11, మే 2024, శనివారం

మోక్షరోహణ పండుగ

మోక్షరోహణ పండుగ 
అపో 1:1-11, ఎఫేసీ1:17-23, మత్తయి 28:16-20
ఈనాడు తల్లి శ్రీ సభ క్రీస్తు ప్రభువు యొక్క మోక్షరోహణ పండుగను కొనియాడుతున్నది. ఏసుప్రభు పునరుత్థానమైన తర్వాత  శిష్యులకు 40 రోజులు దర్శనమిస్తూ, ధైర్యమనిస్తూ, బలపరుస్తూ వారిని సువార్త సేవకై సంసిద్ధం చేసిన తర్వాత పవిత్రాత్మను పంపుట నిమిత్తమై ఆయన మోక్షమునకు వెళుచున్నారు. ప్రభువు ఎక్కడినుండి వచ్చారో మరలా తిరిగి అక్కడికే వెళుచున్నారు. యోహాను 16 :28. మోక్షరోహణం అనేది క్రీస్తు ప్రభువు యొక్క పట్టాభిషేకము అని చెప్పవచ్చు అనగా ఆయన ఈ భూలోకంలో తన తండ్రి అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేరుస్తూ పరలోకంలో ఉన్న పితదేవుని ఎదుట విజేతగా నిలిచి ఉన్నారు. తండ్రి తన కుమారున్ని సింహాసనం పై కూర్చుండబెట్టి పరలోక భూలోకాలకు రాజుగా పట్టాభిషేకం చేస్తున్నారు. ఆయన భూలోక పరలోకానికి అధిపతి అయినప్పటికీ మోక్షరోహణ పట్టాభిషేకం ఆయన యొక్క విజయమునకు సూచనగా ఉన్నది. ప్రభువు పాపమును, సైతాను జయించి ఉన్నారు కాబట్టి తన కుమారునికి ఇచ్చిన గొప్ప బహుమానం, ఇది ఆయన ప్రేమకు చిహ్నం.
ఈనాటి మొదటి పఠణములో ఏసుప్రభు తన శిష్యులను పవిత్రాత్మను పొందు వరకు యెరూషలేమును విడిచి వెళ్ళవద్దని ఆజ్ఞాపించారు. అదేవిధంగా పవిత్రాత్మను పొందిన తర్వాత 'మీరు నాకు సాక్షులై ఉండాలి' అని ప్రభువు తెలిపారు (అపో 1:8). ఏసుప్రభు పరలోకమునకు వెళ్ళుచుండగా ఆయనతో పాటు ఇద్దరు దేవదూతలు కూడా వుంటిరి,వారు ఏసుప్రభు మరల తన యొక్క మహిమతో భూలోకమునకు వేంచేస్తారు అని వాగ్దానమిచ్చారు. ఈ మొదటి పఠణము ద్వారా మనము గమనించవలసిన విషయం ఏమిటి అంటే "సహనంతో ఉండటం", "వేచి ఉండటం"దాదాపు మూడు సంవత్సరాలు తన శిష్యులతో పాటు కలసి పరిచర్య చేసి ప్రభువు తండ్రి చిత్తము నెరవేర్చిన తర్వాత ఒక్కసారిగా ఆయన భౌతికంగా వారి నుండి దూరంగా వెళ్లే సమయంలో శిష్యులు భయపడకుండా, అలజడలకు నిరాశ చెందకుండా, కష్టాలలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఏసుప్రభువు వారికి భౌతికంగా దూరంగా ఉండే సమయంలో తన శిష్యులను సహనంగా ఉండమని ప్రభువు తెలియచేస్తున్నారు. మన యొక్క జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో సహనంగా ఉండాలి అప్పుడే మనము ఎక్కువగా దీవించబడతాం. పునీత అవిలాపురి తెరేసమ్మ గారు సహనము సమస్తమును పొందును అని తెలియచేస్తున్నారు. ఆనాడు శిష్యులు అన్ని సమయాలలో సహనంగా ఉన్నారు కాబట్టే వారు పవిత్రాత్మను పొంది దేవునికి సాక్షులుగా ఉన్నారు.
ఈనాటి రెండవ పఠణములో పునీత పౌలు ఏసుప్రభు మహిమను పొందుటకు గల కారణం గురించి తెలుపుచున్నారు. ఆయన యొక్క త్యాగజీవితం దానికి నిదర్శనం. మనకు కొరకు తండ్రి సమస్తము తన కుమారుని పాదముల కింద ఉంచెను, సమస్తముపై ఆయనకు అధికారము ఉన్నది ఆయనను శ్రీ సభకు శిరస్సుగా అనుగ్రహించెను (ఎఫేసి 1: 22). ఒక విధముగా చెప్పాలి అంటే రెండవ పఠణం మనందరం కూడా మోక్షరోహణము అవుతాము అని తెలుపుచున్నది అది ఎప్పుడంటే మనము సంపూర్ణంగా ఈ లోకమును జయించినప్పుడు, అలాగే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చినపుడు. క్రీస్తు ప్రభువు మనవలె మానవ స్వభావం కలవారు ఆయన పరలోక మహిమను పొందారు అంటే అది మనం కూడా పొందగలము అని అర్థం. క్రీస్తు ప్రభువు మన మధ్యకు మనలాగ వచ్చి అన్నిటిలో సుమాతృకగా నిలచి మనకు పరలోక దారి చూపారు. ఆయనతో పాటు మనం ఐక్యమై, సజీవులుగా,సత్ప్రవర్తనతో, ఆజ్ఞలు పాటిస్తూ జీవించినట్లయితే తప్పనిసరిగా ఆయన మహిమలో కూడా భాగస్తులు అవుతాము. అలాగే మనము క్రీస్తు బాధల్లో పాలుపంచుకున్నప్పుడు ఆయన మహిమలో కూడా మనము భాగస్తులుకాగలం. (రోమి8:18).
ఈనాటి సువిషేశ భాగములో ఏసుప్రభు మోక్షమునకు వెళ్లేటప్పుడు తన శిష్యులకు ఒక గొప్ప బాధ్యతను ఇస్తున్నారు అది ఏమిటంటే ప్రపంచమంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను ప్రకటించమని తెలుపుచున్నారు, పిత, పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమివ్వమని శిష్యులకు తెలిపారు. ఏసుప్రభు తన శిష్యులను నమ్మి ఉన్నారు కాబట్టి వారికి గొప్ప బాధ్యతను అప్పచెప్పి వెళ్తున్నారు. శిష్యులు ఆయన మరణం అప్పుడు చల్లా చెదిరిపోయినప్పటికీ, ఆయనను మోసం చేసినప్పటికీ మరలా వారికే దర్శనమించి, వారి చేతుల్లోనే సువార్త ప్రకటించే బాధ్యతను, శ్రీ సభను అప్పచెప్పుతున్నారు. ఆయన వారి యెడల నమ్మకముంచారు కాబట్టి అంత బాధ్యతను అప్పచెప్పారు. చాలా సందర్భాలలో దేవుడు మనల్ని నమ్ముతారు కానీ మనము దేవుడిని నమ్మలేం.
ఏసుప్రభు తన తండ్రి చెంతకు తిరిగి వెళ్ళినప్పటికీ కూడా ఆయన మనతోనే ఉంటాను అని సెలవిచ్చుచున్నారు అనగా ‌ దివ్య సప్రసాదం ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా, పవిత్ర గ్రంథం ద్వారా, ప్రార్థించుట ద్వారా ఆయన మనతోనే ఉంటారు. 
ప్రభువు యొక్క మోక్షారోహణం మనకు తెలియచేసే అంశములు ఏమిటి అంటే 
1. పవిత్రాత్మను పొందు వరకు వేచి ఉండుట 
2. దేవుని మహిమను పొందాలి అంటే క్రీస్తు ప్రభువు వలే జీవించాలి 
3. దేవుడు అప్పచెప్పిన బాధ్యతలు శిష్యులు నెరవేర్చిన విధంగా మనం కూడా నెరవేర్చాలి. 
4. దేవుడు మనతో ఉన్నాడు అని ధైర్యంతో ముందుకు సాగాలి. 
5. దేవుని యొక్క శుభవార్తను ప్రకటించాలి. 
6. పవిత్ర జీవితం జీవించాలి.

Fr. Bala Yesu OCD

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...