4, డిసెంబర్ 2021, శనివారం

ఆగమన కాలము 2వ ఆదివారము

 
ఆగమన కాలము 2వ ఆదివారము

బారుకు 5:9,

ఫిలిప్పీ 1:4-6,8-11,

లూకా 3:1-6

క్రీస్తు నాధుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి అయిన తిరుసభ ఈరోజు మనలను 2వ ఆగమన కల ఆదివారములోనికి ఆహ్వానిస్తూ, మనలను ఒక్కసారి మనము చేస్తున్న పనులను ఆపి, మనము పయనించే దారి ఎటువైపునకు సాగుతుందో చూసి, దానిని చక్కబరిచి, నూత్నీకరించి మన ప్రయాణాలను కొనసాగించమని కోరుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మనలను ఆంతరంగీకముగా ప్రయాణము చేయమని అడుగుతుంది.

ఆగమన కాలము అనేది దేవుని రాకను గురించి ఎదురుచూడడమొక్కటే కాదు, మనలను పరిశీలించుకుని, మన తలంపులు,మాటలు, చేతలు, చూపులు ఎటువైపు మరలుతున్నాయో అని గమనించుకుని, వక్రమైన దానిని సక్రమొనర్చుకుని, ముందు మనలను మనము అర్ధము చేసుకుని, అంగీకరించిన యెడల మాత్రమే మన మనసులో దేవునికి మరియు అతని రాజ్యానికి చోటు ఉంటుందని తెలుసుకునే కాలము. ముందు మన గమ్యము మనకు తెలిస్తే, మన ప్రయాణము ఎటువైపునకు సాగాలో మనకు తెలుస్తుంది. గమ్యము తెలియని ప్రయాణము వ్యర్ధము. క్రైస్తవులుగా, క్రీస్తులో భాగస్వామ్యులమైన మనము ఈ ఆగమన కాల 2వ ఆదివారములో మన ప్రయాణాలను ఎడారి వైపునకు మళ్లిద్దాము. ఎడారి అనేది ఒక నిర్జన ప్రదేశము. పూర్వము ఋషులు, సాధువులు ఎడారిని తమ ధ్యానమునకు తగు స్థలమని అక్కడే తమ జీవితాలను గడిపి తమలో ఉన్న దైవీక శక్తిని, మానవ శక్తిని ఐక్యపరిచి ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకుని వాటిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ రోజు మనము మన ప్రయాణాన్ని ఈ ఎడారి వైపునకు మళ్లించి మన ఆంతరంగిక ప్రయాణాన్ని తేజోమయము చేయడానికి సంసిద్ధపడుదాము.

ఈరోజు దివ్య పఠనాలలో బారూకు ప్రవక్త, మరియు లూకా సువార్తికుడు ఈ ఎడారిని గూర్చి ప్రస్తావిస్తున్నారు. మొదటి పఠనము అయిన బారూకు గ్రంధము, యూదులు బబులోనియా దేశమునకు వలసకు పోయిన కాలములో వ్రాయబడినది. ఎంతో ఆడంబరముగా, ఆనందముగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు బబులోనియాకు వలసకు పోవలసివచ్చింది. యూదులు ఇతర దేశ ప్రజల మధ్య పలు భాదలు పొందవలసి వచ్చింది. అయితే ఇదే సమయములో యిర్మీయా ప్రవక్త కార్యదర్శియైన బారూకు ఈ గ్రంధమును వ్రాసి యూదులకు, యూదులకు అనగా ప్రత్యేకించి దేవునిచే ఎన్నుకొనబడినవారికి ధైర్యము చెప్తూ ముందుకు సాగమని ప్రబోధించాడు. "యెరూషలేమూ! నీవు విచార వస్త్రములను తొలగించి దైవ వైభవమనెడు శాశ్వత సొందర్యమును ధరింపుము. నీవు దేవుని నీతి వస్త్రమును కప్పుకొనుము. (బారూకు 1:2) ఒక ఆనందకరమైన వార్తతో, ఉత్తేజింపజేసే పలుకులతో బారూకు యూదులకు భోదిస్తున్నాడు. ఈ ప్రవచనాలు, ఊరడింపు మాటలు కావు. ఈ ప్రవచనాలు దేవుని మహిమను వెల్లడి చేసే మాటలు, గత వైభవాన్ని పొందబోతున్నారని ధైర్యపరిచే మాటలు. తమను సృష్టించిన దేవుడు వారితో ఉండబోతున్నారు. గత వైభవమును ఇంకా అధికము చేసి దానిని ప్రపంచ జనులందరకు చూపించాలనే అయన కోరిక. శత్రువులు నడిపించుకొనిపోయిన, యెరూషలేము బిడ్డలను మరల వారు రాజవైభవముతో జనులు మోసుకుని వచ్చుచున్నారు. ఇక్కడ మనము గమనించవలసిన విషయమేమిటంటే యెరూషలేము ప్రజలు బబులోనియాకు ఎడారి గుండా పయనించి, మరల ఎడారి గుండా ప్రయాణము చేస్తారు. వారు ఈ ఉత్తేజకరమైన మాటలను వినగలిగింది ఈ ఎడారి ప్రయాణములోనే.

తన ప్రజలను రక్షించగల దేవుడు ఎందుకు వారిని పరుల ఉచ్చులో చిక్కుకోనిచ్చారు? అనే సందేహము మనలో మెదల వచ్చు. కానీ మనము పరిశీలించి చూస్తే దుఃఖం తరువాత ఆనందము, బాధ తర్వాత సంతోషము, పరాజయము తర్వాత విజయము కచ్చితంగా వస్తాయని మనము అర్థమవుతుంది. కానీ మన దుఃఖ సమయములో మన ఆలోచనలు, చేతలు ఎటువైపునకు పోతున్నాయో గమనించుకోవాలి. మన బాధ సంతోషముగా మారాలంటే మనము ఏమి చేస్తున్నామో, ఏమి చెయ్యాలో మనకు తెలియాలి. పరాజయము పొందిన తర్వాత విజయము సాధించడానికి ఎంత మనోధైర్యము, కృషి, దేవుని యందు గట్టి విశ్వాసము ఉండాలో మనకు అర్ధం కావాలి. మన చేతికి ఏమి ఉచితంగా రాదు. దుఃఖమైనా, ఆనందమైనా మన చేతులలోనే ఉంది. ఎందుకంటే నిన్ను, నన్ను సృజించిన ఆ దేవుడు పూర్తి స్వతంత్రమును మనకు యిచ్చియున్నాడు. మనము చేయవలసినది ఒక్కటే. మనము ఏ మార్గమును ఎంచుకుంటున్నాము? ఏ విధముగా ప్రయాణిస్తున్నాము? మన ప్రయాణములో ఆ దేవునికి ఎంత స్థానము కల్పిస్తున్నాము? ఇవన్నీ మనము పరిశీలించుకోవాలి. ముందుగా మనము ధ్యానించిన విధముగా "గమ్యము లేని ప్రయాణము వ్యర్ధము" మన గమ్యము మనకు తెలిసిన యెడల ప్రయాణములో ఎన్ని బాధలు, అడ్డంకులు వచ్చినా కూడా వాటిని సానుకూలంగా మార్చగల దేవుడు మన దగ్గర ఉన్నాడని జ్ఞాపక పరచుకుంటాము.

అలాగే ఈ రోజు సువిశేషమును చూసుకున్నట్లయితే, బాప్తిస్మ యోహాను యొర్దాను నదీ పరిసర ప్రదేశములందంతట సంచరించుచు పాపక్షమాపణ పొందుటకై పరివర్తనం చెంది, బాప్తిస్మము పొందవలెనని ప్రకటించుచుండెను. యోహాను భోద చేస్తున్నది దేవాలయములో కాదు, పట్టణ ప్రాంతములో కాదు, రాజ భవనాలలో కాదు, కానీ ఎడారి ప్రాంతములో యొర్దాను నదీ ప్రదేశములో. గతకాలములో ఐగుప్తునకు వలసపోయిన ఇశ్రాయేలీయులు ఏ విధముగా తమ దేవుని తెలుసుకున్నారో, ఏ విధముగా వెనకకు తీసుకురాబడ్డారో, ఈ ఎడారి ప్రాంతములో వాళ్లలో జరిగిన ఆంతరంగిక మార్పును మరల, లూకా వ్రాసిన శుభావార్తలో ఈ రోజు మనము వినిన యోహాను బోధనా స్థలము, మరల మనకు ఒక సందేశాన్ని అందిస్తుంది. "ప్రభువు మార్గమును సిద్ధమొనర్పుడు, అయన త్రోవను తీర్చిదిద్దుడు" అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను. (లూకా 3:4)

ప్రభువు మార్గమును సిద్ధమొనర్చడానికి, అయన త్రోవను తీర్చిదిద్దడానికి, మనలను మనము సరిచేసుకోవాలని, మారు మనస్సు పొందాలని, దేవుని మార్గాన్ని అవలంబించాలని, బాప్తిస్మము పొందాలని యోహాను ఎడారిలో భోద చేసారు. ప్రవక్తగా యేసును ఈ లోకమునకు యోహాను పరిచయము చేసారు. మార్గమును సిద్ధపరచాలి అంటే ముందు ఆ మార్గము ఎటు వైపునకు దారి తీస్తుందో మనకు తెలిసి ఉండాలి. త్రోవను తీర్చి దిద్దాలి అంటే, ముందుగా ఆ త్రోవ ఎంతమందికి ఉపయోగకరంగా మారుతుందో తెలిసి ఉండాలి. ఇలా తెలిసి ఉండటం ఒక్కటే కాదు, అది ఎలా చెయ్యాలో కూడా ఎరిగి ఉండాలి. ఇవన్నీ చేయడానికి మన బుద్ధి బలము, మన కండ బలము ఒక్కటే కాదు గానీ, దేవుని శక్తి, ఆయన కృప అవసరము. ఈ అధునాతన ప్రపంచములో మనలను మనము తెలుసుకోవాలంటే మనము చేసే పనులను ప్రక్కనపెట్టి, మన కోసము మనము సమయము కేటాయించుకుని, ఈ ఎడారి అనే నిర్జన ప్రదేశములో అడుగుపెట్టి మనసును కేంద్రీకరించినచో, మన గమ్య స్థానము మనకు తెలుస్తుంది. అప్పుడు మనము ఆ దేవుని త్రోవను సిద్దపరిచే సైనికులమవుతాము.

Br. Putti Kiran OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...