18, జూన్ 2022, శనివారం

క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము(3)

క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము

ఆది 14:18-20
1 కొరింతి 11: 23-26
లూకా  9: 11-17

 క్రీస్తు నాధుని యందు ప్రియ సహోదరి సహోదరులారా! ఈనాడు తల్లి శ్రీసభ 'దివ్యసత్ప్రసాద మహోత్సవం లేదా క్రీస్తు శరీర రక్తముల మహోత్సవాన్ని  కొనియాడుచున్నది. దివ్యసత్ప్రసాదం యేసుక్రీస్తు ప్రభువు మానవాళికి అనుగ్రహించిన ఒక గొప్ప వరం. ఎందుకనగా, దివ్యసత్ప్రసాదం రూపంలో ఆయన ఎల్లప్పుడూ మనతో వాసం చేస్తున్నారు, మనలోకి వేంచేస్తున్నారు.  ఏడు దివ్య సంస్కారాలలో  దివ్య సత్ప్రసాదానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది . 

దివ్య సత్ప్రసాదం  ద్వారా ప్రతి దివ్య సంస్కారము సంపూర్ణమవుతున్నది. అటువంటి క్రిస్తునాధుని శరీర రక్తముల మహోత్సవాన్ని కొనియాడే గొప్ప ఆశీర్వాదం ఈనాడు తల్లి శ్రీసభ మనందరికీ ఒసగుచున్నది.
ఈ పండుగను శ్రీసభ ప్రారంభం నుండి జరుపుకునేవారము కాదు. ఈ పండుగ  13 వ శతాబ్దంలో ప్రారంభమైనది.

పండుగ ప్రారంభం: బెల్జియం దేశం లియోజపురం నివాసియైన జులియాన  అనే కన్యాస్త్రికి తరచుగా ఒక దృశ్యం కనిపిస్తూ ఉండేది. ఆ దృశ్యంలో ఆమె ధగధగమెరుస్తున్న చంద్రుని, దానిలో ఒక మచ్చను చూస్తుండేది.  అది ఒక అద్భుతమని తెలుసుకున్న ఆమె దానిగురించి ఇతరులకు చెప్పడానికి భయపడేది. ఎందుకనగా ఆ దృశ్యం భావమేమిటో ఆమెకు తెలియదు కాబట్టి దాని గురించి ఇతరులకు ఎలా చెప్పాలో ఆమెకు తెలిసేది కాదు. ఆ దృశ్యం భావం తెలియజేయమని ఉపవాసాలతో దేవునికి దీర్ఘ ప్రార్ధనలు చేసేవారు. తన ప్రార్ధనలు ఆలకించిన యేసు ప్రభువు ఆ దృశ్యం భావాన్ని ఆమెకు అర్ధమయ్యేలా చేశారు. అలా ఆమె ఆ దృశ్యం భావాన్ని గ్రహించగలిగింది. ఆ దృశ్యం భావమేమనగా చంద్రుడు శ్రీసభ కాగా, దివ్య సత్ప్రసాద గౌరవార్ధం ప్రత్యేక ఉత్సవం లేని కొరతే ఆ చంద్రునిలో మచ్చ. 

ఆ ఉత్సవం ఏర్పాటు చేయ తోడ్పడాల్సిందిగా తనను ప్రభువు ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఆమె గ్రహించింది. తాను ఒక సాధారణ కన్యాస్త్రి కనుక ఆ ఉత్సవం ఎలా ఏర్పాటు చేయించాలో తనకు అర్ధమయ్యేది కాదు. ఇలా తనలో తాను సతమతమవుతుండగా శ్రీసభ పెద్దలను ఆశ్రయించమని దేవుడు ఆమెకు ప్రేరేపణ కలిపించాడు. ముందుగా ఆమె ఈ దృశ్యం గురించి కొంతమంది భక్తులకు, ముఖ్యమైన గురువులకు తెలియజేశారు. వారందరు లియోజపురం పీఠాధిపతిని కలిసి విషయం తెలియజేసి, తమ మేత్రాసనంలో దివ్య సత్ప్రసాద ఉత్సవం ఏర్పాటు చేయాల్సిందిగా పీఠాధిపతిని అభ్యర్ధించారు. తత్ఫలితంగా రోబర్టో పీఠాధిపతులు 1246 సంవత్సరంలో తమ గురువులకు అధికార పూర్వకమైన ఉత్తరువులు పంపి ఈ ఉత్సవాన్ని స్థాపించాలని ఆదేశించారు. అలా ఆ మేత్రాసనంలో ఆ ఉత్సవం ప్రారంభమైనందున ప్రజలు ఉత్సవం ద్వారా దివ్య సత్ప్రసాదం ప్రాముఖ్యతను గ్రహించారు. అది చూసిన ఇతర పీఠాధిపతులు తమ  మేత్రాసనాల్లో కూడా ఈ  పండుగను ప్రారంభించారు.  తరువాత ఈ ఉత్సవం మెల్లగా మెల్లగా ఇతర దేశాలకు విస్తరించింది. చివరికి 1264 సంవత్సరంలో మూడవ ఉర్బను పోపుగారు ఈ ఉత్సవాన్ని శ్రీసభ అంతటా జరపాలని ఆదేశించారు. అలా ఈ  ఉత్సవం క్రైస్తవులలో యేసుక్రీస్తు దివ్య శరీర రక్తల పట్ల గౌరవం, భక్తిని పెంపొందించింది.

ఈ  విధంగా ఆనాడు ఈ  ఉత్సవం ఒక్క మేత్రాసనంలో మొదలై ఈనాడు ప్రపంచమందంతటా క్రైస్తవులు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా జర్మనీ దేశస్థులు ఈ  ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుకుంటారు.  

పరిశుద్ధ గ్రంధంలో మొదటి మూడు సువిశేషములలో యేసుప్రభువు కడరా భోజనం రోజున దివ్య సత్ప్రసాదాన్ని  స్థాపిస్తూ తన శరీర రక్తములను మనకు ప్రసాదించినటువంటి ఒక గొప్ప కార్యాన్ని మనం చూస్తున్నాం. "యేసు రొట్టెనందుకొని, ఆశీర్వదించి, త్రుంచి శిష్యులకు ఇచ్చుచు 'మీరందరు దీనిని తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము' అనెను. తరువాత పాత్రమునందుకొని, కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చుచు, 'దీనిని మీరు పానము చేయుడు. ఇది అనేకుల పాపపరిహారమై చిందబడనున్న నా రక్తము. దీనిని నా జ్ఞాపకార్ధము చేయుడు' అనెను" (మత్తయి 26: 26-29, మార్కు 14: 22-25,  లూకా  22: 17-20) అని మనం పవిత్రగ్రంథంలో యేసుప్రభువు పలికిన మాటలను వింటున్నాం.  ఈనాడు ఆ యేసుక్రీస్తుని శరీర రక్తములను ఏ విధంగా స్వీకరిస్తున్నాం? యోగ్యముగా స్వీకరిస్తున్నామా లేక అయోగ్యముగా స్వీకరిస్తున్నామా ? యోగ్యముగా స్వీకరించడమంటే మన స్వీకరించబోయేది కేవలం అప్పద్రాక్ష రసములు కాదు నిజమైన ప్రభుని శరీర రక్తములనే మనం స్వీకరిస్తున్నాం అని నిండు విశ్వాసం కలిగియుండి, అలా స్వీకరించుటకు కావలసిన పరిశుద్ధతను కలిగియుండడమే. 

ఈరోజు అటువంటి నిండు విశ్వాసంతో, గొప్ప పరిశుద్ధతతో ఆ ప్రభుని మనం స్వీకరిస్తున్నామా? 

ఎందుకు విశ్వాసం, పరిశుద్ధత కలిగియుండాలి? 

     "విశ్వాసంపై ఆధారపడనిది ఏదైనా పాపమే" (రోమా 14 : 23 ) అని పునీత పౌలు గారు అంటున్నారు. అనగా ప్రభుని శరీర రక్తములను విశ్వాసంతో స్వీకరించకపోతే అది పాపమే అంటున్నారు పౌలుగారు. అదేవిధంగా "పరిశుద్ధ జీవితమును గడుపుటకై ప్రయత్నించండి. ఏలయన, అది లేకుండా ఎవరును ప్రభువును చేరలేరు" (హెబ్రీ 12 : 14 ) అని  హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ మనకు తెలియజేస్తుంది.  అనగా పరిశుద్ధత అనేది ప్రభువుని చేరడానికి మనకు  ఉన్న ఒక ముఖ్యమైన మార్గమని పవిత్రగ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా! ప్రభుని స్వీకరించాలి అంటే విశ్వాసం, పరిశుద్ధత అనేవి మనకు చాలు ముఖ్యం.

 యోగ్యతతో ప్రభువుని శరీర రక్తాలను స్వీకరిస్తే:

యేసుక్రీస్తు ప్రభువుని మనం నిండు విశ్వాసంతో, సంపూర్ణ పరిశుద్ధతో స్వీకరిస్తే ఈనాడు ప్రభువు మనకు మూడు గొప్ప అనుగ్రహాలను దయచేస్తున్నారు. 

1. నిత్య జీవం, అంతిమ దినమున లేపబడతాము:

ఈనాటి సమాజంలో నిత్యజీవము లేదా శాశ్వత జీవం అనగానే అనేకమంది ఈలోక సంబంధమైన వస్తువులలో వెతుకుతూ ఉంటారు. ఏదైనా సరే క్షణాల్లో వచ్చేయాలి అనుకుంటాం.  కానీ ఈనాడు ప్రభువు మనకు జీవాన్ని పొందడానికి ఉన్న అసలైన మార్గాన్ని తెలియజేస్తున్నారు.  "నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నిత్యజీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును" (యోహాను 6 : 54 ) అని ప్రభువు సెలవిస్తున్నారు. ఆయన శరీర రక్తములను యోగ్యముగా స్వీకరించుట వలన మనం నిత్య జీవాన్ని పొందడమే కాకుండా అంతిమ దినమున ఆయన చేత లేపబడతాము. ఆయన శరీర రక్తముల ద్వారా నిత్యజీవాన్ని పొందే గొప్ప అనుగ్రహం కథోలిక విశ్వాసులమైన మనకు దయచేయడం మన అదృష్టంగా భావించాలి.

2. ప్రభువు మనయందు, మనం ప్రభుని యందు ఉంటాము:

ప్రభువు తన శరీర రక్తముల ద్వారా మనకు ఇస్తున్న మరొక గొప్ప వరం మన ప్రభునియందును, ప్రభువు మనయందును జీవిస్తారు. "నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వాని యందును ఉందును" (యోహాను 6 : 56 ) అని ప్రభువు పలుకుచున్నారు. పరిశుద్ధుడు, కరుణామయుడైన ఆ ప్రభువు మనలోనూ, మన కుటుంబములలోను, మన సంఘములోను జీవించాలన్నా, మనం ప్రభుని తిరుహృదయములోను, క్రీస్తు సంఘములో నిజమైన క్రైస్తవ బిడ్డలుగా జీవించాలన్నా ఆ ప్రభువుని యొక్క శరీర రక్తములు మనకు ఆ అనుగ్రహాన్ని దయచేస్తాయి. కనుక యోగ్యముగా ప్రభువుని స్వీకరిస్తూ ఆ ప్రభుని మన హృదయాలలోనికి, మన కుటుంబాలలోని, మన సంఘాలలోనికి ఆహ్వానించుదాం.

3. ప్రభువుని మూలమున ఎల్లప్పుడూ, నిరంతరం జీవిస్తాము:

ప్రభువు తన శరీర రక్తముల ద్వారా మనకు అనుగ్రహిస్తున్న మరొక గొప్ప వరం ఆయన మూలమున జీవించడం. మనం అనేకమార్లు మనకు వున్నా ధనాన్ని, ఆస్తిపాస్తులను, కండబలాన్ని, సమాజంలో మనకున్న పలుకుబడిని చూసుకొని విర్రవీగుతుండవచ్చు. వీటి మూలమున మనం సంతోషంగా, ఆనందంగా జీవించవచ్చు, ఇంకేమి అవసరం లేదు అనుకుంటుంటాం కానీ ప్రభువు ఇవన్నీ అశాశ్వతమైనవని మనకు తెలియజేస్తున్నారు. "పరలోకమునుండి దిగివచ్చిన జీవముగల ఆహారమును నేనే. నన్ను భుజించువాడు నా మూలమున జీవించును, నన్ను భుజించువాడు ఎల్లప్పుడును, నిరంతరము జీవించును" (యోహాను 6 : 51 , 57 - 58 ) అని ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. కనుక మన జీవితం ఈలోక  సంపదలు, ఈలోక వస్తువుల మూలమున కాకుండా జీవమునిచ్చు ఆ యేసుక్రీస్తుని మూలమున జీవించాలి. ఆ విధముగా జీవించాలి అంటే ఆయన శరీర రక్తములను మనం యోగ్యముగా స్వీకరించాలి.

ఒకవేళ అయోగ్యముగా ప్రభువుని స్వీకరిస్తే ఏమౌతుంది?

విశ్వాసంతో, పరిశుద్ధతో ప్రభువుని స్వీకరిస్తే ఆయన అనుగ్రహాలు పొందినట్లే, అవిశ్వాసంతో, అపరిశుద్ధతతో ప్రభువుని స్వీకరిస్తే మనం జీవితంలో ఏం జరుగుతుంది?

1. పాపం చేసినట్లే:

విశ్వాసము, పరిశుద్ధ లేకుండా ఎవరైనా అయోగ్యముగా ప్రభువుని స్వీకరిస్తే మనం పాపం చేయుచున్నట్లే అని పవిత్రగ్రంథం తెలియజేస్తుంది. "అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను ఎవడైనా తినినను, లేక ఆయన పాత్రనుండి త్రాగినను అతడు ప్రభుని శరీరమునకు, రక్తమునకు వ్యతిరేకముగా పాపం చేయుచున్నాడు" (1 కొరింతి 11 : 27 ) అని పునీత పౌలు గారు చాలా స్పష్టముగా మనకు తెలియజేస్తున్నారు. కనుక ప్రభుని శరీర రక్తములను స్వీకరించు ప్రతిసారి ప్రతిఒక్కరు వారు యోగ్యముగా ఆయనను స్వీకరిస్తున్నారు లేదా అని ఆత్మ పరిశీలన చేసుకొని ఆయనను స్వీకరించాలి.

2. తీర్పునకు గురియవుతాము:

అయోగ్యముగా ప్రభువుని స్వీకరిస్తే, స్వీకరించేది ప్రభుని నిజమైన శరీర రక్తములు అని గుర్తింపనిచో తీర్పుకు గురియవుతామని పునీత పౌలు గారు సెలవిస్తున్నారు. "ఎవడైనను రొట్టెను తినుచు, పాత్రనుండి త్రాగుచు అది ప్రభుని  శరీర రక్తములని గుర్తింపనిచో, అతడు తినుటవలనను, త్రాగుటవలనను తీర్పునకు గురియగును" (1 కొరింతి 11:29 ) అని పరిశుద్ధగ్రంధం పలుకుచున్నది. కనుక మనము స్వీకరించేవి యేసుక్రీస్తుని నిజమైనటువంటి శరీర రక్తములు అని గుర్తించి, యోగ్యముగా స్వీకరించినట్లైతే  రానున్న తీర్పునుండి మనము తప్పించుకోగలము. 

మనం ఎల్లప్పుడూ ప్రభువు సువిశేషంలో పలికిన మాటలను గుర్తుంచుకోవాలి. "నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు. నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు" (యోహాను 6 : 35 ).కనుక ఎల్లప్పుడూ పరిశుద్ధతతో ప్రభుని శరీర రక్తములయందు నిండు విశ్వాసం కలిగి   యోగ్యముగా ప్రభువుని స్వీకరించడానికి ప్రయత్నించాలి. ఆ ప్రభువుని యోగ్యముగా స్వీకరించడంతో క్రైస్తవుల పని అయిపోవడం లేదు. ప్రభుని యోగ్యముగా స్వీకరించిన పిమ్మట ఆయన మనకు ఒక కర్తవ్యాన్ని, భాధ్యతను ఇస్తున్నారు. "ఈ రొట్టెను భుజించునప్పుడెల్ల, ఈ పాత్రనుండి పానము చేయునప్పుడెల్ల ప్రభువు వచ్చు వరుకు ఆయన మరణమును ప్రకటించాలి" (1 కొరింతి 11:26 ). ప్రభువుని స్వీకరించిన పిమ్మట ఆయన మరల వచ్చువరకు ఆయన మరణమును ప్రపంచ నలుమూలల ప్రకటించడం ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క బాధ్యత. 

కనుక క్రిస్తునాధుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా! ప్రభుని ఎల్లప్పుడూ నిండు విశ్వాసంతో, సంపూర్ణ పరిశుద్ధతో యోగ్యముగా స్వీకరించి ఆ ప్రభువు ఒసగే గొప్ప వరములను పొందే అనుగ్రహమును దయచేయమని ఈనాటి దివ్యబలి పూజలో ఆ  క్రిస్తునాధుని వేడుకుందాము.

 By Br. Joseph Kampally OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...