17, జూన్ 2022, శుక్రవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

 మత్తయి 7: 19-23 


(ఇది ఈరోజు సువిశేష భాగము కాదు అని గమనించాలి,  ధ్యానం లో భాగంగా దీనిని ధ్యానించు కొరకు మాత్రమే)
మంచి పండ్లనీయని ప్రతి చెట్టును నరికి మంటలో పడవేయుదురు. కావున వారి ఫలములవలన వారిని మీరు తెలిసికొనగలరు. ప్రభూ!ప్రభూ!అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు!కాని, పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే  పరలోక రాజ్యమున ప్రవేశించును. కడపటి రోజున అనేకులు ప్రభూ! ప్రభూ ! నీ నామమున గదా మేము ప్రవచించినది, పిశాచములను పారద్రోలినది, అద్భుతములు అనేకములు  చేసినది అని నాతో చెప్పుదురు. అపుడు వారితో నేను దుష్టులారా! నా నుండి తొలగిపోండు. మిమ్ము ఎరుగనే ఎరుగను అని నిరాకరింతును. 

యేసు ప్రభువు ఈనాటి సువిశేషంలో మంచి పండ్లనియని ప్రతిచేట్టును నరికి మంటలో పడవేయుదురు అని చెబుతున్నారు.  ఎందుకంటే అప్పటి వరకు ఆ  చెట్టు మొక్కగా ఉన్నప్పటి నుండి ఎదిగి పండ్లు ఇచ్చే స్థితి వరకు దానిని పెంచి , పెద్ద చేసి అది మంచి పండ్లను ఇవ్వాలని దానికి కావలనసిన అన్నీ రకాల ఎరువులు వేసి పెంచిన తరువాత, అది మంచి పండ్లను ఇవ్వకపోతే దానిని రైతు నరికి వేస్తారు. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవునిచే ప్రేమించ బడినవాడే. ప్రతి వ్యక్తికి దేవుడు తగిన విధమైన ప్రతిభను ఇచ్చాడు. దానిని వినియోగించుకొని తగిన ప్రతిఫలాన్ని ఇవ్వవలసిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంది.

 "వారి ఫలములవలన వారిని మీరు తెలిసికొనగలరు." యేసు ప్రభువు ఇక్కడ కపట ప్రవక్తల గురించి మాటలాడుతున్నారు. వారి ఫలముల వలన వారిని మీరు తెలుసుకోగలరు. ఎందుకంటే బయటకు దేవుని సందేశమును ప్రవచిస్తున్నాము అని వారికి  ఉపయోగపడే మాటలను మాత్రమే వారు అనేక సార్లు చెబుతున్నారు. ఒక విధముగా యేసు ప్రభువు పరిసయ్యుల జీవితాలను ఉద్దేశించి మాటలాడిన మాటలు ఇవి. వీరు చెప్పే మాటలు అన్నీ మంచిగా ఉన్నాయి అనిపిస్తాయి. కాని చాలా స్వార్ధంగా ఉంటాయి. ఉదా .. తల్లిదండ్రులను గౌరవించాలి అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ.  ఒక వేళ  దేవాలయానికి మనం అర్పణ ఇచ్చి తల్లిదండ్రులకు మిమ్ములను చూసుకోవాలసిన సొమ్మును నేను దేవాలయానికి ఇచ్చాను అని చెప్పినట్లయితే అప్పుడు వారు తల్లిదండ్రులను చూడనవసరం లేదు అని వారు బోధించారు. 

కేవలం ఇది మాత్రమే కాదు. అనేక విషయాలు వినడానికి చాలా బావుంటాయి. కాని దేవునికి ఇష్టమైన పనులు కాదు.  వారి ఫలములు అనేక సార్లు ఏమి చేస్తాయి అంటే  ఇతరులకు  నష్టమును కలుగజేస్తాయి. ఉదా.. వీరు కాపరుల వలె మందలోనికీ వస్తారు కాని క్రూర మృగమును చూసి వీరు పారిపోతారు. వారి ప్రాణముల కొరకు మందలను నాశనం చేస్తారు. వీరు అనేక మంచి విషయములు  చెప్పిన మంచి పనులు వీరు చేయరు. అందుకే వీరిని యేసు ప్రభువు మీరు బయటకు సుందరముగా ఉన్న సమాధులు వంటివారు అని అన్నారు. బయటకు చాలా అందముగా ఉన్నకాని లోపల మొత్తం కుళ్లిపోయిన శరీరమే ఉంది. కేవలం మనం చేసే ప్రతి మంచి పని వలన మాత్రమే మనలని ఇతరులు  తెలుసుకోగలగాలి. మనం చూపించే ప్రేమ, కరుణ, దయ వంటి గుణాల వలన మనం ఆయన అనుచరులం అని  పిలిపించుకోగలగాలి.

 "ప్రభూ!ప్రభూ!అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు!కాని, పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే  పరలోక రాజ్యమున ప్రవేశించును." యేసు ప్రభువు మాటలు మనం చాలా శ్రద్దగా ఆలకించాలి. మనం ప్రతి నిత్యం ప్రార్దన చేయడానకి  దేవుని గురించి చెప్పడానికి ప్రాధాన్యత ఇస్తాము ,  అది తప్పు కాదు. కాని దాని కంటే ముఖ్యం మనం దేవుని చిత్తానుసారముగా జీవించుట.  యేసు ప్రభువు తండ్రి చిత్తము నెరవేర్చడం తన ఆహరముగా భావించాడు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఎంతటి కష్టమైన అనుభవించడానికి సిద్దపడ్డాడు, కష్టాన్ని అనుభవించాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. 

 కపట ప్రవక్తలు ఎవరు ఇటువంటి జీవితానికి సిద్ద పడలేదు. వాటి నుండి దూరంగా వెళ్లిపోయారు. వారు స్వార్ధంతో జీవించారు. ఎవరైతే ఇటువంటి జీవితానికి సిద్ద పడుతారో వారికి దైవ రాజ్యంకు అర్హుడవుతాడు. తండ్రి చిత్తము అనేది మనకు ఎలా తెలుస్తుంది? పది ఆజ్ఞలు ఇవ్వడం ద్వారా దేవుడు తన చిత్తము తెలియజేశాడు. ప్రవక్తల ద్వారా తన చిత్తము తెలియజేశాడు. తన కుమారుని ద్వారా తన చిత్తము తెలియజేశాడు. నాకు ఆయన చిత్తము తెలియదు అని మనం చెప్పలేం. ఎందుకంటే తన చిత్తం ఏమిటి అని తండ్రి ఎప్పుడు తెలియ పరుస్తూనే ఉన్నాడు. మనం ప్రతి నిత్యం ప్రభూ ప్రభూ అని అనుటకంటే  ఆయన చిత్తము నెరవేర్చడానికి పునుకోవాలి.

 "ప్రభూ! ప్రభూ ! నీ నామమున గదా మేము ప్రవచించినది, పిశాచములను పారద్రోలినది, అద్భుతములు అనేకములు  చేసినది అని నాతో చెప్పుదురు. అపుడు వారితో నేను దుష్టులారా! నా నుండి తొలగిపోండు. మిమ్ము ఎరుగనే ఎరుగను అని నిరాకరింతును."  యేసు ప్రభువు  ఇచ్చేటువంటి కొన్ని అనుగ్రహాలు ద్వారా శిష్యులు కొందరు కొన్ని అద్భుతాలు చేసి వారు అంతిమ దినమున మేము మీ పేరున అనేక గొప్ప పనులు చేశాము , పిసచ్చములు పారద్రోలాము అని చెబుతారు అయిన నేను వారిని నేను తిరస్కరిస్తాను అంటున్నారు. నేను మిమ్ము ఎరుగను అంటాను అని చెబుతున్నారు. కారణం ఏమిటి అంటే వీరు ఎంతటి గొప్ప పనులు చేసిన దేవుని చిత్తము వీరు నెరవేర్చారా ? లేదా? అనేది ముఖ్యం. వీరు ఆజ్ఞలు పాటించి , ఆయన చిత్తం నెరవేర్చితె అంటే ఆయన చూపిన సుగుణాలు కలిగి జీవిస్తూ తండ్రి చిత్తం నెరవేర్చడానకి  ఎంతకైనా మనం పాటుపడితే అప్పుడు ఆయన మనలను ఎరుగుతాను అని అంటారు. 

ప్రార్దన : ప్రభువా ! నా  జీవితంలో నేను మీ ప్రేమను, దయను , ప్రతిభను , కరుణను పొందాను. కాని దానికి తగిన విధముగా నా జీవితములో మంచి ఫలాలు ఇవ్వడంలో నేను విఫలం చెందాను. అటువంటి సమయాల్లో నన్ను క్షమించండి. నేను మరలా నా జీవితంలో మీరు ఇచ్చిన అన్నీ అనుగ్రహాలును వాడుకొని మంచి ఫలాలు ఇచ్చే విధంగా నన్ను దీవించండి. ప్రభువా మీ చిత్తమును విడచి పెట్టి ఈ లోక విషయముల మీద చాల సమయం వృధా చేశాను ప్రభువా. నేను కూడా మీ వలె తండ్రి చిత్తము నెరవేర్చడం నా ఆహారం అనే విధంగా నా జీవితాన్ని మార్చండి . మీ చిత్తం నెరవేర్చే వానిగా నన్ను మార్చండి. ఆమెన్ .  




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...