9, డిసెంబర్ 2023, శనివారం

ఆగమన కాల రెండవ ఆదివారం

ఆగమన కాల రెండవ ఆదివారం
యెషయా 40:1-5,9-11
2 పేతురు 3:8-14
మార్కు1:1-8
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు రక్షకుని రాకడకై మన హృదయం అనే ఇంటికి మార్గమును సిద్ధము చేయుట అనే అంశం గురించి బోధిస్తున్నాయి. ప్రభు మన యొక్క జీవితంలోకి రావాలి అంటే మనందరం కూడా ఆయన కొరకు ఒక మార్గమును సిద్ధం చేయాలి. ఆ మార్గము హృదయ పరివర్తనంతో కూడిన మార్గం అయి ఉండాలి అదేవిధంగా పవిత్రత కలిగిన మార్గమై ఉండాలి.
ఈనాటి మొదటి పఠణంలో యెషయా ప్రవక్త  బాబిలోనియా బానిసత్వంలో ఉన్న యూదులను ఓదారుస్తున్నారు. 60 సంవత్సరాల సుదీర్ఘ బాబిలోనియా బానిసత్వం నుండి దేవుడు తన ప్రజలకు స్వేచ్ఛనిచ్చి వారిని యెరుషలేమునకు పంపిస్తున్నారు. ఇకమీదట ఇశ్రాయేలు ప్రజలకు  దేవుడు ఒక కాపరిగా తోడుండి వారిని నడిపిస్తారు అనే అంశమును తెలుపుచున్నారు. ప్రవక్త దేవుని యొక్క మాటలను ఈ విధంగా తెలుపుచున్నారు "ఇశ్రాయేలు ప్రజల బానిసత్వం ముగిసినదనియు, వారు తమ పాపములకు రెండింతలుగా శిక్షను అనుభవించారని,వారి శిక్ష ముగిసినదని తెలిపారు. యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల యొక్క బానిసత్వమునకు వారి యొక్క పాపము జీవితమే కారణం చెప్పుటకు నిరాకరించలేదు ధైర్యంగా వారికి చేసిన తప్పిదమును తెలియజేశారు. ప్రభు వారికి విముక్తిని కలుగజేస్తూ ఆయన యొక్క రాకడ కొరకు మార్గమును సిద్ధం చేయమంటున్నారు. ఈ మొదటి పఠణంలో ఒక స్వరం ఈ విధంగా పలుకుచున్నది "ఎడారిలో ప్రభువులకు మార్గం సిద్ధం చేయుడు, మరో భూమిలో మన దేవునికి రాజ పదమును తయారు చేయుడు. ప్రతి లోయ పూడ్చబడాలి, ప్రతి పర్వతము చదును చేయబడాలి అదేవిధంగా మిట్ట పల్లములు సమతలముగా చేయాలి". ఈ మాటలు వాస్తవానికి ప్రజల యొక్క ఆధ్యాత్మిక జీవితమునకు చెందినటువంటివి.
- ఎడారిలో మార్గమును సిద్ధము చేయుట అనగా ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం ఎడారిలాగా మారినది అంతా కోల్పోయారు, జీవము లేని విధంగా మారినది. దేవుడు లేనటువంటి జీవితం ఎడారి జీవితంలో లాంటిది. అందుకే ఇశ్రాయేలు ప్రజల  యొక్క జీవితం నిర్జీవంగా మారినది, శాంతి లేదు, సమాధానం లేదు కేవలము నిరాశ, నిస్పృహ మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకే ప్రవక్త అంటున్నారు ఎడారి వలె నిర్జీవముగా ఉన్నటువంటి వారి జీవితములో దేవుని రాకకై మార్గాలు సిద్ధం చేయమంటున్నారు. దేవుడు వారి జీవితము గుండా ప్రయాణిస్తాను అని అంటున్నారు.
- మరు భూమిలో దేవునికి రాజ్యమార్గమును సిద్ధము చేయమంటున్నారు అనగా ఫలించలేనటువంటి జీవితంలో విశ్వాసముతో దేవునికి ఒక మార్గాన్ని సిద్ధం చేయమంటున్నారు.
- ప్రతి లోయ పూడ్చబడాలి అనగా ప్రతి ఒక్కరిలో ఏది కొరతగా ఉన్నదో దానితో వారి జీవితము నింపుకోవాలి అది వినయమైన కావచ్చు, సహనమైన కావచ్చు, ప్రేమ అయినా కావచ్చు, క్షమాపణ అయిన కావచ్చు లేదా ఇతర సుగుణములు ఏవైనా కావచ్చు, కాబట్టి మనలో ఉన్న లోయలను ఈ సుగుణములతో నింపుకోవాలి.
- పర్వతములు, కొండలు నేలమట్టం కావలెను అని ప్రవక్త అంటున్నారు ఈ యొక్క మాటలకు ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే పర్వతములైన, కొండలైనా(hight) ఎత్తుగా ఉంటాయి ఇవి మనలో ఉన్నటువంటి గర్వమునకు, అహంకారంకు చూచనగా ఉన్నాయి కొంతమంది గర్వంతో, అహంకారంతో జీవిస్తుంటారు ఆ యొక్క గర్వము అహంకారం నేలమట్టం అవ్వాలని ప్రవక్త తెలుపుచున్నారు.
- మిట్ట పల్లములు సమతలము కావలెను అనగా మనలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కూడా సరి సమానులే, దేవుని బిడ్డలే అనే ఆలోచనతో కలిసిమెలిసి జీవించాలి.
ప్రజలను పరిపాలించే రాజు వస్తున్నాడు కాబట్టి ఆయన కొరకై మనందరం మన జీవితంలో ఒక మార్గమును సిద్ధపరచినట్లయితే ప్రభువు మన జీవితము గుండా ప్రయాణిస్తూ ఉంటారు. మార్గము ఏర్పరిచినప్పుడు మాత్రమే ప్రయాణము సులువుగా కొనసాగుతుంది అదేవిధంగా మన జీవితమును దేవుని రాక కొరకై సిద్ధం చేసుకున్న సమయంలో మాత్రమే దేవుడు మన గుండా వెళుతుంటారు. కాబట్టి మన కాపరి అయిన దేవునికి మనందరం మన జీవితాలను తయారు చేసుకుందాం.
ఈనాటి రెండవ పఠణంలో పేతురు గారు ఏసుప్రభు యొక్క రాకడను గురించి తెలియజేస్తున్నారు ఆయన యొక్క రాకడ దొంగ వలె వచ్చును కాబట్టి సహనంతో ఉండమని తెలుపుతున్నాను. ప్రభు యొక్క దృష్టిలో ఒక దినము వెయ్యి సంవత్సరములకు అదేవిధంగా వెయ్యి సంవత్సరములు ఒక దినము వలె ఉండును. ఆయన యొక్క రాక ఆలస్యం ఎందుకంటే అనేకమంది విశ్వాసులను రక్షించుటకు ఆయన ఆలస్యంగా వస్తూ ఉంటారు కావున మనము ఆయన యొక్క దినముకై వేచి చూస్తూ మన యొక్క జీవితాలను మనము తయారు చేసుకోవాలి.
ఈనాటి సువిశేష భాగములో బప్తిస్మ యోహాను గారు ప్రజలకు హృదయ పరివర్తనము చెంది పాప క్షమాపణకై జ్ఞాన స్నానము పొందాలని తెలుపుచున్నారు. బప్తిస్మ యోహాను గారు ప్రజలకు భిన్నమైన జీవితమును జీవించారు. అంతయు త్యాగం చేసి ఎడారిలో తన సమయమును దేవునితో గడిపారు అదే విధముగా ఆయన తన సమయమును ఎక్కువగా ప్రార్థించుటకై వినియోగించారు, రోమముల వస్త్రములను ధరించారు, నడుమునకు తోలు పట్టి కట్టుకొని మిడతలను భుజించుచు పుట్ట తేనెను త్రాగుచుండెను. ఆయన ప్రజలను యేసు ప్రభువు యొక్క రాకడ కొరకై సిద్ధం చేస్తున్నారు. యోహాను గారు తన యొక్క సువార్త పనిని ఎడారిలో ప్రారంభించడానికి కారణం ఏమిటంటే పూర్వ వేదంలో ఇజ్రాయేల్ ప్రజలు ఎడారిలో నివసించుచున్న కాలాన్ని ప్రత్యేకంగా దైవ వరప్రసాద కాలమని యూదులు భావించేవారు. దేవుడు తన ప్రజలకు అతి సన్నిహితంగా ఉన్నాడు అని తెలిపే కాలం అది. దైవ రాజ్యం మొదటిగా ఎడారిలో స్థాపింపబడుతుందని అచటనే మెస్సయ్య ప్రత్యక్షమవుతారని యూదులు భావించేవారు అందుకే బప్తిస్మ యోహాను తన యొక్క బోధనలను ఎడారిలో ప్రారంభించి అనేక మందిని ఉదయ పరివర్తనం చెంది ఎలాగ చేశారు. హృదయ పరివర్తనము చెందితే గాని మన దేవుడిని మనలోనికి ఆహ్వానించలేము. కాబట్టి దేవుడే స్వయంగా మన యొక్క హృదయములోనికి రాబోతున్నారు కావున మన పాపపు జీవితమును, పాత అలవాటులను, కోరికలను, అభిప్రాయాలు వదిలేసి దేవునితో కొత్త జీవితం ప్రారంభించాలి. యోహాను గారు ప్రభువు రాకడ కొరకై ప్రజల జీవితాలను సిద్ధం చేసిన విధంగా మనం కూడా దేవుని రాకకై మన జీవితాలను సిద్ధం చేయాలి.

Fr. Bala Yesu OCD

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...