6, ఏప్రిల్ 2024, శనివారం

పాస్కా రెండవ ఆదివారం

పాస్కా రెండవ ఆదివారం
క్రీస్తు దివ్య కారుణ్య పండుగ
అపో 4:32-35, 1యోహను 5:1-6, యోహాను 20:19-31
క్రీస్తునాధునియందు ప్రియమైన సహోదరీ సహోదరులారా ఈనాడు తల్లి శ్రీ సభ యేసు దివ్య కారుణ్య పండుగను కొనియాడుచున్నది. ప్రతి సంవత్సరం పాస్కా రెండవ ఆదివారమును దివ్యకారుణ్య ఆదివారంగా పిలుస్తూ ఉంటారు. పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు ఈ యొక్క పండుగను ప్రపంచమంతట కొన్ని ఆడాలి అని 2000 సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖున అధికారికంగా ప్రకటించారు. ఈరోజు ప్రత్యేక విధముగా మనము ధ్యానించవలసినటువంటి అంశము ఏమిటి అంటే దేవుని యొక్క" దయ". 
పవిత్ర గ్రంథము మొత్తం కూడా దేవుని యొక్క దయ గురించి తెలియజేస్తుంది ఇంకొక విధంగా చెప్పాలి అంటే దేవుని యొక్క ప్రేమ గురించి తెలియజేస్తుంది(దయ, ప్రేమ, కనికరము, జాలి అనేవి ఒకే అర్థాన్నిచ్చే పదాలు). ప్రభు యొక్క దయలేనిదే మనము ఇప్పుడు సజీవులుగా ఉండలేము. ఆయన యొక్క కృప అపారమైనది అని పౌలు గారు తెలియజేస్తున్నారు .ఎఫేసి 2:4. దేవుని యొక్క దయ, కనికరం ఎవరూ కూడా వర్ణించలేరు ఎందుకంటే ఆయన అందరి యొక్క పాపములను క్షమించి వారి మీద దయ చూపుతూ ఉంటారు. పునీత తోమస్ అక్వేనస్ గారు దయ గురించి ఈ విధంగా అంటారు "దైవ ప్రేమ మానవుని యొక్క దీనస్థితిని కలుసుకున్నప్పుడు దేవుని యొక్క దయ జన్మిస్తూ ఉన్నది"అంటే మానవుడు పాపము చేసి ఒక దీనస్థితిలో ఉన్న సమయంలో దేవుడు ప్రేమ చూపించి మనలను ఆదుకుంటారు అది ఆయన యొక్క దయకు నిదర్శనం. ఏసుప్రభు వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ యొక్క దీనస్థితిని చూసి నిరాశలో ఉన్న ఆమె చెంతకు వెళ్లి తన యొక్క ప్రేమతో ఆమెను కనికరించి తన పాపములను క్షమించారు. దేవుడు యొక్క దయ చాలా గొప్పది ఎందుకంటే మనందరం పాపము చేసిన సమయములో వెంటనే మనలను శిక్షించకుండా దేవుడు మనలని క్షమిస్తూ, మన మీద దయ చూపుతున్నారు.
పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క దయ గురించి చాలా ఎక్కువగా చెప్పబడింది;
- ఆదాము అవ్వ పాపము చేసిన సమయంలో దేవుడు వారిని మరణ దండనకు గురి చేయక తన యొక్క దయతో క్షమించి ఏదేను తోట నుండి బయటకు పిలిపించి కష్టపడి పని చేసి జీవితం కొనసాగించమని వారికి తెలియజేశారు వారు చేసినటువంటి పాపములను దేవుడు క్షమించారు కాబట్టే వారిని మరణ దండనకు గురి చేయలేదు.
- ఇశ్రాయేలు ప్రజలు దేవుడితో చేసుకున్నటువంటి ఒడంబడికను పాటించుటలో అనేకసార్లు విఫలమయ్యారు అయినా గాని దేవుడు వారిని మరణ దండనకు గురి చేయలేదు. కేవలము వారికి తెలియచేయుట కొరకై వారిని కొన్ని సంవత్సరముల పాటు బానిసత్వములోనికి పంపించారు అయినప్పటికీ వారిని ప్రేమిస్తూనే, వారి మీద దయ చూపుతూనే ఉన్నారు.
- ప్రభువు అనేకమార్లు తన యొక్క ప్రవక్తలను పంపిస్తూ ప్రజల జీవితాలను బాగు చేస్తున్నారు ప్రజల జీవితాలను సరి చేసుకొని, యావే దేవునికి విధేయులై జీవిస్తే దేవుడు దయతో కాపాడతారని ప్రవక్తలు తెలియజేశారు కొన్ని సందర్భాలలో ప్రజలు తమ జీవితాలను మార్చుకొని దేవుడికి ఇష్టకరంగా జీవించారు. ప్రవక్తల యొక్క బోధనలలో ప్రజలకు ప్రతిసారి గుర్తు చేసే విషయం ఏమిటి అంటే దేవుని యొక్క దయ అపారమైనది. (నిర్గమ 34:6-7)
- దేవుడికి ఇష్టమైన దావీదు రాజు తప్పుచేసి దేవుని యొక్క మన్నింపు కోరిన సందర్భంలో దేవుడు అతడిని క్షమించారు 2 సమూయేలు 11:12, 24:10
ఎవరైతే దేవుని యొక్క దయ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారో వారిని దేవుడు ఎప్పుడూ కూడా కరుణిస్తూనే ఉంటారు ఆ ప్రార్ధించినటువంటి సమయములో వ్యక్తి పశ్చాతాప హృదయముతో ప్రార్థించాలి అప్పుడు మాత్రమే దేవుని యొక్క దయను పొందుతారు. వాస్తవానికి దేవుని యొక్క కనికరము మనలను అంగీకరిస్తుంది,
- ఆయన కనికరము మనలను గౌరవిస్తుంది
- ఆయన కనికరము మనకు సహాయపడుతుంది
- ఆయన కనికరము మనకు సమృద్ధిని ఒసగును
- ఆయన కనికరము మనల్ని క్షమిస్తుంది
- ఆయన కనికరము మనకు సానుభూతి చూపుతుంది.
దేవుని యొక్క దయ గురించి కొన్ని అంశాలను ధ్యానం చేసుకోవాలి.
1. దేవుని దయ మన పాపములను క్షమిస్తూ ఉంది.
ఈనాడు విన్న సువిశేష భాగములో యేసు ప్రభువు తన శిష్యులకు దర్శనమిస్తూ వారి యొక్క విశ్వాస జీవితాన్ని బలపరుస్తూ బాధలలో ఉన్నటువంటి వారికి ధైర్యం ఇస్తూ, సంతోషాన్నిస్తూ ఉన్నారు అదే విధముగా వారు ఆయన యొక్క పునరుత్థానమును సంపూర్ణముగా విశ్వసించనటువంటి ఆ యొక్క సందర్భంలో వారి యొక్క పాపములను కూడా ఏసుప్రభు క్షమిస్తూ ఉన్నారు. వారి యొక్క హృదయ కాఠిన్యమును మన్నిస్తున్నారు. ఏసుప్రభు తోమాస్ మీద కూడా కనికరము చూపిస్తున్నారు ఎందుకంటే మిగతా శిష్యులు దేవుని యొక్క దర్శనము పొందిన తర్వాత ఆ చెప్పిన విషయమును తోమాస్ గారు విశ్వసించకుండా ఇంకా అవిశ్వాసములో ఉన్నటువంటి తోమాస్ యొక్క పాపాలు క్షమిస్తూ ఆయన మీద దేవుడు కనికరము చూపిస్తున్నారు.
2. దేవుని దయ మన పాపాలను మరచిపోయేలాగా చేస్తుంది.
దేవుడు మనం చేసినటువంటి పాపములు అన్ని కూడా మరచిపోయి మనలను మరల అంగీకరించి, దీవిస్తారు. ఏసుప్రభు యొక్క మరణ సమయములో శిష్యులు చాలామంది ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు అయినా దేవుడు వారందరి యొక్క పాపములను, బలహీనతలను మరచిపోయి మరల వారికి పదే పదే దర్శనమిస్తూ వారి యొక్క విశ్వాస జీవితాన్ని బలపరిచారు. ఒకవేళ దేవుడే మన పాపములను మరిచిపోకపోతే మనము ఎంతటి శిక్షను పొందేటి వారమో? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి.
3. దేవుని దయ మనలను శాంతితో నింపుతుంది
ఈనాడు విన్న సువిశేష భాగములో ఏసుప్రభు శిష్యుల యొక్క పాపములను క్షమించుట మాత్రమే కాదు చేసేది వారి హృదయాలలో ఉన్నటువంటి అలజడలను తీసివేసి, ఆందోళన తీసివేసి, భయాన్ని తీసివేసి వారి మీద దయ చూపుచు వారి యొక్క హృదయములను శాంతితో నింపుతున్నారు. దేవుడు మన పాపాలను క్షమించుట ద్వారా కూడా మనందరం ప్రశాంతముగా ఉండగలుగుతున్నాము. ఆయన శాంతి లేనిదే మనలో అశాంతి ఉంటుంది కాబట్టి దేవుడు మన మీద చూపించినటువంటి దయ మనము కూడా ఒకరి పట్ల ఒకరు చూపించాలి.
ఈనాడు విన్నటువంటి మొదటి పఠణంలో కూడా తొలి క్రైస్తవ సంఘం ఏ విధముగా ఒకరి పట్ల ఒకరు దయను కలిగి, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, ప్రేమించుకుంటూ, జీవించి ఉన్నారో తెలియజేస్తూ ఉన్నది. రెండవ పఠణంలో దేవుడిని ప్రేమిస్తూ జీవించేవారు కూడా పరస్పర సహాయము కలిగి ప్రేమించుకుని జీవించిన తెలియజేస్తున్నారు. ఈనాడు మనము యేసు దివ్య కారుణ్య పండుగను కొనియాడుతున్న సందర్భముగా మన మీద దేవుడు దయ చూపిన విధంగా మనం కూడా ఒకరి పట్ల ఒకరు దయ కనికరము చూపిస్తూ, ఒకరినొకరు క్షమించుకుంటూ జీవించాలి. దేవుడు మన యొక్క పాపాలు క్షమించిన విధంగా మనం కూడా దయతో ఇతరుల యొక్క పాపాలు క్షమించి వారిని కూడా అర్థం చేసుకొని జీవించాలి.
Fr. Bala Yesu OCD

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...