6, జనవరి 2024, శనివారం

క్రీస్తు సాక్షాత్కార పండుగ

క్రీస్తు సాక్షాత్కార పండుగ
యెషయా 60:1-6,ఎఫేసి 3:2-3, మత్తయి 2:1-12
ఈనాడు తల్లి శ్రీ సభ క్రీస్తు సాక్షాత్కార పండుగను కొనియాడుచున్నది. సాక్షాత్కారం అనగా క్రీస్తు ప్రభువు తనను తాను ఇతరులకు ఎరుకపరుచుట. తండ్రి దేవుడు తన కుమారుడిని ఈ లోకమునకు అంతట ఎరుకపరిచారు. ఆయన యొక్క పుట్టుక ద్వారా దేవుడు మొదటగా ఏసుప్రభువును తన తల్లిదండ్రులకు తరువాత గొల్లలకు ఎరుకుపరిచారు అటు తరువాత ముగ్గురు జ్ఞానులకు తన కుమారుడిని బయలుపరిచారు. క్రీస్తు సాక్షాత్కారము ద్వారా మానవలోకంలో దైవ సాక్షాత్కారం జరిగింది. దేవుడికి మానవునికి మధ్య ఉన్న తెర తొలగిపోయి దేవుడు మానవుడు ఒకటిగా కలిసి ఉన్నారు, ముఖాముఖిగా ఒకరినొకరు చూడగలుగుతున్నారు.
ఈ పండుగను మూడు విధాలుగా పిలుస్తారు
1. ముగ్గురు రాజుల పండుగని
2. విశ్వాసుల పండుగని
3. అన్యుల క్రిస్మస్ పండుగని
ఈ ముగ్గురు జ్ఞానులు అన్యులైనప్పటికీ వారు క్రీస్తు రాజును దర్శించడానికి మరియు ఆరాధించటానికి దూర ప్రాంతముల నుండి సుదీర్ఘమైన ప్రయాణం చేసి కష్టమైనా ఇష్టముగా మార్చుకొని వారు దివ్య బాల యేసును సందర్శించారు. ఈ జ్ఞానులు క్రీస్తు ప్రభువు చెంతకు చేరుటకు ఎటువంటి పవిత్ర గ్రంథమును చదవలేదు కేవలం ఒక నక్షత్రమును ఆధారముగా చేసుకొని వారి యొక్క ప్రయాణమును ప్రారంభించి రక్షకుడిని చేరుకున్నారు. ఈ ముగ్గురు జ్ఞానులు ఎవరనగా? కాస్పర్, మెల్కియోర్, బల్తజార్.
కాస్పర్ అనేటటువంటి జ్ఞాని అరేబియా దేశం నుంచి తన ప్రయాణం ప్రారంభించి దేవునికి సాంబ్రాణి సమర్పించారు. ఈ సాంబ్రాణి యాజకత్వమునకు గుర్తు ఏసుప్రభు నిత్య యాజకుడని గుర్తించి ఆయన అందరికీ రక్షణనిచ్చుటకై తన్ను తానే బలిగా సమర్పించుకుంటారని మరియు మన కొరకై తండ్రిని సంతోష పరుచుటకు ఒక యాజకునిలా ధూపము వేస్తూ మనలను ఆశీర్వదిస్తారు.
మిల్కియోర్ అనే జ్ఞాని ఏసుప్రభుకు బంగారమును సమర్పించారు. ఈ బంగారం యేసు ప్రభు యొక్క రాజరికమునకు గురుతుగా ఉన్నది. ఆయన మన అందరి యొక్క హృదయములను పరిపాలించే రాజు అందుకే ఆయనకు బంగారం కానుకగా సమర్పించారు
బల్తజార్ అనే జ్ఞాని పరిమళ ద్రవ్యమును యేసు ప్రభుకి సమర్పించారు అది ఆయన మరణమును సూచిస్తుంది. ఆయన మరణించిన తరువాత తన యొక్క శరీరమును మంచిగా ఉంచుటకు ఈ యొక్క పరిమళ ద్రవ్యమును సమర్పించారు. ముక్కు రంధ్రంలో పరిమళ ద్రవ్యమును ఉంచినట్లయితే ఆ యొక్క శరీరం చాలా కాలం నిలుస్తుంది.
ఈనాడు ఈ ముగ్గురు జ్ఞానుల పండుగను జరుపుకునే సందర్భంలో వారి జీవితము నుండి మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలి
- 1. ఏసుప్రభువును చూడాలన్న కోరిక. వీరి ప్రయాణం చీకటిలో జరిగినప్పటికీ వారు ఏసుప్రభుని చూడాలి అనేటటువంటి గాఢమైన కోరికను కలిగి ఉన్నారు కాబట్టి ఆయనను సందర్శించి ఉన్నారు. మనలో కూడా దేవుడు ఎడల ఒక గాఢమైన కోరిక ఉండాలి అది ఏమిటి అంటే ఆయనను చూడాలి, ప్రార్థించాలి, ఆయన సన్నిధికి రావాలి అని కోరిక మనలను నడిపించాలి.
2. వెదకుట- ఏసుప్రభు కోసం వెతుకుతూ ఉన్నారు చివరికి ఆయనను కనుగొన్నారు కాబట్టి మనలో కూడా వెదికే సుగుణం ఉండాలి.
3. పాత మార్గమును విడిచి కొత్త మార్గమును అనుసరించాలి. ఈ జ్ఞానులు కూడా చేసినది అదే.
4. దేవుడిని ఆరాధించారు. అన్యులైనప్పటికీ వారు ఏసుప్రభుని విశ్వసించి ఆయన రక్షకుడని గ్రహించి వారు ఎంత పెద్ద జ్ఞానులైనప్పటికీ కూడా ఆయన ముందు సాష్టాంగ పడి ప్రభువుని ఆరాధించారు.
5. విధేయత చూపుట. దేవుని యొక్క దూత వారికి ఆదేశించిన విధముగా వారు దేవుని యొక్క మాటలకు విధేయత చూపించి వారి యొక్క ప్రయాణమును కొనసాగించారు.
6. దేవునికి కానుకలు సమర్పించారు. ఈ ముగ్గురు జ్ఞానులు ఏసుప్రభువుకు విలువైన కానుకలను సమర్పించారు అలాగే మనము కూడా దేవునికి విలువైన కానుకలు సమర్పించాలి.
ఈనాడు ఈ ముగ్గురు జ్ఞానుల పండుగను కొనియాడే  సందర్భంలో మనము వీరిలో ఉన్న లక్షణములను కలిగి జీవించాలి.
Fr. Bala Yesu OCD

లూకా 17:11-19

 సమరియుని కృతజ్ఞత  యేసు సమరియా, గలిలియా ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగనే పదిమంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదు...