28, జులై 2023, శుక్రవారం

17 వ సామాన్య ఆదివారం

 17 వ సామాన్య ఆదివారం

1రాజులు 3:5,7-12

 రోమా 8:28-30

 మత్తయి 13:44-52

ఈనాటి దివ్య గ్రంథణాలు పఠణాలు క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని యొక్క విలువ తెలుసుకొని ఆయనను కలిగి ఉండుటయే ముఖ్యమైన సంపదని మనకు బోధిస్తున్నాయి. మనందరి యొక్క అనుదిన జీవితంలో ఎన్నో అంశాలలో మనం ఏది ఉత్తమము, ఏది సరైనదో దానిని మాత్రమే ఎంచుకొని దాని కొరకు జీవిస్తూ ఉంటాం అదేవిధంగా క్రైస్తవ జీవితంలో ఈ లోక సంపదల కన్నా పేరు ప్రతిష్టల కన్నా, ఆస్తిపాస్తులు కన్నా, అధికారం కన్నా, దేవుడే విలువైన వారు అని తెలుసుకొని వారిని కలిగి ఉంటే వారి జీవితంలో దేవుడు అంతయు సమకూరుస్తూ ఉంటారు. అందుకే దావీదు రాజు కీర్తనల గ్రంథం 23 వ అధ్యాయం 1 వచనంలో ప్రభువే నాకు కాపరి ఇక నాకు ఏ కొదమయు లేదు అని పలుకుతూ ఉన్నారు. 

దేవుడు తన జీవితంలో ఉంటే చాలు ఈలోక సంబంధమైనవి ఏవి కూడా తనకు అక్కరలేదు అనే అంశాన్ని దావీదు రాజు తెలుపుతున్నారు. ఆయన జీవితంలో తెలుసుకొనటువంటి సత్యం ఏమిటంటే దేవుడి కన్నా విలువైనది ఏదీ లేదు ఆయన కలిగి ఉంటే సమస్తము కూడా అందచేయబడుతుంది అని విశ్వసించాడు. ఆయన విశ్వసించిన విధంగానే దేవుడు అన్నియు సమకూర్చాడు ఎన్నో విజయాలు ప్రసాదించారు. ఈనాటి మొదటి పఠణంలో సొలోమోను రాజు యావే దేవుడిని వివేకమును, ప్రసాదించమని కోరుతున్నారు. తన తండ్రి తర్వాత ఇశ్రాయేలు ప్రజల రాజ్య బాధ్యతను స్వీకరించిన సొలోమోను రాజు ఆ ప్రజలను నడిపించుటకు తనకు కావలసినటువంటి జ్ఞానమును అడుగుచున్నారు. 

యావే దేవుడు సొలోమోను రాజుకు కలలో దర్శనమిచ్చిన సందర్భంలో సొలోమోను యొక్క వయసు దాదాపు 20 సంవత్సరాల ప్రాయం అలాంటి చిన్నతనంలో ఒక గొప్ప ప్రజలను నడిపించుటకు తన యొక్క జ్ఞానము సరిపోదని తెలుసుకొని దేవుని మీద ఆధారపడుతూ ఆయన దేవుని యొక్క వివేకము,  విజ్ఞానం కొరకు ప్రార్థిస్తున్నారు. సొలోమోను రాజు దేవుడిని సంపదలు అడగలేదు పేరు ప్రతిష్టలు అడగలేదు, శత్రువుల యొక్క నాశనాన్ని అడగలేదు, దీర్ఘాయుష్షును అడగలేదు కానీ కేవలం ఆయన అడిగినది వివేకం మాత్రమే. మంచి చెడులు తెలుసుకొని ప్రజలను సన్మార్గంలో నడిపించుటకు దేవుని యొక్క జ్ఞానం అడుగుతున్నారు ఆయన యొక్క కోరికలో నిస్వార్థం ఉన్నది. సొలోమోను అడిగినటువంటి వరము దేవునికి ప్రీతికరమైనది ఎందుకంటే ఆయన తన యొక్క ప్రజల మేలుకొరకై యొక్క వరం అడుగుతున్నారు. ప్రజల యొక్క అభివృద్ధి కొరకై, రక్షణ కొరకై అడుగుతున్నాడు కాబట్టి దేవుడు ఈ యొక్క గొప్ప కోరికను తీరుస్తూ ఉన్నారు. 

దేవుడు ఎంతటి గొప్ప వివేకమును దయ చేస్తున్నారంటే 12వ వచనంలో తెలియచేస్తున్నారు నీ ముందటి వారిలో గాని నీ తరువాత వారిలో గాని ఎవ్వరికీ లేని వివేకమును విజ్ఞానమును నీకు ప్రసాదించును అని ప్రభువు తెలియచేస్తున్నారు. దేవుడు ఎవరికీ ఇవ్వనటువంటి గొప్ప వరాన్ని సొలోమోను రాజుకు దయ చేస్తున్నారు. ఒక విధముగా చెప్పాలి అంటే సొలోమోను రాజు విజ్ఞానము విలువైనది అని తెలుసుకున్నారు అందుకనే దానిని సంపాదించుట కొరకు, ధనమును, పేరును ,అధికారమును అన్నియు త్యాగం చేసుకున్నారు. 

అన్నిటికంటే విజ్ఞానానికి, వివేకానికి సొలోమోను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మంచి చెడ్డలను తెలుసుకునే విచక్షణా జ్ఞానంతో ప్రజల యొక్క అవసరాలను మొత్తం అర్థం చేసుకొని దేవుని చిత్తానుసారంగా ఇశ్రాయేలు ప్రజలను సొలోమోను పరిపాలించ కోరాడు అందుకే దేవుడు అతడు కోరిన వరాన్ని కోరిన వెంటనే దయచేశారు. మన జీవితంలో కూడా జ్ఞానము విలువైనదని తెలుసుకొని ఆ జ్ఞానము కొరకు దేవుడిని అర్థించాలి. ఈనాటి మొదటి పఠణం ద్వారా సొలోమోను ఏ విధంగా అయితే మంచిది కనుగొని,ఎన్నుకున్నారో అలాగే మన జీవితంలో కూడా ఏది విలువైనది అని తెలుసుకొని దానిని పొందుకోవాలి.

ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో అలాగే దేవుని యొక్క ఉద్దేశానుసారంగా పిలువబడిన వారికి అంతయు మేలుయే జరుగును అని తెలుపుతున్నారు. మొదటిలో వారు కష్టాలను అనుభవించినప్పటికీ  చివరికి వారి జీవితంలో అంతా మంచే జరుగును. పౌలు గారు దేవుని చేత పిలవబడిన వారికి మేలు కలుగును అని తెలుపుతున్నారు దానికి ముఖ్యమైన ఉదాహరణ పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఏసేపు గారి జీవితమే. ఆయన జీవితము మొదట కష్టాలతో కూడుకున్నది ఐగుప్తు దేశంలో మొదటిలో కష్టాలు అనుభవించారు జైల్లో ఉన్నారు అయినప్పటికీ దేవుడు అతడిని ఎన్నుకుంటున్నారు అతడే ఐగుప్తు ప్రజలకు ప్రధానమంత్రిగా నియమింపబడుతున్నారు అలాగే కరువు కాలంలో ఆయనే భోజనమును పెట్టేటటువంటి ఒక అన్నదాత గా ఉంటున్నారు మొదటిలో ఆయన కష్టాలు అనుభవించినప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉండుటవలన అంతయు మంచియే జరిగినది. అదేవిధంగా పౌలు గారు కూడా మొదటిలో ఏసుప్రభు యొక్క సువార్తను బోధించేటటువంటి సందర్భంలో తన సొంత వారి దగ్గరకు వెళ్లి సువార్త ప్రకటన చేసినప్పుడు తనను అంగీకరించలేదు తాను కూడా కష్టాలు అనుభవించారు కానీ తర్వాత ఆయన అన్యులకు సువార్త ప్రకటించినప్పుడు వారు దానిని అంగీకరించారు మొదట్లో ఆయన కూడా కష్టాలు అనుభవించారు. దేవుడు తనకు తోడుగా ఉండటం వలన ఆయనకు మేలు ఏ జరిగింది అందుకే ఆయనను అన్యుల అపోస్తులుడు అని పిలుస్తూ ఉంటారు. దేవుడు పిలిచిన వారిని నీతిమంతులుగా చేస్తున్నారు అలాగే వారు తన యొక్క మహిమలో పాలుపంచుకొని జీవించేటటువంటి ఒక గొప్ప అర్హతను ప్రభువు దయచేస్తున్నారు వారి యొక్క జీవితంలో కష్టాలు అనుభవించినప్పటికీ కూడా దేవుడిని కలిగి ఉండుటవలన వారి జీవితంలో దేవుడు మేలులు చేస్తూ ఉన్నారు.

ఈనాటి సువిశేష పఠణంలో ఏసుక్రీస్తు పరలోక రాజ్యం గురించి మూడు ఉపమానముల ద్వారా తెలుపుతూ ఉన్నారు. దాచబడిన ధనము అను ఉపమానములో ప్రభువు ఒక వ్యక్తి తాను పొలములో పనిచేసే సమయంలో విలువైన సంపదను కనుగొని దానిని ఏ విధముగా పొందారు అనే అంశమును తెలుపుతూ ఉన్నారు. ఆ కాలంలో ప్రజలు డబ్బులు దాచుకోవటానికి ఇప్పుడున్నటువంటి బ్యాంకులు ఉండేవి కాదు మరియు ప్రజలు దొంగలకు, దోపిడీ దారులకు, యుద్దాలకు, భయపడి తమ యొక్క సంపదలను భూమిలోనే దాచి పెట్టేవారు. కొంతమంది దాచిన స్థలంలో ఆ ధనమును మళ్ళీ తీసుకొని వెళతారు మరి కొంతమంది ఆ ధనాన్ని మళ్లీ వెలికి తీసేవారు కాదు బహుశా ఆ స్థలం మరిచిపోవటంవల్ల లేకపోతే వారు మళ్ళీ అక్కడికి రాకపోవటం వల్ల. కాలక్రమేన అది పరుల కంట పడుతుంది మనం ఈరోజు చదివిన ఉపమానంలో ఒకడు భూమిని దున్నేటువంటి సమయంలో అచట పాతిపెట్టబడినటువంటి ధనమును కనుగొంటున్నారు. అది తన సొంత భూమి కాదు కనుక ఆయన తనకు ఉన్నది మొత్తం కూడా అమ్మి  ఆ పొలమును కొనుగోలు చేస్తున్నారు. ఈ యొక్క వ్యక్తి తాను అనుకోని రీతిగా సంపదను కనుగొన్నాడు కనుగొన్నటువంటి సంపదను పొందుటకు తన దగ్గర ఉన్నది మొత్తం కూడా హెచ్చించి ఆ యొక్క పొలమును తన సొంతం చేసుకున్నారు. ఆ సంపదయే విలువైనది అని గ్రహించిన ఈ వ్యక్తి తన దగ్గర ఉన్నది మొత్తం కూడా త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఇది విలువైనదిగా భావించారు. అదే విధముగా రెండవ ఉపమానంలో ఒక వర్తకుడు ఆణిముత్యముల కొరకు వెదకుచున్నాడు వెదకినటువంటి వ్యక్తి ఒక ఆణిముత్యం దొరకగానే తన దగ్గర ఉన్నది మొత్తం కూడా అమ్మి వేసి ఈ యొక్క ఆణిముత్యమును తన సొంతం చేసుకుంటున్నారు. 

ఈ రెండు ఉపమానములలో ఒక అంశమును ప్రధానంగా చూస్తూ ఉన్నాం. అదేమిటంటే కనుగొనుట దాచబడిన ధనము ఉపమానములో ఒకడు ధనమును కనుగొంటున్నారు ఆణిముత్యం యొక్క ఉపమానములో వర్తకుడు ఆణిముత్యం కనుగొంటున్నాడు. వీరిద్దరూ కూడా వారు కనుగొన్నది ముఖ్యం అని అలాగే అవి విలువైనవి అని తెలుసుకొని వాటిని పొందుకోవటం కోసమై వారి దగ్గర ఉన్నది మొత్తము కూడా త్యాగం చేశారు ఎందుకంటే వారు కనుగొన్నది వారితో ఉంటే దానికన్నా ఇంకా విలువైనది ఏమీ కూడా అవసరం లేదు అని వారు తెలుసుకున్నారు కాబట్టి అందుకనే వారి దగ్గర ఉన్నది మొత్తం కూడా అమ్మి వేసి ఒకరు పొలమును కొంటున్నాడు రెండవ వ్యక్తి ఆణిముత్యమును కొంటున్నారు. ఇద్దరు కూడా ఎంతో శ్రమించారు మరీ ముఖ్యంగా వర్తకుడు ఆణిముత్యం కోసం వెదికకాడు. ఈ సువిశేష భాగంలో మనము గమనించవలసిన విషయం ఏమిటంటే వెదికిన ప్రతి వారికి కూడా దొరుకును అనే సత్యమును దేవుడు వెల్లడిస్తున్నారు. పునీత ఎడిత్  స్టెయిన్ గారు సత్యం కోసం వెదికారు వెతికిన సత్యమును ఆమె క్రీస్తు ప్రభువే అని పునీత అవిలాపురి తెరిస్సమ్మ గారి పుస్తకములో తెలుసుకున్నారు. చాలామంది విశ్వాసులకు వెదికిన చోట దేవుడు దొరికి ఉన్నారు.

అలాగే కొంతమందికి దేవుని యొక్క అనుగ్రహం వలన ఉచితముగా దేవుడే తన యొక్క వరములను వెదకకపోయినా ఇస్తారు దానికి నిదర్శనమే దాచబడిన ధనము కనుగొన్న వ్యక్తి జీవితం. ఇది కేవలము దేవుని యొక్క ఉదారతయే. మన యొక్క జీవితంలో కూడా విలువైనది పొందాలి అంటే మనం కూడా కొన్ని త్యాగం చేసుకోవాలి. కొన్ని విడిచి పెట్టాలి. మరీ ముఖ్యముగా దేవుడిని కలిగి ఉండాలి అంటే పాపమును విడిచి పెట్టాలి అలాగే గర్వమును, వ్యసనములను అన్నిటిని కూడా వదిలిపెట్టినప్పుడే విలువైన సంపద అయిన దేవుడిని మనము కలిగి ఉంటాము. మొదటిగా మనందరం కూడా తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే ఈ లోక సంపదల కన్నా అధికారం కన్నా పేరు ప్రతిష్టల కన్నా దేవుడే ఉంటే చాలు ఇంక ఏదీ కూడా అవసరం లేదు అని. ఏసుప్రభు తన యొక్క శరీర రక్తముల గురించి చెప్పినప్పుడు చాలామంది ఆయనను విడిచిపెట్టి వెళ్లిపోయారు కానీ పేతురు మాత్రము ఏసుప్రభు తో ఉంటే చాలు ఇక ఏది కూడా అవసరము లేదు అని మేము ఎక్కడికి పోలేము నిన్ను విడిచిపెట్టి అని అన్నారు ఎందుకంటే ఆయన ఏసుప్రభు యొక్క గొప్పతనమును, విలువను తెలుసుకున్నారు అందుకనే ఆయనను కలిగి ఉంటే చాలు ఇక ఏది కూడా అవసరం లేదు అని భావించాడు. 

మూడవ ఉపమానములో ఏసుప్రభు పరలోక రాజ్యమును మంచి చేపలు చెడు చేపలు పడిన వలతో పోల్చి చెప్తున్నారు అంటే మంచి వారు చెడ్డవారు కూడా అందరూ దేవుని యొక్క రాజ్యమునకు చెందినవారే కానీ అంత్యకాలమున ఎవరైతే దేవుని చిత్తానుసారంగా జీవించరో వారిని పరలోకము నుండి వేరు చేస్తారు నిత్య శిక్షకు వారు గురి అవుతారు అని ప్రభువు తెలియచేస్తున్నారు. దేవుడు మనకు ఇచ్చినటువంటి జ్ఞానము వరములను బట్టి మంచి మార్గములను ఎన్నుకుంటూ దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ మనందరం జీవిస్తే తప్పనిసరిగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం లేకపోతే చెడు చేపల లాగా దేవుని యొక్క రాజ్యము నుండి పంపి వేయబడి శిక్షకు అర్హులవుతాం కాబట్టి మనందరికీ దేవుడు ప్రసాదించినటువంటి ఆత్మీయ వరములు ద్వారా విలువైనటువంటి దేవుని కలిగి మనము మంచి జీవితము జీవించాలి.

Fr. Bala Yesu OCD

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...