18 వ సామాన్య ఆదివారం (ఆగస్టు 6) ఏసు దివ్య రూప ధారణ మహోత్సవం.
దానియేలు 7:9-10,13-14
2 పేతురు 1:16-19
మత్తయి 17:1-9
ఈనాడు తల్లి శ్రీ సభ ఏసు క్రీస్తు ప్రభువుని యొక్క దివ్యరూప ధారణ మహోత్సవమును కొని యాడుచున్నది. ఈ యొక్క పండుగ తొమ్మిదవ శతాబ్దం నుండి జరుపుకొనుట ప్రారంభమైనది అప్పటి పాపుగారు అయినటువంటి Callixtus
III ప్రతి సంవత్సరం ఆగస్టు 6 తారీఖున యావత్ ప్రపంచంలో ఈ పండుగ కొనియాడాలని తెలియచేశారు. ఏసుక్రీస్తు మహిమలో భాగస్తులై జీవించాలంటే ఆయన యొక్క బాటలో మనందరం కూడా ప్రయాణం చేయాలి. కష్టము అనుభవించలేనిదే ఎవరూ కూడా సుఖము విలువ తెలుకోలేరు. భూమిలో విత్తనం మరణించిననే తప్ప అది మొలకెత్తి పెరిగి,పెద్దదై ఫలించదు. ఎవరైతే చెమటోడ్చి విత్తనం వేస్తారో వారు మాత్రమే ఆనందంతో పంటను కోయగలరు. మనం జీవిత కిరీటాన్ని పొందాలి అంటే కష్టాలు అనుభవించాలి అదేవిధంగా ఆధ్యాత్మిక మహిమను పొందాలి అంటే మనము కూడా క్రీస్తు వలే శ్రమలు అనుభవించాలి. శ్రమల ద్వారానే మనము మహిమను పొందుతాం.
ఈనాటి మొదటి పఠణంలో దానియేలు ప్రవక్త ఆయన చూసినటువంటి దర్శనం గురించి బోధిస్తున్నారు. మనుష్య కుమారుని యొక్క మహిమను ముందుగానే ఆయన ఒక దృశ్యం ద్వారా చూస్తున్నారు. ఆయన చూసిన దర్శనంలో మనుష్య కుమారుని దేవుని సింహాసనం ఎదుట చూశారు. అక్కడ సింహాసనములు వేయుటను దానియేలు చూశారు అక్కడ శాశ్వత జీవి ఒకరు కూర్చున్నారు. ఆయన వస్త్రములు మంచు వలె తెల్లగాను అలాగే ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెపిల్ల వెంట్రుకలు వలె తెల్లగా ఉండెను.
ఆయన సింహాసనము అగ్ని జ్వాల వలె మండుచుండెను అనేకమంది ఆయనకు పరిచర్యలు చేయుచుండరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి తీర్పు తీర్చుటకై గ్రంధాలు తెరవబడునె అదేవిధంగా ఇంకా దానియేలు దర్శనం చూస్తుండగా ఆకాశము నుండి మనుష్య కుమారుని పోలిన ఒకరు వచ్చి ఆ శాశ్వత జీవి ఎదుట నిలబడెను ఆ సందర్భంలో సకల జనులు రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడేవారు ఆయనను సేవించినట్లు, ప్రభుత్వమును, మహిమయును, ఆధిపత్యం ఆయనకు ఇవ్వబడును. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది ఆయన రాజ్యము కలకాలము ఉండును దానియేలు చూసిన దర్శనంలో శాశ్వత జీవి, సింహాసనము మీద వున్న వారు తండ్రి అయిన యావే దేవుడు. ఆయన వస్త్రాలు తల వెంట్రుకలు మండే అగ్నిజ్వాలలు అలాగే అక్కడ ఉన్నటువంటి పరిచర్యకులు అన్నియు దేవుని మహిమను వైభవాన్ని అధికారాన్ని సూచిస్తున్నాయి ఆయన ప్రజలకు తీర్పు విధించుచున్నాడు అలాంటి సమయంలో మనుష్యకుమారుడు మేఘారూరుడై వచ్చి సర్వేశ్వరుని ఎదుట మహిమను సకల జాతుల పై అధికారము పొందుచున్నాడు. తండ్రి తన కుమారునికి సమస్తము మీద ఆధిపత్యం ఇచ్చి ఉన్నారు.
ఈ మనుష్యకుమారుడు ఏ మెస్సయ్యె. ఈనాటి రెండవ పఠణంలో పేతురు గారు ఆయన చూసిన దర్శనంలో ఏసుప్రభు యొక్క దివ్య రూప ధారణ నిజమైనది అని ఆనాటి విశ్వాసులకు తెలియజేస్తున్నారు. దివ్య రూప ధారణ సమయములో ఈయన నా ప్రియమైన కుమారుడు ఇతనిని గూర్చి నేను సంతోషిస్తున్నాను అనే వానిని పేతురు గారు మిగతా శిష్యులు విన్నారు అని వారు తెలియజేస్తున్నారు. పాత నిబంధన గ్రంథంలో మెస్సయ్య గురించి ముందుగానే తెలియచేయబడినది. దివ్య రూప ధారణ ఒక కట్టు కథ కాదు అది నిజమైన వాస్తవము అని పేతురు గారు తెలియచేస్తున్నారు ఏ విధంగానైతే దివ్యరూపధారణ నిజమో అదే విధముగా యేసు క్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ జరగటం నిజము అనే సత్యమును కూడా పేతురు గారు తెలియజేస్తున్నారు.
ప్రవక్తల యొక్క సందేశమును శ్రద్ధగా ఆలకించుట మంచిది అని పేతురు గారు తెలియచేస్తున్నారు ఎందుకంటే వారు బోధించినది ఏది తమ సొంతగా కాకుండా దేవుని యొక్క సందేశమును మాత్రమే వారు బోధించుతిరి అందుకుగాను అది ఆలకించి పాటిస్తే వారి జీవితము ధన్యం అవుతున్నది తెలియ చేసి ఉన్నారు. ఈనాటి సువిశేష పఠణంలో ఏసుప్రభు తాబోరు కొండమీద శిష్యులకు తన దివ్య మహిమను,
పరలోక అనుభూతిని కలుగజేసిన విధానమును చదువుకుంటున్నాము. దివ్యరూపధారణ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే యేసు ప్రభువు తన యొక్క తండ్రిని సంప్రదించుట. ఆయన పొందబోయేటటువంటి సిలువ శ్రమలు,
మరణము,
పునరుత్థానము తండ్రి చిత్తానుసారంగా ఉన్నాయా లేదా అని తెలుసుకునుటకు ప్రభు తాబోరు కొండమీద తండ్రిని సంప్రదిస్తున్నారు. రెండవదిగా శిష్యులకు పరలోక మహిమను తెలియజేయుటకు అదే విధముగా వారు ఈ లోక సంబంధమైన ఆశలు కలిగి జీవించకుండా,
పరలోకం మీద దృష్టి పెట్టి పవిత్ర జీవితం జీవించుటకు ఈ లోక సంబంధ ఆశలు,
కోరికల కన్నా ముఖ్యమైనది దేవుని బాటలో ప్రయాణించుట అని తెలుపుటకు ప్రభువు వారిని తాబోరు కొండమీదకి తీసుకెళ్తున్నారు,
ఇంక శిష్యుల యొక్క విశ్వాసమును అదేవిధంగా వారి యొక్క నమ్మకమును బలపరుచుటకు ప్రభువు వారికి పరలోక అనుభూతిని దయచేసినారు. ఏసుప్రభు తాబోరు కొండమీదకి వెళ్లేటప్పుడు పేతురు యోహాను యాకోబులను మాత్రమే తీసుకొని వెళ్ళి ఉన్నారు ఎందుకు ఈ ముగ్గురిని మాత్రమే తీసుకుని వెళ్లి ఉన్నారంటే ఏసుప్రభు పట్ల,
ఆయన రాజ్యము పట్ల వారికి ఉన్నటువంటి ఆలోచనలు ఈ లోక సంబంధమైనవి. పేతురు ఆయనను మెస్సయ్యగా గుర్తించారు కానీ సిలువ శ్రమలు అనుభవించటానికి ఇష్టపడలేదు అలాగే యోహాను యాకోబులు ఈ లోక సంబంధమైన అధికారం కోసం ప్రాకులాడుతున్నారు అందుకనే మహిమను పొందాలి అంటే సిలువ శ్రమలు అనుభవించాలి.
ఏసుప్రభు ప్రార్థించుటకు తాబోరు కొండమీదకు వెళ్ళుచున్నారు. పవిత్ర గ్రంథంలో పర్వతం దేవుడిని కలుసుకొనుటకు ఒక స్థలంగా ఉన్నది ఎందుకంటే అబ్రహాము మోరియా పర్వతం మీద, మోషే ప్రవక్త సీనాయి పర్వతం మీద, ఏలియా ప్రవక్త హోరేబు పర్వతం మీద యావే దేవుడిని కలుసుకున్నారు. పాత నిబంధన గ్రంథంలో మోషే ప్రవక్త సీనాయి పర్వతం దగ్గర దేవుడిని కలుసుకున్నటువంటి సందర్భంలో ఆయన ముఖము కూడా ప్రకాశించెను. ( నిర్గమ 34:29-35).
ప్రార్థనలో దేవునితో ఉన్నటువంటి సందర్భంలో మనందరం కూడా మార్పు చెందుతుంటాం. మోషే ప్రవక్త ఏలియా ప్రవక్త పర్వతం మీద దేవుడిని కలుసుకున్న సందర్భంలో వారు జీవితంలో ఒక నూతన మార్పు అనేది జరిగింది మోషే ప్రవక్త యొక్క మొఖము ప్రకాశించినది అది ఎన్నడూ లేని విధంగా ఉన్నది ప్రజలు ఆయన ముఖము చూడలేకపోయారు. ఏలియా ప్రవక్త కూడా హోరేబు కొండమీద దేవుడిని కలుసుకున్న సందర్భంలో ఆయన బలవంతుడై తన యొక్క పరిచర్యను ప్రారంభిస్తున్నారు అదే విధముగా మనము కూడా దేవుడిని ప్రార్థనలో కలుసుకొని మనము కూడా మార్పు చెంది దేవుడి ప్రకారముగా జీవించాలి. ఎందుకు మోషే ప్రవక్త యు అదేవిధంగా ఏలియా ప్రవక్తలు మాత్రమే దర్శనములో పేతురు గారికి మిగతా శిష్యులకు కనపడ్డారు అంటే మోషే ప్రవక్త ధర్మ శాస్త్రమును ఇచ్చినవారు ఏలియా ప్రవక్త అందరి ప్రవక్తల కంటే గొప్పవారు. అప్పటి యూదులు వీరిద్దరినీ గొప్ప ప్రవక్తలుగా భావించారు ఎందుకంటే వారు ఈ లోక సంబంధమైన మరణము పొందకుండా దేవుని చేత ఆకాశంలోనికి తీసుకొని పోబడ్డారు అని వారి నమ్మిక. (ద్వితీయో 34:5-6), (2 రాజులు 2:11).
మనుష్యకుమారుడు సిలువ శ్రమల ద్వారా రక్షణము చేకూరుస్తారు. ఏసుప్రభు ధర్మశాస్త్రమును అదేవిధంగా ప్రవక్తల ప్రబోధమును నెరవేర్చుటకు ఈ భూలోకమునకు వచ్చి ఉన్నారు అంటే ఆయన గురించి ఏది అయితే ధర్మశాస్త్రములో,
ప్రవక్తలు బోధించారో అది అక్షరాల నెరవేరుతుంది అందుకే ఈ ఇద్దరు ప్రవక్తలు ఏసుప్రభు తో సంభాషిస్తున్నారు. దివ్య రూప ధారణ సమయంలో ఆకాశము తెరవబడి ప్రభువు యొక్క స్వరము ఈయన నా కుమారుడు ఇతనిని ఆలకింపుడు అని తండ్రి దేవుడు కుమారునితో సంభాషించారు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు అనేకసార్లు మేఘరూపమున మాట్లాడి ఉన్నారు (నిర్గమ 24:15-1; 13:21-22; 34:5; 40:34; 1రాజులు 8:10:11).
తండ్రి దేవుడు కుమారుని స్వరమును ఆలకించమని మనలను కోరుచున్నారు. దేవుని యొక్క స్వరము ఆలకించినట్లయితే మనందరం కూడా సంతోషముగా జీవించగలుగుతాం దానికి కొన్ని ముఖ్య ఉదాహరణలు పవిత్ర గ్రంథంలోని మనకు ఉన్నాయి.
1.
నోవా దేవుని యొక్క స్వరమును ఆలకించారు అందుకని ఆయన కుటుంబము రక్షించబడినది (ఆది6-9)
2.
అబ్రహాము దేవుని స్వరం ఆలకించారు దానికి ప్రతిఫలంగా ఆయన అనేక జాతులకు తండ్రిగా పిలువబడ్డారు.(ఆది12)
3.మోషే దేవుని యొక్క స్వరాన్ని ఆలకించారు దానికి ప్రతిఫలంగా ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా దేవుడు అతడిని నియమించారు.(నిర్గమ3)
4.
యెహోషువ దేవుని స్వరమును ఆలకించి ఉన్నారు అందుకే మోషే ప్రవక్త తర్వాత ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధ్యతను దేవుడు అతనికి అప్పచెప్పారు.
5.
దానియేలు ప్రవక్త దేవుని స్వరమును ఆలకించి ఉన్నారు అందుకే ఆయన సింహపు బోనులో రక్షణను పొంది ఉన్నారు. (దాని 6)
6.
మరియ తల్లి దేవుని స్వరమును ఆలకించారు అందుకే ఆమెను దేవుడు తన తల్లిగా ఎన్నుకున్నారు.
7.
పేతురు దేవుని స్వరమును ఆలకించి ఉన్నారు అందుకే వల చినుగునన్ను చేపలు ఆయన పొందగలిగాడు. ఇంకా చాలామంది దేవుని యొక్క స్వరమును ఆలకించి ప్రభు దీవెనలు పొంది ఉన్నారు.
ఆయన స్వరమును ఆలకించక పోతే మన జీవితములు నరకమునకు సిద్ధం చేసుకున్నట్లే. అలాంటి వారి జీవితంలో సంతోషము ఉండదు,శాంతి ఉండదు, సమాధానము ఉండదు దేవుని యొక్క కృపను కూడా పొందలేరు దానికి ముఖ్య నిదర్శనం సౌలు రాజు యొక్క జీవితం ఆయన దేవుని స్వరమున ఆలకించలేదు అందుకని ఇశ్రాయేలు రాజుగా తృణీకరింపబడ్డాడు,
ఏలి కుమారులు దేవుని స్వరమును ఆలకించలేదు అందుకని వారు శిక్షింపబడ్డారు,
కొన్నిసార్లు ఇస్రాయేలు ప్రజల దేవుని స్వరమును ఆలకించలేదు అందుకని బానిసత్వంలోనికి పంపివేయబడ్డారు కాబట్టి ఈరోజు మనందరం కూడా ఏసుప్రభు యొక్క దివ్య రూప దారుణ పండుగ కొనియాడే సందర్భంలో మనము కూడా పరలోక మహిమను పొందాలి అంటే ఏసుక్రీస్తు ప్రభువులా మారాలి అంటే ఆయన చూపించిన మార్గమును మనము అనుసరించాలి ఆయన స్వరమును ఆలకించి అనుసరించాలి అప్పుడు మాత్రమే మనలో మార్పు అనేది ఉంటుంది. మన యొక్క అనుదిన జీవితంలో కూడా పర్వతం ఎక్కాలి,
అంటే కష్టాలు ఉన్న ,బాధలు ఉన్న, శోధనలు ఉన్నా, సమస్యలు ఉన్నా వీటన్నిటిని కూడా ఎదుర్కొని మనం ముందుకు సాగినప్పుడు మాత్రమే దైవ అనుభూతుని మనము పొందగలుగుతాం లేదంటే కొండ కింద మాత్రమే మనము మనకు నచ్చిన జీవితాన్ని జీవిస్తాము ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే సీనాయి పర్వతం కింద పాపపు జీవితాన్ని జీవించారు అలాగే మనం కూడా పాపంలోనే ఉంటాము కానీ దైవ అనుభూతుని పొందలేము కాబట్టి మనం కూడా పవిత్రత అనే పర్వతమును ఎక్కి దేవుని కలుసుకోవాలి. దేవుని యొక్క స్వరమును ఆలకించి అనుసరించాలి. అనునిత్యం కూడా ప్రార్థించాలి. దేవుని యొక్క సిలువ శ్రమలు పొందటానికి సిద్ధపడాలి.
Fr.
Bala Yesu OCD