారు. వారిని దీవిస్తానని నూరంతలుగా  ఫలాన్ని పొందుతారని  చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు. వారికి నిత్య  జీవితం కూడా దొరుకుతుంది అని యేసు ప్రభువు  తెలియచేస్తున్నారు. కాబట్టి మన యొక్క  విశ్వాస జీవితములో  దైవ జ్ఞానం కలిగి దేవుడిచ్చిన సంపదలు పేద వారికి పంచి , దేవుణ్ణి కలిగి జీవిస్తూ  , నిత్య జీవం పొందటానికి అర్హులగుదాం.
 BY REV.FR. BALA YESU OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...