30, ఏప్రిల్ 2025, బుధవారం

దేవుడు తన కుమారున్ని ఎందుకు పంపాడు?

 దేవుడు తన కుమారున్ని ఎందుకు పంపాడు? 

యోహాను 3: 16-21 

దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు  ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై  అటుల చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని, దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలయన, దేవుని ఏకైక  కుమారుని నామమున అతడు విశ్వాసమునుంచలేదు. ఆ తీర్పు ఏమన, లోకమున వెలుగు అవతరించినది. కాని మనుష్యులు దుష్క్రియలు చేయుచు, వెలుగు కంటె చీకటినే ఎక్కువగ ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయల్పడకుండునట్లు వెలుగును సమీపింపడు. కాని, సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగ చేయబడినవని ప్రత్యక్షమగుటకు వెలుగును సమీపించును" అని సమాధానమిచ్చెను. 

ఈ వాక్యాలు దేవుడు ఎంతగా ఈ లోకమును ప్రేమించినది, అదేవిధంగా మానవుడు నాశనము చెందకుండా తన కుమారుణ్ణి పంపిన విషయం, ఆ కుమారుణ్ణి విస్వసించుట ద్వారా వారు నిత్యజీవము పొందుతారని, ప్రభువు లోకమునకు వెలుగుగా వచ్చారని దుష్క్రియలు చేసేవారు, ఆ వెలుగు దగ్గరకు వచ్చుటకు ఇష్టపడక అవి బయట పడతాయి చీకటిలోనే ఉన్నాడు. సత్యవర్తనుడు వెలుగును సమీపిస్తున్నాడు. జీవితాన్ని మార్చుకుంటున్నాడు అని తెలియజేస్తున్నాయి.  

దైవ ప్రేమ 

దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని  రక్షించడానికి తన కుమారుడిని ఈలోకానికి పంపాడు. కుమారుడు తన తండ్రి సంకల్పమైన లోక రక్షణము నెరవేర్చడానికి మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు.  దేవుని కుమారుడు తన తండ్రి చిత్తాన్ని పూర్తి చేసి అంత సమాప్తం అయినది అని చెప్పాడు. ఆయనను కలుసుకున్న, వినిన , చూసిన ప్రతివాడు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణను సిమియోను  ప్రవక్త వలే చూసారు. ఆయనను విశ్వసించిన వారు రక్షణ పొందుతున్నారు. 

దేవుడు లోకాన్ని ఖండించడానికి  తన కుమారున్ని పంపలేదు 

దేవుడ సృష్టి ఆరంభం నుండి మానవున్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎన్నడు విడనాడలేదు. దేవుడు ఎప్పుడు పాపి మరణించాలని, లేక నాశనం కావాలని కోరుకొనలేదు. ఆయన మానవుణ్ణి సన్మార్గంలో పెట్టదలచి క్రమ పద్దతిలో పెట్టగ దేవుడు శిక్షించినట్లుగా అనుకున్నాడు. దేవున్ని ఒక కఠిన యజమానిగా చూసాడు కాని దేవుని ప్రేమను,  తండ్రి వాత్స్యాల్యాన్ని అర్ధం చేసుకోలేదు.  అనేక సార్లు దేవుడు తన రాయబారులను పంపాడు. కాని మానవుడు దేవుడు పంపిన వారిని లెక్క చేయలేదు. తరువాత తన కుమారుణ్ణి పంపుతున్నారు. ఈ లోకాన్ని నాశనం చేయక తన కుమారుని జీవితం ద్వారా, మనకు ఎలా జీవించాలో తెలియజేస్తున్నాడు, తన మరణం ద్వారా మనకు పాపములను క్షమిస్తున్నారు. తన మీద విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం పొందే అనుగ్రహం ఇస్తున్నాడు. 

విశ్వాసం యొక్క ప్రాముఖ్యత 

రక్షణ యేసు ప్రభువును విశ్వసించడం వలన వస్తుంది. యోహాను ఈ విషయాన్ని తన సువిశేషంలో చాలా సార్లు లిఖించడం జరిగింది. ప్రతి అధ్యాయంలో విశ్వాసం గురించి చెబుతూ, సువిశేష  ఆరంభంలో, మధ్యలో మరియు చివరిలో యేసు ప్రభువును విశ్వసించడం వలన నిత్య జీవం వస్తుంది అని ప్రకటిస్తున్నారు. క్రైస్తవ జీవితంలో విశ్వాసానికి ఉన్న ప్రాముఖ్యత అటువంటిది. ప్రభువు కొన్ని సందర్భాలలో ఇది నీవు విశ్వసిస్తున్నావా? అని అడుగుతున్నారు. వారు స్వస్తత పొందిన తరువాత మీ విశ్వాసమే మిమ్ములను స్వస్థపరిచింది అని అంటున్నారు.  ప్రభువుని యందు మనకు విశ్వాసము ఉండటం వలన నిత్యజీవమే కాక ఈ లోకములో అనేక విషయాల్లో విజయాన్ని పొందుతాము.  

వెలుగు- చీకటి  

యేసు ప్రభువు నేనే లోకమునకు వెలుగును అని ప్రకటించాడు. యోహాను సువిశేషంలో మొదటి అధ్యాయంలో ఆయన ఈ లోకమునకు వెలుగాయను అని వింటాము. ప్రభువు దగ్గరకు నీకొదేము చీకటి వేళలో వస్తున్నాడు. అతను చీకటి నుండి వెలుగు దగ్గరకు వస్తున్నాడు. ప్రభువు దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి కూడా చీకటి నుండి వెలుగు దగ్గరకు వస్తున్నాడు.  కాని చీకట్లో ఉన్నవారు వెలుగు దగ్గరకు రావడానికి ఇష్టపడటలేదు. వెలుగు దగ్గరకు వస్తే వారి ఎటువంటి వారు అనేది, లేక వారి జీవితం అందరికి తెలిసిపోతుంది అని భయపడేవారు. కాని ప్రభువు దగ్గరకు వచ్చినట్లయితే వారు చేసిన తప్పులు ఏమి అందరికి తెలుస్తాయి అని భయపడనవసరం లేదు. ప్రభువు దగ్గరకు వచ్చే  సమయంలో ఆ వెలుగులో మనలో వున్న చేడు, మలినం లేక తొలగిపోతుంది. ప్రభువు నీకొదేము వచ్చినపుడు తాను చీకటిలో వచ్చిన, ప్రభువు దగ్గర ఉండటం వలన తనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాడు. కాని ఎవరు అయితే చెడు పనులు చేస్తున్నారో, ప్రభువు దగ్గరకు రావడానికి ఇష్టపడటం లేదో వారు చెడునే ప్రేమిస్తున్నారు. వారు మారటానికి ఇష్టపడటం లేదు. వారి పనులు ఎవరికీ తెలియకూడదు అని  వారు వెలుగును సమీపించడం లేదు. ప్రభువు దగ్గరకు రాకపోతే, మనలో ఉన్న ఆ చెడు ఎప్పటికి వెళ్లిపోదు. దాని ద్వారా ప్రభువు మనకు ఇచ్చే ఆ రక్షణ పొందలేము. సత్య వర్తనము కలిగి జీవించడము అనేది చాలా ముఖ్యము. అప్పుడు మనం చేసే పనులు దేవునికి ఇష్టమవుతాయి. 

ప్రార్ధన: ప్రభువా ! మీరు లోకమును ఎంతగానో ప్రేమించి మీ ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకమునకు దానిని రక్షించుటకు పంపారు. ఆయనను విశ్వసించిన వారంతా నిత్యజీవం పొందుటకు మీరు అటుల చేశారు. ప్రభువా మిమ్ములను మీ కుమారుణ్ణి మేము విశ్వసిస్తున్నాము. కొన్ని సార్లు వెలుగైన మీ కుమారుని దగ్గరకు రావడానికి మేము భయబడ్డాము. ఆ వెలుగులో నా పాపము ఎక్కడ బయటపడుతుందో అని సందేహించాము. కాని ప్రభువా! ఆ వెలుగు మా లోని పాపమును దహించివేసి మమ్ములను పరిశుద్దులనుగా చేస్తుంది అని మరిచిపోయాము. అటువంటి సందర్భంలో మమ్ములను క్షమించండి. మేము మీ  దగ్గరకు వచ్చి ఎల్లప్పుడు వద్ద ఉంటూ, మిమ్ము విశ్వసించి మీరు ఏర్పాటు చేసిన రక్షణ పొందేలా మమ్ము దీవించండి .ఆమెన్ 

28, ఏప్రిల్ 2025, సోమవారం

నూతనంగా జన్మించుట

 యోహాను 3: 7-15

నీవు మరల జన్మింపవలయునని నేను చెప్పిన్నందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనటుల వీచును. నీవు దాని శబ్దమును వినెదవే కాని అది ఎక్కడనుండి వచ్చునో, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మవలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును" అనెను. "ఇది ఎటుల సాధ్యమగును?" అని నికోదేము అడిగెను. అందులకు యేసు: "నీవు యిస్రాయేలు బోధకుడవైయుండియు దీనిని ఎరుగవా? మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము. చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము. కాని, మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పిన మీరు నమ్ముట లేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన యెడల ఎట్లు నమ్మెదరు. పరలోకము నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. "మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యజీవము పొందుటకు అట్లే మనుష్యకుమారుడును ఎత్తబడవలెను. 

నూతన జీవితం - క్రీస్తు ఎత్తబడటం 

ఈ సువిశేష భాగంలో నూతన జీవితం ఎలా మొదలవుతుంది, దానికి ఏమి చేయాలి అని మరియు ఏవిధంగా క్రీస్తు మోషే కంచు సర్పమును ఎత్తినట్లు ఎత్తబడతాడు అనే విషయాలను మనము చూస్తాము. యేసు ప్రభువు నికోదేముకు ఎలా ఒక వ్యక్తి నూతనంగా జన్మించాలి అని చెబుతున్నాడు. అటులనే ఈ నూతన జీవితం పొందేవాడు నిత్యజీవానికి అర్హుడు అవుతాడు, ప్రభువు అందుకుగాను వారి కొరకై సిలువ మీదకు ఎత్తబడతాడు, ప్రభువుని సిలువ మరణం మానవునికి ఈ నిత్య జీవమును ఇచ్చుటకే అనే విషయం స్పష్టము అవుతుంది. 

ఎందుకు మరల జన్మించాలి ? 

యేసు ప్రభువు  ఈ లోకంలో ఉండగా దేవుని రాజ్యం యొక్క గొప్ప తనాన్ని అందరికి ప్రకటించారు. ఆ రాజ్యంలో ప్రవేశించడానికి ఒక వ్యక్తి దేనినైన కోల్పోవడానికి సిద్ధంగా ఉంటాడు కాని ఆ రాజ్యం కావాలనికోరుకుంటాడు. దేవుని రాజ్యం అంటే అంతటి గొప్పది కనుక యేసు ప్రభువు చెప్పిన అనేక ఉపమానాలలో దాని విలువ తెలిసిన  వ్యక్తులు,  ఏమి కోల్పోయిన దానిని పొందుటకు ప్రయత్నిస్తారు. దేవుని  రాజ్యంలో ప్రవేశించడానికి ప్రధానమైన అర్హత నూతన జన్మను పొందాలి అని ప్రభువు చెబుతున్నారు. అందుకే ఈ నూతన జన్మ ముఖ్యమైనది. మానవుడు తన సొంత బలం ద్వారా ఈ నూతన జన్మను పొందలేడు, జీవించలేడు. దేవుని తోడ్పాటు ఎంతగానో అవసరం ఉంటుంది. ఇది పూర్తిగా హృదయ పరివర్తనతోనే మొదలవుతుంది, అందుకే ప్రభువు తన పరిచర్యలు మొదట హృదయ పరివర్తన పొందాలి అని చెబుతున్నారు. 

ఆత్మతో జన్మించువారు 

ఆత్మతో జన్మించువారిని ప్రభువు గాలితో పోల్చుతున్నారు. గాలి  ఎక్కడ నుండి వస్తుందో, ఎక్కడకు వెళుతుందో మనకు తెలియదు, అటులనే ఆత్మతో జన్మించువారు, లేక నూతన జన్మ పొందిన వారు, మారు మనసు పొందినవారు ఎలా ఉంటారో మనము చూస్తాము. వారి జీవితాల్లో ఉన్న మార్పు, వారి పరివర్తన మనకు కనపడుతునే ఉంటుంది, అంటే మనం ఆత్మను చూడము కానీ వారి జీవితంలో వచ్చే మార్పును బట్టి వారు నూతన జీవితం జీవిస్తున్నారు అని తెలుసుకొనవచ్చు. మగ్దలా మరియ, పౌలు వారి జీవితాలలో వచ్చిన మార్పును, జక్కయ్య జీవితంలో వచ్చిన మార్పును మనం చూసినప్పుడు వారు, హృదయ పరివర్తన చెందారు అని , నూతన జీవితం వారు జీవిస్తున్నారు అని మనము తెలుసుకుంటాము. ఆత్మ ద్వారా జన్మించిన వారి జీవితాలలో కూడా ఈ మార్పును మనం చూడవచ్చు. ఆత్మ ఫలాలు వారి జీవితాల్లో సుష్పష్టంగా కనిపిస్తాయి.  వారు పాపమునకు బానిసలుగా కాక స్వతంత్రంగా జీవిస్తారు. 

యేసు ప్రభువు ఎదుట నికోదేము సందేహంను వేలిబుచ్చుట 

యేసు ప్రభువు ఆత్మ వలన జన్మించుటకు గురించి చెప్పిన తరువాత నీకొదేము ఇది ఎలా సాధ్యము అని అడుగుతున్నాడు. ప్రభువు అతనికి అది క్రొత్త విషయము ఏమి కాదు అని తెలియజేస్తూనే, నీవు బోధకుడివి కదా! ఈ విషయం తెలియదా అని అడుగుచున్నాడు. పాత నిబంధనలలో కూడా మనం మారు మనస్సు గురించి వింటాము. మరి ఎందుకు వీరు అవి ఏమి తెలియక ఉన్నారు అంటే వారు ఎప్పుడు ఈ లోక విషయాలు, మరియు స్వార్ధ పూరిత ఆలోచనలతో ఉన్నారు. కానుక అనేక దైవ విషయాలు, దైవ జ్ఞానం గురించి అజ్ఞానములో ఉన్నారు. దైవ జ్ఞానము కోసం మనము ఎంతగానో శ్రమించాలి.  ఆయనను వేదకాలి అటువంటి  వారికి ప్రభువు ఆ జ్ఞానమును ఇస్తారు. 

పరలోక విషయాల గురించి యేసు ప్రభువు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే ఆయన మాత్రమే పరలోకం నుండి వచ్చినవారు. ఆయనే చెప్పేవి మాత్రమే ప్రామాణికం, అటువంటి వాటి గురించి జ్ఞానము కావాలి అంటే ప్రభువుని మాటలను వినాలి. ప్రభువును విశ్వసించాలి, ప్రభువు చెప్పినట్లు చేయాలి. కాని అనేక సార్లు ప్రభువుని మాటలను మనం పెడచెవిన పెట్టి పరలోక జ్ఞానమును పోగొట్టుకుంటున్నాము. నికోదేముతో ప్రభువు అంటున్నారు మేము చూచిన విషయాలను చెప్పిన మీరు నమ్ముటలేదు అని. అంటే మనం కొన్ని సార్లు ఎంతో కరుడుగట్టిన హృదయాలు కలిగిన వారిగా ఉంటున్నాము. ప్రభువు మాత్రమే పరలోకము నుండి వచ్చినవాడు మరియు తిరిగి పరలోకమునకు వెళ్లినవాడు. ఆయనకు పోయిన చోటుకు వెళ్ళుటకు ఆయనను మాత్రమే అనుసరించాలి. 

యేసు ప్రభువు ఎత్తుబడుట 

పాత నిబంధనలో దేవునికి మాటకు ఎదురుతిరిగిన వారు పాము కాటుకు గురయ్యి మరణిస్తుంటే, మోషే దేవునికి మొరపెట్టగా, వారిని  రక్షించుటకు మోషేతో దేవుడు ఒక కంచు సర్పము తయారు చేసి దానిని చూచిన వారు రక్షించబడ్డారు. అటులనే పాపం చేసిన మానవుని రక్షించడానికి ప్రభువు సిలువ మీద మరణించారు. ఇది ప్రభువును విశ్వసించువారు అందరు నిత్య జీవం పొందుటకు ఆయన సిలువ మీద మరణించారు. మనందరికీ  ఆయన నిత్య జీవాన్ని సాధ్యం చేశారు. 

ప్రార్ధన: ప్రభువా! మీరు నికోదేముతో మరల జన్మించుట యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. ప్రభువా మీ మాటలు విని అనేక మంది పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుటకు దేనిని కోల్పోవడానికి అయినా సిద్ధపడ్డారు. నేను కూడా నా జీవితాన్ని మార్చుకొని, నూతన హృదయం కలిగి జీవించి, మిమ్ములను అనుసరించి మీరు నా కోసం మరణించి, నాకు సాధ్యం చేసిన ఆ నిత్యజీవాన్ని పొందే అనుగ్రహం చేయండి. ఆమెన్ 

27, ఏప్రిల్ 2025, ఆదివారం

నీటివలన ఆత్మ వలన నూతన జీవం


యోహాను 3:1-8


పరిసయ్యులలో నికోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండెను. అతడు ఒకరాత్రి యేసు వద్దకు వచ్చి "బోధకుడా! నీవు దేవుని యొద్దనుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. ఏలయన, దేవునితోడు లేనియెడల నీవు చేయుచున్న అద్భుత సూచకక్రియలను ఎవడును చేయలేడు" అని పలికెను. యేసు అందుకు అతనితో, "మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." అని పలికెను అందుకు నికోదేము, "వృద్ధుడైన మనుష్యుడు మరల ఎటుల జన్మింపగలడు? అతడు తల్లిగర్భమున రెండవ పర్యాయము ప్రవేశించి జన్మింపగలడా?" అని అడిగెను. అపుడు యేసు,"ఒకడు నీటివలన, ఆత్మవలన జన్మించిననేతప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరములముగ జన్మించినది శరీరమును, ఆత్మమూలముగ జన్మించినది ఆత్మయునైయున్నది. నీవు మరల జన్మింపవలయునని  నేను  చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనటుల వీచును. నీవు దాని శబ్దమును వినెదవే కాని అది ఎక్కడనుండి వచ్చునో, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును" అనెను. 

వెలుగు దగ్గరకు వచ్చుట 

  
యేసు ప్రభువు వద్దకు నికోదేము రాత్రి వేళ వస్తున్నాడు. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటి అంటే నికోదేము ఒక పరిసయ్యుడు, మరియు బోధకుడు. ఒక బోధకుడు మరియు పరిసయ్యుడు అయిన వ్యక్తి యేసు ప్రభువు దగ్గరకు వస్తున్నారు అంటే బోధకులు మరియు పరిసయ్యులు అతనిని తక్కువ చేసి చూడవచ్చు, లేక ప్రభువుతో మాటలాడి ఆయనను అంగీకరిస్తే ఖచ్చితముగా నికోదేము ఇతర వారితో అవమానింప బడవచ్చు. అందుకే కాబోలు నికోదేము ఎవరి కంట పడకుండ రాత్రి వేళ వచ్చి ఆతనికి ప్రభువు చెప్పేదేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలని వచ్చి ఉండవచ్చు. ఇక్కడ రాత్రి వేళ ప్రభువు దగ్గరకు రావడం అంటే చీకటి నుండి వెలుగు దగ్గరకు రావడం. ప్రభువు అనేక సార్లు నేనే వెలుగు అని చెబుతారు. ఇప్పుడు నికోదేము చీకటిని వదలి వెలుగు దగ్గరకు వచ్చి తనలో ఉన్న అంధకారాన్ని మొత్తంను వెలుగుతో నింపుకొనుటకు అవకాశము వచ్చి నందున దానిని పూర్తిగా వినియోగించుకొంటున్నాడు. తనలో ఉన్న ప్రతి అనుమానాన్ని ప్రభువు ముందు వెల్లడిచేస్తున్నాడు. 

ప్రభువు గొప్పతనాన్ని  ఒప్పుకొనుట 


నికోదేము స్వయంగా బోధకుడు కనుక అతనికి దేవుని గురించి దైవ జ్ఞానము గురించి అవగాహన ఉంది. యేసు ప్రభువు మాటలు విన్నప్పుడు అతనిలో ఉన్న దైవ అన్వేషణ, ప్రభువు వద్ద నుండి ఇంకా  దేవుడిని గురించి తెలుసుకోవాలనే కోరిక ఎక్కువ అయ్యింది. ప్రభువు ఎక్కువగా దేవుని రాజ్యం గురించి బోధిస్తున్నారు. మానవుడు ఏమి హెచ్చించి అయ్యిన ఆ దైవ రాజ్యం పొందాలనే కోరిక ఎక్కువైంది, మరియు తనలో ఉన్న కొన్ని అనుమానాలు కూడా తీర్చుకోవాలి అని అనుకున్నాడు. ప్రభువు దగ్గరకు వచ్చి బోధకుడా నీకు దేవుని నుండి వచ్చిన వాడివని మాకు తెలుసు, లేనిదే ఈ అద్భుత కార్యములు ఎవరు చేయలేరు అని చెబుతున్నారు. ఎందుకంటే ప్రభువు చేచేసిన అద్భుతాలు సాధారణమయినవి కావు.  ఆయన పకృతి మీద, లోకం మీద జీవరాశుల మీద తన ఆధిపత్యాన్నే కాక ఎలా ఒక దానిని సహజ సిద్ద స్వభావాలు కూడా మార్చ గలిగాడో తెలుసుకున్నాడు. కనుకనే ఎవరు దేవుని నుండి రాకపోతే మీలా చేయజాలరు అని ప్రకటిస్తున్నాడు. 


నీటివలన ఆత్మవలన పుట్టుట 


యేసు ప్రభువును నికోదేము నీవు దేవుని నుండి వచ్చావు అని ప్రకటించిన తరువాత ప్రభువు నీకొదేముతో ఏ విధంగా  దేవుణ్ణి చేరవచ్చు, అతనితో ఉండవచ్చు, అతనిని పొందవచ్చు అనే విషయాన్ని ప్రకటిస్తున్నాడు. అది ఎలా అంటే "మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." అని ప్రభువు పలుకుతున్నాడు. దానికి నీకొదేము మరల జన్మించడము అంటే తల్లి గర్భంలోనికి ప్రవేశించి పుట్టడం ఎలా అని అనుకుంటున్నాడు. దానికి ప్రభువు మనిషి మరల జన్మించడం అంటే నీటి వలన ఆత్మ వలన అని చెబుతున్నాడు. నీరు పరిశుద్దతను సూచిస్తుంది. మనిషి తన మలినాన్ని కడుగుకొనవలెను అని చెబుతుంది. ఇది జ్ఞానస్నానమును సూచిస్తుంది. అందుకే ప్రభువు తన శిష్యులతో మీరు వెళ్లి పిత, పుత్ర, పవిత్రాత్మ పేరిట జ్ఞానస్నానము ఇవ్వమని చెబుతున్నారు. ఆత్మ జీవాన్ని ఇస్తుంది, జీవాన్ని నిలుపుతుంది. దేవుని ఆత్మ మాత్రమే మనకు  నూతన జీవితాన్ని ఎప్పుడు పడిపోకుండా ఉంచుతుంది.  

ఆత్మను గుర్తించగలుగుట 


ఆత్మను ప్రభువు గాలితో  పోల్చుతున్నాడు. గాలిని మనం అనుభవించగలము కాని అది ఎక్కడ నుండి వస్తున్నదో, ఎక్కడకు వెళ్తుందో మనకు తెలియదు అటులనే ఆత్మ నుండి పుట్టినవాని జీవితంలో వచ్చిన మార్పును మనము గుర్తించగలం, ఎందుకంటే వారి జీవితం అంతలా మారిపోతుంది. మనము కూడా ప్రభువు చెబుతున్న ఆ దేవుని రాజ్యంలో చేరుటకు, మరల జన్మించుటకు బాప్తిస్మము పొందియున్నాము. నూతన జీవితము జీవించుటకు ఎప్పుడు సిద్ధముగా ఉండాలి. 

ప్రార్ధన: ప్రభువా ! మీ వద్దకు రావడం అంటే వెలుగు దగ్గరకు రావడమే, జీవం వద్దకు రావడమే, మీజీవితంలో అనేక అంధకార శక్తులు ఉన్నవి వాటి అన్నింటిని వదలి మీ దగ్గరకు రావడానికి, మరియు మీరు చెబుతున్న ఆ దైవ రాజ్యంలో స్థానము పొందుటకు సహాయం చేయండి. నిజమైన సంపదను తెలుసుకొని, దాని కోసం పాటుపడేలా చేయండి. జ్ఞానస్నానం పొందిన మీ అనుచరులుగా జీవించ శక్తిని దయచేయండి. ఆమెన్ 





26, ఏప్రిల్ 2025, శనివారం

యేసు ప్రభువు దర్శనములు

మార్కు 16: 9-15

ఆదివారము ప్రాతఃకాలమున పునరుత్తానుడైన యేసు, తాను ఏడూ దయ్యములను వెళ్లగొట్టిన మగ్ధలా మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను. ఆమె వెళ్లి ఆయనతో  ఉండినవారును, దుఃఖసాగరంలో మునిగియున్న ఆయన శిష్యులకును ఈ సమాచారమును అందచేసెను. ఆయన జీవించి ఉన్నాడనియు, ఆమెకు దర్శనమిచ్చెననియు విని వారు నమ్మరైరి. పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్లుచున్న ఇద్దరు శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చెను. వారు ఇద్దరు తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయమును తెలియపరచిరి. కానివారు నమ్మలేదు. తదుపరి పదునొకండుగురు శిష్యులు భోజనము చేయుచుండగా, యేసు వారికి ప్రత్యక్షమై, సజీవుడై లేచివచ్చిన తనను చూచిన వారి మాటలను కూడ  నమ్మనందున వారి అవిశ్వాసమునకును, హృదయకాఠిన్యముకును వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను: "మీరు ప్రపంచ మందంతట తిరిగి, సకలజాతి జనులకు సువార్తను బోధింపుడు.   

ఈ వచనాలు యేసు ప్రభువు పునరుత్థానము నిద్ధారణము మరియు శిష్యులకు ఓదార్పును తెలియజేస్తూ, వారు చేయవలనసిన కర్తవ్యము గురించి తెలియజేస్తున్నాయి. ఈ దర్శనములు వారిలో ఉన్న అపనమ్మకమును తీసివేయుటకు ఆయన సువార్తను బోధించుటకు వారిని మరల ప్రభువు ప్రోత్సహిస్తున్నాడు. 

మగ్ధలా మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను

యేసు ప్రభువు మొదటగా ఒక స్త్రీకి దర్శనము ఇస్తున్నాడు. యూదయ సమాజంలో, మరియు యేసు ప్రభువు కాలములో ఒక స్త్రీకి సమాజంలో అంతటి ప్రాముఖ్యత ఉండేది కాదు. మరియు ఈ మరియమ్మ నుండి ప్రభువు దయ్యములను వదలకొట్టాడు. ప్రభువు మనకు దర్శనము ఇవ్వడడానికి మన గత జీవితం ఏమిటి? మనకు సమాజం ఇచ్చే ప్రాముఖ్యత ఏమిటి? అనేవి ఏమి ప్రభువు పరిశీలించరు. మనకు ప్రభువు మీద చూపించిన ప్రేమకు కృతజ్ఞత కలిగిఉంటే చాలు. ఆయన మనము మరచిపోలేని మేలులను మనకు చేస్తారు. అంతేకాక మనలను ప్రత్యేక వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు. అనేక మందికి ఆదర్శవంతులుగా తయారుచేస్తారు. ఈ మరియమ్మ అనేక బంధనాలనుండి విముక్తి పొందింది. ప్రభువు మాటలకు అణువుగా మనం ఉంటే మన జీవితం కూడా ఎటువంటి లోక శక్తులకు బానిసలు కాకుండా ఎల్లప్పుడు స్వతంత్రులుగా జీవించగలుగుతాం. 

ప్రభువు దర్శనం గురించి నమ్మక పోవుట 

దుఃఖంలో ఉన్న శిష్యులకు ప్రభువు ఓదార్పు ఇవ్వడానికి ఎంతగానో వారికి అనేక పర్యాయాలు కనబడుతున్నప్పటికీ శిష్యులు నమ్మలేదు. వారికి నమ్మకము కలుగక పోవడానికి కారణం పకృతి విరుద్ధంగా ఉన్న మరణం నుండి లేవడం అనేది నమ్మదగినదిగ లేకపోవడం. అంతేకాక ప్రభువే ఇటువంటివి చేశారు. ఆయనే మరణించిన తరువాత ఎవరు అలా చేయగలరు? అనేక ప్రశ్నలు వారిలో ఉన్నవి. వీరిలో ఉన్న ఈ భయాలు మరియు యేసు ప్రభువు చెప్పిన మాటలు నేను మూడవ రోజున తిరిగి లేస్తాను అని చెప్పిన మాటలు ఆసరాగా తీసుకొని ఎవరైన పుకార్లు పుట్టిస్తున్నారు అనే అనుమానాలు ఇవాన్నీ శిష్యులలో ఉండవచ్చు అందుకే వారు అన్నింటిని నమ్మలేని పరిస్థితుల్లో లేరు. 

 ఇద్దరు శిష్యులకు దర్శనం 

యేసు ప్రభువు గ్రామమునకు వెళుతున్న ఇద్దరు శిష్యులకు దర్శనం ఇస్తున్నారు. లూకా సువిశేషంలో ఎమ్మావు వెళుతున్న ఇద్దరు శిష్యులు అని మనం చదువుతాం. ప్రభువు వారితో మాట్లాడుతున్న సమయంలో వారు ప్రభువును గుర్తించలేకపోయారు. తరువాత రొట్టెను విరిచి ఇస్తున్నప్పుడు వారు ప్రభువును గుర్తించారు. అనేక సార్లు ప్రభువు మనతో ఉన్నప్పుడు మనము ప్రభువును గుర్తించలేపోతున్నాము కారణము కేవలం ప్రభువుకు సంబంధించిన విషయాలలో మనం ప్రేక్షకులుగా మాత్రమే ఉంటున్నాము. ప్రభువుతో వ్యక్తిగతంగా సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఇద్దరు శిష్యులు కూడా ప్రభువు వారికి దర్శనము ఇచ్చిన విషయం గురించి ఇతర శిష్యులకు చెప్పినప్పుడు వారు నమ్మలేదు.  శిష్యులు ఏక్కువ నమ్మనది వారికి స్వయంగా  ప్రభువు ఇచ్చిన దర్శనమును. వారు స్వయనుభవంకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రభువు మాత్రము మనకు ఇతరుల సాక్ష్యంను కూడా నమ్మమని చెబుతున్నారు. 

ప్రభువుని సందేశం 

యేసు ప్రభువు పదకొండు మంది శిష్యులకు దర్శనము ఇచ్చి వారి అవిశ్వాసమును ఖండించారు. యేసు ప్రభువు వారి హృదయ కాఠిన్యము, అవిశ్వాసమును  గద్దించారు. హృదయ కాఠిన్యము చాల మందిలో పెరుగుతున్నది. హృదయ కాఠిన్యము పెరిగినప్పుడు మనము దేనికి స్పందించము. ఇతరుల అవసరములలో ఉన్న , కష్టాలలో ఉన్నా నాకు ఎందుకులే? అనే ధోరణిలో ఉంటాము.  క్రీస్తు అనుచరులలో ఉండకూడనిది ఈ హృదయ కాఠిన్యము.  అందుకే దేవుడు యిస్రాయేలుకు వారి రాతి గుండెను తీసి మాంసంతో కూడిన హృదయము వారికి ఇస్తాను అని చెప్పినది. క్రైస్తవుల హృదయం ఎప్పుడు ప్రభువు వలె ఇతరుల జీవితాలు చూసినప్పుడు వారి సమస్యలు , లేక సౌఖ్యాల అనుకూలంగా స్పందించ కలగాలి. ప్రభువు వారితో సకల జాతి జనులకు సువార్తను ప్రకటించండి అని చెబుతున్నాడు. శిష్యులకు ఉన్న ప్రధాన లక్ష్యం సువార్తను ప్రకటించడం. ఎందుకు ఇది ప్రధానమైన లక్ష్యం అంటే ప్రభువు ఇచ్చే రక్షణ అందరికి, కేవలం ఒక జాతి, ప్రాంతం, వర్గమునకు మాత్రమే చెందినది కాదు. ఆ విషయం ఈ శిష్యుల ప్రపంచమంతట తిరిగి అందరికి తెలియజేస్తూ, వారు సాక్ష్యం ఇవ్వాలి. ఈ సాక్ష్యం ఇతరుల అనుభవాలు మాత్రమే కాక వారు కూడా స్వయంగా ప్రభువును పునరుత్థానం అయిన తరువాత చూసారు, విన్నారు మరియు ఆయన నుండి వారి కర్తవ్యము ఏమిటో తెలుసుకున్నారు. వీరు మాత్రమే కాక ప్రభువును తెలుసుకున్న వారు అందరు ఈ కర్తవ్యము కలిగివున్నారు. వారు అందరు ఆయనను ప్రకటించవలసి బాధ్యత ఉంది. 

ప్రార్థన : ప్రభువా! మీరు ఈ లోకమున ఉండగా అనేకమందిని   పాపము నుండి సాతాను బంధనముల నుండి  విముక్తిని కలిగించారు. అదేవిధంగా వారిని స్వతంత్రులనుచేశారు. మీరు చూపించిన కరుణకు స్పందిస్తూ,  మంచి జీవితం జీవించిన వారిని మీరు అనాధారం చేయలేదు. మగ్ధలా మరియమ్మకు దర్శనము ఇవ్వడం, శిష్యులకు దర్శనం ఇవ్వడం, ఇవాన్నీ మీరు మమ్ములను  విడిచిపెట్టడం లేదు అని తెలుపుతున్న, మిమ్ములను నమ్మడంలో, విశ్వసించడంలో  అనేకసార్లు విఫలం చెందుతున్నాం. దానికి మాకు ఉన్న అనేక భయాలు కారణం అయ్యివుండవచ్చు. ప్రభువా! మీరు మాతో ఎప్పుడు ఉంటారు అనే విషయాన్ని తెలుసుకొని,  మీరు ప్రసాధించిన రక్షణ అందరికి అని, మీ సువార్తను ప్రకటించే భాద్యత, మాకు ఇచ్చినందుకు కృతఙ్ఞతలు, మీ సువార్తను ఇతరులకు ప్రకటించుటకు కావలసిన అనుగ్రహము దయచేయండి. ఆమెన్. 

12, ఏప్రిల్ 2025, శనివారం

మ్రానికొమ్మల ఆదివారము


యెషయా 50:4-7
ఫిలిప్పీ 2:6-11
లూకా 22:14-23:56
             ప్రియ సహోదరి సహోదరులరా ఈ రోజు మనకు ఎంతో ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే ఈ ఆదివారంతో పాటు మనమందరము పవిత్ర వారంలోనికి ప్రవేశించబోతున్నాము. అదేవిదంగా ఈ యొక్క వారమును మ్రానికొమ్మల ఆదివారంగా కొనియాడుతున్నాము. ఈ నాటి మూడు పఠనలు మనకు సేవకుని యొక్క జీవితం గురించి తెలియజేస్తున్నాయి. మొదటి పఠనములో సేవకునికి ఎన్ని బాధలు వచ్చిన కూడా దేవునిపై నమ్మకాన్ని కోల్పోకూడదు అని తెలియజేస్తున్నది. రెండొవ పఠనములో ఎన్ని బాధలు వచ్చిన కూడా మనలను మనం తగ్గించుకొని జీవించాలని తెలియజేస్తుంది. చివరిగా సువిశేషములో బాధలను అనుభవించుటకు మనలను మనం సిద్ధం చేసుకోవాలని ఆహ్వానిస్తుంది. ఎందుకంటే లూకా 22:42 లో మనం చూస్తున్నాము బాధలను అనుభవించుట లేక తొలగించుట దేవుని చిత్తానికి వదిలివేయాలని నేర్పిస్తుంది.
           అసలు బాధలు అంటే ఏమిటి అని మనం గ్రహించినట్లయితే. బైబిల్‌లో బాధలకు సంబంధించిన అనేక వచనాలు ఉన్నాయి, ఇవి మనకు ఓదార్పును, ఆశను, ప్రోత్సాహాన్ని అందిస్తాయి. బాధలు మానవుని జీవితంలో ఒక భాగమని, దేవుడు మనతో ఉంటాడని ఈ వచనాలు మనకు గుర్తుచేస్తాయి.
బాధలకు అర్థం ఏంటి అని మనం గ్రహించినట్లయితే బైబిల్ ప్రకారం, బాధలు అనేక కారణాల వల్ల వస్తాయి. అవి మన పాపాల ఫలితంగా, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, లేదా దేవుని మహిమ కోసం రావచ్చు. బాధలు మనలను దేవునికి దగ్గర చేయడానికి, మన పాత్రను అభివృద్ధి చేయడానికి, ఇతరులను ఓదార్చడానికి ఉపయోగపడతాయి.
     మరి ముఖ్యముగా కార్మెలైట్ సభ పునీతులు బాధల గురించి అనేక విషయాలు చెబుతున్నారు, ముఖ్యంగా బాధలు దేవునితో ఐక్యమయ్యేందుకు, ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు, ఇతరులకు సహాయపడేందుకు ఒక మార్గమని వారు భావించారు. పునీత అవిలాపురి తెరెసమ్మ  గారు  బాధలు దేవుని ప్రేమను అనుభవించడానికి ఒక మార్గమని, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక అవకాశమని బోధించింది. పునీత సిలువ యెహాను గారు బాధలు ఆధ్యాత్మిక శుద్ధికి ఒక మార్గమని, దేవునితో ఐక్యమయ్యేందుకు సహాయపడతాయని బోధించాడు. అంతే కాకుండా బాధలు స్వర్గంలో శాశ్వత ఆనందానికి దారితీస్తాయని బోధిస్తున్నారు. పునీత ఎలిజబెత్ ఆఫ్ ది ట్రినిటీ బాధలలో దేవుని సన్నిధిని అనుభవించాలని, ఆయన ప్రేమపై నమ్మకం ఉంచాలని బోధించింది. పునీత చిన్న తెరెసమ్మ గారు అంటున్నారు చిన్న చిన్న బాధలను కూడా దేవునికి అర్పించాలని, వాటి ద్వారా ఆయన ప్రేమను చాటాలని ప్రోత్సహించిచరు. కార్మెలైట్ పునీతులు బాధలను సహనంతో, విశ్వాసంతో ఎదుర్కోవాలని బోధించారు. పునీత ఎడిత్ స్టెయిన్  గారు బాధలలో క్రీస్తును అనుసరించాలని, ఆయన బాధలలో పాల్గొనాలని బోధించింది. 
        ముందుగా మొదటి పఠనములో యెషయా 50:4-7 బాధపడుతున్న సేవకుని గురించి మాట్లాడుతుంది. అతను దేవుని మాటలను వింటాడు, ప్రజలను ఓదార్చడానికి నేర్చుకుంటాడు, బాధలను సహిస్తాడు. బాధలు ఎదురైనప్పుడు దేవునిపై నమ్మకం ఉంచడానికి, ఆయన వాక్యానికి విధేయత చూపడానికి మనలను ప్రోత్సహిస్తాయి.
      రెండొవ పఠనములో ఫిలిప్పీయులు 2:6-11 క్రీస్తు యొక్క  వినయం, త్యాగం గురించి మాట్లాడుతుంది. దేవుని రూపంలో ఉన్నప్పటికీ, ఆయన మనలాంటి మానవునిగా అవతరించాడు. ఆయన తనను తాను తగ్గించుకొని, సిలువ మరణం వరకు విధేయుడయ్యాడు. అందుకు దేవుడు ఆయనను అత్యంత ఉన్నత స్థితికి హెచ్చించాడు, ప్రతి మోకాలు ఆయన ముందు వంగుతుంది తెలియజేస్తున్నాయి. ఈ వచనాలు మనలో వినయం, త్యాగం, దేవునికి విధేయత కలిగి ఉండాలని బోధిస్తాయి.
లూకా 22:14-23:56 యేసుక్రీస్తు యొక్క చివరి భోజనం, పట్టుబడటం, విచారణ, సిలువ మరణం గురించి చెబుతుంది. యేసు తన శిష్యులతో చివరి భోజనం చేస్తూ, తన త్యాగం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. ఆయనను పట్టుకొని, విచారించి, సిలువ వేయబడ్డాడు. యేసుక్రీస్తు బాధలు, మరణం మన పాపాలకు ప్రాయశ్చిత్తం అని తెలియజేస్తున్నాయి. 
           కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా ఈ మూడు పఠనలు బాధలు అనేవి జీవితంలో ఒక భాగమని, కానీ దేవుడు మనతో ఉంటాడని చూపిస్తాయి. ఎందుకంటే యేసుక్రీస్తు బాధలు మనకు ఆశను కలిగిస్తాయి, ఎందుకంటే ఆయన మన బాధలను అర్థం చేసుకుంటాడు, మనలను ఓదార్చగలడు. బాధలు అనేవి మన విశ్వాసాన్ని పరీక్షించగలవు, కానీ అవి మనలను దేవునికి దగ్గర చేస్తాయి. బాధల సమయంలో, మనం దేవునిపై నమ్మకం ఉంచాలి, ఆయన వాక్యానికి విధేయత చూపాలి, క్రీస్తు యొక్క ఉదాహరణను అనుసరించాలి.
Fr. Johannes OCD 
  ‌ 

5, ఏప్రిల్ 2025, శనివారం

ఐదవ తపస్సుకాలపు ఆదివారము

ఐదవ తపస్సుకాలపు ఆదివారము 
యెషయా 43:16-21 ఫిలిప్పీయులు 3: 8-14
 యోహాను 8:1-11
క్రీస్తునాధునియందు ప్రియమైన క్రైస్తవ విశ్వాసులరా. మనం ఇప్పుడు తపస్సుకాలపు చివరి రోజులలోకి ప్రవేశిస్తున్నాము, అంటే తపస్సుకాలపు ఐదవ ఆదివారం జరుపుకుంటున్నాము. నేటి మూడు పఠనలు కూడా మనల్ని, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ముఖ్యమైన పాఠాలను అందిస్తున్నాయి. మనం క్రీస్తును తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, దేవునిపై విశ్వాసం ఉంచాలి, మరియు ఇతరులను క్షమించాలి. దేవుడు మనకు ఎల్లప్పుడూ కొత్త ఆశను మరియు కొత్త ప్రారంభాలను అందిస్తాడు.
దేవుని దయ మరియు ఆయన క్షమాపణ శక్తిని అనుభవించమని పిలుస్తున్నాయి.
           ఈ నాటి మొదటి పఠనములో యెషయా 43:16-21, యెషయా ప్రవక్త ఇశ్రాయేలీయులకు దేవుని శక్తివంతమైన కార్యాలను గుర్తుచేస్తాడు, ముఖ్యంగా ఎర్ర సముద్రాన్ని దాటించడం. అయితే, దేవుడు గతంలో చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని, వారు దానిని చూడాలని చెబుతున్నాడు. ఆయన అరణ్యంలో మార్గాలను, ఎడారిలో నదులను సృష్టించి, తన ప్రజలకు కొత్త ఆశను ఇస్తాడు. ఈ లేఖనం దేవుడు ఎల్లప్పుడూ కొత్త కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని, మనం ఆయనపై విశ్వాసం ఉంచాలని గుర్తుచేస్తుంది.
ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన అంశాలను గురించి చూడవచ్చు. అవి ఏమిటంటే * గత కార్యాల స్మరణ: దేవుడు తన ప్రజలకు గతంలో చేసిన అద్భుతాలను గుర్తుచేస్తాడు.
 * క్రొత్త కార్యాలు: దేవుడు గతంలో చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
 * అరణ్యములో మార్గము, ఎడారిలో నదులు: దేవుడు అసాధ్యమైన పరిస్థితులలో కూడా మార్పు తీసుకురాగలడు.
 * దేవుని విశ్వాసం: దేవునిపై విశ్వాసం ఉంచమని ప్రోత్సహిస్తుంది. ఈనాటి మొదటి పఠనము.
          రెండొవ పఠనములో  ఫిలిప్పీయులకు 3:8-14 అపొస్తలుడైన పౌలు  క్రీస్తును తెలుసుకోవడం యొక్క అత్యున్నత విలువను గురించి మాట్లాడుతాడు. గతంలో తనకు విలువైనవిగా భావించినవన్నీ క్రీస్తుతో పోలిస్తే వ్యర్థమైనవిగా భావిస్తాడు.
      అంతే కాకుండా పౌలు తన జీవితంలో క్రీస్తును తెలుసుకోవడం కంటే మరేదీ గొప్పది కాదని ప్రకటిస్తాడు.
   * అతను తన గత విజయాలు, నేపథ్యం, మరియు ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండటం వంటి వాటిని క్రీస్తుతో పోలిస్తే "పెంట"గా పరిగణిస్తాడు.
             క్రీస్తుతో ఐక్యత కోసం ప్రయత్నం: పౌలు క్రీస్తుతో ఐక్యతను సాధించడానికి, ఆయనను పోలి ఉండటానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. అతను క్రీస్తు యొక్క నీతిని పొందాలని కోరుకుంటాడు, ఇది ధర్మశాస్త్రం ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా వస్తుంది.
         గతానికి వీడ్కోలు, భవిష్యత్తుపై దృష్టి:  పౌలు తన గత జీవితాన్ని, విజయాలను విడిచిపెట్టి, భవిష్యత్తుపై దృష్టి సారిస్తాడు. అతను గురి యొద్దకే పరుగెత్తుచున్నాను అని చెబుతాడు, ఇది క్రీస్తులో తన పిలుపు యొక్క బహుమానం కోసం అని రెండొవ పఠనము తెలియజేస్తుంది.
          చివరిగా సువిశేష పఠనములో యోహాను 8:1-11 యేసు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒక స్త్రీని న్యాయాధిపతుల నుండి రక్షించిన సంఘటనను వివరించబడింది.
 * పరిసయ్యుల మరియు శాస్త్రుల కుట్ర: పరిసయ్యులు మరియు శాస్త్రులు యేసును పరీక్షించడానికి ఒక వ్యభిచారిణిని ఆయన ముందు నిలబెడతారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెకు రాళ్లతో కొట్టి చంపే శిక్ష విధించాలని వారు యేసును అడుగుతారు. వారు యేసును ఇరుకున పెట్టాలని చూస్తారు, ఆయన ధర్మశాస్త్రాన్ని సమర్థిస్తే, ఆయన కఠినమైన న్యాయాధిపతిగా కనిపిస్తాడు, లేకపోతే ఆయన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది.
 * యేసు యొక్క జ్ఞానం మరియు కరుణ: యేసు నేలపై వ్రాస్తూ, మీలో పాపం లేనివాడు మొదట ఆమెను రాళ్లతో కొట్టవచ్చు అని అంటాడు. ఈ మాటలు విన్న వారందరూ ఒక్కొక్కరుగా అక్కడి నుండి వెళ్లిపోతారు, వారి స్వంత పాపాలను గుర్తుచేసుకుంటారు. యేసు స్త్రీ పట్ల కరుణ చూపిస్తాడు, ఆమెను ఖండించకుండా, "నేను కూడా నిన్ను శిక్షించను; ఇకనుండి పాపం చేయకు" అని చెప్పి ఆమెను పంపివేస్తాడు.
 * దేవుని క్షమాపణ మరియు కొత్త ప్రారంభం: యేసు స్త్రీకి క్షమాపణను అందిస్తాడు మరియు ఆమెకు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవకాశం ఇస్తాడు. ఈ సంఘటన దేవుని క్షమాపణ మరియు కరుణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇది మనందరం పాపులమేనని, ఇతరులను తీర్పు తీర్చడానికి మనకు హక్కు లేదని గుర్తుచేస్తుంది.
 * యేసు యొక్క బోధన: ఈ సంఘటన ద్వారా, యేసు క్షమాపణ, కరుణ మరియు స్వీయ-పరిశీలన యొక్క ప్రాముఖ్యతను బోధిస్తాడు. ఇతరులను తీర్పు తీర్చడానికి ముందు, మన స్వంత లోపాలను పరిగణించాలని ఆయన మనకు బోధిస్తాడు.
ఈ సంఘటన దేవుని ప్రేమ, క్షమాగుణం మరియు మానవత్వం యొక్క శక్తివంతమైన ఉదాహరణ. ఇది మనకు క్షమాపణ యొక్క ప్రాముఖ్యతను, దేవుని కరుణను, మరియు కొత్త ప్రారంభాల ఆశను నేర్పుతుంది.
        కాబ్బటి ప్రియ దేవుని బిడ్డలరా ఈ మూడు పఠనములు మన ఆధ్యాత్మిక జీవితానికి మార్గనిర్దేశం చేస్తాయి. దేవుని ప్రేమ, క్షమాగుణం, మరియు కొత్త ఆశ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతాయి.
Fr. Johannes OCD 

29, మార్చి 2025, శనివారం

తపస్సు కాలపు నాలుగోవ ఆదివారం

తపస్సు కాలపు నాలుగోవ ఆదివారం
యెహోషువా 5:9-12
2 కొరింథి 5: 17-21
లూకా 15: 1-3, 11-32
                   క్రీస్తునాధునియందు ప్రియ విశ్వాసిని విశ్వాసులరా, ఈ నాడు మనమందరము కూడా తపస్సు కాలపు నల్గొవా ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాము. ఈ నాటి మూడు దివ్య గ్రంథ పఠనలను మనం ద్యానించినట్లయితే మూడు పఠనలు కూడా నూతన జీవితం యొక్క సందేశాన్ని మనకు అందజేస్తున్నాయి. 
              అసలు నూతన జీవితం అంటే ఏమిటి అని గ్రహించినట్లయితే పునీత అసిస్సిపురి ఫ్రాన్సిస్ వారు, అవిలాపురి తెరెసమ్మ గారు మరియు సిలవా యోహాను గారు ఈ విధంగా అంటున్నారు నూతన జీవితం అనేది: 
* నూతన జీవితం అనేది క్రీస్తు అడుగు జడలో నడవటం మరియు అయన ఉదాహరణలను అనుసరించడం, 
* నూతన జీవితం అంటే ప్రపంచంలోని భోగభాగ్యలకు దూరంగా ఉండటం మరియు నిరాడంబరమైన జీవితాన్ని గడపటం.
* నూతన జీవితం అంటే దేవుని సృష్టిలో సామరహస్యం జీవించడం మరియు దానిని సంరక్షించడం.
* నూతన జీవితం అంటే ఇతరులను నిస్వార్థంగా ప్రేమించటం మరియు అవసరాలను తీర్చుటకు సిద్ధంగా ఉండటం.
* నూతన జీవితం అంటే మన పాపాల నుండి వైదోలగడం మరియు దేవుని వైపు తిరగడం.
* నూతన జీవితం అంటే దేవునితో నిరంతరం సంభాసించటం మరియు అయన చిత్తని తెలుసుకొవడానికి ప్రయత్నించటం.
* నూతన జీవితం అంటే దేవునిపై పూర్తిగా నమ్మకం ఉంచడం మరియు అయన మార్గదర్శకత్వనికి లోబడి జీవిచడం.
* పునీత సిలువ యోహాను గారికి నూతన జీవితం అంటే మన కోరికలను మరియు అటాచ్మెంట్‌లను అధిగమించడం మరియు దేవునిపై మాత్రమే ఆధారపడటం.
* పునీత అవిలాపురి తెరెసమ్మ మరియు సిలువ యోహాను. వారిద్దరికి కూడా నూతన జీవితం అనేది నిరంతర ఆధ్యాత్మిక ప్రయాణం అని మరియు అది దేవుని ప్రేమలో మరింతగా ఎదగడానికి మనలను పిలుస్తుందని బోధించారు.
                యెహోషువ 5:9-12:
ఈ మొదటి పఠనములో ఇశ్రాయేలీయులు ప్రజలు వాగ్దాన భూమిలోకి ప్రవేశించిన తర్వాత జరిగిన ముఖ్యమైనటువంటి సంఘటన గురించి వివరించబడింది. ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు చేయబడని సున్నతి గిల్గాలులో చేయబడుతుంది. దీని అర్థం ఏమిటంటే, వారు ఐగుప్తు బానిసత్వం యొక్క కళంకాన్ని తొలగించుకున్నారు మరియు దేవుని ఎన్నిక చేసుకున్న నూతన ప్రజలుగా కొత్త ప్రారంభాన్ని పొందారు. దీని తర్వాత వారు మొదటిసారిగా ఆ దేశపు పంటను తిన్నారు మరియు అప్పటివరకు వారికి ఆహారంగా ఉన్న మన్నా అక్కడితోటి ఆగిపోయింది. ఈ సంఘటన మన జీవితాలకు ఒక గొప్ప గుణ పాఠాన్ని నేర్పుతుంది. మనం కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపం యొక్క బంధకాల నుండి విడుదల పొందుతాము. బాప్తిస్మం అనేది మన జీవితంలో ఒక నూతన ప్రారంభాన్ని మరియు నూతన జీవితాన్ని ప్రారాంబించటం సూచిస్తుంది. ఇకపై మనం పాత జీవితానికి చెందినవారం కాదు అని క్రీస్తునందు కొత్త సృష్టిగా జీవిస్తాము. దేవుడు మనకు అవసరమైన ప్రతిదాన్ని సరైన సమయంలో అందిస్తాడు. అరణ్యంలో మన్నాను అందించిన దేవుడే, వాగ్దాన భూమిలో పంటను కూడా అందించాడు. అదే విధంగా మనం ఆయనపై నమ్మకం ఉంచితే, మన అవసరాలను ఆయన తప్పకుండా తీరుస్తాడు అని ఈ నాటి మొదటి పఠనములో దేవుడు తెలియజేస్తున్నాడు.
            2 కొరింథీయులు 5:17-21:
ఈ రెండొవ పఠనములో క్రీస్తునందు  ఎవరైతే ఉంటారో వారి యొక్క నూతనత్వాన్ని మరియు దేవునితో సమాధానపడే అవకాశాన్ని గురించి మాట్లాడుతుంది. ఎవరైనా క్రీస్తునందు ఉంటే, వారు నూతన సృష్టి పునీత పౌలు గారు అంటున్నారు. అంటే మనలో ఉన్నటువంటివి పాతవి గతించిపోయి, ఇదిగో కొత్తవి వచ్చాయి ఇదంతా దేవుని ద్వారానే సాధ్యమైంది అంటు,  క్రీస్తు ద్వారా మనలను తనతో సమాధానపరచుకున్నాడు అని మరియు ఆ సమాధాన పరిచర్యను మనకు అప్పగించాడు. యేసు క్రీస్తు పాపం చేయకపోయినా, మన కొరకు పాపవిమోచకుడిగా చేయబడ్డాడు, తద్వారా మనం దేవుని నీతి బిడ్డలుగా తీర్చిదిద్దాబడ్డము. ఈ మాటలు మనకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తాయి. క్రీస్తునందు మనం కొత్త జీవితాన్ని ప్రారంభించగలము. దేవుడు మనలను తనతో సమాధానపరచుకోవడమే కాకుండా, ఇతరులను కూడా ఆయనతో సమాధానపరచడానికి మనలను రాయబారులుగా నియమించాడు. ఇది మనకు ఇవ్వబడిన గొప్ప నూతన అధ్యాద్మిక బాధ్యత.
                  లూకా 15:1-3, 11-32:
చివరికి సువిశేష పఠనములో యేసు చెప్పిన తప్పిపోయిన కుమారుని ఉపమానం గురించి ఇది దేవుని యొక్క అపారమైన ప్రేమను మరియు క్షమాపణను చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. చిన్న కుమారుడు తన తండ్రి ఆస్తిని తీసుకొని దూర దేశానికి వెళ్లి దుర్వ్యసనాలతో దానిని నాశనం చేసుకుంటాడు. చివరికి దిక్కులేని స్థితిలో తన తండ్రి వద్దకు తిరిగి వస్తాడు. తండ్రి అతన్ని చూసి జాలిపడి పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకుంటాడు మరియు ఘనంగా విందు ఏర్పాటు చేసి సంతోషిస్తాడు. అయితే పెద్ద కుమారుడు దీనిని చూసి అసూయపడతాడు. ఈ ఉపమానంలో తండ్రి దేవునికి, ఇద్దరు కుమారులు కూడా మానవులకు ప్రాతినిధ్యం వహిస్తారు. చిన్న కుమారుడు పాపంలో పడిపోయిన మరియు దేవునికి దూరమైన వ్యక్తిని సూచిస్తాడు. అతని పశ్చాత్తాపం మరియు తిరిగి రావడం అనేది దేవుని క్షమాపణను పొందడానికి అవసరమైన హృదయ మార్పును తెలియజేస్తుంది. తండ్రి యొక్క నిస్వార్ధమైన ప్రేమ మరియు క్షమాపణను మరియు దేవుని యొక్క కరుణను మరియు ఆయన పాపులను స్వీకరించే విధానాన్ని చూపిస్తుంది. పెద్ద కుమారుడు తమ నీతిని గూర్చి గర్వపడే మరియు ఇతరులను తక్కువగా చూసే వారిని సూచిస్తాడు. దేవుని ప్రేమ అందరికీ అందుబాటులో ఉంటుందని మరియు మనం ఇతరుల పశ్చాత్తాపం పట్ల సంతోషించాలి అని ఈ ఉపమానం మనకు నేర్పుతుంది. 
           కాబ్బట్టి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ప్రేమగలవాడు మరియు క్షమించేవాడు. ఆయన మనలను పాపం యొక్క బంధకాల నుండి విడిపించడానికి, మనకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి మరియు తనతో సమాధానపరచుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయనపై విశ్వాసం ఉంచాలి, మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడాలి మరియు ఆయన ప్రేమను ఇతరులతో పంచుకోవాలి అప్పుడే మనం ఒక నూతన సృష్టిగా లేకపోతే నూతన వ్యక్తులుగా పరిగనింపబడతాము. మరి అటువంటి దీవెనలకొరకై మనమందరము ఈ బలి పూజలో ప్రార్దించుకుందాము.

22, మార్చి 2025, శనివారం

తపస్సు కాలపు మూడవ ఆదివారము

తపస్సు కాలపు మూడవ ఆదివారము 

నిర్గమ 3:1-8, 13-15
1కొరింథీ 10:1-6, 10-12
లూకా 13:1-9
క్రీస్తునాధునియందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనము  తపస్సు కాలపు మూడవ ఆదివారంలోనికి ప్రవేశించియున్నాము. ఈ నాటి మూడు దివ్యాగ్రంధ పఠనములు మనకు దేవునితో మన సంబంధం గురించి మరియు ఆయనకు మహిమను తెచ్చే జీవితాలను ఎలా జీవించాలని అనే  ముఖ్యమైన అంశాల గురించి తెలియజేస్తున్నాయి.
           అసలు దేవునితో సంబంధం అంటే ఏమిటి అని మనం గ్రహించినట్లయితే పునీత అవిలాపురి తెరెసమ్మ గారు  ఈ విధంగా అంటున్నారు. 
1. వ్యక్తిగత అనుభవం: ప్రతి ఒక్కరి జీవితములో కూడా దేవునితో ఒక వ్యక్తిగతమైన సబంధం ఉండాలని మరియు మన హృదయాలలో దేవునితో ఒక ప్రత్యేకమైన సంభందం  ఉండాలని ఈ మొదటి మాటలో అంటున్నారు.
2. స్నేహం: ఆమె ప్రార్థన దేవునితో ప్రేమపూర్వకమైన స్నేహం అంటున్నారు.  ఎందుకు ఆమె ఆలా అంటున్నారు అంటే స్నేహితులు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటారో, తమ సంతోషాలను మరియు బాధలను పంచుకుంటారో, అదే విధంగానే మనం కూడా దేవునితో మన హృదయాన్ని తెరవాలని ఒక స్నేహితునివలె మనము కూడా ఆయనతో మాట్లాడాలని తెలియజేస్తున్నారు.
3. ఆత్మ పరిశీలన: దేవునితో మన సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ఆత్మ పరిశీలన చాలా ముఖ్యమైన సాధనమని ఆమె అంటున్నారు. మన బలహీనతలను మరియు మన పాపాలను గుర్తుచేసుకొని వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి ఆమె మనకు తెలియజేస్తున్నారు. 
                          ఈ విధమైనటువంటి సంబంధాన్ని  మనం  జీవిచాలని ఆమె అంటున్నారు. ఈ నాటి పఠనలుకూడా ఇదే విషయాన్ని  మనకు తెలియజేస్తున్నాయి. 
           ముందుగా మొదటి పఠనములో మోషే దేవుని యొక్క పిలుపును అందుకుంటాడు. దేవుడు మండుతున్న పొద రూపంలో మోషేకు ప్రత్యక్షమై, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్న వారిని విడిపించడానికి దేవుడు మోషేను ఎన్నుకుంటానాడు. ఇక్కడ, దేవుడు మోషేతో తనను తాను 'నేను ఉన్నవాడను' అని పరిచయం చేసుకుంటాడు, ఇది ఆయన శాశ్వతత్వాన్ని, స్వయం సమృద్ధిని మరియు విశ్వాసనీయతను తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుడు తన ప్రజల బాధలను చూసి, వారిని విడిపించడానికి ఒక గొప్ప నిర్ణయాన్ని  తీసుకున్నాడు. అంతేకాకుండా ఇక్కడ దేవుని పిలుపు మరియు ఆయన శక్తిని ఈ సంఘటనద్వారా మనకు తెలియజేస్తుంది. ఇక్కడ మనము గమనించలసింది దేవుని పేరు యొక్క ప్రాముఖ్యత మరియు ఆయనతో మన సంబంధం గురించి ఇది తెలియజేస్తుంది. 
         రెండవ పఠనములో  పౌలు ఇశ్రాయేలీయుల ఎడారి ప్రయాణం నుండి నేర్చుకోవలసిన గుణ పాఠాల గురించి కొరింథీయులకు గుర్తుచేస్తున్నాడు మరియు వివరిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని అద్భుతాలను చూసినప్పటికీ, వారు అవిధేయత, విగ్రహారాధన మరియు సణుగుడు ద్వారా పాపం చేశారు అని పౌలు గారు వారి అనుభవాలను మనకు హెచ్చరికగా ఉపయోగిస్తాడు, తద్వారా మనం అదే తప్పులు చేయకుండా ఉంటాము అని దేవునితో సభందం కలిగి జీవిస్తామని అంటున్నారు.
అంతేకాకుండా ఇక్కడ మనం దేవుని విశ్వాసనీయతను అంత తేలికగా తీసుకోకూడదు. మన హృదయాలను పాపం నుండి కాపాడుకోవాలి మరియు దేవునికి విధేయత చూపాలి అని అంటున్నారు. ఎందుకంటే గర్వం అనేది మన పతనానికి దారితీస్తుందని కాబట్టి మనం ఎల్లప్పుడూ వినయంగా ఆయనతో సంబంధం  కలిగి ఉండాలని అంటున్నారు.
         చివరిగా సువిశేష పఠనములో యేసు పీలాతు చేతిలో చంపబడిన గలిలయుల గురించి మరియు సిలోయము గోపురం కూలి చనిపోయిన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఈ సంఘటనలు ఎందుకు క్రీస్తు వారికీ తెలియజేస్తున్నాడంటే పాపులు పశ్చాత్తాపపడకపోతే వారు కూడా నాశనం అవుతారని హెచ్చరికగా ఉపయోగిస్తాడు. యేసు ఒక అంజూరపు చెట్టు ఉపమానాన్ని కూడా చెబుతాన్నాడు, ఇది దేవునిపట్ల మన పశ్చాత్తాపం మరియు ఫలాలను ఉత్పత్తి చేయడం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తుంది. మనం మన పాపాలను విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని వైపు తిరగాలుగుతామో. అపుడే దేవుడు మనకు పశ్చాత్తాపపడటానికి అవకాశాలను ఇస్తాడు, కానీ మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలి. మనం దేవునికి ఫలాలను ఇచ్చే విధంగా మనం మారాలని, అంటే మనం ఆయనకు మహిమ తెచ్చే జీవితాలను జీవించాలి తెలియజేస్తున్నాడు.

కాబట్టి  ప్రియా దేవుని బిడ్డలరా ఇక్కడ మనం నేర్చుకోగల కొన్ని సాధారణ గుణాలు మనకు కనిపిస్తాయి. దేవుడు నమ్మదగినవాడు మరియు విశ్వాసనీయుడు. మనం పాపం నుండి పశ్చాత్తాపపడాలి మరియు దేవునికి విధేయత చూపాలి.
 కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఈ  తపస్సు కాలం మనం పశ్చాత్తాపాన్ని, విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవడానికి, దేవునిచే అనుగ్రహించబడిన సమయం కాబట్టి  మన పాపాలను దేవుని ముందు ఉంచుతు పశ్చాత్తాపం పడి దేవునితో సంబంధం  కలిగి జీవించాలని ప్రార్దించుకుందాము.

Fr. Johannes OCD

15, మార్చి 2025, శనివారం

తపస్సుకాలపు రెండొవ ఆదివారము

తపస్సుకాలపు రెండొవ ఆదివారము
ఆదికాండము 15:5-12, 17-18
ఫిలిప్పీయులు 3:17-4:1
లూకా 9:28-36

          క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియ  దేవుని  దైవ భక్తులారా, ఈ రోజున మనమందరము తపస్సుకాలపు రెండవ  ఆదివారం లోనికి ప్రవేశించి ఉన్నాము. ఈ నాటి మూడు పఠనలు కూడా మనం దేవుని విశ్వసించాలి, క్రీస్తును అనురించాలి మరియు ఆయన మాట వినాలి అని తెలియజేస్తున్నాయి ఎందుకంటే అలా చేయడం ద్వారా, మనం ఆయన వాగ్దానాలను పొందుతాము మరియు ఆయన మహిమలో పాలుపంచుకుంటాము అని క్లుప్తంగా వివరిస్తున్నాయి.
           మొదటి పఠనములో ఆదికాండము  నుండి చూస్తున్నాము ఇక్కడ అబ్రాహామునకు మరియు దేవునికి మధ్య ఒక ఒప్పందం గురించి తెలియజేస్తుంది. దేవుడు అబ్రామునకు ఆకాశంలోని నక్షత్రాలను చూపించి, అతని సంతానం ఆలాగే ఉంటుందని వాగ్దానం చేస్తున్నాడు. దానికి గాను అబ్రాము దేవునిపై విశ్వాసం చూపిస్తున్నాడు, ఇది అతనికి బహు మంచిగా అనిపించింది. మరల కొద్దీ సేపటి తర్వాత అబ్రాము దేవుని వాగ్దానం గురించి అనుమానం వ్యక్తం చేసాడు అది ఏవిధంగానంటే తన సంతానం ఈ భూమిని ఎలా పొందుతుందని  దేవుని అడిగాడు. దానికి గాను దేవుడు అబ్రాహాముతో నీవు దీనిని నమ్ముటకు కొన్ని జంతువులను తెచ్చి, వాటిని రెండుగా కోసి, ఒకదానికొకటి ఎదురుగా అమర్చమని చెప్పాడు. ఈ ఒప్పంద విధిలో భాగంగా, దేవుడు ఒక పొగమంచు పొగ మరియు మంట దీపం రూపంలో జంతువుల మధ్య దీర్ఘంగా నడిచాడు. దానికి గాను ఈ ఒప్పందంలో దేవుడు అబ్రాము సంతానానికి కనాను అను భూమిని ఇస్తానని వాగ్దానం చేసియున్నాడు. అబ్రాము సంతానం నాలుగు వందల సంవత్సరాలు బందీలుగా ఉంటారని, తర్వాత వారు గొప్ప సంపదతో తిరిగి వస్తారని దేవుడు అబ్రాహామునకు ఒక కచ్చితమైనటువంటి మాటను చెప్పాడు. ఇక్కడ ఈ వచనలలో దేవుని విశ్వాసనీయతను మరియు ఆయన వాగ్దానాలను నెరవేర్చే శక్తిని చూపిస్తుంది. అబ్రాహాము దేవునిని విశ్వసించినట్లే, మనం కూడా ఆయనను విశ్వసించాలి మరియు ఆయన వాగ్దానాలపై ఆధారపడి జీవిస్తుండాలి, ఎందుకంటే మనము కూడా అబ్రాహాము వలే దేవునిపై విశ్వాసం ఉంచి జీవిస్తే అయన వలే మనము కూడా దివించబడతాము. కాబట్టి ఆ ఆశీర్వాదలను ఎలా పొందలో అబ్రాహామును ఒక ఉదాహరణగా తీసుకోవాలని మొదటి పఠనము మనకు వివరిస్తుంది.
            తరవాత రెండవ పఠనములో  పౌలు గారు ఫిలిపియులైన క్రైస్తవులకు సరైన మార్గంలో నడవాలని సలహా ఇస్తున్నాడు. అతను తనను  అనుసరించమని చెబుతున్నాడు. ఈ సందర్భంలో  పౌలు ఎందుకు ఆ ప్రజలను ఆవిధంగా అంటున్నాడంటే అతని విశ్వాసం మరియు నిబద్ధతను అనుసరించమని సలహా ఇస్తున్నాడు. అదేసమయంలో, కొందరు ప్రజలు వారి శరీరాన్ని దేవుని దృష్టిలో అపవిత్రం చేస్తున్నారని మరియు వారికీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారని వారి జీవితాలను బట్టి పౌలు ఆవిధంగానైనా వారిని తిరిగి దేవుని చెంతకు తీసుకునిరావాలన్నా ఆలోచనతోటి వారిని హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా, వారు ప్రభువులో స్థిరంగా నిలబడాలని కోరుకుంటున్నాడు. ఈ విధంగా, పౌలు ఫిలిప్పీయులకు మంచి మార్గంలో నడవడం మరియు దేవుని వాక్యాన్ని పాటించడం గురించి బోధిస్తున్నాడు. కనుక మన జీవితంలో కూడా అనేక సార్లు మనకిష్టమొచ్చినట్లు జీవిస్తూ ఉంటాము. కాబ్బటి ఈనాటి నుండి మనమందరము చెడు జీవితాన్ని వదలిపెట్టి మంచి మార్గాన్ని ఎంచుకోవడం మరియు దేవుని వాక్యాన్ని పాటించడం గురించి ఆలోచించడం మొదలు పెట్టమని పౌలు గారు మనలను  ఈ రెండవ పఠనము ద్వారా హెచ్చరిస్తున్నాడు.
           చివరిగా సువిశేష పఠనములో  యేసు ప్రభువుని రూపాంతరికరణము గురించి చెప్పబడింది. యేసుక్రీస్తు మొషే మరియు ఎలియా  కలిసి ఉండగా రూపాంతరం చెందాడు. ఈ సందర్భంలో ఇక్కడ మన ఆలోచన ఏవిధంగా ఉండాలంటే యేసు ప్రభువు యొక్క విశ్వాసం మరియు అయన యొక్క వాక్య పరిచర్య మరియు అయన వచ్చిన పనిని గురించి ఆలోచించామని మనకు సలహా ఇస్తుంది. ఇక్కడ మనం గమనించలసింది ఏమిటంటే, యేసు తన శిష్యులైన పేతురు, యోహను, యకోబులను వెంటబెట్టుకొని పర్వతము మీదికి తీసుకొని వేలతాడు. అక్కడికి వెళ్లిన తరువాత యేసుక్రీస్తు రూపాంతరం చెండుతాడు. అయన ముఖం మారిపోయి, తన వస్త్రాలు ప్రకాశవంతంగా మారుతాయి. మోషే మరియు ఎలియా ప్రవక్తలు  ఆయనతో సంభాసించటం వారి ముగ్గురికి కనిపిస్తారు. అక్కడ వారు ముగ్గురు అయనకు జెరూసలేములో సంభవించే మరణం మరియు పునరుత్థానం గురించి మాట్లాడారు వారు మాట్లాడుకుంటారు. ఇది అంత జరిగిన తరువాత వారు తిరిగి కిందకు వచ్చే సమయములో ఒక మేఘం వారిని కమ్ముకుంటుంది. ఆ మేఘం నుండి ఒక స్వరం వారికీ వినిపిస్తుంది, అది ఏమిటంటే ఈయన నా ప్రియమైన కుమారుడు, నేను ఏర్పరచుకొనినవాడు; ఆయన మాట వినుడు అని ఒక శబ్దం వస్తుంది. ఇక్కడ మనం గమనించలసింది.
ఈ సంఘటన యేసు యొక్క దైవత్వాన్ని మరియు ఆయన తండ్రితో ఉన్న ప్రత్యేక సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మోషే మరియు ఏలీయా కనిపించడం ద్వారా పాత నిబంధన యేసులో నెరవేరుతుందని చూపిస్తుంది. తండ్రి స్వరం యేసును ఆయన కుమారుడిగా ధృవీకరిస్తుంది మరియు ఆయన మాట వినమని మనకు ఆజ్ఞాపిస్తుంది. కాబట్టి మనము అయన మాట విని దేవుని ఆశీర్వాదలు పొందాలని మనము ప్రార్థన చేసుకోవాలి మరియు ఆయనను విశ్వాసించాలి.
        కాబట్టి ప్రియా దేవుని బిడ్డలరా ఈ తపస్సు కలమంతా దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశము, అంతే కాకుండా మన విశ్వాసాన్ని దేవుని పట్ల ఏంతగా ఉందొ నిరూపించుకొనే ఒక గొప్ప అవకాశము, అందుకని మనం మన విశ్వాసాన్ని దేవుని ముందు వ్యక్తపరుచుచు అయన యడల మన విశ్వాసాన్ని చూపిస్తూ జీవించాలని ఈ దివ్యబలి పూజలో విశ్వాసంతో ప్రార్థించుకుంటు పాల్గొందాము.
Fr. Johannes OCD 

8, మార్చి 2025, శనివారం

తపస్సుకాలపు మొదటి ఆదివారము


ద్వితీయోపదేశకాండము 26:4-10, రోమీయులకు 10:8-13, 
లూకా 4:1-13.

          క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియా  దేవుని భక్త జనులరా , ఈ రోజున మనమందరము తపస్సుకాలపు మొదటి ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాము, ఈ నాటి మూడు దివ్య గ్రంథ పఠనములను మనం ద్యానించినట్లయితే, ఈ మూడు పఠనలు కూడా మనకు ముఖ్యమైనటువంటి కొన్ని అవసరమైనటువంటి అంశముల గురించి తెలియజేస్తునాయి. అవి విశ్వాసం, విధేయత మరియు దేవుని యొక్క విశ్వసనీయత యొక్క ప్రాముఖ్యతను గురించి చెబుతున్నాయి. 

                ముందుగా మనము మొదటి పఠనమును గమనించినట్లయితే ఈ యొక్క మొదటి పఠనములో. దేవుని కృపకు గుర్తుగా ఇశ్రాయేలీయుల యొక్క పంట మొదటి ఫలాలను దేవునికి అర్పించేటువంటి ఆచారాన్ని గురించి వివరిస్తుంది.
అంతే కాకుండా దేవుడు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నప్పుడు వారిని విడిపించి, వాగ్దాన భూమికి నడిపించిన విధానాన్ని కూడా మనకు గుర్తుచేస్తుంది.
అంతే కాకుండా దేవుడు తన ప్రజలకు చేసిన మంచి పనులను గుర్తుచేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
మన జీవితంలో కూడా దేవుడు అనేక సార్లు అనేక విధాలుగా ఎన్నెన్నో చేసిన మేలులను ఈ సమయాన మనము గుర్తుచేసుకొని, దేవునికి కృతజ్ఞతలు చెప్పడం చాలా ముఖ్యం. ఎందుకంటే పాపం అనే జీవితములో మనము అనేక సార్లు దేవునికి వెతిరేకంగా చేసిన కూడా అయన మనలను క్షమించి మరల అయన చెంతకు తీసుకున్నాడు. కాబ్బటి మనము కూడా ఇజ్రాయెల వాలే దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరిగి అయన చెంతకు రావాలని మొదటి పఠనము మనలను ఆహ్వానిస్తుంది.
                 రెండొవ పఠనములో రోమీయులకు 10:8-13లో 
యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించడం మరియు మన జీవితములో విశ్వసించడం ద్వారా రక్షణ పొందవచ్చని మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే యేసు ప్రభువు ప్రభువు అని విశ్వాసిస్తామో అప్పుడే మనము అయన ద్వారా రక్షింపబడతాము(10:9). ఇక్కడ విశ్వాసం యొక్క సార్వత్రిక స్వభావాన్ని నొక్కి వక్కనించి చెబుతుంది, ఇక్కడ యూదుడని గ్రీసుదేశస్థుడని భేదములేదు. అందరూ కూడా ఒకటేనాని ఒక్క ప్రభువే అందరికి ప్రభువైయునాడని. ఆయనను నమ్మడం ద్వారా ఎవరైనా రక్షణ పొందవచ్చు అని తెలియజేస్తుంది. ఇక్కడ మనము పూర్తిగా గమనించినట్లయితే ఇది మనకు దేవుని ప్రేమను, ఆయన రక్షణ ప్రణాళికను గురించి తెలియజేస్తుంది. కాబ్బటి మనము కూడా అదే విశ్వాసాన్ని దేవుని పట్ల చూపిస్తూ జీవించాలని రెండొవ పఠనము మనకు వివరిస్తుంది.   
                చివరిగా సువిశేష పఠనములో  యేసు ఎడారిలో శోధించబడిన వృత్తాంతాన్ని గురించి వివరిస్తుంది. యేసు సాతాను శోధనలను లేఖనాల ద్వారా జయించాడు. ఇక్కడ విశ్వాసం మరియు దేవుని వాక్యానికి విధేయత గురించి చెబుతుంది. యేసు శోధనలను ఎదుర్కొన్నప్పుడు, ఆయన దేవుని వాక్యంపై ఆధారపడ్డాడు. మనం కూడా అనేక సార్లు అనేక విధాలుగా శోధనలను ఎదుర్కొనేటప్పుడు, దేవుని వాక్యం మనకు ఎంతగానో సహాయం చేస్తుంది. బలహీనలుగా ఉన్నా మనలను దేవుని వాక్యం బలవంతులను చేస్తోంది. కాబ్బటి మనము ముందుగా దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే దేవుడు మనకు కూడా ప్రాముఖ్యతను ఇస్తాడు. 
       కాబట్టి ప్రియా దేవుని బుడ్డలారా మనం దేవునిపై విశ్వాసం ఉంచాలి, ఆయన వాక్యానికి విధేయత చూపాలి మరియు ఆయన చేసిన మేలులను గుర్తుచేసుకోనీ కృతజ్ఞతలు చెల్లించుకుందాము.
Fr. Johannes OCD

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...