18, జూన్ 2022, శనివారం

దివ్య సత్ప్రసాద మహోత్సవము(4)

దివ్య సత్ప్రసాద మహోత్సవము

ఆది 14 : 18 - 20 , 1 కొరింతి 11 : 23 -26 , లూకా 9 : 11 -17

ద్వితియో 8 : 2 -3 , 14 - 16 , 1 కొరింతి 10 : 16 - 17 , యోహాను 6: 51 -58 .

నేడు తల్లి శ్రీ సభ క్రీస్తు ప్రభువు యొక్క పరమ పవిత్ర శరీర రక్తముల పండుగను కొనియాడుచున్నది. 

దైవార్చన సంవత్సరంలో దివ్య సత్ప్రసాదం యొక్క గొప్ప తనం గురించి రెండు ప్రత్యేకమైన రోజులలో ధ్యానించుకుంటాం. 

1. పవిత్ర గురువారం రోజున 

2. ప్రభువు పునరుతనమైన 9 వారాల తర్వాత.

దివ్య సత్ప్రసాదం అనేది క్రీస్తుప్రభువు శ్రీసభకు ఇచ్చిన గొప్ప సంపదం. దాని వలననే శ్రీ సభ జీవించుచున్నది . పరిశుద్ధ 16 వ బెనెడిక్ట్ పాపు గారు అంటారు దివ్య సత్ప్రసాదం లేనిది శ్రీ సభ ఉనికి లేదు అని.

దివ్య సత్ప్రసాదం అనేది ప్రభువు యొక్క అమూల్యమైన వరం. ఆయన కడరాత్రి భోజనమున దివ్యసత్ప్రసాదమును స్థాపించారు.

కేవలం కథోలిక సంఘంలో వున్న విశ్వాసులకు దేవుడిని తమలోకి స్వీకరించే అదృష్టం కలుగుతుంది. ఏ దేవాలయము కు  వెళ్లిన కేవలం దేవుడికి అర్పించిన ప్రసాదం తీసుకుంటారు. కానీ కథోలిక శ్రీ సభ లో దేవుడిని దివ్యసత్ప్రసాదంలో తమ యొక్క హృదయంలోకి ఆహ్వానించుకుంటారు.

పాస్కా పండుగ దినముల తరువాత ఎందుకు ఈ పండుగను కొనియాడుతారంటే ప్రభువు శిష్యులతో "నేను లోకాంతము వరకు సదా మీతో ఉందును అని వాగ్దానం చేశారు. మత్తయి 28 : 20 . ఈ విధంగా ఆయన దివ్య సత్ప్రసాదంలో దాగి వున్నారు.

దేవుడు మనతో చిరకాలము ఉండుటకు దివ్యసత్ప్రసాదంను స్థాపించారు.

దివ్య సత్ప్రసాదం కథోలిక విశ్వాస సంప్రదాయంలో గుండెకాయ వంటిది . మానవుల యొక్క జీవితంలో హృదయం అనేది కేంద్రం . హృదయం లేనిది మనిషి జీవించలేడు. అలాగే దివ్యసత్ప్రసాదం లేనిదే కథోలిక విశ్వాసం లేదు.

ప్రభువు యొక్క శరీరము నిజమైన ఆహారము ఆయన యొక్క రక్తము నిజమైన పానము. 

కడరాత్రి భోజనమున దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని చెప్పి ఆయన మన కోసమే తన శరీరమును రక్తమును ఇచ్చి వున్నారు.

శ్రీసభ ఈ పండుగను స్థాపించటానికి 4 కారణాలు వున్నాయి.

1 దివ్యసత్ప్రసాదంలో క్రీస్తు ప్రభువు నిజంగా ప్రత్యక్షమై వున్నారని తెలుపుటకు. 

2 దివ్య సత్ప్రసాదంలో దాగివున్న క్రీస్తు ప్రభువుకు చెందిన అవమానాలకు పరిహారం చెల్లించుటకు. 

3 దివ్యసత్ప్రసాదం ద్వారా మనం పొందే మేలులకు కృతజ్ఞతా తెలుపుటకు.

4 తరుచుగా అందరం దివ్యసత్ప్ర సాదం స్వీకరించి దేవునితో ఐక్యమై జీవించుట కొరకు స్థాపించబడినది.

దివ్య సత్ప్రసాదంలో చాలా శక్తి దాగి వున్నది . దివ్య సత్ప్రసాదమే మనలను దేవునితో ఐక్యపరుస్తుంది.

ఈ నాటి మొదటి పఠనంలో షాలేము రాజు అయిన మేల్కేసెదెకు సమర్పించిన రొట్టె , ద్రాక్షారసము గురించి చెప్పబడినది. 

అబ్రహాము శత్రు సైన్యములను జయించి బంధింపబడి ఉన్న లోతును విడిపించుకొని వచ్చే సమయంలో మేల్కేసెదెకు రాజు అబ్రహామును కలుసుకొనుటకు వస్తారు.

మేల్కేసెదెకు ఒక రాజు మాత్రమే కాదు ఆయన దేవుని యొక్క పూజారికూడా (ఆది 14 : 18 ) అంటే దేవునికి బలులు సమర్పించే యాజకుడు.

మేల్కేసెదెకు యాజకత్వమునకు పుట్టుపూర్వోత్తరాలు లేవు అయినా కానీ ఆయన దేవుని యొక్క యాజకుడు. అని పవిత్ర గ్రంధం తెలుపుతుంది. పవిత్ర గ్రంథంలో వున్న మొదటి యాజకుడు. కీర్తన 110 :4 .

ఒక దేవుని యొక్క యాజకుడిగా మేల్కేసెదెకు అలసిపోయిన అబ్రహాముకు రొట్టెను, ద్రాక్షారసమును ఇచ్చి బలపరుస్తున్నాడు.

మేల్కేసెదెకు అబ్రహామును యావే దేవునిపేరిట దీవిస్తున్నారు. ఆయన సమర్పించిన రొట్టె, ద్రాక్షారసము బలి అర్పణకు సూచనగా ఉంది. రొట్టెను, ద్రాక్ష రసమును సమర్పించుట పూర్వ నిభందన కాలంలో అత్యంత ప్రధానమైన సాంప్రదాయంగా మారింది.

-యేసు క్రీస్తు ప్రభువు యొక్క యాజకత్వం మేల్కేసెదెకు యాజకత్వ వారసత్వంను కలిగి వున్నదని హెబ్రీయులకు వ్రాసిన లేఖలో తెలిపారు. హెబ్రి  7 , 8 అధ్యాయాలు . క్రీస్తు ప్రభువు లేవీయుల గోత్రమునకు చెందినవారు కారు. అయినా కానీ ఆయన నిత్యుడగు యాజకుడు; ఆయన తన శరీర రక్తములనే  రొట్టెగా, ద్రాక్షా రసముగా సమర్పించారు.

మేల్కేసెదెకు దేవునియొక్క ఆత్మ ప్రేరణ చేతనే రొట్టె, ద్రాక్షరసాలను ప్రభువుకు సమర్పించారు. 

వాస్తవానికి ఆనాటి అన్యజాతీయులు జంతువుల మాంసంతోను, రక్తంతోను తమ దేవదూతలకు , దేవుళ్ళకు బలులు సమర్పించాలి. కానీ మేల్కేసెదెకు  దానికి భిన్నముగా కేవలం రొట్టె, ద్రాక్ష రసాలు సమర్పించారు. ఎందుకంటే అవి క్రీస్తు ప్రభువు యొక్క రక్షణ బలికి సుమాత్రుకగా ఉన్నాయి.

మేల్కేసెదెకు  రొట్టె ద్రాక్ష రసములను ఇవ్వుట మాత్రమే కాదు అబ్రహామును దీవిస్తున్నారు. 

ఈనాటి రెండవ పఠనంలో క్రీస్తు ప్రభువు, వారు అర్పించిన బలి గురించి పౌలు గారు కొరింతు ప్రజలకు వివరిస్తున్నారు.

ప్రభువు యొక్క అపోస్తులులు తన మరణ, పునరుత్తానం తరువాత రొట్టె విరుచుటలో ప్రతిదినము సమావేశమయ్యేవారు. ఈ యొక్క సంప్రదాయంను అందరు పాటించే వారు ఎందుకంటే క్రీస్తు ప్రభువు వారు అన్నారు దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు అని.

మనందరం రొట్టెను , ద్రాక్షణారసమును పానము చేయునప్పుడు దేవునియొక్క రక్షణమును జ్ఞాపకం చేసుకోవాలి ఆయనయొక్క త్యాగం, ఆయన యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి.

యావే దేవుడు ఆనాడు మన్నాను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చారు. ఈనాడు క్రీస్తు ప్రభువు తనను తాను బలిగా సమర్పించుకొని తన శరీర రక్తాలు మనకు ఒసగి వున్నారు.

దేవునికి మనం కృతఙ్ఞతలు తెలపాలి.

దివ్య సత్ప్రసాదం స్వీకరించిన మనందరం అన్యోన్యంగా జీవించాలి ఎందుకంటే అందరిలో క్రీస్తు ప్రభువు వున్నారు. అనేక మంది కలిసి ఒకే పిండితో, నీతితో చేసిన రొట్టెను పంచుకొనుట ద్వారా మనందరం క్రీస్తు నందు ఒకే ప్రజగా ఉంటున్నాం.

మనం ఏ ప్రాంతమునకు వెళ్లిన, భాషకు, జాతులకు, చెందిన వారమైన సరే దివ్యసత్ప్రసాదం స్వీకరించిన తరువాత ఒకే ఒక ప్రజగా మారాలి. ఎటువంటి పేద, ధనిక, భేదాభి ప్రాయాలు లేకుండా కలసి జీవించాలి.

రొట్టెను చేసేది అన్ని గోధుమలు కలిపి ఒక ముద్దగా చేసి రొట్టెగా మార్చుతారు. అలాగే ద్రాక్ష రసము కూడా చాలా కాయలు కలిపి నలగ గొట్టినప్పుడే మంచి ద్రాక్ష రసము వస్తుంది. కాబట్టి అనేక గోధుమల కలయిక వల్ల ఏర్పడిన రొట్టెలాగా అలాగే అనేక ద్రాక్ష పళ్ళ కలయిక వల్ల ఏర్పడు ద్రాక్ష రసములాగా మనందరం కలసి మెలసి ఐక్యంగా జీవించాలి.

పౌలు గారు ప్రభువుయొక్క భోజనము గురించి ఎందుకు వివరించారంటే ఆనాటి కొరింతు సంఘంలో ఐక్యత అంతగా లేదు అందుకే ప్రభువు భోజనము ఏవిధంగానైతే అందరిని ఐక్యపరిచినదో అలాగే  ప్రతి కొరింతు విశ్వాసి ఐక్యత కలిగి జీవించాలి.

ఈ నాటి సువిశేష పఠనంలో యేసు క్రీస్తు ప్రభువు 5000 మందికి ఆహారం ఇచ్చిన అద్భుతంను చదువుకుంటున్నాం.

ప్రభువు అయిదు రొట్టెలు, రెండు చేపలు ద్వారా అక్కడవున్న వారందరిని సంతృప్తి పరిచారు. ప్రభువు కేవలం వారికి ఆధ్యాత్మిక ఆహారం మాత్రమే కాదు ఇచ్చింది శారీరక ఆకలిని కూడా వారు తీసివేశారు.

యోహాను సువార్త 6 : 35 వచనాలలో ప్రభువు "నేనే జీవాహారము" అని పలికారు. జీవాహారము అనే మాటకు రెండు అర్థాలున్నాయి. 

1. దేవుని వాక్కు - జీవాహారం మన యొక్క ఆత్మలకు జీవము నిచ్చే వాక్కు మనల్ని బలపరిచే వాక్కు. కీర్తన 119 : 50 . పాతనిభందన గ్రంధంలో దేవుని వాక్కు ఆహారంతో పోల్చబడినది యెషయా 55 వ అధ్యాయం .

2. దేవుని యొక్క దివ్య శరీర రక్తములు - యోహాను 6 వ అధ్యాయం 

దివ్యసత్ప్రసాదం  మనయొక్క జీవాహారం కాబట్టి మనం యోగ్యారీతిగా స్వీకరించాలి.

ప్రభువు సువిశేషంలో 5000 మందికి ఆహారం ఒసగిన సంఘటన పాత నిబంధన గ్రంధంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను ఇచ్చిన సంఘటన అదేవిధంగా ఎలీషా ప్రవక్త అతిధులకు  రొట్టెను ఇచ్చిన విధానం అన్ని కూడా యేసు ప్రభువు స్థాపించే దివ్యసత్ప్రసాదంకు సూచనగా వున్నాయి.

నిర్గమ 16 : 4 - 36 (మన్నా),, 2 రాజు  4 : 42 – (ఎలీషా అద్భుతం)

యేసు ప్రభువు 5000 మందికి ఆహారం ఒసగిన సంఘటన నలుగురు సువార్తికులు వ్రాశారు.

దివ్యసత్ప్రసాదం దేవుడు మనకు ఒసగిన గొప్ప వరం కాబట్టి దానిని ఎలాగా మనం స్వీకరిస్తున్నాం?

దివ్య సత్ప్రసాదం స్వీకరించుట అంటే-

ఆయనను  మనలోకి ఇంకించుకోవడం  అంటే ఆయన జీవితం వలే మన జీవితం మారాలి . గలతి 2 : 20 .

- ఆయన రూపంను పొందాలి 

-ఆయన వలే మనం తయారవ్వాలి.

-ఐక్యమై జీవించుట 

దేవుడు మనతో ఉండాలని మనకు దగ్గరగా ఉండాలని, మనలో ఉండాలని దివ్య సత్ప్రసాద రూపంలో దాగి వున్నారు కాబట్టి ఆయనను స్వీకరించుటకై మనం ఎలాగా తయారగుచున్నాం.

-దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తే మనందరిలో అనేక ప్రయోజనాలు వున్నాయి. 

-స్వీకరించిన వారు జీవాన్ని కలిగి వుంటారు- యోహాను 6: 53 

-ఆయన పునరుత్థాన జీవితం పంచుకుంటారు- యోహాను 6: 54 

-ప్రభువులో సహజీవనం ఏర్పడుతుంది -యోహాను 6: 56, గలతి 2 :20  

-దేవుని మూలమున జీవిస్తాం - యోహాను 6: 57 

-దేవుడు మనయందు ఉంటారు - యోహాను 6: 56

మనందరం యేసు ప్రభువుయొక్క దివ్య శరీర రక్తములు స్వీకరించినప్పుడు దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. 

- దేవుడు ఒసగె ఆహారం మనలను ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది. ఈ ఆహారం భుజించియే ఏలియా నలభై రోజులు నడిచారు. 1 రాజు 19: 8.

- ఈ ఆహారం భుజించియే ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో నడిపించబడ్డారు. నిర్గమ 16 : 35 .

-దేవుడు మనకై ఏర్పరిచిన ఈ యొక్క దివ్య సత్ప్రసాదం పట్ల గౌరవం, ప్రేమ, భక్తి కలిగి మారుమనస్సు పొంది ప్రభువుని మనలోకి స్వీకరిద్దాం.

మన ఇంటికి ఎవరైనా అతిధి వస్తే వారిని మంచిగా స్వీకరిస్తాం, అదే ఇంటికి గొప్ప వారు వస్తే ఇంకా బాగా స్వీకరిస్తాం. మరి దివ్య సత్ప్రసాదం ద్వారా దేవుడు మనలోకి  వచ్చేటప్పుడు మనం ఎలాగా స్వీకరిస్తున్నాం. ఆయన మానవ మాత్రులకన్నా గొప్పవాడు. మనల్ని రక్షించిన దేవుడు. ఆయన్ను స్వీకరించుటకు పవిత్రత కావాలి. మనం పాపమును విడిచిపెట్టి, మారుమనస్సు పొంది దేవుడిని మనలోకి ఆహ్వానించాలి.

Rev. Fr. BalaYesu OCD 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...