9, సెప్టెంబర్ 2023, శనివారం

23 వ సామాన్య ఆదివారం

23 సామాన్య ఆదివారం

యెహెజ్కేలు 33:7-9

 రోమి 13:8-10

 మత్తయి:18:15-20

కొన్నిసార్లు కుటుంబంలో కానీ స్నేహితుల మధ్య కానీ వివిధ కారణాలవల్ల విభేదాలు రావడం మనం చూస్తూనే ఉంటాం. విభేదాలు రావడానికి మన యొక్క స్వార్థం కారణమై ఉండొచ్చు,  మన యొక్క అసూయ కారణమై ఉండొచ్చు బంధాలు తెగిపోవడానికి అనేక విధాలుగా మనం కారణమవుతాం ఈనాటి దివ్య పఠణాలు తెగిపోయిన బంధాలను సరిదిద్దే అంశం గురించి బోధిస్తున్నాయి.

 మానవుడు బలహీనుడు అనేకసార్లు పాపములు చేసి దేవునికి, తమ యొక్క తోటి వారికి దూరమైపోతూ ఉంటారు అలాగే చాలా సందర్భాలలో అక్కడే(పాపంలోనే)ఉండిపోతారు. ఈరోజు దివ్యవాక్కు ద్వారాదేవుడు ఇచ్చేటటువంటి యొక్క హెచ్చరికలను గురించి తెలియజేస్తూ ఉన్నారు. మొదటి పఠణంలో దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా సోదరుని సరిదిద్దే బాధ్యతను గురించి  తెలియచేస్తున్నారు.

ప్రవక్త దేవుని యొక్క వాక్కు ప్రకారం ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క హెచ్చరికలు తెలియజేయాలి అది విధముగా ఉండాలి అంటే దుర్మార్గుడు తన దుర్మార్గతను విసర్జించేటట్లు ఉండాలి. నీవు దుర్మార్గుడికి మాట తెలియచేయని యెడల దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణించును కాబట్టి తన ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును అని ప్రభువు తెలుపుచున్నారు. ఇది దేవుడు ప్రవక్తను ప్రశ్నించే అంశం గురించి తెలుపుచున్నారు ఎందుకంటే పాపాత్ముడు తన యొక్క పాపములకు పశ్చాత్తాప పడి తన పాపమును విడిచిపెట్టి కొత్త జీవితం జీవించేలా చేయవలసినటువంటి బాధ్యత ప్రవక్తది. ప్రవక్తకి బాధ్యత ఇచ్చినది ఎందుకు అంటే ప్రజలకు మంచి చెడులను బోధిస్తూ ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే వారి జీవితంలో సరిచేసి దేవుడు వైపుకు మరలుచుటకే.

దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను ఇశ్రాయేలు ప్రజలకు కావలిగా నియమించారు అని తెలియజేస్తున్నారు అనగా వారి యొక్క జీవితములో ఉన్న లోటుపాటులను పరిశీలించి సరిచేసి దేవుని వైపుకు నడిపించుటకు, స్వయముగా అతడిని ఒక కావలిగా నియమించారు. కావలి యొక్క బాధ్యత ఏమిటంటే ఎల్లప్పుడూ కూడా కాచుకొని ఉండుట. ప్రవక్తగా కాచుకుని ఉండుట అంటే ఆయన తన ప్రజలు చెడు మార్గంలో ప్రయాణం చేయకుండా మంచి మార్గంలోనే ప్రయాణం చేయుటకు ఎల్లప్పుడూ కూడా ప్రజల మీద దృష్టిని ఉంచి వారి యొక్క జీవిత అభివృద్ధి కొరకు సహాయపడేవారు.

 యావే దేవుడు పలుకు చున్నారు నీవు నా హెచ్చరికలను వారికి వినిపించుచుండవలెను అని. ఒక్క పాపాత్ముడు కూడా చనిపోవుట దేవునికి ఇష్టము కాదు వారు హృదయ పరివర్తనము చెంది దేవుని వైపు తిరిగి రావాలి అన్నది ప్రతి ఒక్కరి నుండి కాంక్షించేది. సృష్టి ప్రారంభం నుండి తప్పు చేసినటువంటి మానవుడిని దేవుడు సరి చేయటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దేవుడు అతడిని పాపంలో వదిలి వెయ్యలేదు కానీ అతడిని రక్షించుటకు మరల తన ప్రవక్తలను పంపిస్తున్నారు. చాలా సందర్భాలలో దేవుడు అనేకమంది ద్వారా మనకి తన యొక్క హెచ్చరికలను తెలియజేస్తూ ఉంటారు. పాపము చేయవద్దని, అన్యాయం చేయవద్దని, తప్పుడు మార్గంలో ప్రయాణం చేయొద్దని అనేకసార్లు ప్రభువు హెచ్చరిస్తూనే ఉంటూ ఉంటారు కానీ ఆయన యొక్క హెచ్చరికను చాలాసార్లు పాటించం. ఇశ్రాయేలు ప్రజలు బాలు దేవతలను అన్య దైవములను పూజించే సందర్భంలో ప్రభువు తన యొక్క ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తున్నారు.

కొన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్తల మాటల విని తమ జీవితములను సరిచేసుకుంటున్నారు అప్పుడు వారు దేవుడు యొక్క దీవెనలు పొందుతున్నారు. కొన్నిసార్లు దేవుని యొక్క హెచ్చరికలను పెడచెవిన పెట్టి దేవుడికి దూరమై బానిసత్వంలో జీవించారు. ప్రభువు అందరూ కూడా రక్షించబడాలి అని కోరుకుంటున్నారు అందుకనే తన యొక్క సోదరుడి యొక్క బాధ్యతను ప్రతి ఒక్కరికి కూడా అప్పజెప్తున్నారు. మనము మన యొక్క తోటి వారు మారే అంతవరకు అనగా పాపము నుండి బయటకు వచ్చే అంతవరకు కూడా  వారికి మంచిని బోధిస్తూనే ఉండాలి, నిరాశ పడకూడదు ఎందుకంటే మన యొక్క తోటి వారికి మనందరం కూడా బాధ్యులం. మన యొక్క సోదరులను ఎందుకు మనము సరిదిద్దాలి అంటే క్రైస్తవులమైన మనందరం క్రీస్తు నందు సోదర బృందంగా ఒకే శరీరముగా ఏకము చేయబడ్డాం సృష్టిలోని మానవులంతా సోదర భావంతో ఒక కుటుంబంలోని వ్యక్తులుగా జీవించాలి ప్రత్యేకంగా మనందరం క్రీస్తు నందు ఒకే శరీరముగా ఐక్యమచేయబడ్డాం. శరీరంలోని అవయములు విధముగానయితే ఒకదానిపై మరియొకటి ఆధారపడి ఉంటాయో అలాగే మనందరం కూడా ఒకరికి ఒకరు సహాయము చేసుకుంటూ కలసి జీవించుచు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించాలి అన్నదే ప్రభువు యొక్క కోరిక.

ఈనాటి రెండవ పఠణంలో పౌలు గారు సోదర ప్రేమ కలిగి జీవించమని తెలుపుచున్నారు. ఆయన ఎవరికిని ఏమి బాకీ ఉండకూడదు మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు ఒకరినొకరు అన్యోన్యంగా ప్రేమించుకొనుటయే అని తెలుపుచున్నారు, అలాగే తోటి వానిని ప్రేమించువాడు దేవుని చట్టం నెరవేర్చిన వాడు అని తెలుపుచున్నారు. మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో సోదర ప్రేమ కలిగి ఉంటే మనము మన సోదరుడు నాశనమైపోవటానికి, దేవుడి నుండి దూరమైపోవటానికి ఇష్టపడము ఎందుకంటే ఎదుటి వ్యక్తి మీద ఉన్న ప్రేమ అతని యొక్క అభివృద్ధిని, మంచితనమును మాత్రమే కోరుకుంటుంది కాబట్టి పౌలు గారు తెలిపే అంశం ఏమిటి అంటే మనము సోదర ప్రేమ కలిగి  తప్పు చేసిన సోదరుని సరిదిద్దుతూ ప్రేమతో జీవించాలి.

ఈనాటి సువిశేష భాగంలో తోటి సోదరుడిని విధముగా సరిదిద్దాలి అనే అంశము గురించి ఏసుప్రభువు తెలుపుచున్నారు. తొలి సోదరులైనటువంటి కయీను, ఆబేలు యొక్క జీవితంలో ఒక సంఘటన జరిగినది అది ఏమిటంటే కయీను తన సోదరుడైన ఆబేలును చంపుతున్నాడు. సందర్భంలో దేవుడు  కయీను అడిగిన ప్రశ్న నీ సోదరుడు ఎక్కడ? అప్పుడు అతడు చెప్పిన సమాధానం ఏమిటంటే "నేనేమైనా నా సోదరుడికి కావలి వాడనా?"( దిఇ4:9) దానికి దేవుడు ఇచ్చే సమాధానం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా తమ తోటి వారికి కావలి వారు అలాగే వారి యొక్క జీవితానికి బాధ్యులే. సువిశేష భాగములో తోటి సోదరుడిని సరి చేసే విధానం గురించి ప్రభువు తెలుపుచున్నారు అది ఎలాగంటే ఒకవేళ మన సహోదరుడు మనకు విరుద్ధముగా తప్పిదము చేసిన ఎడల అతడికి తన దోషములను ఒంటరిగా పిలిపించి నిరూపించమని తెలుపుచున్నారు. ఇక్కడ ఏసుప్రభు తప్పిదము చేసినటువంటి వ్యక్తి యొక్క గౌరవమును కాపాడుచున్నారు ఎందుకంటే తప్పు చేసినటువంటి వ్యక్తిని అందరి ముందు అడిగితే తన యొక్క గౌరవం పోతున్నది కాబట్టి తప్పు చేసినటువంటి వ్యక్తిని తిరిగి సంపాదించుకోవాలి అంటే మొట్టమొదటిగా మనము ఆయనను ఒంటరిగా సరిదిద్దాలి.

కొన్నిసార్లు ఒంటరిగా సరిదిద్దునప్పుడు తన తప్పిదం తెలుసుకొని మంచి జీవితాన్ని జీవించవచ్చు అలాగే తాను చేసిన తప్పు కూడా ఇతరులకు తెలియదు కాబట్టి ఆయన కూడా ప్రశాంతంగా ఉండవచ్చు. ఒకవేళ తప్పు చేసిన సోదరుడు ఒంటరిగా సరిదిద్దునటువంటి విధానము పాటించకపోతే ఏసుప్రభు ఇద్దరిని తీసుకుని వెళ్లి యొక్క వ్యక్తిని హెచ్చరించమని తెలుపుతున్నారు. ఇంకా వారి మాట కూడా వినకపోతే సంఘమునకు తీసుకుని వెళ్లి అక్కడ వారి ద్వారా సరిచేయమంటున్నారు వారందరి మాట వినకపోతే అతడిని సుంకరి సుంకరి గాను పాపిగాను పరిగణించమని ప్రభువు తెలుపుతున్నారు. యొక్క సువిశేషం లో ప్రభువు సోదరుడిని విధముగానైనా సరే సంపాదించుకోవాలి అనే అంశము గురించి తెలుపుచున్నారు ఆయన నాశనం అయిపోవడం ఇష్టం లేదు అందుకనే ఒంటరిగా సరిదిద్దమంటున్నారు, ఇద్దరిని తీసుకుని వెళ్లి సరిదిద్దమంటున్నారు ఇంకా సంఘమును సైతం తీసుకుని వెళ్లి సరిదిద్దుకుంటున్నారు. చాలా ప్రాధాన్యత యొక్క వ్యక్తిని సంపాదించుకోవడానికి ప్రభువు ఇస్తున్నారు ఇక్కడ ప్రభువు యొక్క రక్షణ ఉద్దేశ్యం అర్థమవుచున్నది అందరూ కూడా రక్షించబడాలి అన్నది దైవ ప్రణాళిక.

ప్రభువు పలుకుచున్నారు " బాలురులో ఒక్కడైనను పతనమగుట పరలోకమందున్న మీ పిత చిత్తము కాదని తెలుసుకొనుడు". అందరూ రక్షించబడాలి అన్నదే మాట యొక్క అర్థం కాబట్టి మనం పాపమును విడిచి పుణ్య మార్గమును చేకొని దేవుని వైపు ప్రయాణం చేయాలి అన్నది ప్రభువు కోరిక. కాబట్టి మనము దేవుడు ఇచ్చిన సోదరులను దేవుని యొక్క వాక్కు ద్వారా హెచ్చరించి సరిదిద్దాలి. తప్పిపోయినటువంటి ఒక గొర్రె కోసం కాపరి వెళ్ళిన విధముగా మనము కూడా తప్పిపోయినటువంటి సోదరుడు, సోదరి కొరకు వెళ్లి ఓర్పుతో ప్రేమతో గౌరవంతో మాట్లాడి వారిని సంఘంలో చేర్చుకునే లాగా కృషి చేయాలి.

చాలా సందర్భాలలో తప్పుచేసి దూరమైపోయిన వ్యక్తిని మనము వదిలి వేస్తాం ముఖ్యంగా ఇంటి నుండి దూరంగా వెళ్లిన వాళ్లని అలాగే వదిలేస్తాం కొన్నిసార్లు తప్పు చేశారని భర్తలు భార్యలను భార్యలు భర్తలను విడిచి పెడుతుంటారు కానీ ప్రభువు తప్పిపోయిన వ్యక్తిని అనగా పాపము చేసినటువంటి వ్యక్తిని మరల గెలవమని సంపాదించుకోమని తెలుపుతున్నారు. ఇది కష్టం, కానీ దేవుని కృపతో ఇది సాధ్యమగును.

మనందరం కూడా అనేకసార్లు పాపము చేస్తూ దేవునికి దూరమైపోతూ ఉంటాం కానీ దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా మనందరినీ కూడా హెచ్చరిస్తూ సరిచేస్తూ మన జీవితాలను తన వైపుకు నడిపిస్తున్నారు. మనకు జీవితములో వచ్చేటటువంటి ప్రతి ఒక్క హెచ్చరికను అశ్రద్ధ చేయక వాటిని మనం గౌరవిస్తూ మన జీవితాలను సరి చేసుకోవాలి ఎందుకంటే హెచ్చరికలు పాటించకపోతే మనము అనేక వరాలు కోల్పోతాం, కొన్నిసార్లు బంధాలు కోల్పోతాం, కొన్నిసార్లు స్నేహమును కోల్పోతాం,  కొన్నిసార్లు జీవితాన్నే కోల్పోతూ ఉంటాం. కాబట్టి ప్రతి హెచ్చరిక మన జీవితాలను మార్చేలాగా ఉండాలి కాబట్టి దేవుడు ఇచ్చిన సోదరుని సరిదిద్దే బాధ్యత మనందరం కూడా మన జీవితంలో నెరవేర్చాలి.

Fr. Bala Yesu OCD


11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...