4, నవంబర్ 2023, శనివారం

31వ సామాన్య ఆదివారం

31వ సామాన్య ఆదివారం
మలాకీ  1:4-2,8-10
1 తెస్సలోనిక 2:7-9,13
మత్తయి 23:1-12
ఈనాటి దివ్య పఠణములు దేవుని సేవకులైన యాజకుల యొక్క బాధ్యతలను వారు జీవించవలసిన విధానములు గురించి తెలియజేస్తున్నాయి. మనము ఈ లోకంలో వివిధ రకములైనటువంటి నాయకులను చూస్తూ ఉంటాం. మత బోధకులను చూస్తుంటాం. కొంతమంది తాము ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి జీవిస్తూ ఉంటారు. చాలామంది ఒకటి చెప్పి ఇంకొకటి అనుసరించేటటువంటి వారు ఉంటారు. ఈరోజు ప్రభువు తన ప్రతినిధులందరికీ కూడా తెలియచేసే అంశము ఏమిటంటే వారి జీవిత విధానము దేవుని యొక్క చిత్తానుసారముగా ఉండాలని. కేవలము ఈ యాజకుల యొక్క జీవితం మాత్రమే కాకుండా ఎవరైతే ఒక ప్రతినిధిగా ఉంటూ ఉన్నారో వారి గురించి కూడా మాట్లాడుతున్నారు. దేవుడు ఇచ్చిన బాధ్యతలు  సరియైనటువంటి రీతిలో నెరవేరుస్తున్నారా? లేదా అని ప్రభువు మనలను సవాలు చేస్తున్నారు. దానితోపాటు దేవుని యొక్క సేవకులు జీవితం నీ స్వార్థ జీవితంగా అదేవిధంగా విశ్వాసము - చేతలు కలిగిన జీవితముగా ఉండాలి అని ప్రభువు తెలుపుచున్నారు.
ఈనాటి మొదటి పఠణంలో బాబిలోనియా బానిసత్వం నుండి తిరిగి వచ్చిన మతాధికారులను అదేవిధంగా యాజకులను ఉద్దేశించి మాట్లాడుచున్నారు. దేవుడు మలాకీ ప్రవక్తను క్రీస్తుపూర్వం 515 వ సంవత్సరంలో ఎన్నుకొని తన రక్షణ సందేశమును అంద చేయుటకు నియమించి ఉన్నారు. దేవుడు మలాకీ ప్రవక్త ద్వారా ఆనాటి అసత్య బోధకులు, మత నాయకులైన యాజకులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. దేవుడు వారి యొక్క స్వార్థపు జీవితమును చూసి వారిని శిక్షిస్తానని తెలుపుతున్నారు. ఎందుకు దేవుడు తాను ఎన్నుకున్నటువంటి వారిని శిక్షిస్తానని చెబుతున్నారంటే ఈ యాజకులు దేవుడి యొక్క పనిని కాకుండా, ఆయన చిత్తమును కాకుండా, తమ ఇష్టానుసారముగా స్వలాభము కోసం జీవించి ఉన్నారు అందుకనే వారిని ప్రభువు శిక్షిస్తానని తెలుపుచున్నారు. మలాకీ ప్రవక్త యొక్క కాలంలో యాజకుల యొక్క కపటత్వమును ఖండిస్తున్నారు. బాబిలోనియా నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలు  ప్రజలు యెరూషలేము దేవాలయమును రెండవసారి పునః నిర్మించి ఉన్నారు అప్పుడు యాజకులు వారి యొక్క విధులను నెరవేర్చుటలో విఫలమయ్యారు. వివిధ రకములైనటువంటి చెడు మార్గములను అవలంబించారు. అదే కాకుండా ప్రజలకు న్యాయం చేయుటకు బదులుగా అన్యాయం చేశారు. వితంతువులను ఆదుకొనుటకు బదులుగా వారిని నిరాకరించారు. ఈ యాజకులు దేవుని సందేశమును బోధించకుండా అలాగే ఆయన చిత్తమును నెరవేర్చకుండా తమ యొక్క సొంత ప్రణాళికలను అదేవిధంగా రాజుల యొక్క ప్రణాళికలను నెరవేర్చారు. అందుకనే వారి యొక్క జీవితములను చూచిన ప్రభువు కోపపడుతూ వారిని శిక్షిస్తానని తెలుపుచున్నారు.
 ఒక విధముగా చెప్పాలంటే వారు దేవుని యొక్క మార్గము నుండి వైదొలిగి జీవించి ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించుటలేదు. అందుకనే మలాకీ ద్వారా దేవుడు మరియొకసారి యాజకులను ఖండిస్తున్నారు. వారు దేవునికి సమర్పించేటటువంటి ఆ యొక్క బలి అర్పణలో కూడా వారు మేలైనది దేవునికి సమర్పించకుండా అనారోగ్యంతో ఉన్నటువంటివి దేవునికి సమర్పించేటటువంటివారు. ప్రభువు చాలా బాధపడుతూ పలికినటువంటి మాట ఏమిటంటే "యాజకులు దారి తప్పితిరి" అని తెలుపుచున్నారు అనగా దేవుని యొక్క మార్గములకు వ్యతిరేకంగా జీవించుటకు ఇష్టపడ్డవారు.వాస్తవానికి దేవుడే వారిని ప్రత్యేకంగా ఎన్నుకొని తన యొక్క సేవ చేయుటకు నియమించి ఉన్నారు కానీ వారే దేవునికి విరుద్ధముగా జీవిస్తూ, ప్రజలను కూడా పాపములోనికి నడిపించి ఉన్నారు కాబట్టి ప్రభువు అట్టి వారిపట్ల అసహనమును వ్యక్తపరుస్తున్నారు. ఆనాటి కాలంలో కూడా అసత్య ప్రవక్తలు ఉన్నారు సత్య ప్రవక్తలు ఉన్నారు. దేవుని కొరకు జీవించేవారు ఉన్నారు. దేవుని కొరకు జీవిస్తున్నామని చెప్పుకొని నటించేవారు కూడా ఉన్నారు.ఈ మొదటి పఠణము ద్వారా మనము తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే యాజకుల వలె దేవుడు  మనందరికీ కూడా బాధ్యతలను ఇచ్చి ఉన్నారు కాబట్టి అట్టి బాధ్యతలు మనము ఎలాగ మన జీవితంలో కపటత్వము లేకుండా నెరవేరుస్తున్నాము అని ప్రశ్నించుకోవాలి.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు తెస్సలోనికా ప్రజల యొక్క విశ్వాస జీవితము గురించి తెలియజేస్తున్నారు వారి మధ్య సువార్తను ప్రకటించే సందర్భంలో దేవుని యొక్క సువార్తను వారు అందరు కూడా స్వీకరించి ఉన్నారు ఆ సందేశమును బట్టి వారు తమ జీవితములను మార్చుకున్నారు. వారి జీవితంలో పౌలు గారు అదేవిధంగా మిగతా సేవకులు బోధించిన వాక్యము మానవ సంబంధమైన వాక్యము కాదు దైవ సంబంధమైన వాక్కు అని వారు గ్రహించి ఉన్నారు కాబట్టి దాని ప్రకారముగా వారి జీవితములను సరి చేసుకుంటూ జీవింపసాగారు అందుకుగాను పౌలు గారు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పౌలు గారు తెస్సలోనిక ప్రజల మధ్య జీవించే సమయములో ప్రజల మీద ఎటువంటి భారము మోపకుండా వారిని ప్రేమిస్తూ, వారికి సుమాత్రకుగా జీవిస్తూ, వారికి దైవ ప్రణాళికలను సందేశమును అందజేసి ఉన్నారు. మనందరం కూడా తెస్సలోనికా ప్రజల యొక్క జీవితము నుండి నేర్చుకోవలసిన సందేశం ఏమిటి అంటే వారు అపోస్తుల నుండి ప్రకటింపబడిన సత్యము, దేవుని సత్యము, సందేశము అని గ్రహించి దాని ప్రకారముగా జీవింప సాగారు అలాగే మనము కూడా యాజకులు బోధించిన దైవ సందేశము ప్రకారముగా జీవింప సాగాలి.
ఈనాడు మనము చదివిన సువిశేష భాగములో ప్రజలను ధర్మ శాస్త్ర బోధకుల, పరిసయ్యుల  యొక్క కపటత్వము గురించి జాగరుకులై ఉండమని తెలుపుతున్నారు. ఎందుకంటే ధర్మశాస్త్ర బోధకులు అనేక సందర్భంలో కేవలం నీతి వాక్యములను బోధించే వారు కానీ ఆచరించే వారు కాదు. పరిసయ్యులో దాదాపు 7 వర్గాలు కలిగినటువంటి లేదా ఏడు మనస్తత్వములు కలిగిన  వ్యక్తులు ఉన్నారు. 
- కొంతమంది మోషే ధర్మ శాస్త్రమును పాటిస్తూ మంచి క్రియలను చేసేటటువంటి వారు. వీరు కేవలము ప్రజల పొగడ్తలకై ఇష్టపడేవారు.
-కొంతమంది కేవలం మాటలు మాత్రమే చెప్పి క్రియలు చేయ కుండా సాకులు చెప్పేవారు.
- కొంతమంది ఇతరుల ఎదుట పుణ్యాత్ములనపించుకొనుటకు నటించేవారు. వారు నడిచేటప్పుడు ఎవరైనా స్త్రీలు కనపడినప్పుడు వారిని చూడకుండా తమ యొక్క శరీరములను గాయపరచుకుంటారు అట్టివారిని ప్రజలు చూసినప్పుడు వారు నిగ్రహ శక్తి కలిగిన వారు, మంచివారు అని అనుకొనుటకు నటించేవారు.
-ఇంకా కొంతమంది వినయాన్ని వ్యక్తపరచుటకు గూని వాని వలె వంగి నడిచేవారు మీరు కూడా ప్రజల యొక్క దృష్టిలో మంచివారు అనిపించుకొనుటక ఇట్లా జీవించేవారు.
-కొంతమంది దేవుని నుండి మెప్పు పొందుటకై సత్కార్యాలు చేయటానికి ఇష్టపడేవారు. వారి యొక్క స్వార్థం కొరకే ఇలాగ జీవించేవారు.
-మరి కొంతమంది దేవుని శిక్షకు భయపడేటటువంటివారు అనగా బయటకు మంచిగా జీవిస్తూ అంతరంగికంగా తాము చేసిన తప్పులకు బాధపడేవారు.
-చివరిగా కొంతమంది పరిసయ్యులు దైవభయం కలిగి దేవుని ప్రేమిస్తూ సేవిస్తూ ఆయనకు విధేయులై జీవించేవారు. పైన చెప్పబడినటువంటి పరిసయ్యుల యొక్క జీవితము దాదాపుగా ఇతరులకు చూపించట కొరకే గానీ వారు తమ జీవితంలో ఒక్క నిజాయితీని గానీ,నిజమైన విశ్వాసమును గాని ప్రకటించుట చాలా అరుదు అందుకే ప్రభువు కేవలం వారి యొక్క బోధనలను పాటించమని చెబుతూ ఉన్నారు వారి యొక్క క్రియలను కాదు ఎందుకంటే చాలా సందర్భాలలో బోధించేవారు ఇతరులకు సుమాత్రుకగ ఉండరు. అది వారి బలహీనత వలన కావచ్చు, వారి యొక్క స్వార్థం వలన కావచ్చు, లేదా వారి యొక్క శోధన వల్ల కావచ్చు కాబట్టి ఈ ధర్మశాస్త్ర బోధకులు గాని పరిసయ్యులు గాని అదే విధముగా యాజకులు గాని బోధించిన ఏ మంచి సందేశమైన మనము స్వీకరించటానికి మనము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. కానీ అనేక సందర్భంలో మనము వారి జీవితాన్ని చూస్తాము కానీ వారి యొక్క మాటలను బోధనలను మన జీవితంలో అనుసరించడానికి ఇష్టపడము కానీ ఈ సువిశేష ప్రారంభంలోనే ప్రభువు వారి జీవితము కాక వారి బోధనలను పాటించమని తెలియజేస్తున్నాను కాబట్టి మనకు మంచిని ప్రకటించినప్పుడు దానిని ఆచరించడానికి సిద్ధపడుతూ జీవించుదాం. దేవుడు మనకు ఇచ్చిన ప్రతి బాధ్యతను కపటం లేకుండా నీతిగా నిజాయితీగా నిర్వహించుదాం.
Fr. Bala Yesu OCD

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...