21, అక్టోబర్ 2023, శనివారం

29 వ సామాన్య ఆదివారం

29 వ సామాన్య ఆదివారం
యెషయ 45:1,4-6, 1 తెస్సలోనిక 1:1-5, మత్తయి 22:15-21

ఈనాటి పరిశుద్ధ గ్రంధం పఠణములు మానవుని యొక్క బాధ్యతలను గురించి తెలుపుచున్నది. మానవులు దేవుని యెడల నెరవేర్చవలసిన బాధ్యతలను అదే విధముగా ఈ లోక ప్రభుత్వం యెడల నెరవేర్చవలసిన బాధ్యతలను గురించి తెలుపుచున్నది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా జీవించడం చాలా ముఖ్యం అది దేవుని పట్లయినా లేదా తమ యొక్క దేశము పట్లయినా. ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడని కాకుండా ఆయన మానవులందరికీ కూడా దేవుడు అని తెలుపుతున్నాను. ప్రభువు అన్యుడైన పర్షియా దేశపు సైరస్ రాజును అభిషక్తునిగా చేస్తున్నారు. చరిత్రలో మొదటిసారిగా యావే దేవుడు యూదులను కాకుండా అన్యులను అభిశక్తునిగా చేస్తున్నారు. సైరస్ రాజు యావే దేవుడిని ఆరాధించనప్పటికిని ఆయనను ఎన్నుకుంటున్నారు ఎందుకంటే ఆయనలో ఒక ప్రత్యేకత అది ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలు క్రీస్తుపూర్వం 587 వ సంవత్సరంలో బాబిలోనియా బానిసత్వంలో జీవించేవారు అప్పుడు వారు తమ యొక్క సొంత మత విధి విధానాలు అనుసరించడానికి అవకాశం ఉండేది కాదు కానీ దాని తర్వాత క్రీస్తుపూర్వం 539లో సైరస్ రాజు బాబిలోనియాను జయించి ఇశ్రాయేలు ప్రజలకు ఒక విధమైన స్వేచ్ఛను కలిగించారు అది మాత్రమే కాదు యూదులు ప్రత్యేక విధంగా యావే దేవుడిని ఆరాధించటకు ప్రోత్సహించాడు, వారి యొక్క భక్తికి ఎటువంటి ఆటంకం చెప్పలేదు అదేవిధంగా వారికి ఆర్థికంగా సహాయం చేశారు వారి యొక్క దేవాలయమునకు కావలసిన వాటిని కూడా సైరస్ రాజు సమకూర్చాడు. యావే దేవుడు తెలియనప్పటికీ కూడా ఆయన కొరకు అంతా చేయటానికి అనుమతిచ్చారు. అందుకే ఆయన యొక్క మంచితనమును చూసి ప్రభువు తనను అభిశక్తునిగా చేస్తున్నారు.
 అభిశక్తునిగా చేయటం అంటే దేవుడు అతనిని ఒక ప్రత్యేకమైనటువంటి పనికి ఎన్నుకుంటున్నారు ఆ ప్రత్యేకమైనటువంటి పని ఏమిటంటే యూదులకు స్వేచ్ఛనిచ్చుటకు దేవుడు అతడిని నియమిస్తున్నారు అదేవిధంగా ప్రభువు ఈ మొదటి పఠణంలో తాను ఒక్కడే దేవుడు ఇక ఏ దేవుడు లేరు అనే అంశములు కూడా తెలియజేస్తున్నారు. పదేపదే ప్రభువు నేను ఒక్కడినే అని తెలుపుచున్నారు,ఆయన్ని మాత్రమే ఆరాధించాలి అని తెలుపుతున్నాను ఈ మాటలు దేవుడు మనకు మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ప్రథమ ఆజ్ఞ గురించి తెలుపుతున్నది. అది ఏమిటంటే సర్వేశ్వరుడుని మాత్రమే ఆరాధించదువుగాక దేవుడు ఒక్కడే అని తెలుసుకొని ఆరాధించాలి. పాత నిబంధన మొత్తం కూడా దేవుడు ఒక్కడే అని తెలుపుచున్నది. నేను రోషము గల దేవుడు అని ప్రభువు తెలిపారు,నేను తప్పా ఇంకొక  దేవుడు లేడు అని ప్రవక్తల ద్వారా తెలిపారు. చాలా సందర్భాలలో మనందరం కూడా ఈ సత్యాన్ని మరచిపోతూ ఉంటాము ఎందుకంటే మనందరం వివిధ రకాలైనటువంటి విశ్వాస పద్ధతులను అనుసరిస్తాం కానీ దేవుడు ఒక్కరే. ఒకవేళ మనం వేరే మత సాంప్రదాయాలను అనుసరించినట్లయితే అది దేవునికి విరుద్ధముగా జీవించినట్లే. కాబట్టి దేవుడు ఒక్కరే అని తెలుసుకొని ఆయనను మనం విశ్వసించి అనుసరించాలి. ఈనాటి 
రెండవ పఠణంలో పౌలు గారు తెస్సలోనిక ప్రజల యొక్క విశ్వాస జీవితాన్ని మెచ్చుకుంటున్నారు ఎందుకంటే వారు అక్కడ పరిచర్య చేసినటువంటి సందర్భంలో అన్ని విధాలుగా సహకరించి నందుకు అదేవిధంగా దేవుని ఎడల విశ్వాస పాత్రలుగా జీవించినందుకు. పౌలు గారు తెస్సలోనిక ప్రజల యొక్క విశ్వాసం, ప్రేమ, నిరీక్షణను మెచ్చుకుంటున్నారు.
ఈనాటి సువిశేష పఠణంలో పరిసయ్యులు ఏసుప్రభువును సుంకము గురించి అడిగినటువంటి ప్రశ్న తెలుసుకుంటున్నాం. ఏసుప్రభువు చక్రవర్తికి సుంకమును చెల్లించాలా? లేదా అనేటటువంటి ప్రశ్న అడుగుతున్నారు దానికి ప్రతిఫలముగా ప్రభువు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే నాణెము మీద ఉన్న రూపంను బట్టి సుంకములు చెల్లించవలసిందిగా తెలుపుతున్నారు. వాస్తవానికి వీరు యొక్క ఉద్దేశం ఏంటంటే ఏసు ప్రభువుని ఏ విధంగానైనా సరే పట్టించాలి అనే ఆలోచన. ఒకవేళ ఏసుప్రభు సుంకము చెల్లించవద్దు అని అన్నట్లయితే ఆయన రోమా చక్రవర్తులకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు అని ఆయన మీద కుట్ర పన్ని ఆయనను శిక్షించాలని అనుకుంటున్నారు. ప్రభువు వారికి చక్కగా సమాధానం ఇచ్చారు. నాణెము మీద చక్రవర్తి రూపము ఉన్నది కాబట్టే అతనికి సుంకము చెల్లించవలసిన అవసరత ఉన్నది అదేవిధంగా మనందరం కూడా దేవుని యొక్క రూపంలో సృష్టించబడ్డాము కాబట్టి మనము ఆయనకు(దేవునికి) చెందినటువంటి వారమైట్లయితే మరి ఆయన యెడల ఉన్నటువంటి మన యొక్క బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్నామా? దేవుడు మన జీవితంలో మనకు కావలసినవి ఇచ్చారు మరి మనం ఆయన యెడల ఎలాంటి విశ్వాసం వ్యక్తపరుస్తున్నాము? ఏ విధముగా ఆయన యొక్క ఆజ్ఞ పాటిస్తున్నా మీ? ఏ విధముగా ఆయన చిత్తమును మన జీవితంలో నెరవేరుస్తున్నాము?. మనందరి యొక్క జీవితంలో దేవుని యొక్క రూపం ఉన్నది కాబట్టి మనము దేవునికి చెందిన వారము కావున దేవుడి యొక్క మాట ప్రకారముగా మనం జీవించటకు ప్రయత్నం చేయాలి.
మనకి భూలోక పౌరసత్వము అదేవిధంగా పరలోక పౌరసత్వం ఉన్నది కాబట్టి మనము ఈ లోకానికి చెందినటువంటి ప్రభుత్వమునకు సంబంధించినటువంటి బాధ్యతలను నెరవేర్చాలి అదేవిధంగా దేవుడికి సంబంధించినటువంటి బాధ్యతలను కూడా నెరవేర్చాలి.
Fr. Bala Yesu OCD

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము  ఆదికాండము 2:18-24 హెబ్రీయులకు 2:9-11 మార్కు 10:2-16 క్రీస్తునాధునియందు ప్రియ సహోదరీ సహోదరులారా, దేవుని బిడ్డ...