20, నవంబర్ 2021, శనివారం

34 వ సామాన్య ఆదివారం (క్రీస్తు రాజు మహోత్సవం)

క్రీస్తురాజు మహోత్సవం

దానియేలు 7 : 13 -14 

దర్శన గ్రంధము 1 : 5 - 8 

యోహాను 18 : 33 - 37

క్రీస్తునాధుని యందు ప్రియా సహోదరి సహోదరులారా. ఈనాడు తల్లి తిరుసభ 34వ సామాన్య ఆదివారంలోకి ప్రవేశించియున్నది. క్రీస్తు ప్రభువు విశ్వమంతటికి రారాజు అన్న విషయాన్నీ ప్రపంచమంతటికి చాటిచెప్పడానికి తల్లి శ్రీసభ సామాన్య ఆదివారాల్లో చివరిదైన 34వ ఆదివారాన్ని  క్రీస్తురాజు మహోత్సవానికి అంకితం చేస్తుంది. 

శ్రీసభ చరిత్రలో మొదటినుంచి క్రీస్తురాజు మహోత్సవాన్ని జరుపుకునేది కాదు. పదకొండవ భక్తినాధ పోపుగారు 1925 డిసెంబర్ 11 వ తేదీన ఈ మహోత్సవాన్ని దైవాక్యర్చన క్యాలెండరులో చివరి ఆదివారాన జరుపుకోవాలని ప్రకటించారు.  ప్రజల పాప జీవితం, విచ్చలవిడి తనం, అధికార వ్యామోహాలు, ప్రభువును వారి జీవితాలనుంచి త్రోసివేసి జీవించడంలాంటివి చూసి పోపుగారు, అందరికి ఒక్కరే రాజు, అధికారి వున్నారు, ఆయనే క్రీస్తుప్రభువు అని లోకమంతటికి తెలియజేయడం కోసం ఈయొక్క మోహోత్సవాన్ని  విశ్వమంతటా ప్రకటించియున్నారు. ఈ పండుగ ప్రారంభమై 96  సంవత్సరాలే  అవుతున్నా క్రీస్తుప్రభువు రాజు అని వినడం, అనడం శ్రీసభలో కొత్తెమికాదు. 

క్రీస్తు పుట్టక పూర్వం, పుట్టినప్పుడు, క్రీస్తు మరణిస్తున్నప్పుడు, మరణించిన తర్వాత కూడా ఆయనను రాజు అని అంగీకరించడం మనం పరిశుద్ధ గ్రంధంలో చూస్తున్నాం. క్రీస్తు పుట్టక పూర్వమే  జెకర్యా ప్రవక్త క్రీస్తుని రాజుగా గుర్తించి ఇలా పలుకుతున్నారు, "యెరూషలేము కుమారి! నీవు ఆనందము చెందుము. అదిగో! నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు" (జెకర్యా 9: 9). క్రీస్తు పుట్టిన సమయాన కూడా ఆయనను మానవాళి రాజుగా అంగీకరించడాన్ని మనం చూడవచ్చు. క్రీస్తు పుట్టినప్పుడు తూర్పు దిక్కునుంచి వచ్చిన జ్ఞానులు హేరోదు రాజు వద్దకు వెళ్లి, " యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ?" (మత్తయి 2: 2) అని అడుగుతూ క్రిస్తునాధుని రాజుగా అంగీకరిస్తున్నారు.  అదేవిధంగా క్రీస్తు నాధుడు మరణించే సమయాన కూడా ఒక రాజుగా అంగీకరింపబడ్డారు. పిలాతు తెలిసితెలియక " నీవు యూదుల రాజువా?" (మత్తయి 27: 11) అనే ప్రశ్నద్వారా, మరియు "నజరేయుడగు యేసు యూదుల రాజు " (యోహాను 19 : 19 ) అని క్రీస్తు సిలువపై ఫలకం పెట్టించుటద్వారా క్రీస్తుప్రభువు రాజు అని భయలుపరుస్తున్నారు. కనుక క్రీస్తుప్రభువు రాజు అను సత్యాన్ని మానవాళి తెలిసీతెలికుండానే అంగీకరించింది.

క్రీస్తురాజు మహోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ శుభసందర్భంలో మన క్రీస్తు రాజు ఎటువంటి వాడు, ఆ రాజు రాజ్యం ఎటువంటిది, ఆ రాజ్యానికి అర్హులం కావాలంటే మనం ఏం చేయాలో తెలుసుకోవడం చాలా మంచిది. 

I. ఈ రాజు ఏటువంటివాడు?

1. తీర్పు తీర్చు న్యాయ తీర్పరి:

ఈ  రాజు “న్యాయముతో తీర్పు తీర్చువాడు (యెషయా 11 : 5 )  అని యెషయా ప్రవక్త పలుకుచున్నారు. అంటే మన రాజు న్యాయతీర్పరి. ఎందుకు క్రీస్తు మాత్రమే తీర్పరియై ఉన్నాడు. ఎందుకనగా  తండ్రిదేవుడే స్వయానా తీర్పుతీర్చె అధికారాన్ని కుమారునకు ఇస్తున్నారు. “తండ్రి ఎవరికిని తీర్పుతీర్చడు. తీర్పరిగా సర్వాధికారం కుమారునికి ఒసగబడెను “ (యోహాను 5 : 22 ) అని ప్రభువే స్వయానా పలుకుచున్నారు. ఈ లోకానికి కేవలం క్రీస్తుమాత్రమే తీర్పరి. తీర్పుతీర్చుటకు సర్వాధికారం తండ్రి ఆయనకు ఇచ్చివేసియున్నారు.

II. ఈ రాజు రాజ్యం ఎటువంటిది ? 

1. శాంతి సమాధానములు గల రాజ్యం :

"దేవుని రాజ్యమనగా తినుట, త్రాగుట కాదు. పవిత్రాత్మ యొసగె నీతి, శాంతి, సంతోషములే" (రోమా 14 : 17 ) అని పునీత పౌలు గారు రోమీయులకు వ్రాసిన లేఖలో చాలా చక్కగా పలుకుచున్నారు. పరలోక రాజ్యములో పాపముగాని, కష్టనష్టాలుగాని, ఇంకా ఎటువంటి చెడుకు తావులేనటువంటి ఒక రాజ్యం. ఆ రాజ్యంలో శాంతి సమాధానంకు కొరత ఉండదు. ఎందుకంటే ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు అక్కడ నివసించు జనుల నడుమ శాంతిని నెలకొల్పును(జెకర్యా 9 :10 ) అని జెకర్యా ప్రవక్త పలుకుచున్నారు. ఈ రాజ్యమున ఉండేటటు వంటి  శాంతి కేవలం తాత్కాలికమైన శాంతి కాదు, ఈ రాజ్యమున శాంతి సదా, ఎల్లకాలము నెలకొనును (9 : 7 ) అని యెషయా ప్రవక్త పలుకుచున్నారు. మన జీవితాలలో ఎల్లప్పుడూ ఈ క్రీస్తురాజు, ఇచ్ఛేటటువంటి శాంతి సమాధానం కోసం పరితపించాలి.

2 . నీతిన్యాయములు గల రాజ్యం :

ఈ రాజ్యం  ఎల్లప్పుడూ నీతిన్యాయములు గల రాజ్యం. ఆ రాజు విజ్ఞానముతో తన రాజ్యమును పరిపాలించును, తన రాజ్యమున నీతిన్యాయములు నెలకొల్పును (యిర్మీయా 23 : 5 ) అని యిర్మీయా ప్రవక్త పలుకుచున్నారు. ఎందుకంటె ఆ రాజు నీతిన్యాయములు గల రాజు కనుక. అందరికంటే ముందు అతనే నీతిని, ధర్మమును పాటించును (యిర్మీయా 33 : 15 ), అతనే న్యాయమును ప్రకటించును, న్యాయమునకు విజయము చేకూర్చునంతవరకు  అతను పట్టువిడువడు (మత్తయి 12 : 18 - 20 ) అని పరిశుద్ధ గ్రంధం తెలియజేస్తుంది. మనం ఎల్లప్పుడు నీతిన్యాయములతో జీవిస్తూ ఉండుటకు ప్రయత్నించాలి.

3  శాశ్వతమైన రాజ్యము: 

మన క్రీస్తురాజు యొక్క రాజ్యమునకు పరిమితి లేదు. ఈ రాజ్యమునకు హద్దులుగాని, నిర్ణిత సమయముగాని లేదు అని పరిశుద్ధ గ్రంధం తెలియజేస్తుంది. గాబ్రియేలు దూత మరియతల్లిని సందర్శించినప్పుడు  "క్రీస్తు యొక్క రాజ్యమునకు అంతమే ఉండదు" (లూకా 1 : 33 ) అని మరియతల్లితో పలుకుచున్నారు. ఎందుకని ఆయన పరిపాలించే రాజ్యము ఎల్లకాలము ఉంటుంది కాబట్టి. ఈ నాటి మొదటి పఠనంద్వారా కూడా ప్రభువు మనకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. మొదటిపఠనంలో దానియేలు ప్రవక్త, క్రీస్తుని పరిపాలనా, మరియు అతని రాజ్యం గురించి ముందుగానే తెలియపరచియున్నారు. "అతని పరిపాలనము శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతమే ఉండదు" (దానియేలు 7 : 14 ) అని దానియేలు ప్రవక్త పలుకుతున్నారు. మనమందరము ఇటువంటి శాశ్వతమైన రాజ్యం కోసం ఎల్లప్పుడూ వెదకాలి.

III . ఈ రాజుయొక్క రాజ్యానికి అర్హులం కావాలంటే మనం ఏం చేయాలి?

1 . హృదయపరివర్తన :

"మీరు పరివర్తన చెంది, చిన్న బిడ్డవలె రూపొందిననే తప్ప పర లోక రాజ్యమును ప్రవేశింపలేరు" (మత్తయి 18 : 3 ) అని ప్రభువే స్వయానా పలుకుచున్నారు. ఈ క్రీస్తు రాజు యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అంటే హృదయపరివర్తన కలిగి, చిన్న బిడ్డలవలె నిష్కల్మషమైన మనస్సు కలిగి ఉంటే తప్ప పరలోకరాజ్యంలోకి మనం ప్రవేశించలేము.  

2 .  దేవుని చిత్తానుసారం జీవించాలి :

"ప్రభూ! ప్రభూ! అని నన్ను సంబోధించు ప్రతివాడు పర లోక రాజ్యములో ప్రవేశింపడు! కానీ, పర లోక మందున్న నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోకరాజ్యమున ప్రవేశించును" (మత్తయి 7 : 21 ) అని క్రిస్తునాధుడు పరిశుద్ధగ్రంధంలో పలుకుతున్నారు. మనం జీవితాలను మన ఇష్టానుసారం, మనకునచ్చినట్టుగా కాకుండా, దేవుని చిత్తానుసారం, ఆయన వాక్యానుసారం జీవిస్తే కశ్చితంగా మనమందరం ఈ క్రీస్తురాజ్యంలో  వారసత్వం సంపాదించవచ్చు.

౩. సేవకరూపం దాల్చాలి:

దేవుని రాజ్యానికి అర్హులం కావాలంటే ప్రతిఒక్కరు సేవకరూపం దాల్చాలి. క్రీస్తు ప్రభువు ఒక దేవుడై యుండికూడా, ఈ విశ్వమంతటికి రారాజు అయ్యి కూడా తాను సేవచేయాడానికే వచ్చారని తెలియజేస్తున్నారు. "ఏలయన, మనుష్యకుమారుడు సేవించుటకేగాని, సేవింపబడుటకు రాలేదు" (మార్కు 10 : 45 ) అని మార్కు సువార్త ద్వారా ప్రభువు తెలియజేస్తున్నారు. క్రీస్తునియెక్క సేవచేసే వ్యక్తిత్వం ఎటువంటిదంటే, తాను దేవుడై యుండి కూడా మానవాళి యొక్క కాళ్ళు కడుగుటకు వెనుదీయలేదు (యోహాను 13  : 1 - 17 ) అని సువార్తలో చూస్తున్నాం. కనుక ప్రియా సహోదరి సహోదరులారా ! మనం  ఈనాడు క్రీస్తుని అనుసరించువారలం అని చెప్పుకోవాలి అంటే మనం కూడా ఇటువంటి సేవకరూపం దాల్చాలి అని ప్రభువు బోధిస్తున్నారు. 

కనుక  క్రిస్తునాధునియందు  ప్రియా సహోదరి సహోదరులారా ! ఈనాడు క్రీస్తురాజు మహోత్సవాన్ని జరుపుకుంటున్న మనందరినుంచి ప్రభువు ఆశించేది ఒక్కటే. మనమందరము ఆ రాజు రాజ్యములో వారసత్వం పొందడమే. ఆ వారసత్వం పొందాలి అంటే మనం హృదయపరివర్తన కలిగి, దేవుని చిత్తానుసారము జీవిస్తూ, సేవకారుపం దాల్చాలి. ఈనాడు మన జీవితాలకు, మనకుటుంబాలకు రాజు ఎవరు?ఎవరు మన జీవితాలను, మన కుటుంబాలను పరిపాలిస్తున్నారు?  ధనమా? అధికార వ్యామోహమా ? శరీరవాంచాలా? ఇతరులా? లేక విశ్వమంతటికి రాజైన క్రీస్తురాజునా? ఈనాటి దివ్యబలిపూజలో మన జీవితాలకు, మన కుటుంబాలను  క్రీస్తురాజు మాత్రమే పరిపాలించాలి అని ప్రార్థనచేద్దాం.



Bro. JOSEPH OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...