16, డిసెంబర్ 2023, శనివారం

ఆగమన కాలం మూడవ ఆదివారం

ఆగమన కాలం మూడవ ఆదివారం
యెషయా 61:1-2, 10-11
1తెస్సలోని 5:16-24
యోహాను 1:6-8,19-28
ఈనాటి ఆదివారమును లతీన్ భాషలో "గౌదేతే "ఆదివారం అని పిలుస్తారు అనగా 'ఆనందించు' ఆదివారము అని అర్థం. దివ్య బాల యేసు యొక్క రాక అతి చేరువులోవున్నది, మన యొక్క రక్షణ కూడా అతి సమీపంలో ఉన్నది కాబట్టి ఆయన యొక్క రాక కొరకై మనందరం కూడా ఆనందంతో సంసిద్ధత కలిగి ఎదురు చూస్తున్నాం. ప్రభువు నందు ఎల్లప్పుడూ సంతోషించాలి మనం.
ఈనాటి దివ్య గ్రంథ పఠనంలు కూడా దేవుని యొక్క రాక కొరకై త్వరపడి చేయవలసిన ఆధ్యాత్మిక పనులు చేసి సిద్ధంగా ఉండాలి అనే అంశము గురించి బోధిస్తున్నాయి. మొదటి పఠనంలో దేవుడు యెషయా ప్రవక్తను అభిషేకించిన విధానమును వింటున్నాం.  బాబిలోనియా బానిసత్వంలో జీవిస్తున్నటువంటి యూదులకు దేవుడు సంతోషకరమైన వార్తను అందచేస్తున్నారు అది ఏమిటంటే  "పేదలకు సువార్తను బోధించటానికి, హృదయ వేదననొందిన వారిని దృఢపరుచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును తన యొక్క సేవకుడిని ఎన్నుకుంటున్నాను అని ప్రభువు తెలియచేస్తున్నారు. ఈ మాటలను ఒక్కొక్కటి మనము ధ్యానం చేసుకోవాలి ఎందుకనగా మాటలు కేవలం యెషయా ప్రవక్తకు సంబంధించినవి మాత్రమే కాదు అవి బాధామయ సేవకుడైన ఏసుప్రభుకు సంబంధించిన వచనములు. మెస్సయ్య తన యొక్క భూలోక జీవితంలో చేసినది ఈ పనియే.
పేదలు అనగా లేనివారు- ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క సాన్నిధ్యం లేకుండ జీవిస్తున్నారో వారికి దేవుడిని అందజేయుట. పేదవారు దేవునియందు నిండు నమ్మకం ఉంచి ఆయనపై పూర్తిగా ఆధారపడి జీవించేవారు. దేవుడే వారి యొక్క ఐశ్వర్యం. ప్రవక్త దేవుడి మీద ఆధారపడి జీవించే వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు అని తెలిపారు.
హృదయ వేదననొందిన వారిని దృఢపరుచుటకు దేవుడు ప్రవక్తను అభిషేకిస్తున్నారు అంటే బానిసత్వములో బాధలు అనుభవిస్తూ, నిరాశలో, నిస్పృహలో అన్ని కోల్పోయాము అని బాధలో ఉన్న వారిని బలపరచడానికి ప్రవక్త అభిషేకమును పొందుచున్నారు.
చెరలో ఉన్నవారికి అదే విధముగా బంధింపబడిన  వారికి విముక్తిని కలుగ చేయుటకు అభిషేకమును దయచేస్తున్నారు. ప్రవక్త యొక్క ప్రధానమైన బాధ్యత ఏమిటంటే ఎవరైతే ఈ లోక సంబంధమైన కోరికలలో, పాపములో చిక్కుకుని పోయి ఉన్నారో వారిని విడుదల చేయుటకు అభిషేకమును పొందుతున్నారు. అలాగే శిక్షించేటటువంటి వారిని ఓదార్చుటకు ప్రవక్త నియమింపబడుతున్నారు. ఈ మొదటి పఠనం ద్వారా మనము గ్రహించవలసిన అంశం ఏమిటంటే దేవుడు ప్రజలకు సంతోషమును దయ చేయుటకు వారి మార్గములను సరి చేయుటకు వారికి తాను ఎప్పుడూ తోడుగా ఉన్నారు అని తెలియచేయుటకు ప్రవక్తలను ఎన్నుకొని వారిని తన యొక్క సాధనములుగా ప్రజల మధ్య ఉంచుతున్నారు.
ఈనాటి రెండవ పఠనంలో పౌలు గారు తెస్సలోనిక ప్రజలను సర్వదా సంతోషించమని, ప్రార్థించమని మరియు దేవునికి కృతజ్ఞత తెలియజేయమని తెలుపుచున్నారు. ప్రభువు యొక్క రాకడ జరుగును కావున ఆ అంశం మీద ఎల్లప్పుడూ సంతోషించమని తెలుపుతూ ఉన్నారు. అలాగే దేవునికి ప్రార్ధన చేస్తూ ప్రభువు పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞులై జీవించమని తెలుపుతున్నారు. పౌలు గారు ఈ లోకంలో అంతయు పరీక్షించి కేవలం మనిషిని మాత్రమే అనుసరించమని తెలుపుచున్నారు ఎందుకనగా మంచిని చేసినట్లయితే మనము ఎప్పుడు కూడా సంతోషంతోనే జీవిస్తూ ఉంటాం. అదేవిధంగా దేవుని యొక్క ఆత్మనుసారంగా మనము జీవించాలని పౌలు గారు తెలుపుతున్నారు.
ఈనాటి సువిశేష  భాగములో బప్తిస్మ యోహాను గారు గురించి చెప్పబడినది బప్తిస్మ యోహాను గారు ఈ లోకంలో క్రీస్తునకు సాక్షమిచ్చుటకు వచ్చి ఉన్నారు. అలాగే క్రీస్తు  కొరకు ప్రజలలో మార్గమును సిద్ధం చేయుటకు వచ్చి ఉన్నారు. ఆయన సువార్త పరిచర్య చేసే సమయంలో అనేకమంది ప్రజలలో యోహాను గారే మెస్సయ్య లేదా ఇంకా వేరే ఒకరి కొరకు ఎదురు చూడాలా అనే సందేహాలు చాలా ఉన్నాయి దానికిగాను యెరుషలేములో ఉన్న యూదులు కొందరు యాజకులను, లేవీయులను యోహాను గారి దగ్గరికి పంపిస్తున్నారు, ఆయన ఎవరు అని తెలుసుకొనుటకు. యోహాను గారు తాను క్రీస్తుని కాదని ఒప్పుకొనుటకు ఎటువంటి నిరాకరణ చేయలేదు. ఆయన ఆ సందర్భంలో నేనే క్రీస్తు అని చెప్పినట్లయితే అనేకమంది ఆయనను నమ్మి ఉండి ఉండవచ్చు కానీ యోహాను గారు, నేను ఆయనను కాదు కేవలము ఆయన కొరకు మార్గమును సిద్ధం చేయుట కొరకై పంపబడిన వాడిని పలికారు మరియు నేను ఆయన పాదరక్షలను విప్పుటకైన యోగ్యుడను కాను అని తనను తాను తగ్గించుకొని క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇచ్చారు. బప్తిస్మ  యోహాను గారు ఏసుప్రభుకు సాక్ష్యం ఇచ్చుటలో సంతోషంగా ఉన్నారు.ఈయనలో అంత వినయము ఉన్నది కాబట్టే దేవుడు అతని జీవితమును దీవించారు అందుకే ఏసుప్రభు ఈ భూలోకంలో బప్తిస్మ యోహాను గారు గొప్పవారు అని తెలుపుతున్నారు.
ఈనాటి పరిశుద్ధ వాక్యం మనం దేవుడి యందు సంతోషించాలి అనే అంశమును తెలుపుతూ ఉన్నారు కాబట్టి మనం కూడా మంచిని చేస్తూ, మంచిగా జీవిస్తూ, ప్రభు రాకడ కొరకై మన జీవితంను సిద్ధపరచుకుంటూ ఆయన వస్తాడు అనేటటువంటి ఆశతో, ఆనందంతో, ఎదురుచూసి రక్షకుని మన ఇంటికి ఆహ్వానించుదాం.
Fr. Bala Yesu OCD

ఇరవై ఎనిమిదవ ఆదివారము

సొలొమోను జ్ఞానం గ్రంధం 7:7-11 హెబ్రియులు 4:12-13 మార్కు 10:17-30  క్రీస్తునాదునియాందు ప్రియా సహోదరి సహోధులరా, ఈనాడు మనమందరం కూడా సామాన్య కాల...