33 వ సామాన్య ఆదివారం
దానియేలు 12:1-3, హెబ్రీ 10:11-14,18 మార్కు 13:24-32
నేటి దివ్య గ్రంధ పఠనాలు దేవుడు ఎప్పుడు మనతో ఉంటారనే విషయాన్ని గురించి
బోధిస్తున్నాయి. మన యొక్క కష్ట కాలంలో అంత్య దినములలో దేవుడు మనతో
ఉంటారని తెలుపుచున్నా యి, ఈ పఠనాలు. అలాగే ఈ దివ్య పఠనాలు దేవుని రెండవ
రాకడను గురించి కూడా బోధిస్తున్నాయి. దేవుని యొక్క రాకడకై అందరు సంసిద్దులై జీవించాలి.
ఈనాటి మొదటి పఠనంలో దానియేలు ప్రవక్తకు కలిగిన నాల్గవ దర్శన వివరణ మనం
వింటున్నాం.
మానవులు మరణించి సమాధి చేయబడిన తరువాత మట్టిలో నిద్రించే చాలా మంది
సజీవులగుదురు అని చెపుతున్నాయి. ఆనాడు విశ్వాస పాత్రులుగా జీవిస్తున్న
యూదులను నాలుగవ అంతియోకు అన్యాయంగా వారిని శిక్షకు గురిచేసి, చంపివేశారు.
నాల్గవ అంతియోకు (సిరియా) గ్రీకు రాజు, ఆయన యూదా ప్రజలమీద అనేక రకాలైన
ఆంక్షలు విధించి, వారు గ్రీకు మతస్తుల ఆచారాలను , పద్దతులను ఆచరించాలని
ఒత్తిడి చేశారు. యూదా ప్రజల సున్నతిని తిరస్కరించారు, దేవాలయాన్ని ధ్వంసం
చేశారు, దేవాలయంలో ఉన్న విలువైన వస్తువులను నాశనం చేశారు అది మాత్రమే
కాకుండా వారికి విలువైన పవిత్ర గ్రంధం తోర యొక్క భాగాలను కాల్చి వేశారు. ప్రజలు
గ్రీకు దేవతలను , దేవుళ్లను ఆరాధించాలని ఒత్తిడి చేసిన సమయంలో ప్రవక్తకు దేవుని
యొక్క అభయ సందేశాలు వినిపించబడ్డాయి.
దేవుని పట్ల విశ్వసనీయత కలిగి జీవించిన ప్రతి యూదుడు కూడా, మరణించిన
తరువాత,శరీరంతో పునరుత్థానం చెందుతారని తెలుపు చున్నారు.
దానియేలు ప్రవక్త, బాధలు అనుభవించే ప్రజలకు ఒక ఊరట ఇస్తున్నారు. యావే దేవుడు
ఎప్పుడు కూడా తన ప్రజలకు చేరువలోనే ఉంటారని, యూదులు కూడా యావే దేవుడు
ఈకష్టకాలంలో, ఈ లోకంలోకి దిగి వచ్చి తమకు తోడుంటారని ప్రగాఢంగా నమ్మారు.
దానియేలు గ్రంధం 11:21-39 వచనములు మనం చదివితే అక్కడ సిరియా రాజు
యొక్కఅహం, ఆయన యొక్క దురాలోచనలు , ఆయన యొక్క స్వార్ధం , ఆయన చేసే
హింసలుఅన్నీ అర్థమవుతాయి. ఎన్ని విపత్తులు ఎదురైన సరే ప్రజలలో ఒక విధమైన
ఆశను,నమ్మకాన్ని కలుగజేస్తున్నారు ప్రవక్త.
వారి జీవిత అంత్య దినములు సంభవించినప్పుడు దేవుని కోసం
ఎలాగా జీవిస్తున్నమన్నదిముఖ్యం. దేవుని జీవ గ్రంధమునా వ్రాయబడిన పేర్ల వారు
జీవిస్తారు అని తెలుపుచున్నారు.దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ , దైవ ప్రేమ, సోదర
ప్రేమ కలిగిన వారందరి యొక్క పేర్లు జీవ గ్రంధ మందు వ్రాయబడుతాయి.
నిర్గమ 32:32-33, కీర్తన 69:28.
2 వ వచనంలో చనిపోయి మట్టిలో నిద్రించే వారు సజీవులగుదురు అని ప్రవక్త
తెలుపుచున్నారు. ఇదియే క్రైస్తవ విశ్వాసం మరియు యూదుల విశ్వాసం , అంతిమ
దినమున అందరు కూడా లేపబడుతారని తెలుసుకున్నాం. పవిత్ర గ్రంధంలో ఆనాడు
యెహెజ్కేలుప్రవక్త ఎండిన ఎముకలకు ప్రవచనం చెప్పగానే వారు సజీవులై లేచారు.
యెహెజ్కేలు 37:7-8.
దీని ద్వార ప్రభువు చెప్పే విషయము మనకు అర్థమగుచున్నది. దేవుని కొరకు
చనిపోయిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచి చనిపోయినవారు మరలా దేవుని కృప
వలన సజీవులౌతారని. యెహెజ్కేలు 37:13. యూదులు పునరుత్థాన భాగ్యం కలుగుతుంది అనివిశ్వాసించారు. 2 మక్కబీయులు 7:9 . ఏడుగురు సోదరులు ప్రాణాలు
త్యాగం చేయడానికిసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మరణం గురించి భయం లేదు.
మరణం తరువాత దేవునితోజీవం ఉందని గ్రహించారు/విశ్వాసించారు.యూదా ప్రజలు
తమ జీవిత అంత్య కాలం గురించి కలవర పడ్డారు. వారి కష్టాలలో దేవుడు దానియేలు
ప్రవక్త ద్వార వారితో మాట్లాడి, బాధలను స్వీకరించి, నీతివంతమైన జీవితం గడపడం
ద్వార ఆనందం గా మృత్యువుని చేరుకొమ్మని అభయమిచ్చారు.
ఈనాటి మొదటి పఠనంలో విశ్వాసుల జీవితాలను బలపరచిన వారికి , దైవ జ్ఞానం
బోధించిన జ్ఞానులకు, దేవుని యొక్క ధర్మము నేర్పించిన వారు ఎల్లప్పుడు కూడా దేవుని
యొక్క బహుమతి పొందుతారని ప్రవక్త తెలియ పరుస్తున్నారు. వివేకవంతులైన
నీతిమంతులకు దేవుని తీర్పువలన బహుమానం లభిస్తుందని, మూర్ఖులు, దుష్టులు
శిక్షించబడతారని ఈనాటి మొదటి పఠనం వివరిస్తుంది.
రెండవ పఠనంలో యేసు క్రీస్తు ప్రభువు యొక్క యాజకత్వంకు ఉన్న గొప్ప తనం గురించి
తెలుపుచున్నారు. పూర్వ నిబంధన ప్రధాన యాజకులు ఒకే రకమగు బలులు
అర్పించినప్పటికి ప్రజల పాపాలను తొలగించ లేకపోయారు. కానీ క్రీస్తు ప్రభువు తన
యొక్కబలి ద్వార అందరి పాపాలను ఒక్కసారిగా మన్నించారు.
ఆయన సమర్పించిన బలికి రక్షణ సామర్ధ్యం ఉంది. యేసు క్రీస్తు సమర్పించిన ఈ ఒకే
ఒక బలి విశ్వాసులను దేవుని ఎదుట నీతిమంతులుగా చేస్తుంది, శుద్దీకరిస్తుంది అధె
విధముగా అందరిని రక్షణ పొందుటకు సహాయ పడుతుంది. పాత నిబంధన
గ్రంధంలోని అన్నీబలులు కూడా క్రీస్తు ప్రభువు సమర్పించిన కలువరి బలిలో
పరిపూర్ణమైనవి. క్రీస్తు ప్రభువు ఈ బలి సమర్పించి దేవుని కుడి ప్రక్కన
ఆసీనుడైయున్నారు. ఆయన యొక్క యాజకత్వ సమర్పణ ద్వార, స్వీయ త్యాగం
మనందరం నేడు శుద్దులుగా ఉంటున్నాం. పరిశుద్దత కలిగి ఉంటున్నాం. మనకు
దేవుడు క్రొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు. ఆయన ఒకే ఒక శరీర బలి అర్పణ ద్వార
మనమందరం పాపములనుండి శాశ్వతంగా పవిత్రులుగా చేయబడితిమి.
ఈనాటి సువిశేష పఠనం దేవుని యొక్క రాకడను గురించి బోధిస్తుంది. క్రీ. శ . 69 లో
రోమియులు క్రైస్తవులను, అధే విధంగా నూతనంగా క్రైస్తవత్వమును స్వీకరించిన
యూదులను హింసలకు గురిచేస్తున్న కాలంలో తన ప్రజల యొక్క విశ్వాసాన్ని
బలపరచడానికి దేవుడు మరలా వస్తాడనే నమ్మకం కలిగిస్తూ మార్కు గారు ఈ
వచనాలను వ్రాస్తున్నారు. తనకు కలిగిన దర్శనం వల్ల మనుష్య కుమారుని రాకడ
జరిగినప్పుడుప్రపంచంలో కొన్ని ప్రకృతి మార్పులు జరుగుతాయని అనగా సూర్యుణ్ణి
చీకటి క్రమ్మటం, నక్షత్రాలు రాలి పడటం వంటి సంకేతాలు కనిపిస్తాయని వివరించాడు.
వాస్తవానికి నిజమైన విశ్వాసులకు అవన్నీ భయపెట్టే సంకేతాలు కావు. దేవుని ఆజ్ఞల
ప్రకారంగా జీవించని వారికి మాత్రమే అవి భయాన్ని కలుగచేస్తాయి. యేసు ప్రభువు
యొక్క మాట వలన మనమందరం అత్తి చెట్ల నుండి ఒక పాఠం నేర్చుకోవాలి. అత్తి చెట్ల
ఆకులు వసంత ఋతువు చివర్లోనే చిగురిస్తాయి. అవి అలా కనిపించినప్పుడు ఒక క్రొత్త
కాలం సంభవించినది అని మనకు తెలుస్తుంది. ఆకులు రాలిపోయాయి అంటే చెట్టు
చనిపోయింది అని కాదు అర్ధం, క్రొత్త ఆకులు వస్తాయి అని అర్ధం. దేవుని యొక్క
రెండవ రాకడ జరిగినప్పుడు కూడా క్రొత్త కాలం ప్రారంభమగుచున్నది, దానికి గాను
అందరు కూడా విశ్వాసులుగా జీవించాలి. దేవునియొక్క రాకడ కోసం మనం ఎప్పుడు
సంసిద్దులై జీవించాలి. లోకాంత్యం అంటే లోకం మొత్తంబూడిద కావడం కాదు. ఈ
లోకంలో ఉన్న పాపం , ద్వేషం, సైతాను ఆలోచనలు అని కూడా వదలి లోకమంతా
దేవుని రాజ్యం ,ప్రేమ రాజ్యం , శాంతి రాజ్యంగా మార్చడమే. లోకమంతట నూతనత్వం ,
నవ జీవన వినూత్న చైతన్యం వర్ధిల్లీ ఉండటం.
2 కోరింథీ 5:17 . యేసుప్రభువు చెప్పినటువంటి మూడు విషయాలు
-యెరుషలేము దేవాలయము ధ్వంసం
-లోకాంత్యం – దేవుని రాజ్యంగా మారటం
-క్రీస్తు ప్రభువు రెండవ రాకడ
మొదటి రెండు కూడా నెరవేరాయి కాబట్టి మూడవది తప్పక నెరవేరుతుందని ఆనాటి
ప్రజలు విశ్వసించారు. దేవుని గడియ ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు. తెలిస్తే ఆ
సమయంలో సిద్దపడతారు. క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు మనం సిద్ద పడాలి.
దేవుని యొక్క రాకడ కొన్ని విషయాలను తెలియ పరుస్తుంది.
1. సర్వం కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉంది.
2. ఆయన క్రీస్తు నిజముగా దేవుడు అనే సత్యమును తెలియ పరుస్తుంది.
3. దేవుడు మానవుల కష్టాలను తొలగించి వారికి సంతోషమును పంచి పెడతారు.
4. దేవుడు రెండవ సారి వేంచేసే సమయంలో అందరు కూడా ఆయన మనుష్య కుమారుడని తెలుసుకొని విశ్వసిస్తారు. 27 వ వచనంలో దూతలు దేవుడు ఎన్నుకొనిన వారిని ప్రోగుచేస్తారు.
1. ఎవరు ఎన్ను కొనబడిన వారు ? ఎవరైతే దేవుని యందు జ్ఞాన స్నానము పొంది ఉన్నారో
అలాగే దేవుని కొరకు బాధలు అనుభవిస్తారో , ప్రార్థించే వారందరు ,సాయం చేసే వారందరు
కూడా దేవుని యొక్క దూతల చేత ప్రోగుచేయబడతారు. లూకా 18:7.
2. ఎన్నుకొనబడిన వారు అంటే దేవుని యొక్క మెప్పు పొందిన వారు. రోమి 8:33
3. పవిత్రులు , వినయవంతులు, సానుభూతి కలిగినవారు, సహనం కలిగిన వారు. కోలస్సీ 3:12.
ప్రపంచ నలుమూలల నుండి ఎన్నుకొనబడిన వారిని ప్రోగుచేస్తారు. మత్తయి 25:31-32.
-మన యొక్క విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా జాగురుకులై ఉండి జీవించాలి.
మనం అంత్య కాలమునకు సిద్దపడాలి. దేవుని యొక్క ప్రకారం జీవిస్తే భయపదనక్కరలేదు.
దేవుడు శాశ్వతంగా జీవించేవారు ఆయన పలోకిన ప్రతిమాట నెరవేరుతుంది. కాబట్టి మన
జీవితంలో ఆయన రాకడ కోసం సిద్దపడుతూ జీవించాలి.
Rev.Fr. BalaYesu OCD
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి