18, జూన్ 2022, శనివారం
దివ్య సత్ప్రసాద మహోత్సవము(4)
దివ్య సత్ప్రసాద మహోత్సవము
ఆది 14 : 18 - 20 , 1 కొరింతి 11 : 23 -26 , లూకా 9 : 11 -17
ద్వితియో 8 : 2 -3 , 14 - 16 , 1 కొరింతి 10 : 16 - 17 , యోహాను 6: 51 -58 .
నేడు తల్లి శ్రీ సభ క్రీస్తు ప్రభువు యొక్క పరమ పవిత్ర శరీర రక్తముల పండుగను కొనియాడుచున్నది.
దైవార్చన సంవత్సరంలో దివ్య సత్ప్రసాదం యొక్క గొప్ప తనం గురించి రెండు ప్రత్యేకమైన రోజులలో ధ్యానించుకుంటాం.
1. పవిత్ర గురువారం రోజున
2. ప్రభువు పునరుతనమైన 9 వారాల తర్వాత.
దివ్య సత్ప్రసాదం అనేది క్రీస్తుప్రభువు శ్రీసభకు ఇచ్చిన గొప్ప సంపదం. దాని వలననే శ్రీ సభ జీవించుచున్నది . పరిశుద్ధ 16 వ బెనెడిక్ట్ పాపు గారు అంటారు దివ్య సత్ప్రసాదం లేనిది శ్రీ సభ ఉనికి లేదు అని.
దివ్య సత్ప్రసాదం అనేది ప్రభువు యొక్క అమూల్యమైన వరం. ఆయన కడరాత్రి భోజనమున దివ్యసత్ప్రసాదమును స్థాపించారు.
కేవలం కథోలిక సంఘంలో వున్న విశ్వాసులకు దేవుడిని తమలోకి స్వీకరించే అదృష్టం కలుగుతుంది. ఏ దేవాలయము కు వెళ్లిన కేవలం దేవుడికి అర్పించిన ప్రసాదం తీసుకుంటారు. కానీ కథోలిక శ్రీ సభ లో దేవుడిని దివ్యసత్ప్రసాదంలో తమ యొక్క హృదయంలోకి ఆహ్వానించుకుంటారు.
పాస్కా పండుగ దినముల తరువాత ఎందుకు ఈ పండుగను కొనియాడుతారంటే ప్రభువు శిష్యులతో "నేను లోకాంతము వరకు సదా మీతో ఉందును అని వాగ్దానం చేశారు. మత్తయి 28 : 20 . ఈ విధంగా ఆయన దివ్య సత్ప్రసాదంలో దాగి వున్నారు.
దేవుడు మనతో చిరకాలము ఉండుటకు దివ్యసత్ప్రసాదంను స్థాపించారు.
దివ్య సత్ప్రసాదం కథోలిక విశ్వాస సంప్రదాయంలో గుండెకాయ వంటిది . మానవుల యొక్క జీవితంలో హృదయం అనేది కేంద్రం . హృదయం లేనిది మనిషి జీవించలేడు. అలాగే దివ్యసత్ప్రసాదం లేనిదే కథోలిక విశ్వాసం లేదు.
ప్రభువు యొక్క శరీరము నిజమైన ఆహారము ఆయన యొక్క రక్తము నిజమైన పానము.
కడరాత్రి భోజనమున దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని చెప్పి ఆయన మన కోసమే తన శరీరమును రక్తమును ఇచ్చి వున్నారు.
శ్రీసభ ఈ పండుగను స్థాపించటానికి 4 కారణాలు వున్నాయి.
1 దివ్యసత్ప్రసాదంలో క్రీస్తు ప్రభువు నిజంగా ప్రత్యక్షమై వున్నారని తెలుపుటకు.
2 దివ్య సత్ప్రసాదంలో దాగివున్న క్రీస్తు ప్రభువుకు చెందిన అవమానాలకు పరిహారం చెల్లించుటకు.
3 దివ్యసత్ప్రసాదం ద్వారా మనం పొందే మేలులకు కృతజ్ఞతా తెలుపుటకు.
4 తరుచుగా అందరం దివ్యసత్ప్ర సాదం స్వీకరించి దేవునితో ఐక్యమై జీవించుట కొరకు స్థాపించబడినది.
దివ్య సత్ప్రసాదంలో చాలా శక్తి దాగి వున్నది . దివ్య సత్ప్రసాదమే మనలను దేవునితో ఐక్యపరుస్తుంది.
ఈ నాటి మొదటి పఠనంలో షాలేము రాజు అయిన మేల్కేసెదెకు సమర్పించిన రొట్టె , ద్రాక్షారసము గురించి చెప్పబడినది.
అబ్రహాము శత్రు సైన్యములను జయించి బంధింపబడి ఉన్న లోతును విడిపించుకొని వచ్చే సమయంలో మేల్కేసెదెకు రాజు అబ్రహామును కలుసుకొనుటకు వస్తారు.
మేల్కేసెదెకు ఒక రాజు మాత్రమే కాదు ఆయన దేవుని యొక్క పూజారికూడా (ఆది 14 : 18 ) అంటే దేవునికి బలులు సమర్పించే యాజకుడు.
మేల్కేసెదెకు యాజకత్వమునకు పుట్టుపూర్వోత్తరాలు లేవు అయినా కానీ ఆయన దేవుని యొక్క యాజకుడు. అని పవిత్ర గ్రంధం తెలుపుతుంది. పవిత్ర గ్రంథంలో వున్న మొదటి యాజకుడు. కీర్తన 110 :4 .
ఒక దేవుని యొక్క యాజకుడిగా మేల్కేసెదెకు అలసిపోయిన అబ్రహాముకు రొట్టెను, ద్రాక్షారసమును ఇచ్చి బలపరుస్తున్నాడు.
మేల్కేసెదెకు అబ్రహామును యావే దేవునిపేరిట దీవిస్తున్నారు. ఆయన సమర్పించిన రొట్టె, ద్రాక్షారసము బలి అర్పణకు సూచనగా ఉంది. రొట్టెను, ద్రాక్ష రసమును సమర్పించుట పూర్వ నిభందన కాలంలో అత్యంత ప్రధానమైన సాంప్రదాయంగా మారింది.
-యేసు క్రీస్తు ప్రభువు యొక్క యాజకత్వం మేల్కేసెదెకు యాజకత్వ వారసత్వంను కలిగి వున్నదని హెబ్రీయులకు వ్రాసిన లేఖలో తెలిపారు. హెబ్రి 7 , 8 అధ్యాయాలు . క్రీస్తు ప్రభువు లేవీయుల గోత్రమునకు చెందినవారు కారు. అయినా కానీ ఆయన నిత్యుడగు యాజకుడు; ఆయన తన శరీర రక్తములనే రొట్టెగా, ద్రాక్షా రసముగా సమర్పించారు.
మేల్కేసెదెకు దేవునియొక్క ఆత్మ ప్రేరణ చేతనే రొట్టె, ద్రాక్షరసాలను ప్రభువుకు సమర్పించారు.
వాస్తవానికి ఆనాటి అన్యజాతీయులు జంతువుల మాంసంతోను, రక్తంతోను తమ దేవదూతలకు , దేవుళ్ళకు బలులు సమర్పించాలి. కానీ మేల్కేసెదెకు దానికి భిన్నముగా కేవలం రొట్టె, ద్రాక్ష రసాలు సమర్పించారు. ఎందుకంటే అవి క్రీస్తు ప్రభువు యొక్క రక్షణ బలికి సుమాత్రుకగా ఉన్నాయి.
మేల్కేసెదెకు రొట్టె ద్రాక్ష రసములను ఇవ్వుట మాత్రమే కాదు అబ్రహామును దీవిస్తున్నారు.
ఈనాటి రెండవ పఠనంలో క్రీస్తు ప్రభువు, వారు అర్పించిన బలి గురించి పౌలు గారు కొరింతు ప్రజలకు వివరిస్తున్నారు.
ప్రభువు యొక్క అపోస్తులులు తన మరణ, పునరుత్తానం తరువాత రొట్టె విరుచుటలో ప్రతిదినము సమావేశమయ్యేవారు. ఈ యొక్క సంప్రదాయంను అందరు పాటించే వారు ఎందుకంటే క్రీస్తు ప్రభువు వారు అన్నారు దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు అని.
మనందరం రొట్టెను , ద్రాక్షణారసమును పానము చేయునప్పుడు దేవునియొక్క రక్షణమును జ్ఞాపకం చేసుకోవాలి ఆయనయొక్క త్యాగం, ఆయన యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి.
యావే దేవుడు ఆనాడు మన్నాను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చారు. ఈనాడు క్రీస్తు ప్రభువు తనను తాను బలిగా సమర్పించుకొని తన శరీర రక్తాలు మనకు ఒసగి వున్నారు.
దేవునికి మనం కృతఙ్ఞతలు తెలపాలి.
దివ్య సత్ప్రసాదం స్వీకరించిన మనందరం అన్యోన్యంగా జీవించాలి ఎందుకంటే అందరిలో క్రీస్తు ప్రభువు వున్నారు. అనేక మంది కలిసి ఒకే పిండితో, నీతితో చేసిన రొట్టెను పంచుకొనుట ద్వారా మనందరం క్రీస్తు నందు ఒకే ప్రజగా ఉంటున్నాం.
మనం ఏ ప్రాంతమునకు వెళ్లిన, భాషకు, జాతులకు, చెందిన వారమైన సరే దివ్యసత్ప్రసాదం స్వీకరించిన తరువాత ఒకే ఒక ప్రజగా మారాలి. ఎటువంటి పేద, ధనిక, భేదాభి ప్రాయాలు లేకుండా కలసి జీవించాలి.
రొట్టెను చేసేది అన్ని గోధుమలు కలిపి ఒక ముద్దగా చేసి రొట్టెగా మార్చుతారు. అలాగే ద్రాక్ష రసము కూడా చాలా కాయలు కలిపి నలగ గొట్టినప్పుడే మంచి ద్రాక్ష రసము వస్తుంది. కాబట్టి అనేక గోధుమల కలయిక వల్ల ఏర్పడిన రొట్టెలాగా అలాగే అనేక ద్రాక్ష పళ్ళ కలయిక వల్ల ఏర్పడు ద్రాక్ష రసములాగా మనందరం కలసి మెలసి ఐక్యంగా జీవించాలి.
పౌలు గారు ప్రభువుయొక్క భోజనము గురించి ఎందుకు వివరించారంటే ఆనాటి కొరింతు సంఘంలో ఐక్యత అంతగా లేదు అందుకే ప్రభువు భోజనము ఏవిధంగానైతే అందరిని ఐక్యపరిచినదో అలాగే ప్రతి కొరింతు విశ్వాసి ఐక్యత కలిగి జీవించాలి.
ఈ నాటి సువిశేష పఠనంలో యేసు క్రీస్తు ప్రభువు 5000 మందికి ఆహారం ఇచ్చిన అద్భుతంను చదువుకుంటున్నాం.
ప్రభువు అయిదు రొట్టెలు, రెండు చేపలు ద్వారా అక్కడవున్న వారందరిని సంతృప్తి పరిచారు. ప్రభువు కేవలం వారికి ఆధ్యాత్మిక ఆహారం మాత్రమే కాదు ఇచ్చింది శారీరక ఆకలిని కూడా వారు తీసివేశారు.
యోహాను సువార్త 6 : 35 వచనాలలో ప్రభువు "నేనే జీవాహారము" అని పలికారు. జీవాహారము అనే మాటకు రెండు అర్థాలున్నాయి.
1. దేవుని వాక్కు - జీవాహారం మన యొక్క ఆత్మలకు జీవము నిచ్చే వాక్కు మనల్ని బలపరిచే వాక్కు. కీర్తన 119 : 50 . పాతనిభందన గ్రంధంలో దేవుని వాక్కు ఆహారంతో పోల్చబడినది యెషయా 55 వ అధ్యాయం .
2. దేవుని యొక్క దివ్య శరీర రక్తములు - యోహాను 6 వ అధ్యాయం
దివ్యసత్ప్రసాదం మనయొక్క జీవాహారం కాబట్టి మనం యోగ్యారీతిగా స్వీకరించాలి.
ప్రభువు సువిశేషంలో 5000 మందికి ఆహారం ఒసగిన సంఘటన పాత నిబంధన గ్రంధంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను ఇచ్చిన సంఘటన అదేవిధంగా ఎలీషా ప్రవక్త అతిధులకు రొట్టెను ఇచ్చిన విధానం అన్ని కూడా యేసు ప్రభువు స్థాపించే దివ్యసత్ప్రసాదంకు సూచనగా వున్నాయి.
నిర్గమ 16 : 4 - 36 (మన్నా),, 2 రాజు 4 : 42 – (ఎలీషా అద్భుతం)
యేసు ప్రభువు 5000 మందికి ఆహారం ఒసగిన సంఘటన నలుగురు సువార్తికులు వ్రాశారు.
దివ్యసత్ప్రసాదం దేవుడు మనకు ఒసగిన గొప్ప వరం కాబట్టి దానిని ఎలాగా మనం స్వీకరిస్తున్నాం?
దివ్య సత్ప్రసాదం స్వీకరించుట అంటే-
ఆయనను మనలోకి ఇంకించుకోవడం అంటే ఆయన జీవితం వలే మన జీవితం మారాలి . గలతి 2 : 20 .
- ఆయన రూపంను పొందాలి
-ఆయన వలే మనం తయారవ్వాలి.
-ఐక్యమై జీవించుట
దేవుడు మనతో ఉండాలని మనకు దగ్గరగా ఉండాలని, మనలో ఉండాలని దివ్య సత్ప్రసాద రూపంలో దాగి వున్నారు కాబట్టి ఆయనను స్వీకరించుటకై మనం ఎలాగా తయారగుచున్నాం.
-దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తే మనందరిలో అనేక ప్రయోజనాలు వున్నాయి.
-స్వీకరించిన వారు జీవాన్ని కలిగి వుంటారు- యోహాను 6: 53
-ఆయన పునరుత్థాన జీవితం పంచుకుంటారు- యోహాను 6: 54
-ప్రభువులో సహజీవనం ఏర్పడుతుంది -యోహాను 6: 56, గలతి 2 :20
-దేవుని మూలమున జీవిస్తాం - యోహాను 6: 57
-దేవుడు మనయందు ఉంటారు - యోహాను 6: 56
మనందరం యేసు ప్రభువుయొక్క దివ్య శరీర రక్తములు స్వీకరించినప్పుడు దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి.
- దేవుడు ఒసగె ఆహారం మనలను ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది. ఈ ఆహారం భుజించియే ఏలియా నలభై రోజులు నడిచారు. 1 రాజు 19: 8.
- ఈ ఆహారం భుజించియే ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో నడిపించబడ్డారు. నిర్గమ 16 : 35 .
-దేవుడు మనకై ఏర్పరిచిన ఈ యొక్క దివ్య సత్ప్రసాదం పట్ల గౌరవం, ప్రేమ, భక్తి కలిగి మారుమనస్సు పొంది ప్రభువుని మనలోకి స్వీకరిద్దాం.
మన ఇంటికి ఎవరైనా అతిధి వస్తే వారిని మంచిగా స్వీకరిస్తాం, అదే ఇంటికి గొప్ప వారు వస్తే ఇంకా బాగా స్వీకరిస్తాం. మరి దివ్య సత్ప్రసాదం ద్వారా దేవుడు మనలోకి వచ్చేటప్పుడు మనం ఎలాగా స్వీకరిస్తున్నాం. ఆయన మానవ మాత్రులకన్నా గొప్పవాడు. మనల్ని రక్షించిన దేవుడు. ఆయన్ను స్వీకరించుటకు పవిత్రత కావాలి. మనం పాపమును విడిచిపెట్టి, మారుమనస్సు పొంది దేవుడిని మనలోకి ఆహ్వానించాలి.
Rev. Fr. BalaYesu OCD
క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము(3)
క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము
క్రీస్తు నాధుని యందు ప్రియ సహోదరి సహోదరులారా! ఈనాడు తల్లి శ్రీసభ 'దివ్యసత్ప్రసాద మహోత్సవం లేదా క్రీస్తు శరీర రక్తముల మహోత్సవాన్ని కొనియాడుచున్నది. దివ్యసత్ప్రసాదం యేసుక్రీస్తు ప్రభువు మానవాళికి అనుగ్రహించిన ఒక గొప్ప వరం. ఎందుకనగా, దివ్యసత్ప్రసాదం రూపంలో ఆయన ఎల్లప్పుడూ మనతో వాసం చేస్తున్నారు, మనలోకి వేంచేస్తున్నారు. ఏడు దివ్య సంస్కారాలలో దివ్య సత్ప్రసాదానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది .
పండుగ ప్రారంభం: బెల్జియం దేశం లియోజపురం నివాసియైన జులియాన అనే కన్యాస్త్రికి తరచుగా ఒక దృశ్యం కనిపిస్తూ ఉండేది. ఆ దృశ్యంలో ఆమె ధగధగమెరుస్తున్న చంద్రుని, దానిలో ఒక మచ్చను చూస్తుండేది. అది ఒక అద్భుతమని తెలుసుకున్న ఆమె దానిగురించి ఇతరులకు చెప్పడానికి భయపడేది. ఎందుకనగా ఆ దృశ్యం భావమేమిటో ఆమెకు తెలియదు కాబట్టి దాని గురించి ఇతరులకు ఎలా చెప్పాలో ఆమెకు తెలిసేది కాదు. ఆ దృశ్యం భావం తెలియజేయమని ఉపవాసాలతో దేవునికి దీర్ఘ ప్రార్ధనలు చేసేవారు. తన ప్రార్ధనలు ఆలకించిన యేసు ప్రభువు ఆ దృశ్యం భావాన్ని ఆమెకు అర్ధమయ్యేలా చేశారు. అలా ఆమె ఆ దృశ్యం భావాన్ని గ్రహించగలిగింది. ఆ దృశ్యం భావమేమనగా చంద్రుడు శ్రీసభ కాగా, దివ్య సత్ప్రసాద గౌరవార్ధం ప్రత్యేక ఉత్సవం లేని కొరతే ఆ చంద్రునిలో మచ్చ.
ఆ ఉత్సవం ఏర్పాటు చేయ తోడ్పడాల్సిందిగా తనను ప్రభువు ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఆమె గ్రహించింది. తాను ఒక సాధారణ కన్యాస్త్రి కనుక ఆ ఉత్సవం ఎలా ఏర్పాటు చేయించాలో తనకు అర్ధమయ్యేది కాదు. ఇలా తనలో తాను సతమతమవుతుండగా శ్రీసభ పెద్దలను ఆశ్రయించమని దేవుడు ఆమెకు ప్రేరేపణ కలిపించాడు. ముందుగా ఆమె ఈ దృశ్యం గురించి కొంతమంది భక్తులకు, ముఖ్యమైన గురువులకు తెలియజేశారు. వారందరు లియోజపురం పీఠాధిపతిని కలిసి విషయం తెలియజేసి, తమ మేత్రాసనంలో దివ్య సత్ప్రసాద ఉత్సవం ఏర్పాటు చేయాల్సిందిగా పీఠాధిపతిని అభ్యర్ధించారు. తత్ఫలితంగా రోబర్టో పీఠాధిపతులు 1246 సంవత్సరంలో తమ గురువులకు అధికార పూర్వకమైన ఉత్తరువులు పంపి ఈ ఉత్సవాన్ని స్థాపించాలని ఆదేశించారు. అలా ఆ మేత్రాసనంలో ఆ ఉత్సవం ప్రారంభమైనందున ప్రజలు ఉత్సవం ద్వారా దివ్య సత్ప్రసాదం ప్రాముఖ్యతను గ్రహించారు. అది చూసిన ఇతర పీఠాధిపతులు తమ మేత్రాసనాల్లో కూడా ఈ పండుగను ప్రారంభించారు. తరువాత ఈ ఉత్సవం మెల్లగా మెల్లగా ఇతర దేశాలకు విస్తరించింది. చివరికి 1264 సంవత్సరంలో మూడవ ఉర్బను పోపుగారు ఈ ఉత్సవాన్ని శ్రీసభ అంతటా జరపాలని ఆదేశించారు. అలా ఈ ఉత్సవం క్రైస్తవులలో యేసుక్రీస్తు దివ్య శరీర రక్తల పట్ల గౌరవం, భక్తిని పెంపొందించింది.
ఈ విధంగా ఆనాడు ఈ ఉత్సవం ఒక్క మేత్రాసనంలో మొదలై ఈనాడు ప్రపంచమందంతటా క్రైస్తవులు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా జర్మనీ దేశస్థులు ఈ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుకుంటారు.
పరిశుద్ధ గ్రంధంలో మొదటి మూడు సువిశేషములలో యేసుప్రభువు కడరా భోజనం రోజున దివ్య సత్ప్రసాదాన్ని స్థాపిస్తూ తన శరీర రక్తములను మనకు ప్రసాదించినటువంటి ఒక గొప్ప కార్యాన్ని మనం చూస్తున్నాం. "యేసు రొట్టెనందుకొని, ఆశీర్వదించి, త్రుంచి శిష్యులకు ఇచ్చుచు 'మీరందరు దీనిని తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము' అనెను. తరువాత పాత్రమునందుకొని, కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చుచు, 'దీనిని మీరు పానము చేయుడు. ఇది అనేకుల పాపపరిహారమై చిందబడనున్న నా రక్తము. దీనిని నా జ్ఞాపకార్ధము చేయుడు' అనెను" (మత్తయి 26: 26-29, మార్కు 14: 22-25, లూకా 22: 17-20) అని మనం పవిత్రగ్రంథంలో యేసుప్రభువు పలికిన మాటలను వింటున్నాం. ఈనాడు ఆ యేసుక్రీస్తుని శరీర రక్తములను ఏ విధంగా స్వీకరిస్తున్నాం? యోగ్యముగా స్వీకరిస్తున్నామా లేక అయోగ్యముగా స్వీకరిస్తున్నామా ? యోగ్యముగా స్వీకరించడమంటే మన స్వీకరించబోయేది కేవలం అప్పద్రాక్ష రసములు కాదు నిజమైన ప్రభుని శరీర రక్తములనే మనం స్వీకరిస్తున్నాం అని నిండు విశ్వాసం కలిగియుండి, అలా స్వీకరించుటకు కావలసిన పరిశుద్ధతను కలిగియుండడమే.
ఈరోజు అటువంటి నిండు విశ్వాసంతో, గొప్ప పరిశుద్ధతతో ఆ ప్రభుని మనం స్వీకరిస్తున్నామా?
ఎందుకు విశ్వాసం, పరిశుద్ధత కలిగియుండాలి?
"విశ్వాసంపై ఆధారపడనిది ఏదైనా పాపమే" (రోమా 14 : 23 ) అని పునీత పౌలు గారు అంటున్నారు. అనగా ప్రభుని శరీర రక్తములను విశ్వాసంతో స్వీకరించకపోతే అది పాపమే అంటున్నారు పౌలుగారు. అదేవిధంగా "పరిశుద్ధ జీవితమును గడుపుటకై ప్రయత్నించండి. ఏలయన, అది లేకుండా ఎవరును ప్రభువును చేరలేరు" (హెబ్రీ 12 : 14 ) అని హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ మనకు తెలియజేస్తుంది. అనగా పరిశుద్ధత అనేది ప్రభువుని చేరడానికి మనకు ఉన్న ఒక ముఖ్యమైన మార్గమని పవిత్రగ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా! ప్రభుని స్వీకరించాలి అంటే విశ్వాసం, పరిశుద్ధత అనేవి మనకు చాలు ముఖ్యం.
యోగ్యతతో ప్రభువుని శరీర రక్తాలను స్వీకరిస్తే:
యేసుక్రీస్తు ప్రభువుని మనం నిండు విశ్వాసంతో, సంపూర్ణ పరిశుద్ధతో స్వీకరిస్తే ఈనాడు ప్రభువు మనకు మూడు గొప్ప అనుగ్రహాలను దయచేస్తున్నారు.
1. నిత్య జీవం, అంతిమ దినమున లేపబడతాము:
ఈనాటి సమాజంలో నిత్యజీవము లేదా శాశ్వత జీవం అనగానే అనేకమంది ఈలోక సంబంధమైన వస్తువులలో వెతుకుతూ ఉంటారు. ఏదైనా సరే క్షణాల్లో వచ్చేయాలి అనుకుంటాం. కానీ ఈనాడు ప్రభువు మనకు జీవాన్ని పొందడానికి ఉన్న అసలైన మార్గాన్ని తెలియజేస్తున్నారు. "నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నిత్యజీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును" (యోహాను 6 : 54 ) అని ప్రభువు సెలవిస్తున్నారు. ఆయన శరీర రక్తములను యోగ్యముగా స్వీకరించుట వలన మనం నిత్య జీవాన్ని పొందడమే కాకుండా అంతిమ దినమున ఆయన చేత లేపబడతాము. ఆయన శరీర రక్తముల ద్వారా నిత్యజీవాన్ని పొందే గొప్ప అనుగ్రహం కథోలిక విశ్వాసులమైన మనకు దయచేయడం మన అదృష్టంగా భావించాలి.
2. ప్రభువు మనయందు, మనం ప్రభుని యందు ఉంటాము:
ప్రభువు తన శరీర రక్తముల ద్వారా మనకు ఇస్తున్న మరొక గొప్ప వరం మన ప్రభునియందును, ప్రభువు మనయందును జీవిస్తారు. "నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వాని యందును ఉందును" (యోహాను 6 : 56 ) అని ప్రభువు పలుకుచున్నారు. పరిశుద్ధుడు, కరుణామయుడైన ఆ ప్రభువు మనలోనూ, మన కుటుంబములలోను, మన సంఘములోను జీవించాలన్నా, మనం ప్రభుని తిరుహృదయములోను, క్రీస్తు సంఘములో నిజమైన క్రైస్తవ బిడ్డలుగా జీవించాలన్నా ఆ ప్రభువుని యొక్క శరీర రక్తములు మనకు ఆ అనుగ్రహాన్ని దయచేస్తాయి. కనుక యోగ్యముగా ప్రభువుని స్వీకరిస్తూ ఆ ప్రభుని మన హృదయాలలోనికి, మన కుటుంబాలలోని, మన సంఘాలలోనికి ఆహ్వానించుదాం.
3. ప్రభువుని మూలమున ఎల్లప్పుడూ, నిరంతరం జీవిస్తాము:
ప్రభువు తన శరీర రక్తముల ద్వారా మనకు అనుగ్రహిస్తున్న మరొక గొప్ప వరం ఆయన మూలమున జీవించడం. మనం అనేకమార్లు మనకు వున్నా ధనాన్ని, ఆస్తిపాస్తులను, కండబలాన్ని, సమాజంలో మనకున్న పలుకుబడిని చూసుకొని విర్రవీగుతుండవచ్చు. వీటి మూలమున మనం సంతోషంగా, ఆనందంగా జీవించవచ్చు, ఇంకేమి అవసరం లేదు అనుకుంటుంటాం కానీ ప్రభువు ఇవన్నీ అశాశ్వతమైనవని మనకు తెలియజేస్తున్నారు. "పరలోకమునుండి దిగివచ్చిన జీవముగల ఆహారమును నేనే. నన్ను భుజించువాడు నా మూలమున జీవించును, నన్ను భుజించువాడు ఎల్లప్పుడును, నిరంతరము జీవించును" (యోహాను 6 : 51 , 57 - 58 ) అని ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. కనుక మన జీవితం ఈలోక సంపదలు, ఈలోక వస్తువుల మూలమున కాకుండా జీవమునిచ్చు ఆ యేసుక్రీస్తుని మూలమున జీవించాలి. ఆ విధముగా జీవించాలి అంటే ఆయన శరీర రక్తములను మనం యోగ్యముగా స్వీకరించాలి.
ఒకవేళ అయోగ్యముగా ప్రభువుని స్వీకరిస్తే ఏమౌతుంది?
విశ్వాసంతో, పరిశుద్ధతో ప్రభువుని స్వీకరిస్తే ఆయన అనుగ్రహాలు పొందినట్లే, అవిశ్వాసంతో, అపరిశుద్ధతతో ప్రభువుని స్వీకరిస్తే మనం జీవితంలో ఏం జరుగుతుంది?
1. పాపం చేసినట్లే:
విశ్వాసము, పరిశుద్ధ లేకుండా ఎవరైనా అయోగ్యముగా ప్రభువుని స్వీకరిస్తే మనం పాపం చేయుచున్నట్లే అని పవిత్రగ్రంథం తెలియజేస్తుంది. "అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను ఎవడైనా తినినను, లేక ఆయన పాత్రనుండి త్రాగినను అతడు ప్రభుని శరీరమునకు, రక్తమునకు వ్యతిరేకముగా పాపం చేయుచున్నాడు" (1 కొరింతి 11 : 27 ) అని పునీత పౌలు గారు చాలా స్పష్టముగా మనకు తెలియజేస్తున్నారు. కనుక ప్రభుని శరీర రక్తములను స్వీకరించు ప్రతిసారి ప్రతిఒక్కరు వారు యోగ్యముగా ఆయనను స్వీకరిస్తున్నారు లేదా అని ఆత్మ పరిశీలన చేసుకొని ఆయనను స్వీకరించాలి.
2. తీర్పునకు గురియవుతాము:
అయోగ్యముగా ప్రభువుని స్వీకరిస్తే, స్వీకరించేది ప్రభుని నిజమైన శరీర రక్తములు అని గుర్తింపనిచో తీర్పుకు గురియవుతామని పునీత పౌలు గారు సెలవిస్తున్నారు. "ఎవడైనను రొట్టెను తినుచు, పాత్రనుండి త్రాగుచు అది ప్రభుని శరీర రక్తములని గుర్తింపనిచో, అతడు తినుటవలనను, త్రాగుటవలనను తీర్పునకు గురియగును" (1 కొరింతి 11:29 ) అని పరిశుద్ధగ్రంధం పలుకుచున్నది. కనుక మనము స్వీకరించేవి యేసుక్రీస్తుని నిజమైనటువంటి శరీర రక్తములు అని గుర్తించి, యోగ్యముగా స్వీకరించినట్లైతే రానున్న తీర్పునుండి మనము తప్పించుకోగలము.
మనం ఎల్లప్పుడూ ప్రభువు సువిశేషంలో పలికిన మాటలను గుర్తుంచుకోవాలి. "నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు. నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు" (యోహాను 6 : 35 ).కనుక ఎల్లప్పుడూ పరిశుద్ధతతో ప్రభుని శరీర రక్తములయందు నిండు విశ్వాసం కలిగి యోగ్యముగా ప్రభువుని స్వీకరించడానికి ప్రయత్నించాలి. ఆ ప్రభువుని యోగ్యముగా స్వీకరించడంతో క్రైస్తవుల పని అయిపోవడం లేదు. ప్రభుని యోగ్యముగా స్వీకరించిన పిమ్మట ఆయన మనకు ఒక కర్తవ్యాన్ని, భాధ్యతను ఇస్తున్నారు. "ఈ రొట్టెను భుజించునప్పుడెల్ల, ఈ పాత్రనుండి పానము చేయునప్పుడెల్ల ప్రభువు వచ్చు వరుకు ఆయన మరణమును ప్రకటించాలి" (1 కొరింతి 11:26 ). ప్రభువుని స్వీకరించిన పిమ్మట ఆయన మరల వచ్చువరకు ఆయన మరణమును ప్రపంచ నలుమూలల ప్రకటించడం ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క బాధ్యత.
కనుక క్రిస్తునాధుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా! ప్రభుని ఎల్లప్పుడూ నిండు విశ్వాసంతో, సంపూర్ణ పరిశుద్ధతో యోగ్యముగా స్వీకరించి ఆ ప్రభువు ఒసగే గొప్ప వరములను పొందే అనుగ్రహమును దయచేయమని ఈనాటి దివ్యబలి పూజలో ఆ క్రిస్తునాధుని వేడుకుందాము.
17, జూన్ 2022, శుక్రవారం
సామాన్య కాలపు పన్నెండవ ఆదివారము
క్రీస్తు ప్రభువు శరీర రక్తాల మహోత్సవము
ఆది 14: 18-20 , 1 కొరింతి 11: 23-26 , లూకా 9: 11-17
క్రీస్తునాధుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు తల్లి శ్రీసభ దివ్యసత్ప్రసాద మహోత్సవమును కొనియాడుతున్నది. ఈనాటి మూడు పఠనములు సంపూర్ణ సమర్పణ గూర్చి ధ్యానించమని మన అందరిని తల్లి అయిన శ్రీ సభ మన అందరిని ఆహ్వానిస్తోంది.
మొదటి పఠనంలో మేల్కేసెదెకు క్రీస్తుకు సంకేతంగా ఉంటాడు, ఇతడు రాజు, యాజకుడు. ఇతడు రొట్టె ద్రాక్ష రసాలను పదోవంతు దేవునికి అర్పించాడు. ఇతనికి ప్రతిబింబమైన క్రీస్తు కూడా దేవునికి ఇవే కానుకలు అర్పించాడు. కనుక క్రీస్తు మనకు నూతన మేల్కేసెదెకు లాంటి వాడు.
సువిశేష పఠనంలో యేసు ప్రభు ఐదు రొట్టెలను, రెండు చేపలను ఐదువేల మందికి ఆహారంగా సమకూర్చి, వారి యొక్క భౌతికమైన ఆకలి తీర్చాడు.
మరియు రెండొవ పఠనంలో క్రీస్తు ప్రభు మన అందరి కోసం తన శరీరమును, మరియు రక్తమును మన అందరి యొక్క ఆధ్యాత్మిక ఆకలి తీరుస్తుంది.
1) దివ్య సత్ప్రసాదం మనలను క్రీస్తుతో ఐక్యం చేస్తోంది: భౌతికమైన ఆహారం మన శరీరాన్ని పోషిస్తుంది. అలాగే దివ్య సత్ప్రసాదం మన ఆత్మను పోషిస్తుంది. అది మన్నాను మించిన భోజనం, మన్నా కేవలం భౌతిక ఆహారం కానీ సత్ప్రసాదం ఆధ్యాత్మిక ఆహారం. ఈ ఆహారం ద్వారా భక్తుడు క్రీస్తుతో ఐక్యమౌతాడు. క్రీస్తు తన తండ్రి నుండి జీవని పొందుతాడు. ఈ యొక్క దివ్య సత్ప్రసాదం ద్వారా మనం క్రీస్తు నుండి జీవన్నీ పొందుతాము. దివ్య సత్ప్రసాదం ఒక విందు, మనకు జీవం ఇచ్చే విందు. కనుక మనం దీని స్వీకరించటానికి పూజలో పాల్గొంటే చాలదు, కానీ ఈ పరమ భోజనాన్ని కూడా స్వీకరించాలి అప్పుడే మనకు విందు అవుతుంది. యేసు ప్రభు మానవ దేహాన్ని చేకొన్నపుడు ఆ దేహాన్ని దేవుడు జీవమయం చేసాడు. ఈ జీవమయ శరీరాన్ని భుజించినప్పుడు మనము కూడా సమృద్ధిగా జీవాన్ని పొందుతాము. నిప్పులో పెట్టిన ఇనుప ముక్క తాను నిప్పు అవుతుంది, అలాగే జీవ పరిపూర్ణుడైన క్రీస్తుని భుజించిన మనం కూడా జీవంతో నిండిపోతాం. క్రీస్తు తండ్రి నుండి, మనం క్రీస్తునుండి జీవన్నీ పొందుతాము.
దివ్య సత్ప్రసాదం మనకు ఉత్తానమును ప్రసాదిస్తుంది. విత్తనాన్ని భూమిలో నాటుతాం. దానిలోని జీవ శక్తి వలన అది మళ్ల మొలకెత్తుతుంది. అలాగే మనం స్వీకరించిన దివ్య సత్ప్రసాదం ఒక బీజంలా మనలో ఉండిపోతుంది. భూమిలో పాతి పెట్టిన మన శరీరం ఆ జీవ బీజం వలన మళ్లా లోకాంతంలో మొలకెత్తుతుంది. అదే మన ఉత్థానం. అన్ని భోజనాలు మనలోకి మారతాయి. కానీ దివ్య భోజనం మనలోకి మారదు. మనలని తనలోకి మార్చుకుంటుంది. అది మనలోకి మారితే మన లాగే పాపపు మానవుడు అవుతుంది. కానీ అది దేవుడు కనుక మనలను తనలోనికి మార్చుకొంటుంది. మనకు దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది.
2. దివ్య సత్ప్రసాదం మనలను తోటి నరులతో ఐక్యం చేస్తుంది:- పునీత పౌలు గారు ఇలా పలికారు ఒకే రొట్టెను భుజించే మనమంతా ఒక శరీరమౌతాం . అనగా సత్ప్రసాదం స్వీకరించే వారు ఒకరితో ఒకరు ఐక్యంమౌతారాని భావం . తొలినాటి యెరూషలేములోని భక్తులు ఈ ఆహారం పరస్పరం ఐక్యమై సమష్టి జీవనం గడిపారు. నేడు మనము ఇలాగే ఐక్యమై ప్రేమ జీవితం గడపాలి . దివ్య సత్ప్రసాదంలో వుండే ఆత్మ మనలను ఐక్యం చేస్తుంది.
చాలా గోధుమ గింజలు ఒక అప్పంగా, చాలా ద్రాక్షపండ్లును నలిపి పాత్రలోని చేరెడు రసంగా తయారు చేస్తాం. వీటిని స్వీకరించిన మనం కూడా ఒక్క సమాజంగా ఐక్యం అవుతాం.
సత్ప్రసాద బలి సిలువ బలి . ఆ బలి ఏక కుటుంబం గా ఐక్యం చేసేది. శిరస్సులోని అవయవాలు తమలో తాము ఐక్యం కావాలి క్రీస్తు పెక్కు అవయవాలతో ఏక శరీరం లాంటి వాడు. ఆ శరీరం మనమే. క్రీస్తులోనికి ఐక్యమైన వారిలో జాతి, వర్గ, లింగ, భేదాలు ఉండకూడదు. కానీ మనదేశంలోని ప్రజలు ఎప్పుడు కుల, వర్గ, లింగ, విభజనలతో సతమత మవుతుంటారు. దేవుడితో ఐక్యం కావటం సులభం. తోటి నరుడితో ఐక్యం కావటం కష్టం. ఇలాంటి పరిస్థితులలో సత్ప్రసాదం మనకు ఐక్య సాధనం కావాలి. ప్రొటెస్టెంట్ శాఖలకు మనకు కూడా ఐక్యత చేకురాలి.
3. దివ్య సత్ప్రసాదం యేసు ప్రభువు యొక్క జ్ఞాపకార్థం;
క్రీస్తు రొట్టెను ద్రాక్షారసమును ఆశీర్వదించి శిష్యులకు ఇచ్చిన పిమ్మట, మీరు దీనిని నా జ్ఞాపకార్ధం చేయండి అన్నాడు. ఇక్కడ దేనిని అంటే? క్రీస్తు చేసిన కార్యాన్ని . అతడు రొట్టెను తీసుకొని దేవుని స్తుతించి దానిని విరిచి శిష్యులకు ఇచ్చారు. వాళ్ళను తినమన్నారు. అలాగే పాత్రను తీసుకొని దేవునికి వందనములు అర్పించి దానిని శిష్యులకు ఇచ్చి పానము చేయమన్నారు. ఈ క్రియలన్నిటిని క్రీస్తు చేసినట్లుగానే తరువాత శిష్యులుకూడా చేయాలి . దివ్య సత్ప్రసాద బలి క్రీస్తు జ్ఞాపకార్ధం జరగాలి. అనగా భక్తుడు, క్రీస్తు యొక్క మరణ పునరుత్తానమును తండ్రికి జ్ఞాపకం చేస్తారు. ఆ తండ్రి తన కుమారుని మరణమును పునరుత్తానమును జ్ఞప్తికి తెచ్చుకొని ఆ కుమారుని విశ్వసించే భక్తులందరిని కనికరిస్తారు.
ప్రతి పూజలో మనం క్రీస్తు మరణ పునరుత్తనాలను తండ్రికి జ్ఞాపకం చేసేటప్పుడు రెండు పనులు చేస్తాం. మొదటిది ఆ క్రీస్తు ద్వారా మనలను రక్షించినందులకు తండ్రికి మనం వందనాలు అర్పిస్తాం.
రెండవది ఆ క్రీస్తుని చూచి ఇప్పుడు కూడ మనలను కాచి కాపాడాలని తండ్రికి మనవిచేస్తాం.
దివ్య సత్ప్రసాదం గురించి మన తల్లియైన తిరుసభ గొప్పగా బోధిస్తుంది. దివ్య సత్ప్రసాదం అంటే గోధుమ అప్పము యొక్కయు ద్రాక్షారసము యొక్కయు గుణములలో యేసు నాదుని దివ్య ఆత్మా దివ్య శరీరము, రక్తము , దైవ స్వభావము వేంచేసియుండు దేవద్రవ్యఅనుమానము అని భోదిస్తుంది.
దీనిని ఒక్కముక్కలో చెప్పాలంటే దివ్య సత్ప్రసాదము అంటే సాక్షాత్తు యేసు ప్రభువే .
మరి ఎందుకు యేసు ప్రభువు దీని స్తాపించాడు అంటే ;
మొదటిగా మన ఆత్మకు దివ్య భోజ్యమై ఉండుటకు యోహాను 6 ; 53 -56 లో చూస్తే దేవుడు ఇలా అంటున్నాడు , మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన తాగిననే తప్ప మీలో జీవము ఉండదని అని పలికారు. అయితే మనఅందరిలో జీవం ఉండాలంటే మన ఆత్మా రక్షింపబడాలి అంటే మనందరం ఈ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించాలి. దీనిని మనం భాహ్యమయిన కళ్ళతో చూడక అంతరంగిక హృదయముతో విశ్వాస దృష్టితో చూడాలి . అప్పుడే మనం పరమ రహస్యాన్ని గ్రహించగలం.
అందుకే పునీత పౌలు గారు కూడా అంటున్నారు దేవుని పాత్రలోనిది మనం ఆశీర్వదించి త్రాగునప్పుడు రక్తమున పాలు పంచుకొనుట లేదా ? 1 కొరింతి 11: 27 -30
2. మనతో వాసము చేయుటకు:
యోహాను 15 :4
"నేను మీయందు ఉందును మీరు నాయందు ఉండదు." యేసు ప్రభువు ఒక్క శిష్యులు ప్రాణ భయముతో ఎమ్మావు మార్గములో వెళ్లుచున్నప్పుడు , దేవుడు వారికీ దర్శనమిచ్చాడు. ఆయన వారితో మాట్లాడిన తరువాత వారు యేసు ప్రభువుని "మాతో ఉండుడు అని అడిగారు. మరి యేసు ప్రభువు వారితోనే ఉండుటకు రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చారు. లూకా 24 :30 . దీని అర్థం ఏమిటంటే యేసు ప్రభువు తాను ప్రేమించినవారితో ఉండటానికి తనను తానూ త్యాగం చేసుకొని తనవారితో వాసం చేశాడు అని అర్థం .
అదే విధంగా యేసు ప్రభువు మనల్ని అనాధలుగా విడిచి పెట్టడు .
పునీతుల వ్యక్తిగత జీవితాలలో దివ్య సత్ప్రసాదం నుండి పొందిన అనుభూతి.
పునీత జాన్ మరియ వియాన్ని గారు దివ్య సత్ప్రసాదం ముందు మోకరించి ప్రార్థించి తార్సు పట్టణాన్ని మార్చాడు.
పునీత మథర్ థెరెసా గారిని ఒకరోజు, అమ్మ నీ శక్తికి గల కారణమేమిటి అని అడిగినప్పుడు, ఆమె ఇలా అంది ; రోజు దివ్యసత్ప్రసాదం ముందు గంట సేపు మోకరించి ప్రార్థించటమే. వీరిలా మనకు విశ్వాసముంటే ఇంకా ఎన్నో అద్భుతాలు పాత నిబంధనలో చుస్తే దివ్యమందసాన్ని ఓబేదెదోము ఇంటికి ఆహ్వానింపగా వారి కుటుంబము అమితముగా ఆశీర్వదింపబడినది. 2 సమూయేలు 6 :11- 12 .
1 వ సమూయేలు 7 : 6 లో ప్రజలు మిస్ఫా వద్ద ప్రోగై పాపములను ఒప్పుకొని , దహన బలిని సమర్పించిన తరువాత ఫిలిస్తెయులను దేవుడు శిక్షించారు. చివరకు సాలొమోను దేవాలయమును నిర్మించి మందసాన్ని మందిరంలో ఉంచారు.
మరి ఇంత శక్తి దివ్య మందసంలో ఇమిడి ఉండటానికి దాంట్లో ఏముందంటే "మోషే హోరేబు కొండ చెంత ఉంచిన రెండు రాతి పలకలు , మన్నా , మరియు అహరోను కర్రా . వీటికే ఇంత శక్తి ఉంటె ఇప్పుడు మన దివ్య మందసంలో సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడు యేసు క్రీస్తు నివసిస్తున్నాడు. ఆయొక్క దివ్య సత్ప్రసాదానికి ఇంకెంత శక్తి ఉండాలి. కాబట్టి మనమందరం కూడా దివ్య సత్ప్రసాదముయొక్క శక్తిని , పవిత్రతను తెలుసుకొని ఆయనను కొనియాడుతూ కృతజ్ఞతలు చెల్లిస్తూ విశ్వాసంతో ఆయనను స్వీకరించి ఆయనలో ఏకమవుటకు ప్రయత్నిద్దాం. ఆమెన్.
By బ్రదర్ . సైమన్
అనుదిన దైవ వాక్కు ధ్యానం
మత్తయి 7: 19-23
మంచి పండ్లనీయని ప్రతి చెట్టును నరికి మంటలో పడవేయుదురు. కావున వారి ఫలములవలన వారిని మీరు తెలిసికొనగలరు. ప్రభూ!ప్రభూ!అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు!కాని, పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. కడపటి రోజున అనేకులు ప్రభూ! ప్రభూ ! నీ నామమున గదా మేము ప్రవచించినది, పిశాచములను పారద్రోలినది, అద్భుతములు అనేకములు చేసినది అని నాతో చెప్పుదురు. అపుడు వారితో నేను దుష్టులారా! నా నుండి తొలగిపోండు. మిమ్ము ఎరుగనే ఎరుగను అని నిరాకరింతును.
యేసు ప్రభువు ఈనాటి సువిశేషంలో మంచి పండ్లనియని ప్రతిచేట్టును నరికి మంటలో పడవేయుదురు అని చెబుతున్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఆ చెట్టు మొక్కగా ఉన్నప్పటి నుండి ఎదిగి పండ్లు ఇచ్చే స్థితి వరకు దానిని పెంచి , పెద్ద చేసి అది మంచి పండ్లను ఇవ్వాలని దానికి కావలనసిన అన్నీ రకాల ఎరువులు వేసి పెంచిన తరువాత, అది మంచి పండ్లను ఇవ్వకపోతే దానిని రైతు నరికి వేస్తారు. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవునిచే ప్రేమించ బడినవాడే. ప్రతి వ్యక్తికి దేవుడు తగిన విధమైన ప్రతిభను ఇచ్చాడు. దానిని వినియోగించుకొని తగిన ప్రతిఫలాన్ని ఇవ్వవలసిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంది.
"వారి ఫలములవలన వారిని మీరు తెలిసికొనగలరు." యేసు ప్రభువు ఇక్కడ కపట ప్రవక్తల గురించి మాటలాడుతున్నారు. వారి ఫలముల వలన వారిని మీరు తెలుసుకోగలరు. ఎందుకంటే బయటకు దేవుని సందేశమును ప్రవచిస్తున్నాము అని వారికి ఉపయోగపడే మాటలను మాత్రమే వారు అనేక సార్లు చెబుతున్నారు. ఒక విధముగా యేసు ప్రభువు పరిసయ్యుల జీవితాలను ఉద్దేశించి మాటలాడిన మాటలు ఇవి. వీరు చెప్పే మాటలు అన్నీ మంచిగా ఉన్నాయి అనిపిస్తాయి. కాని చాలా స్వార్ధంగా ఉంటాయి. ఉదా .. తల్లిదండ్రులను గౌరవించాలి అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఒక వేళ దేవాలయానికి మనం అర్పణ ఇచ్చి తల్లిదండ్రులకు మిమ్ములను చూసుకోవాలసిన సొమ్మును నేను దేవాలయానికి ఇచ్చాను అని చెప్పినట్లయితే అప్పుడు వారు తల్లిదండ్రులను చూడనవసరం లేదు అని వారు బోధించారు.
కేవలం ఇది మాత్రమే కాదు. అనేక విషయాలు వినడానికి చాలా బావుంటాయి. కాని దేవునికి ఇష్టమైన పనులు కాదు. వారి ఫలములు అనేక సార్లు ఏమి చేస్తాయి అంటే ఇతరులకు నష్టమును కలుగజేస్తాయి. ఉదా.. వీరు కాపరుల వలె మందలోనికీ వస్తారు కాని క్రూర మృగమును చూసి వీరు పారిపోతారు. వారి ప్రాణముల కొరకు మందలను నాశనం చేస్తారు. వీరు అనేక మంచి విషయములు చెప్పిన మంచి పనులు వీరు చేయరు. అందుకే వీరిని యేసు ప్రభువు మీరు బయటకు సుందరముగా ఉన్న సమాధులు వంటివారు అని అన్నారు. బయటకు చాలా అందముగా ఉన్నకాని లోపల మొత్తం కుళ్లిపోయిన శరీరమే ఉంది. కేవలం మనం చేసే ప్రతి మంచి పని వలన మాత్రమే మనలని ఇతరులు తెలుసుకోగలగాలి. మనం చూపించే ప్రేమ, కరుణ, దయ వంటి గుణాల వలన మనం ఆయన అనుచరులం అని పిలిపించుకోగలగాలి.
"ప్రభూ!ప్రభూ!అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు!కాని, పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును." యేసు ప్రభువు మాటలు మనం చాలా శ్రద్దగా ఆలకించాలి. మనం ప్రతి నిత్యం ప్రార్దన చేయడానకి దేవుని గురించి చెప్పడానికి ప్రాధాన్యత ఇస్తాము , అది తప్పు కాదు. కాని దాని కంటే ముఖ్యం మనం దేవుని చిత్తానుసారముగా జీవించుట. యేసు ప్రభువు తండ్రి చిత్తము నెరవేర్చడం తన ఆహరముగా భావించాడు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఎంతటి కష్టమైన అనుభవించడానికి సిద్దపడ్డాడు, కష్టాన్ని అనుభవించాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు.
కపట ప్రవక్తలు ఎవరు ఇటువంటి జీవితానికి సిద్ద పడలేదు. వాటి నుండి దూరంగా వెళ్లిపోయారు. వారు స్వార్ధంతో జీవించారు. ఎవరైతే ఇటువంటి జీవితానికి సిద్ద పడుతారో వారికి దైవ రాజ్యంకు అర్హుడవుతాడు. తండ్రి చిత్తము అనేది మనకు ఎలా తెలుస్తుంది? పది ఆజ్ఞలు ఇవ్వడం ద్వారా దేవుడు తన చిత్తము తెలియజేశాడు. ప్రవక్తల ద్వారా తన చిత్తము తెలియజేశాడు. తన కుమారుని ద్వారా తన చిత్తము తెలియజేశాడు. నాకు ఆయన చిత్తము తెలియదు అని మనం చెప్పలేం. ఎందుకంటే తన చిత్తం ఏమిటి అని తండ్రి ఎప్పుడు తెలియ పరుస్తూనే ఉన్నాడు. మనం ప్రతి నిత్యం ప్రభూ ప్రభూ అని అనుటకంటే ఆయన చిత్తము నెరవేర్చడానికి పునుకోవాలి.
"ప్రభూ! ప్రభూ ! నీ నామమున గదా మేము ప్రవచించినది, పిశాచములను పారద్రోలినది, అద్భుతములు అనేకములు చేసినది అని నాతో చెప్పుదురు. అపుడు వారితో నేను దుష్టులారా! నా నుండి తొలగిపోండు. మిమ్ము ఎరుగనే ఎరుగను అని నిరాకరింతును." యేసు ప్రభువు ఇచ్చేటువంటి కొన్ని అనుగ్రహాలు ద్వారా శిష్యులు కొందరు కొన్ని అద్భుతాలు చేసి వారు అంతిమ దినమున మేము మీ పేరున అనేక గొప్ప పనులు చేశాము , పిసచ్చములు పారద్రోలాము అని చెబుతారు అయిన నేను వారిని నేను తిరస్కరిస్తాను అంటున్నారు. నేను మిమ్ము ఎరుగను అంటాను అని చెబుతున్నారు. కారణం ఏమిటి అంటే వీరు ఎంతటి గొప్ప పనులు చేసిన దేవుని చిత్తము వీరు నెరవేర్చారా ? లేదా? అనేది ముఖ్యం. వీరు ఆజ్ఞలు పాటించి , ఆయన చిత్తం నెరవేర్చితె అంటే ఆయన చూపిన సుగుణాలు కలిగి జీవిస్తూ తండ్రి చిత్తం నెరవేర్చడానకి ఎంతకైనా మనం పాటుపడితే అప్పుడు ఆయన మనలను ఎరుగుతాను అని అంటారు.
ప్రార్దన : ప్రభువా ! నా జీవితంలో నేను మీ ప్రేమను, దయను , ప్రతిభను , కరుణను పొందాను. కాని దానికి తగిన విధముగా నా జీవితములో మంచి ఫలాలు ఇవ్వడంలో నేను విఫలం చెందాను. అటువంటి సమయాల్లో నన్ను క్షమించండి. నేను మరలా నా జీవితంలో మీరు ఇచ్చిన అన్నీ అనుగ్రహాలును వాడుకొని మంచి ఫలాలు ఇచ్చే విధంగా నన్ను దీవించండి. ప్రభువా మీ చిత్తమును విడచి పెట్టి ఈ లోక విషయముల మీద చాల సమయం వృధా చేశాను ప్రభువా. నేను కూడా మీ వలె తండ్రి చిత్తము నెరవేర్చడం నా ఆహారం అనే విధంగా నా జీవితాన్ని మార్చండి . మీ చిత్తం నెరవేర్చే వానిగా నన్ను మార్చండి. ఆమెన్ .
15, జూన్ 2022, బుధవారం
అనుదిన దైవ వాక్కు ధ్యానం
మత్తయి 6:7-15 (జూన్ 16,2022)
సువిశేషం: అన్యులవలె అనేక వ్యర్ధపదములతో మీరు ప్రార్ధింపవలదు. అటుల చేసినగాని, దేవుడు తమ మొరనాలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలయునో మీరడుగక మునుపే మీ తండ్రి ఏరిగియున్నాడు. మీరిట్లు ప్రార్ధింపుడు: పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పవిత్రపరుపబడునుగాక! నీ రాజ్యము వచ్చునుగాక!నీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక! నేటికీ కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు, మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక, దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన యెడల, పరలోక మందలి, మీ తండ్రి , మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపనియెడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు.
ఈనాటి సువిశేషంలో యేసు ప్రభువు శిష్యులకు ఎలా ప్రార్దన చేయాలి అని నేర్పిస్తున్నారు . అన్యుల వలె వ్యర్ధ పదములతో మీరు ప్రార్ధింప వలదు అని వారికి చెపుతున్నారు. ఎందుకు వీరు అనేక పెద్ద పెద్ద మాటలతో , గొప్ప వర్ణలతో దేవుడుని ప్రార్ధిస్తారు అంటే దేవునికి ముఖ స్తుతి ఇష్టం అని వీరు భావిస్తారు, అందుకే చాలా అందమైన పదాలను వాడటానికి ఇష్టపడుతారు. నిజానికి దేవునికి ఇటువంటివి ఇష్టం వుండదు. దేవుడు మన వేడుకోలును అలకించాలి అంటే మనకు కావలసినది భాష ప్రావీణ్యత కాదు. పొగుడుటలో పట్టాలు కాదు. ఈ లోకం యొక్క మెప్పును పొందాలి అనుకునేవారు, దేవుని గురించి సరిగా అర్ధం చేసుకొనివారు చేసే విధంగా కాకుండా తన శిష్యులు ఏ విధంగా దేవున్ని ప్రార్ధించాలి అని యేసు ప్రభువు చెబుతున్నారు.
మీకు ఏమి కావలయునో మీరు అడుగక మునపే మీ తండ్రి ఏరిగియున్నాడు . దేవునికి మనం అవసరములు అన్నీ కూడా తెలుసు. మనం కష్ట సుఖాలు అన్నీ ఆయనకు ఎరుకయే. దేవుని మన అవసరములు తెలియదు అన్నట్లు మనం ప్రవర్తిస్తుంటాం. ఏలియా ప్రవక్త, బాలు ప్రవక్తలతో గొడవ పడినప్పుడు ఆ ప్రవక్తలను ఈ విధముగానే హేళన చేసింది. మీ దేవర నిద్ర పోతున్నదేమో ఇంకా పెద్దగా అరవండి అని అంటున్నారు. దేవుడు మనకు ఉన్న సమస్యలను ఇతర దేవరల వలె చూడలేని వాడు కాదు. మనం ఎప్పుడు ఆయన కనుసన్నలలోనే ఉంటాము. దేవునికి నీ అవసరం తెలుసు అదే విధముగా నీ కోరిక తెలుసు. నిన్ను ఎంత పరీక్షించాలో తెలుసు.
"మీరిట్లు ప్రార్ధింపుడు: పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పవిత్రపరుపబడునుగాక! నీ రాజ్యము వచ్చునుగాక!నీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక!" ఇక్కడ యేసు ప్రభువు మనకు దేవుడు తండ్రి అని చెబుతున్నారు. ఆయనతో మనం మాటలాడటానికి చాలా ఆనంద పడాలి. ఎందుకంటే దేవుడు ఎక్కడో మనకు దూరంగా ఉండాలి అనుకునే వ్యక్తి కాదు. ఆయన ఎల్లప్పుడు మనతో ఉండాలి అనుకుంటారు. ఆయన పరలోకంలో ఉన్నారు. ఎందుకంటే ఆయన చిత్తం ఎల్లప్పుడు అక్కడ నెరవేర్చబడుతుంది.
ఎక్కడ దేవుని చిత్తం నెరవేర్చబడుతుందో అక్కడ దేవుడు ఉంటారు. ఎప్పుడైతే భూలోకంలో కూడా దేవుని చిత్తం పూర్తిగా నెరవేర్చ బడుతుందో అప్పుడు భూలోకం కూడా పరలోకంలానె ఉంటుంది. మనం ప్రార్ధించాలనది దేవుని నామమును ఎల్లప్పుడు పవిత్ర పరచ బడాలి అని. దేవుని అందరు కీర్తించాలి అని. దేవుని నామమును అపవిత్రం చేయడం అంటే దేవున్ని కాకుండా దేవునిచే సృష్టిని దేవునిగా ఆరాధించడం. దేవుని రాజ్యం రావాలని మనం ప్రార్దన చేయాలి అని ప్రభువు చెబుతున్నారు.
ఏమిటి ఈ దేవుని రాజ్యం. ఎటువంటి అసమానతలు లేని రాజ్యం, అందరు సోదర భావంతో మెలిగే రాజ్యం. ఒకరికోకరు ప్రేమ కలిగి జీవించే రాజ్యం. ప్రతి నిత్యం దైవ సాన్నిద్యం అనుభవించే రాజ్యం. ఇటువంటి రాజ్యం ఈ లోకంలో రావాలని ప్రార్ధించాలి. ఈ రాజ్యాన్ని స్థాపించాలని యేసు ప్రభువు కృషి చేశారు. అందుకే దేవుని రాజ్యం సమీపించినది అని ప్రభువు చెప్పినది. ఇటువంటి రాజ్యం అంటే దేవుని రాజ్యం ఈ లోకంలో స్థాపించ బడాలి అప్పుడు నీకోరికలు అవసరాలు అన్నీ, ఏది కూడా కష్టమైనది కాదు. ఇది మొత్తం సాధ్యం ఎప్పుడైతే దేవుని చిత్తం ఇక్కడ జరుగుతుందో అప్పుడు. దానికోసం మనం ప్రార్దన చేయాలి.
"నేటికీ కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు, మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక, దుష్టుని నుండి రక్షింపుము." దైవ రాజ్యం, ఆయన చిత్తం గురించి ప్రార్ధించిన తరువాత నేటికీ కావాలసిన ఆహారం కోసం ప్రార్దన చేయమంటున్నారు. మన భౌతిక అవసరముల కోసం ప్రార్దన చేసిన తరువాత ప్రభువు మనకు చెప్పేది సమాజంలో మన జీవించే తీరు గురించి. మనం ఏ విధముగా ఇతరుల పట్ల ప్రవర్తిస్తున్నామో మన పట్ల కూడా అదేవిధముగా ప్రవర్తించమని దేవున్ని ఆడగమని ప్రభువు చెబుతున్నారు. నీవు ఇతరులను క్షమించకుండా , ఇతరులకు ప్రేమను పంచకుండా దేవుని నుండి వాటిని ఆశించవద్దు అని ప్రభువు చెబుతున్నారు.ఈలోకం మీద , లోకం వస్తువుల మీద మనకు అనేక శోదనలు వస్తుంటాయి. వాటిలోనికి పడిపోకుండా మనలను రక్షించమని ప్రార్ధించమని చెబుతున్నారు. అనేక మంది గొప్ప వారు ఈ లోక ఆశలకు లోనై దేవున్ని విడనాడి జీవించి ఆయన అనుగ్రహాలు కోల్పోయారు.
ప్రార్ధన : ప్రభువా! పరలోక ప్రార్దన ద్వారా మేము ఏమి కోరుకోవాలో, ఏమి కోరుకోకూడదో తెలియజేస్తున్నారు ప్రభువా. దేవా!మీ చిత్తమునే ఎల్లప్పుడు ఈ లోకంలో మేము కోరుకునే విధముగా మమ్ము దీవించండి. అనేక సార్లు మేము అన్యుల వలె అనేక వ్యర్ధ పదాలతో ప్రార్దన ఇతరుల కంట పడాలి అని, మేము బాగా ప్రార్ధన చేస్తాము అని అనిపించుకోవాలని ప్రార్దన చేసిన సమయాలు ఉన్నవి ప్రభువా, అటువంటి క్షణాలలో మమ్ములను క్షమించండి. వాక్యంలో చెప్పబడిన విధముగా మొదట దేవుని చిత్తమును వెదికే వారీగా మమ్ము దీవించండి. మీ చిత్తమును నెరవేర్చిన తరువాత ప్రభువా, మేము మీ రాజ్యమునకు అర్హులము అవుతాము. మీ చిత్తములో క్షమాపణ ఉంది. మీ చిత్తమును నెరవేర్చువాడు. ఇతరులను క్షమిస్తాడు. ప్రేమిస్తాడు. మీ కరుణకు పాత్రుడు అవుతాడు. మమ్ములను మీ చిత్తము నెరవేర్చేవారిగా చేసి , మీ రాజ్యంలో చేర్చుకోనండి. ఆమెన్.
14, జూన్ 2022, మంగళవారం
అనుదిన దైవ వాక్కు ధ్యానం (మత్తయి 6:1-6,16-18 )
మత్తయి 6:1-6,16-18 ( జూన్ 15, 2022)
సువిశేషం: మనుష్యుల కంటబడుటకై వారియెదుట మీ భక్తి కార్యములు చేయకుండ జాగ్రత్తపడుడు. లేనియెడల పరలోకమందలి మీ తండ్రినుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్ధనా మందిరములలోను , విధులలోను డాంబికులు చేయునట్లు నీవు నీ దానధర్మములను మేళతాళాలతో చేయ వలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది యున్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానము చేయునపుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము. అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము నొసగును. కపట భక్తులవలే మీరు ప్రార్ధన చేయవలదు. ప్రార్ధనామందిరములలో, వీధులమలుపులలో నిలువబడి, జనులు చూచుటకై ప్రార్ధనలుచేయుట వారికి ప్రీతి. వారికి తగినఫలము లభించెనని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్దన చేయునపుడు నీవు నీ గదిలో ప్రవేశించి, తలుపులు మూసికొని అదృశ్యుడైయున్న నీ తండ్రిని ప్రార్ధింపుము అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము ఒసగును. మీరు ఉపవాసము చేయునపుడు, కపట వేషధారులవలె విచారవదనములతో నుండకుడు, వారు తమ ఉపవాసము పరులకంట పడుటకై విచారవదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించెనని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. అందు వలన అదృశ్యుడైయున్న నీ తండ్రియేకాని, మరెవ్వరునునీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తన బహుమానమును బాహాటముగ ఒసగును.
దేవునిచేత ఎలా ప్రశంసించబడాలి?
"మనుష్యుల కంటబడుటకై వారియెదుట మీ భక్తి కార్యములు చేయకుండ జాగ్రత్తపడుడు. లేనియెడల పరలోకమందలి మీ తండ్రినుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు." యేసు ప్రభువు తన శిష్యులకు వారు ఏ విధముగా భక్తి కలిగి ఉండాలి అని చెబుతున్నారు. మన భక్తి దేవునికి మనకు మధ్య వ్యక్తిగతమైనదిగా ఉండాలి అని ప్రభువు కోరుతున్నాడు. మన భక్తి ఇతరులకు చూపించడానికి కాదు అనే విషయం తెలియ పరుస్తున్నారు. ఎందుకు యేసు ప్రభువు ఈ మాటలను చెబుతున్నారు అంటే పరిసయ్యులు , ధర్మ శాస్త్ర బోధకులు వారి భక్తి క్రియలన్నీ ఇతరులకు కనబడే విధముగానే చేసేటువంటి వారు. అందరు వారి భక్తికి వారిని గౌరవంగా చూసేవారు మరియు ప్రశంసించేవారు. ఎప్పుడైతే వీరిని అందరు గొప్పగా పొగుడుతున్నారో, ఆ పొగడ్తలకు మురిసిపోయి వాటి కోసమే వారి భక్తిని బయట చూపించేవారు. ఇది ఎంత వరకు వెళ్ళింది అంటే వారి జీవితాలు కపటత్వంతో నిండిపోయేంతగా వెళ్ళింది. ఇతరులు చూడకుండ వీరు ఏమి చేయడానికి ఇష్టపడలేనంతగా వీరి జీవితాలు ఉన్నాయి. ఇది మనం ఎక్కడ చూస్తాము అంటే వారు బయట నుండి ఒక వస్తువు తీసుకొని వచ్చినప్పుడు దానిని బయట శుభ్రంగా కడిగితే సరిపోతుంది, లోపల అవసరం లేదు అని చెప్పేంతగా వీరు జీవిస్తున్నారు.
కొన్ని సంవత్సరాల క్రిందట చదివిన ఒక చిన్న కధ గుర్తుకు వస్తుంది. ఒక ఊరిలో ఒక పెద్ద పేరు మోసిన ఒక లాయరు గారు ఉన్నారు. ఆయన అనేక కేసులలో పేదలవైపున వాదించి పేదలకు సాయం చేసేవారు. ఆ విధంగా ఆయనకు మంచి పేరు వచ్చింది. అందరు ఆయనను పొగిడేవారు. గొప్పవాడు అని అందరు ఆయనను కీర్తించే వారు. పేదల పెన్నిది అని చెప్పేవారు. ఈ లాయరు గారు, ఈ పొగడ్తలకు బాగా అలవాటు పడి పోయాడు. రాను రాను ఏ మంచి పని చేయాలన్న ఎవరైన ఉన్నారా ? నేను చేసే మంచి పని చూడటానికి, అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా ఒక వేళ తాను చేసే మంచి పని చూడటానికి ఎవరు లేకపోతే, ఆ మంచి పని చేయడం మని వేశాడు. ఎందుకంటే తాను చేసే మంచి పని, కేవలం కీర్తి , ప్రతిష్టలకోసం , తాను చేసే పని చూడటానికి ఎవరు లేనప్పుడు తాను ఆ పని చేసేవాడు కాదు. ఒక రోజు తాను కారులో ప్రయాణం అయి పోతుండగా అక్కడ చెరువులో ఒక స్త్రీ నీటిలో మునిగి పోతూ , తనను రక్షించమని వేడుకుంటుంది. ఆ దారిలో పోతున్న ఈ లాయరు గారికి ఆ అరుపులు వినపడుతాయి. తాను ఆమెను రక్షించినట్లయితే దానిని చూడటానికి , చూసిన తరువాత దాని గురించి చెప్పి, తనను పొగడటానికి ఎవరైన ఉన్నారా? అని ఆ లాయరు గారు చుట్టు ప్రక్కల చూసి, ఎవరు లేరు అని గ్రహించి, ఆమెను కాపాడకుండా వెళ్ళిపోతాడు. మనం చేసే ప్రతి పనిని ప్రభువు చూస్తూనే వుంటాడు. మనకు బహుమానము ఇచ్చేది ప్రభువే కాని మానవ మాత్రులు కారు. ఇతరులు కంట, పడటానికే మనం మంచి పని చేస్తే అది స్వార్ధంతో చేసిన పని అవుతుంది.
యేసు ప్రభువు మనం చేసే ప్రతి మంచి పని, అది భక్తి తో కూడిన పని అయిన లేక ఉపకారంతో కూడిన పని అయిన ఇతరుల మెప్పు పొందుటకు చేయ వద్దు అని చెబుతున్నారు. మన ప్రభువు మనం చేసే అన్నీ పనులను చూస్తారు, ఇతరులు మెప్పు పొందుటకు మనం మంచి పనులు చేస్తే ఇతరులు మనలను మెచ్చుకుంటారు. మనం పొందవలసిన బహుమానం మనం పొందాము అని ప్రభువు చెబుతున్నారు. మనం బహుమానం పొందవలసినది తండ్రి దగ్గర నుండి. ఆయన మన పనులకు సరి అయిన బహుమానం ఇస్తారు.
డాంభీకములు చెప్పుకోవడం లేక మేము గొప్ప అని అని పించుకోవడం అనేది మన అజ్ఞానం వలనే జరుగుతుంది. మనం చేసే ప్రతి మంచి పని దేవుడు మనకు ఇచ్చిన ఒక అవకాశం, దానిని మనం సద్వినియోగం చేసుకోవడం కూడా ఆయన కృపనే. కనుక అందుకు మనం ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండాలి.
యేసు ప్రభువు మనం ఉపవాసం చేసేటప్పుడు మనం ఎటువంటి విచారాన్ని బయట పడనివ్వకుండ ఉండమని చెబుతున్నారు. ఎందుకంటే మన భక్తి క్రియలన్నీ చూసే ప్రభువు ఖచ్ఛితముగా మనకు కావలసిన అనుగ్రహాలు, ఇస్తారు అని చెబుతున్నారు. అంతే కాదు ప్రభువు మనకు ఈ అనుగ్రహాలు , బహుమానాలు బాహాటముగా ప్రకటిస్తారు అని చెబుతున్నారు. అప్పుడు మన మంచి తనాన్ని దేవుడే అందరికి తెలియజేస్తారు. దేవునిచేత మనం గొప్ప వారిగా కీర్తించ బడేలా జీవించమని ప్రభువు చెబుతున్నారు.
ప్రార్ధన : ప్రభువా! నా జీవిత ప్రయాణంలో అనేక సార్లు ఇతరుల చేత పొగిడించుకోవాలని, మంచి వాడను అని పించుకోవాలని, ఎన్నో మంచి పనులు చేయలని లేకపోయినా చేశాను ప్రభువా. దాని ద్వార నేను మంచి వాడిని అని గొప్ప వాడిని అని పేరు పొందాను. కాని ఎవరు చూడని సమయాలలో అవకాశం ఉండికూడ మంచి చేయడానికి ముందుకు వెళ్లలేదు ప్రభువా. కేవలం నా మంచి పనిని చూడటానికి ఎవరు ఉండరు అనే ఒకే కారణంతో మంచి చేసే అవకాశం వదులుకున్నాను ప్రభువా. ఇటువంటి సంఘటనలు అనేకం నా జీవితంలో జరిగాయి. ఆ సంఘటనలు అన్నింటిని ఈ రోజు మీ ముందు ఉంచుతున్నాను ప్రభువా. ఇటువంటి ఘటనల నుండి నన్ను క్షమించండి ప్రభువా. మరల ఇటువంటివి నా జీవితంలో జరుగకుండా నన్ను నడపండి. ఇక నుండి నేను చేసే ప్రతి పని ఇతరుల మెప్పు కోసం కాకుండా కేవలం మీ మీద గల ప్రేమ వలనే చేసే విధంగా నన్ను దీవించండి. ప్రభువా , ఇతరుల మెప్పు కాకుండా మీరు మెచ్చుకునే విధంగా జీవించే వానినిగా మార్చండి. ఆమెన్.
13, జూన్ 2022, సోమవారం
అనుదిన దైవ వాక్కు ధ్యానం (మత్తయి 5: 43-48 )
మత్తయి 5: 43-48 (జూన్ 14, 2022)
సువిశేషం: "నీ పొరుగువానిని ప్రేమింపుము; నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పిబడిన దానిని మీరు వినియున్నారుగదా! నేనిపుడు మీతో చెప్పునదేమన : మీ శత్రువులను ప్రేమింపుడు. మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్ధింపుడు. అపుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలయన, ఆయన దుర్జనులపై , సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపజేయుచున్నాడు. సన్మార్గులపై , దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపజేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును? సుంకరులు సైతము అటులచేయుట లేదా?మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత యేమి? అన్యులు సహితము ఇట్లు చేయుటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక!
నీ పొరుగు వానిని ప్రేమింపుము ; నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారుగదా! మీ పొరుగువానిని ప్రేమింపుము అని లెవీయకాండంలో మరియు ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం. శత్రువును ద్వేషింపుము అని మనం చూడము. కాని వారి వ్యావహారిక విషయాలలో అది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం అంటే ఇష్టం లేని వారిని ప్రేమించడం మనకు చాలా కష్టం. మనలను ద్వేషించే వారిని ప్రేమించడం అంత సులువైన విషయము కాదు. ఆ విధంగా చేయడానికి మనం చాలా అధ్యాత్మికంగా ఎదగాలి . మనం అంటే ఇష్టం లేని వారిని ద్వేషించడం లేక దూరం పెట్టడం మనం కొన్ని సారులు చేస్తుంటాము. కాని ఇది దేవుని వాక్కును సరిగా అర్ధం చేసుకోకుండా మనం చేసే పని. యేసు ప్రభువు ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వారికి వారి ఆలోచనలు సరి చేస్తున్నారు. ఎందుకు వారు ఈ విధంగా ఆలోచించకూడదు అని బోధిస్తున్నారు. అందుకే యేసు ప్రభువు మీ శత్రువులను ప్రేమింపుడు అని అంటున్నారు.
మీ శత్రువులను ప్రేమింపుడు. యేసు ప్రభువు చెప్పిన ఈ మాటలు అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యపరచి ఉండవచ్చు. ఇవి సాధ్యపడే మాటలు కాదు అని అనిపించి ఉండవచ్చు. నేను ఎలా నా నాశనము కోరుకునే వ్యక్తిని ప్రేమించాలి? అని అనుకోని ఉండవచ్చు. మనం కూడా అటులనే అనుకుంటూ వుండవచ్చు. అసలు నేను ఎందుకు నన్ను వ్యతిరేకించే, లేక నాకు కీడు తలపెట్టే వ్యక్తిని ప్రేమించాలి? అని మనం ఆలోచించినప్పుడు మనకు ఒక విషయం అర్ధం అవుతుంది. అది ఏమిటి అంటే ప్రేమకు మాత్రమే మానవుడు లొంగిపోతాడు. మనం ఒక వ్యక్తిని గెలవ గలిగేది కేవలం ప్రేమతో మాత్రమే. మనం ద్వేషం చూపిస్తే తాను అదే విధంగా స్పందిస్తాడు కాని ప్రేమకు మాత్రము దాసోహం అవుతారు. వారు మారి అనేక మందికి మార్గ చూపరులు అవుతారు. ప్రేమకు మొదటిలో కోపంతో లేక ద్వేషంతో స్పందించిన తరువాత ఖచ్చితంగా వారు మారుతారు. అందుకే మానవున్ని ఎప్పుడు దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. తన వద్దకు ఆహ్వానిస్తూనే ఉంటాడు.
"మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్ధింపుడు. అప్పుడు మీరు పరలోక మందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు" : ఆదిమ క్రైస్తవులు ఈ పనులు ఖచ్ఛితముగా పాటించారు. వారిని రాజులు, పాలకులు హింసించినప్పుడు వారి కొరకు ప్రార్ధన చేశారు. స్తేఫాను గారు అందరు రాళ్ళు వేస్తున్న కూడా ఆయన యేసు ప్రభువు వలె ప్రభువు వీరు చేయునదేమో వీరికి తెలియదు వీరిని క్షమించు అని ప్రార్ధన చేశారు. ఆయన మాత్రమే కాదు, అనేక మంది ఆదిమ క్రైస్తవులు ఈ విధంగా ప్రార్ధన చేశారు, వారిని ఇతరులు హింసించినప్పుడు. హింసించే వారి మీద పగ తీర్చుకోలేదు. ఎందుకంటే వారికి తెలుసు ఇతరులను హింసించే వారు వారి అజ్ఞానంతో ఆ పని చేస్తున్నారు అని . దైవ జ్ఞానం కలిగి వివేకం కలిగిన దైవ జనుడు అటువంటి హింసను చేయడు. కాని వారి కోసం ప్రార్ధన చేస్తారు. ఇది యేసు ప్రభువు చూపించిన మార్గం. ఆయనను సైనికులు హింసిస్తున్న వారి కోసం ప్రార్దన చేస్తున్నారు. అప్పడు కూడా తన ప్రక్క వాని విన్నపాన్ని ఆమోదీస్తున్నారు. ఆయన దేవుని కుమారుడు. మనలను కూడా ఆయన వలె చేయమని చెబుతున్నారు. ఈ విధంగా జీవించడం వలన మనం దేవుని కుమారులం కాగలమని ప్రభువు చెబుతున్నారు.
అంతేకాదు ఇది దేవుని గుణం. ఆయన ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరిపై తన ప్రేమను ఒకే విధంగా చూపిస్తున్నారు. "ఏలయన, ఆయన దుర్జనులపై , సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపజేయుచున్నాడు" ఈ సువిశేషము మనలను దేవుని గుణగణాలు కలిగి ఉండే వారిగా జీవించమని కోరుతుంది. మన జీవితంలో మనం ఎంత గొప్ప ధ్యేయలు సాధించిన కాని యేసు ప్రభువు మనకు చూపిస్తున్న ఈ గొప్ప గుణాలు అంతటివి అవి కాలేవు. ఎందుకంటే ఇవి దైవ లక్షణాలు. అంతే కాదు యేసు ప్రభువు ఇక్కడ ఇంకొక మాట చెబుతున్నారు, మిమ్ములను ప్రేమించే వారిని మాత్రమే మీరు ప్రేమిస్తే దానిలో మీ గొప్పతనం ఏమి ఉంది అని అడుగుతున్నారు. అందరు ఆ విధంగానే చేస్తారు కదా! సుంకరులు కూడా అలానె చేస్తున్నారు. యూదులు సుంకరులను , తక్కువ వారిగా చూసేవారు. అంటే మీరు ఎవరి కంటే గొప్ప కాదు అని ప్రభువు వారికి చెబుతున్నారు. క్రీస్తు అనుచరునిగా , దేవుని నమ్మిన వానిగా నేను పరిపూర్ణత కలిగి జీవించాలి. ఆయన ప్రేమ , వాత్సల్యం ఇతరులకు పంచగలగాలి. దిని కోసం ప్రభువు నన్ను పిలుచుకున్నాడు అని విశ్వసించి మనం జీవించాలి.
ప్రార్దన : ప్రభువా ! మా జీవితంలో అనేక సార్లు నేను నిజమైన క్రీస్తు అనుచరునిగా జీవించాలి అని అనుకుంటున్నాను కాని ఈలోక ఆశలు లేక ఇతరుల మీద నాకున్న చెడు అభిప్రాయాలు వలన అందరిని దూరం పెడుతూ , ఎవరికి నీ ప్రేమను చూపించ కుండ జీవిస్తున్నాను. నీవు మాత్రము ప్రభువా, నేను నీ వలె, తండ్రి వలె పరిపూర్ణత కలిగి ఉండాలని కోరుకుంటున్నావు ప్రభువా, నేను నీ వలె జీవించలేక పోయినందుకు , ఆ అవకాశాలు చేజార్చుకున్నందుకు నన్ను క్షమించండి ప్రభువా. నాలో ఉన్న చెడు లక్షణాలును, ఇతరులను ద్వేషించే మనస్సును, హింసించే హృదయాన్ని తీసివేయండి. ఇతరులను క్షమిస్తు, ప్రేమిస్తూ మీ సుగుణాలును అలవర్చుకునే అనుగ్రహం నాకు దయ చేయండి. ఎప్పుడు ఎవరిని ద్వేషించకుండ అందరిని ప్రేమించె మనస్సును ఇవ్వండి ప్రభువా. మీ యొక్క కుమారుని వలె జీవించెలా జేయండి. ఆమెన్ .
4, జూన్ 2022, శనివారం
పెంతుకోస్తు మహోత్సవం(2)
పెంతెకోస్తు మహోత్సవము
పెంతెకోస్తు మహోత్సవము
నిత్య జీవము ఎలా వస్తుంది
యోహాను 6: 22-29 మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...