23, మార్చి 2024, శనివారం

మ్రాని కొమ్మల ఆదివారం

మ్రాని కొమ్మల ఆదివారం
యెషయా 50:4-7, ఫిలిప్పి 2:6-11, మార్కు 14:1-15,47
ఈనాడు తల్లి శ్రీ సభ మ్రాని కొమ్మల ఆదివారమును కొనియాడుచున్నది. ఏసుప్రభు యెరుషలేము పట్టణము వచ్చుచున్నాడని కొందరు విని ఆయనకు స్వాగతం పలకడానికి ఎదురెళ్ళారు. ఈ యొక్క మ్రాని కొమ్మల రోజు ఏసుప్రభు యొక్క జీవితంలో ప్రత్యేకమైనటువంటి రోజు ఒక విధముగా చెప్పాలంటే సంతోషకరమైన రోజు ఎందుకంటే ప్రజలు ఆయనను మెస్సయ్యగా గుర్తించి ఆయనకు ఘన స్వాగతం పలికారు. తమ యొక్క హస్తాలతో తాటి ఆకులను ధరించి ఏసు ప్రభువుకి ఎదురు వెళ్లి జయ జయ నినాదాలు తెలిపారు. ప్రజలందరూ ఏసుప్రభువును రాజుగా ఊహించుకుని, ఆయన వారికి స్వేచ్ఛనిస్తారు అని భావించారు. ఏసుప్రభువుకి ప్రజలు అంత ఘన ఆహ్వానం ఎందుకు పలికారంటే ఆయన యొక్క అద్భుత కార్యములు అదేవిధంగా ఆయన చూపించిన ఒక జీవిత నిదర్శనం(పేదవారి కొరకు పోరాడటం) ప్రజల జీవితంలో కొత్త ఆశలను నమ్మకాన్ని కలుగజేసినది. ప్రభువు పేదవారి పక్షమున పోరాడుట వలన అనేకమందిలో ఒక కొత్త నమ్మకం వచ్చినది. ఇతడు నిజముగా ప్రజల కోసం వచ్చారని ప్రజల సమస్యల నుండి కాపాడతారని వారి నమ్మకం అందుకే ఆయన రాజుగా చేయాలని ఆయనకు ఆహ్వానం పలికారు.
ఈనాటి పండుగను ఉద్దేశించి కొన్ని అంశములు ధ్యానం చేసుకోవాలి
1. ప్రవక్తల యొక్క ప్రవచనం నెరవేరినది.
మెస్సయ్య గాడిద పిల్ల మీద వస్తాడు అని ప్రవచనాలు తెలియచేయబడ్డాయి. జెకార్య 9:9. ఏసుప్రభు తన శిష్యులను పంపించి తన కొరకై ఒక ఇంటి యజమాని గాడిదను ఇవ్వమని అడగమని తెలిపారు (మార్కు 14.:13) ఆ యొక్క ఇంటి యజమానుడు కూడా శిష్యులు వచ్చి గాడిదను అడిగిన వెంటనే కట్టి ఉన్నటువంటి గాడిదను శిష్యులకి ఇస్తున్నారు ఎందుకంటే బహుశా ఆయన యేసు ప్రభువు యొక్క గొప్పతనం గురించి విని ఉండవచ్చు అందుకని వేరొక ఒక్క మాట మాట్లాడకుండా ఇది దేవుని కొరకు వినియోగించబడుతున్నది అని సంతోషముగా ఈ యొక్క గాడిదను శిష్యులకి ఇచ్చి పంపించారు.
ప్రభువు గాడిదను ఎన్నుకొనుట ఆయనకు ఇష్టం ఎందుకంటే పూర్వం గుర్రం కన్నా గాడిదలనే ముందుగా ప్రయాణాలకు వినియోగించేవారు( 2 సమూ13:29, 1 రాజులు 1:38). అదేవిధంగా పూర్వం రాజులు యుద్ధం చేయటానికి వెళ్లేటప్పుడు గుర్రం మీద వెళ్లేవారు కానీ ఎవరైతే శాంతిని నెలకొల్పాలనుకున్నారో వారు మాత్రము గాడిద మీద వెళ్లేవారు. ఏసుప్రభు మనలను తండ్రితో సమాధానపరుచుట కొరకే ఈ యొక్క గాడిద పిల్లను ఎన్నుకుంటున్నారు. గాడిదను ఎన్నుకొనుటకు కారణాలు
1. గాడిద శాంతికి గుర్తు
2. గాడిద ఎంత బరువునైనా మోయుటకు గుర్తు
3. గాడిద వినమ్రతకు గుర్తు
4. గాడిద యజమాని చెప్పినది చేయుటకు గుర్తు
5. గాడిద సేవకు గుర్తు
6. గాడిద బాధలు అనుభవించుటకు గుర్తు
పూర్వం చాలా మంది గాడిద మీద ప్రయాణం చేసి ఉన్నారు.
- సొలోమోను కూడా తన తండ్రి గాడిద మీద సింహాసనం అధిష్టించే రోజున వచ్చి ఉన్నారు.
1 రాజులు 1:38-41
- సౌలు కుమారుడు కూడా గాడిద మీదే వచ్చి ఉన్నారు 2 సమూ19:26
- ఏసుప్రభు తీసుకురమ్మన్న గాడిదను ఎవ్వరు ఎన్నడను వాడలేదు మొట్టమొదటిగా యేసు ప్రభువు మాత్రమే వాడుతున్నారు.
- ఏసుప్రభు ఈ యొక్క గాడిద పిల్లను విడుదల చేస్తున్నారు అప్పటివరకు కూడా అది కట్టి వేయబడినది అటు తరువాత ప్రభువు తన యొక్క ప్రమేయంతో విడుదల చేస్తున్నారు అదియే మన యొక్క జీవితంలో కూడా నెరవేర్చబడుతుంది పాపమునకు, వ్యసనములకు కట్టి వేయబడుచున్న మనలను దేవుడు తన యొక్క కుమారుడు యొక్క మరణము ద్వారా విముక్తులను చేస్తున్నారు కాబట్టి మనము దేవుని ప్రేమను గుర్తించి మారుమనస్సు పొందాలి.
2. హోసన్న అనగా-Save us now (ఇప్పుడు మమ్ము రక్షించు ప్రభు అని అర్థం) ఎలాంటి సందర్భంలో మనము ఇతరులను రక్షించమని అడుగుతాం?. మనలని మనము రక్షించుకోలేని సందర్భంలో అలాగే ఆపదలో చిక్కుకున్న సమయంలో మన యొక్క శక్తి సామర్థ్యం వలన సాధ్యము కాని విషయం తలంచుకున్నప్పుడు ఇతరుల యొక్క సహాయం కోరుతూ రక్షించమని అడుగుతూ ఉంటాం. ఏసుప్రభువు కాలంలో కూడా ప్రజలు ప్రార్ధించినది ఇదియే. ఇప్పటివరకు కూడా స్వేచ్ఛ లేకుండా బ్రతుకుచున్నటువంటి మమ్ములను రక్షించమని ప్రార్థిస్తున్నారు. వాస్తవానికి దేవునికి రక్షించమని ప్రార్థించిన ప్రతి వ్యక్తిని రక్షిస్తున్నారు.
- ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం లో ఉన్నప్పుడు మమ్ము రక్షించమని ప్రార్థించారు దేవుడు వారిని రక్షించారు. నిర్గమ 3:7
- ఇశ్రాయేలు ప్రజలు పాము కాటుకు గురైనప్పుడు రక్షించమని ప్రార్థించారు సంఖ్యా 21:7
- ఎస్తేరు తన ప్రజలను ఆపదనుండి రక్షించమని దేవునికి ప్రార్థించింది (ఎస్తేరు 4)
- భర్తిమయి అనే గుడ్డివాడు రక్షించమని ప్రార్థించారు. లూకా 18:38
- సిలువ మీద ఏసుప్రభు పక్కన ఉన్న దొంగ కూడా రక్షించమని ప్రార్థించారు. (లూకా 23:42)
ఇంకా చాలా సందర్భాలలో ప్రజలు రక్షించమని కోరినప్పుడు ప్రభువు తన ప్రజలను రక్షిస్తున్నారు. ఆయన యొక్క మరణము ద్వారా మనందరం కూడా రక్షించబడుతున్నాం.
3. ప్రభువు ముందు ఉండుట.
కేవలము మ్రాని కొమ్మల ఆదివారం రోజున యాజకుడు అందరికన్నా ముందుగా ప్రయాణమై పోవుతుంటారు. ఇది ఎందుకంటే దేవుడే మనకు ముందుండి అన్ని విషయాలలో నడుస్తారు. ఏసుప్రభు మనము అనుభవించేటటువంటి శ్రమలకు బదులుగా ఆయనే ముందుండి మన కొరకు అన్ని బాధలు పొందటానికి సిద్ధపడ్డారు. నిర్గమకాండంలో కూడా మనం చూస్తాం యావే దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు రాత్రి అగ్నిస్తంభముగా పగలు మేఘస్తంభంగా వారి ముందుండి నడిచారు. మనము అనుభవించవలసిన శ్రమలు మరణం నిందలు అవమానాలు అన్నీ కూడా ఏసుప్రభు మన కొరకై అనుభవించారు కాబట్టి ఈరోజు మనము ఆ ప్రభువు యొక్క ప్రేమను తెలుసుకొని మన జీవితంలను మార్చుకొనుటకు ప్రయత్నం చేయాలి. దేవుని ప్రేమ గొప్పది ఆ ప్రేమను అర్థం చేసుకొని మనం జీవించాలి.
Fr. Bala Yesu OCD

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...