6, మార్చి 2021, శనివారం

తపస్సు కాల 3వ ఆదివారం

తపస్సు కాల 3వ ఆదివారం  

నిర్గమ 20:1-17, 1కొరింతి 1:22-25 ,యోహాను 2:13-22                                                

క్రీస్తు నాధునియందు ప్రియమైన సహోదరి సహోదరులరా! ఈనాటి గ్రంథ పఠనాలు మన జీవితాలలో  దైవ ప్రేమ సోదర ప్రేమ కలిగియుండాలని తెలియజేస్తున్నాయి. తపస్సు కాలంలో ముఖ్యంగా మనం క్రీస్తు పునరుత్తానా మహోత్సవాన్ని కొనియాడుటకు సిద్ధపడుతున్నాం. మహోత్సవంలో నిండు మనస్సుతో పాల్గొనుటకు దైవ ప్రేమ సోదర ప్రేమ అను రెండు సుగుణాలు మనకు ఎంతగానో దోహదపడతాయిఏలయన, నిత్య జీవితం పొందడానికి దైవ ప్రేమ సోదర ప్రేమ అనునవి చాలా ముఖ్యం అని  ప్రభువే చెప్పియున్నారు (లూకా 10:25-27).

            ఈనాటి గ్రంథ పఠనాలను ధ్యానించినట్లయితే రెండు ఆజ్ఞలను మనం చూస్తున్నాం. మొదటి పఠనంలో  యిస్రాయేలు ప్రజలకు ప్రభువు సీనాయి కొండ దగ్గర పది ఆజ్ఞలు ఇస్తున్నారు. దేవుని ఆజ్ఞలను తెలుసుకొని, పాటించుట ధ్వారా ప్రభుని ప్రేమ, కరుణ ఎల్లప్పుడూ మనపై ఉంటాయని తెలుస్తుంది. పది ఆజ్ఞలలో మొదటి మూడు ఆజ్ఞలు దేవుని ప్రేమని, చివరి ఏడు ఆజ్ఞలు పొరుగువారి యందు ప్రేమను వెల్లడిచేస్తున్నాయి (నిర్గమ 20:1-17, మత్తయి 22: 37-40). 

అసలు దైవ ప్రేమ, సోదర ప్రేమ అంటే ఏమిటి? ఎందుకు మనం దేవుని, మన తోటి సోదరుని ప్రేమించాలి? దానివలన మన జీవితాలలో కలుగు మేలు ఏమిటి

దైవ ప్రేమ  

"దైవ ప్రేమయన ఆయన ఆజ్ఞలకు లోబడుటయే" (1 యోహాను 5: 3, యోహాను 14:15 ). దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను పాటించడం, ఆయన ఆజ్ఞలను పాటించడం అంటే దేవుని ప్రేమించడం అని అర్ధం. ఆయన ఆజ్ఞను పాటిస్తే ఆయన ప్రేమ మనపై కలకాలం ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా పరిశుద్ధ గ్రంధంలో మనం చాలామందిని చూస్తున్నాం.

ఉదాహరణకు ఆదికాండంలో అబ్రహమును చూస్తున్నాం. దేవుడు అబ్రాహామును "నీ దేశము, నీ ప్రజలను వదిలి నేను చూపు దేశమునకు వెళ్లుము" (ఆది 12: 1-4) అని  ఆజ్ఞాపించగానే అబ్రాహాము తిరుగు ప్రశ్న వేయకుండా వెళ్తూ ఉన్నారు. అల్లాగే "నీవు గాఢముగా ప్రేమించిన నీ ఏకైక కుమారుని నాకు బలిగా సమర్పించుము" (ఆది 22:2-19) అని ఆజ్ఞాపించినప్పుడు కూడా అబ్రాహాము మారుమాట పలాకాకుండా మరుసటి రోజు తెల్లవారకు ముందే కుమారుని తీసుకుని దహనబలి సమర్పించడానికి సిద్ధపడ్డారు అని పరిశుద్ధ గ్రంధంలో చూస్తున్నాంఅబ్రాహామునకు ప్రభువుమీద ఎనలేని ప్రేమ గౌరవం ఉన్నదీ కాబట్టే ప్రభువు ఆజ్ఞాపించినదాన్ని వెంటనే చేస్తున్నారు, అందుకుగాను ప్రభువు అబ్రాహామును నీతిమంతునిగా ఎంచెను (ఆది 15:6). ఈనాడు తల్లి తిరుసభచేత కూడా విశ్వసమునకు తండ్రిగా పిలవబడుచున్నాడు

ఈనాటి సువిశేషంలో యూదులు, దేవాలయ అధికారులు యెరూషలేము దేవాలయాన్ని వ్యాపార స్థలంగా మార్చడాన్ని చూస్తున్నాం. దేవునియందు క్రీస్తుకు  గల ప్రేమ ఆయనను దహించివేస్తుంది. సంఘటనను చూడగానే క్రీస్తు కోపోద్రిక్తుడవుతున్నారు. అధికారులు దేవుని ఆజ్ఞలు మర్చిపోయి, ఆయనాయందు ప్రేమ విశ్వసాన్ని కోల్పోయి దేవాలయాన్ని వ్యాపారస్థలంగా మారుస్తున్నారు.

ఎందుకన, " ప్రజలు నన్ను కేవలం వారి పెదవులతో మాత్రమే స్తుతించుచున్నారు, కానీ వీరి హృదయాలు నాకు కాదు దూరం"  (మత్తయి 15:8) అని ప్రభువునకు తెలుసు. అధికారులు కేవలం జనులు చూచుటకై ప్రార్ధన చేస్తారు తప్ప దేవుని యందు ప్రేమతో కాదు (మత్తయి 6:5). ప్రభువు ఇచ్చిన మొదటి మూడు ఆజ్ఞలు (ప్రభువుని మాత్రమే ఆరాధించాలి, ఆయన నామమును, పండుగా దినములను పవిత్రముగా ఉంచాలి ) పవిత్రత గురించి చెప్తున్నాయి. కానీ దేవాలయ అధికారులు మాత్రం ప్రభువు వసించు ఆలయాన్ని, ఆయన నామమును, పండుగ దినములను అపవిత్రం చేస్తున్నారు. కనుక క్రీస్తుని ఆగ్రహానికి గురియగుచున్నారు. మన జీవితాలలో కూడా ప్రభుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

దేవుని మనం ఎందుకు ప్రేమించాలి, ఆజ్ఞలు పాటించాలి?

1). ఆయన కరుణ కొరకు

దేవుడు నిర్గమ కాండం 20:6 లో పలుకుతున్నారు, ఎవరైతే దేవుని ప్రేమించి, ఆయన ఆజ్ఞలను పాటిస్తారో దీవుడు వారిని వేయి తరములదాకా కరుణిస్తాను అని. నీనెవె ప్రజలు పాపంలో కూరుకుపోయినప్పుడు ప్రభువు పట్టణాన్ని నాశనం చేస్థానాన్ని యోనా ప్రవక్త ధ్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే ప్రజలు పలుకులు విన్నారో వెంటనే పశ్చాతాపం చెంది ప్రభుని మొరపెట్టుకోగానే ప్రభువు వారిని కరుణించారు (యోనా 3:10). కనుక ప్రభువు ఆజ్ఞానుసారం జీవిస్తే ఆయన కరుణ ఎల్లప్పుడూ మనపై ఉండును.

2). ప్రభువు  రక్షణ కొరకు

దేవుడు కీర్తనాకారుడు ధ్వారా  (91:14)  "నన్ను ప్రేమించువారిని నేను రక్షించెదను", " నా నిబంధనమును పాటించి, నా కట్టడాలను పాటించువారికి నా రక్షణ తరతరములవరకు లభించును' (కీర్తన 103:18) అని అంటున్నారు. మనం ప్రభువు పట్ల, ప్రభుని ఆజ్ఞల పట్ల ప్రేమకలిగి జీవిస్తే ఎన్ని అపాయములు ఆటంకాలు మన దారికి వచ్చినా ఆయన ఎల్లప్పుడూ మనలను రక్షిస్తారు. ఇందుకు నిదర్శనం మనం దానియేలు గ్రంధంలో చూడవచ్చు. హిల్కియా కుమార్తె సూసన్నా చిన్నప్రాయం నుండి ధర్మశాస్త్ర నియమముల ప్రకారం జీవించెను (దానియేలు 13:3). ఎప్పుడైతే నాయమూర్తులు అన్యాయంగా సూసన్నపై నిందారోపణగావించి మరణశిక్ష విధించారో, ప్రభువు వెంటనే దానియేలు ధ్వారా తనను నమ్మిన బిడ్డను రక్షిస్తున్నారు (దానియేలు 13:62). కనుక ప్రభువుని ప్రేమించి ఆయన ఆజ్ఞానుసారం జీవిస్తే తన రక్షణ మనతో కాలాంతకాలం ఉండును.

పొరుగువారిని ప్రేమించుట:

క్రైస్తవ జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్కరు కశ్చితంగా సోదరప్రేమ కలిగియుండాలి. ఏలయన, తన తోటివారిని ప్రేమించువారే  చట్టములను నెరవేర్చినట్టు' (రోమా 13:8) అని పునీత పౌలు గారు పలుకుచున్నారు. క్రీస్తు ప్రభువే స్వయానా చెప్పియున్నారు  ధైవుని ప్రేమించుట, పొరుగువారిని ప్రేమించుట అత్యంత ముఖ్యమైన ఆజ్ఞలు అని (మార్కు 12:31, యోహాను 15:12). పరిశుద్ధ గ్రంధంలో పొరుగువారిని ప్రేమించుట అను ఆజ్ఞకు చాలా ప్రత్యేకమైన స్థానం ఇవ్వబడింది. పది ఆజ్ఞలలో చివరి ఏడు ఆజ్ఞలు (నిర్గమ 20:12-17) 'మనలను మనం ప్రేమించుకొనినట్లే మన పొరుగువారిని కూడా ప్రేమించాలి' అను ఒకే ఒక్క ఆజ్ఞయందు ఇమిడియున్నదని పునీత పౌలుగారు (రోమా 13:9) పలుకుచున్నారు. అంతే కాదు గలతి 5:14 లోధర్మశాస్తమంతయు సోదరప్రేమ అను ఒక్క ఆజ్ఞలో నెరవేరియున్నదని’ కూడా పౌలుగారు స్పష్టం చేస్తున్నారు

మన జీవితాలలో అనేకమార్లు మనం దేవాలయాన్ని వెళ్తూ, ప్రార్ధనా ఉపవాసాలు చేస్తూ దేవునిపై మన ప్రేమను అనేకవిధాలుగా వెల్లడిచేస్తుంటాము. కానీ మన పొరుగువారితో మాత్రం ఎల్లప్పుడూ గొడవలు, మనస్పర్థలు, కోపం, పగ, ద్వేషాలతో జీవిస్తుంటాం. కానీ దేవుని ప్రేమించడం అంటే మన పొరుగువారిని ప్రేమించడమే అని (1 యోహాను 4:21) పరిశుద్ధ గ్రంధం తెలియజేస్తున్నది. మనం దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్పుకుంటూ మన సోహోదరులను ద్వేషిస్తే మనం అసత్యవాదులం అవుతాం. ఎందుకంటే మన కంటికి కనిపించే తోటి సోహోదరుని ప్రేమింపనిచో, మనం చూడని దేవుని ఎలా ప్రేమింపగలం? (1 యోహాను 4 :20). కనుక దైవ ప్రేమ, సోదర ప్రేమ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి

ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభువు త్రాళ్లతో కొరడా పేని దహనబలికి అమ్ముటకు తెచ్చిన జంతువులను, పావురాలను, డబ్బులు మార్చువారిని దేవాలయం నుండి వెళ్లగొడుతున్న సంఘటన మనకు కనిపిస్తుంది. ఎందుకు ప్రభువు ఇంత కఠినంగా ప్రవరిస్తున్నారు? దేవాలయ ఆచారం ప్రకారం దహనబలి వాడే జంతువులు, పావురాలు అసుచికరంగా మరియు ఎటువంటి లోపం కలిగి ఉండరాదు. ఎందుకంటే బలికి మంచి జంతువులను అమ్ముతున్నారు. ఎందుకు క్రీస్తు ప్రభువు కోపోద్రిక్తుడయ్యారు? ప్రభువు ఆలయాన్ని అపవిత్రం చేయడంతో పాటు, వారు పొరుగువారికి అన్యాయం చేస్తున్నారు. వారు వ్యాపారానికి వాడుతున్న దేవాలయప్రాంగణం పరదేశీయులకు, అన్యులకు ప్రార్థనచేసుకొనుటకు కేటాయించిన స్థలం. స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా వారికి ఇష్టం వచ్చిన ధరకు అన్యాయంగా బలి వస్తువులను అమ్ముతున్నారుఅనేకమంది పేదప్రజలు అంతటి వెలనిచ్చి బలివస్తువు కొనలేక ప్రభువుకు బలి అర్పించకుండా నిరాశతో ఇంటికి తిరిగివెళ్తున్నారు. తమ తోటి సహోదరులపైనా ప్రేమపూర్వకంగా ప్రవర్తించకుండా వారికి ఇష్టంవచ్చినట్లు అన్యాయంగా వ్యాపారం చేస్తున్నారు. పేదవారికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి భరించలేక క్రీస్తుప్రభువు ఆగ్రహించుకుంటున్నారు

మన జీవితంలో కూడా ప్రభువునకు, ఆయన ఆలయానికి, ఆయన ప్రజలకి ఎంత గౌరవం ఇస్తున్నాం అని ధ్యానం చేసుకుందాం. ఎందుకన, ప్రతిఒక్కరు దేవుని ఆలయమనియు, పవిత్రాత్మకు నిలయమనియు పౌలుగారు 1 కొరింతి 3 :16లో పలుకుచున్నారు. అటువంటి దేవుని ఆలయమైన మన తోటి సహోదరి సహోదరులను మనం ఏవిధంగా గౌరవిస్తున్నాం, ప్రేమిస్తున్నాం. మనం ఎప్పుడైతే మన పొరుగువారితో ప్రేమభావం కలిగి ఉంటామో దేవుని ఆలయమును మనలో దేవుడు నివాసం ఏర్పరచుకుంటారు (1 యోహాను 4:12). తన సహోదరుని ప్రేమింపనివాడు దేవుని బిడ్డడు కాదు, సైతాను బిడ్డ (1 యోహాను 3 :10), అట్టివాడు ఇంకను మృత్యువునందే ఉన్నాడు (1 యోహాను 3:14) అని యోహానుగారు తెలియజేస్తున్నారుఎందుకు మనం తోటివారిని ప్రేమించలేకపోతున్నాం? ఎందుకంటే మనం కూడా యూదులవలె అద్భుతాలను, గ్రీకులవలే వివేకమును (1 కొరింతి 1 :22) కోరుచున్నాము. కానీ వీటి అన్నింటికంటే గొప్పవాడు లోకరక్షకుడైన యేసు క్రీస్తును మన పొరుగువారిలో గుర్తించలేకపోతున్నాం. మనం లోకసంబంధమైన వాటికోసం కాకుండా క్రీస్తుప్రభువు కోసం వెదకితే కశ్చితంగా ఆయన అనుగ్రహం, కరుణ, రక్షణ పొందగలుగుతాం.

కనుక క్రిస్తునాధునియందు ప్రియా సహోదరి సహోదరులారా. క్రీస్తు పునరుత్తాన పండుగకు సిద్ధపడుతున్న మనమందరం ఈనాడు గుర్తుంచుకోవాల్సింది, దేవునియందు ప్రేమ, సహోదర ప్రేమ లేకుండా పండుగలో మనం సంపూర్ణ హృదయంతో దేవునికి ఇష్టపూర్వకంగా పాల్గొనలేము. అది కేవలం నామమాత్రంగానే ఉంటుంది తప్ప నిజమైన పునరుత్తానాన్ని మన జీవితంలో అనుభవించలేం. కాబట్టి, సహోదరి సహోదరులారా పది ఆజ్ఞలను మనస్సునందు ముద్రించుకొని దైవ ప్రేమ, సోదర ప్రేమ అను గొప్ప సుగుణాలతో పునరుత్తాన పండుగకు నిండు మనస్సుతో సిద్ధపడదాం. ఆమెన్.

By Br. Joseph Kampally

 


27, ఫిబ్రవరి 2021, శనివారం

తపస్సుకాల రెండవ ఆదివారము

తపస్సుకాల రెండవ  ఆదివారము 

ఆది 22:1–2, 9–13, 15–18

రోమా 8:31–34

మార్కు 9:2–10

క్రీస్తు నాధుని యందు ప్రియ స్నేహితులారా, ఈనాడు మనము తపస్సుకాల రెండవ ఆదివారమును కొనియాడుతున్నాము. ఈనాటి దివ్య గ్రంథ పఠనములు మనము ధ్యానించినట్లయితే, త్యాగపూరిత జీవితము మరియు దేవుని సాన్నిధ్యము అను అంశముల గురించి మాట్లాడుతున్నాయి. ఎవరైతే దేవుని యందు విశ్వాసముంచి, త్యాగపూరితమైన జీవితము జీవిస్తారో వారు దేవుని సాన్నిధ్యాన్ని కనుగొంటారు, మరియు వారు నిత్యము దేవుని సన్నిధిలో నివశిస్తారు. అప్పుడు దేవుడు వారి వారి కుటుంబాలను దీవిస్తాడు.

ఈనాటి సమాజమును గమనించినట్లయితే ఎంతోమంది దేవుని యందు విశ్వాసములేకుండా, ఎన్నో వ్యసనములకు గురి అవుతున్నారు. తల్లితండ్రులు అంటే గౌరవం లేకుండా పిల్లలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, భార్యభర్తల మధ్య అనేకానేక సమస్యలు, ఒకరినొకరు అర్ధం చేసుకోకుండా వివాహ భాంధవ్యాన్ని అపార్ధాల ముసుగులో నెట్టుకొస్తున్నారు. ఈ సందర్భములో అబ్రాహాము జీవితము, ఈనాటి మొదటి పఠనము ద్వారా ఓ మంచి ఉదాహరణమును మన ముందుంచుతుంది.

అబ్రాహాము విశ్వాసులందరిలో చాల గొప్పవాడు. ఎందుకనగా అబ్రాహాము దేవుని పిలుపును ఆలకించి , దేవుణ్ణి అనుసరించి దేవుని చిత్తానుసారముగా జీవించాడు. అబ్రాహాము ఎల్లపుడు దేవుని కనుసన్నలలో జీవిస్తూ ఉండేవుడు. ఓనాడు దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించడం కోసం అబ్రాహాము యొక్క ముద్దుల తనయుని, తన ఒక్కగానొక్క కుమారుడైన ఈసాకుని బలిగా సమర్పించమన్నాడు. అబ్రాహామునకు చాల కాలము వరకు సంతానము కలగలేదు. దేవుడు అబ్రాహామునకు ముసలి ప్రాయములో కుమారుణ్ణి ప్రసాదించాడు. దేవుడు ఈసాకుని బలిగా అర్పించమన్నపుడు అబ్రాహాము  చిత్తం ప్రభు! అని దేవుని ఆజ్ఞను శిరసావహించి దేవుని చిత్తానుసారముగా ఈసాకుని దేవునికి సమర్పించుటకు సిద్ధపడుతున్నాడు. దేవుడు ఈసాకుని బలిగా సమర్పించమన్నపుడు అయన విశ్వాసం తొట్రిల్లలేదు. అబ్రాహాము చెదరలేదు, బెదరలేదు, వెనకడుగు వేయలేదు.

దేవుని యందు విశ్వాసము ఉంచి సకలము దేవుడే కలుగజేసాడు, నాకు ఈ బిడ్డను ఆయనే దయచేసాడు, ఆయనే సమకూరుస్తాడు అని ఈసాకును బలిగా సమర్పించడానికి మోరియా కొండ మీదకు తీసుకు వెళుతున్నాడు. అప్పుడు దేవుడు అబ్రాహాము విశ్వాసమునకు మెచ్చి, అబ్రాహాము చేసిన త్యాగమునకు గుర్తుగా ఆయన కుటుంబాన్ని ఎంతగానో దీవించాడు. అదేవిధముగా ప్రియ దేవుని బిడ్డలారా, మం జీవితములో కూడా ఎన్నోసార్లు, అనేక పరీక్షలకు గురవుతుంటాము. అనేక శోధనలు, సమస్యలు ఎదురవుతుంటాయి. ఆ సమస్యలను చూసి మనము భయపడకుండ, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని దేవుని దూషించకుండ, దేవుని యందు విశ్వాసముంచి, అబ్రాహాము ఏ విధముగా త్యాగపూరిత జీవితము జీవించాడో అదే విధముగా మనము కూడా జీవించాలి అని మొదటి పఠనము తెలియజేస్తుంది.

అదే విధముగా ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు దివ్యరూపము దాల్చడము మనము చూస్తున్నాము. యేసు ప్రభువు దివ్యరూపము దాల్చినపుడు , తాను పొందబోవు శ్రమలు, మరణ పునరుత్తానముల గురించి మోషే, ఏలీయాతో సంభాషిస్తున్నారు. అప్పుడు అక్కడ పేతురు, యాకోబు, మరియు యోహాను మాత్రమే ఉన్నారు. వారు ఆ దృశ్యాన్ని చూసి, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కనుగొన్నారు, ఆ సాన్నిధ్యాన్ని అనుభవించారు. అందుకనే వారు సమస్తాన్ని మరిచిపోయారు. పేతురు గారు 4 వ వచనంలో బోధకుడా! మనము ఇక్కడే ఉందాము. మీకు, మోషేకు, ఏలీయాకు మూడు పర్ణశాలలు నిర్మిస్తాము అని అంటున్నారు.

మనము కూడా ఎప్పుడైతే దేవుని సాన్నిధ్యములో ఉంటామో, ఎన్నడైతే మనము దేవునిని కనుగొంటామో, దేవుడు మనతో మాట్లాడతాడు, తన రహస్యాలను మనకు బయలు పరుస్తాడు. ఆనాడు కొండమీద దేవుడు, ;ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను ఆలకింపుడు; అని శిష్యులతో పలికారో ఈనాడు అదే దేవుడు మనతో కూడా పలుకుతారు. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఉంటామో అప్పుడు ఎలాంటి సైతాను శోధనలనైనా ఎదుర్కొన శక్తిమంతులమవుతాము. ఎలాంటి సమస్యలైనా మన మనస్సును కలత పెట్టలేవు. అందుకనే ఈనాటి రెండవ పఠనములో పునీత పౌలు గారు ఈవిధముగా అంటున్నారు,దేవుడు మన పక్షమున ఉన్నచో, ఇక మనకు విరోధి ఎవడు ఎప్పుడైతే మనము దేవుని యందు ఉంటామో అప్పుడు దేవుడు మనయందు ఉంటాడు. దేవుడు మనయందు ఉండాలి అంటే మనము పవిత్రముగా జీవించాలి, దేవునికి అనుగుణముగా, విశ్వాస జీవితములో, త్యాగపూరితముగా జీవించాలి. అప్పుడు దేవుడు మనయందు జీవిస్తాడు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపస్సు కాలము ఎంతో చక్కని కాలము. ఎందుకనగా, మనమందరము ఉపవాసముతోను, ప్రార్ధనతోను గడుపుకోవడానికి దేవుడు మనకు దయచేసిన ఒక చక్కటి కాలము. ఈ తపస్సు కాలములో మనము దానధర్మాలతో, ప్రార్థన జీవితముతో, దేవుని యందు విశ్వాసముంచి, మన పాపాలను, చెడు ఆలోచనలను, కుళ్లూకుతంత్రాలను విడనాడి, మంచి జీవితాలను జీవించ కావలసిన అనుగ్రహములను దయచేయమని దేవుని ఆర్థిద్దాము. ఆమెన్.

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...