27, ఏప్రిల్ 2024, శనివారం

పాస్కా ఐదవ ఆదివారం

పాస్కా ఐదవ ఆదివారం 
అపో9: 26-31, 1 యోహాను 318-24, యోహాను 15:1-8
ఈనాటి పరిశుద్ధ దివ్య గ్రంథ పఠనములు దేవునిలో ఐక్యమై జీవించుట అనే అంశము గురించి బోధిస్తున్నాయి. దేవుడిని తెలుసుకొని, దేవుడిని సేవించి, దేవునిలో ఐక్యమై జీవించుట క్రైస్తవ కతోలిక విశ్వాసము మనకు బోధిస్తుంది.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు సౌలును తన యొక్క సువార్త సేవకై ఎన్నుకున్నటువంటి విధానం గురించి వింటున్నాం. దేవునిలో ఐక్యమై జీవించుట నిమిత్తమై ఏసుప్రభు సౌలును ఎన్నుకొని ఆయనకు దర్శనమిచ్చి తన జీవితం మార్చుతున్నారు. సౌలు యొక్క హృదయ పరివర్తనము క్రైస్తవ జీవితంలో ఒక ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే ఆయన మార్పు అనేకమందికి ఆదర్శమైనది, అనేకమంది విశ్వాసం పెంచింది. ఆయన ఏసుప్రభుని అనుసరించేటటువంటి వారిని హింసించాడు అదే ఒక వ్యక్తి మరొకసారి ఏసుప్రభు గురించే ప్రసంగించి అనేకమందిని ఏసుప్రభు చెంతకు చేరుస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు గ్రహించవలసినటువంటి సత్యం. ఏ విధముగానయితే తోటలో పనిచేసే తోటమాలి మొక్క ఎదుగుట కొరకై దానిని సరి చేస్తూ దాని యొక్క అభివృద్ధి కొరకై సహకరిస్తూ ఉంటారో అదే విధముగా దేవుడు కూడా సౌలు యొక్క హృదయ కాఠిన్యం జీవితమును సరిచేసి ఆయనను మృదువుగా సువార్త పరిచర్యకుడిగా చేశారు. సౌలు కూడా తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారు అదేవిధంగా దేవుడి మీద ఆధారపడి ఉన్నారు. దేవుని పిలుపుకు స్పందించి సౌలు జీవించారు . సౌలు దేవుడిలో ఐక్యమై జీవించుట కొరకై తన యొక్క పాత జీవితంను విడిచిపెట్టారు.
ఈనాటి రెండవ పఠణంలో  మన యొక్క జీవితము కేవలం మాట వలననేకాక క్రియల వలన కూడా ఉండాలి అని యోహాను గారు తెలియచేస్తున్నారు. మనము దేవునికి విధేయులమై ఆయన యొక్క ఆజ్ఞలను పాటించవలెనని తెలియచేస్తున్నారు అప్పుడు దేవుడు మనము ఏది కోరిన సరే దాన్ని వసుగుతారు.
ఈనాటి సువిషేశ పఠణంలో ప్రభువు ద్రాక్షావల్లి తీగలు అనేటటువంటి అంశము ద్వారా మనము ఆయనలో ఐక్యమై జీవిస్తూ ఫలించాలని ప్రభువు తెలియచేస్తున్నారు. ఏసుప్రభు ద్రాక్షావల్లి, తండ్రి వ్యవసాయని తెలుపుచున్నారు అదేవిధంగా మనము ద్రాక్షావల్లి యొక్క తీగలు. ద్రాక్షావల్లిలో భాగస్తులైన తీగలు ఎల్లప్పుడూ కూడా ఫలించాలి అని ప్రభువు తెలుపుతూ ఉన్నారు. ఆ తీగలు ఫలించటానికి వ్యవసాయ కత్తిరిస్తూ వాటిని సరి చేస్తారు. ద్రాక్ష వల్లి ఫలించుట నిమిత్తమై యజమాని కావలసినటువంటి ఎరువులు వేస్తూ తగినటువంటి నీరును సమకూరుస్తూ ఉంటారు. ఆయన యొక్క ఆశ మొత్తము కూడా ఆ తీగలు ఫలించాలి అనే, దానికోసమే ఆయన కృషి 
 చేస్తారు. ద్రాక్ష తీగలు సరిచేసిన సందర్భంలో ఏ కొమ్మ అయితే తోటమాలికి సహకరిస్తూ ఉంటూ ఉంటుందో ఆ కొమ్మ అధికముగా ఫలిస్తుంది. మనలో ఉన్నటువంటి స్వార్ధ భావాలు, అసూయలు, కోప తాపాలు, కత్తిరించినప్పుడే మనము కూడా ఫలించబడతాము. 
మనము ద్రాక్షావల్లిలో  భాగస్తులైన కొమ్మలైతే ఎందుకు ఫలించుటలేదు మనం ఫలించకపోవడానికి కారణం ఏమిటి?
1. మనలో ఉన్నటువంటి పాపము. 
2. మన యొక్క విధేయత 
3. మనము దేవుని మీద ఆధారపడకపోవడం 
4. మన యొక్క స్వార్థపూరితమైన జీవితం  
5. మన యొక్క హృదయ కాఠిన్యం 
6. దేవుని యొక్క వాక్యమును ఆచరించకపోవడం 
7. మన యొక్క అవిశ్వాసం 
8. క్షమించలేకపోవటం
మనల్ని శుద్ధి చేయుట నిమిత్తమై ప్రభువు తన యొక్క వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉంటారు కాబట్టి ఆయన యొక్క వాక్కును ఆలకించి మనము జీవించాలి అప్పుడే మన యొక్క జీవితాలు ఫలిస్తాయి అదేవిధంగా ద్రాక్షవల్లి తీగలు ఎల్లప్పుడూ కూడా కలిసి ఉండటం నిమిత్తమై మనము ఈ విధంగా ఉండాలి.

1. ప్రార్థన చేయాలి
2. విధేయత చూపాలి 
3. దేవుని చెంతకు మరలి రావాలి 
4. దేవుని మీద ఆధారపడి జీవించాలి 
5.  దైవ ప్రేమ, సోదర ప్రేమ కలిగి జీవించాలి.
ఇవి అన్నియు మన యొక్క జీవితంలో పాటించినప్పుడు మనం దేవునిలో ఐక్యమై జీవిస్తాము.
ఈనాడు తల్లి శ్రీ సభ మనము దేవుడిలో ఐక్యమయి జీవించమని కోరిన సందర్భంలో మనము ఆ ప్రభువు యొక్క వాక్కు అనుసారముగా జీవించ ప్రయత్నించాలి. సౌలు ఏ విధంగానైతే తన యొక్క జీవితాన్ని కత్తిరించినప్పుడు దేవునికి సహకరించారో అదేవిధంగా మనం కూడా దేవునికి సహకరిస్తూ ఆయనలో ఐక్యమవ్వాలి.
Fr. Bala Yesu OCD

20, ఏప్రిల్ 2024, శనివారం

పాస్కా నాలుగవ ఆదివారం

పాస్కా నాలుగవ ఆదివారం 
అపో 4:8-12, 1 యోహాను 3: 1-2
యోహాను 10:11-18
 ఈ యొక్క ఆదివారమును మంచి కాపరి ఆదివారము అని తల్లి శ్రీ సభ పిలుస్తుంది. పాత నిబంధన గ్రంథంలో యావే దేవుడిని గొర్రెల కాపరిగా పోల్చి చెబుతూ ఉంటారు. దావీదు రాజు ప్రభువును కాపరిగా పిలిచారు కీర్తన (23 :1). అదేవిధంగా ఇంకొక చోట మేము నీ ప్రజలము నీ మందలోని గొర్రెలను అని తెలుపుచున్నారు (కీర్తన 79: 13). దేవుడు తన ప్రజలకు ఒక కాపరిగా ఉంటూ వారిని తన వైపుకు ప్రతినిత్యం నడిపిస్తూ, వారి యొక్క జీవిత యొక్క అభివృద్ధి కొరకు ప్రతినిత్యం కూడా కృషి చేస్తూ, వారిని శత్రువుల నుండి అదేవిధంగా విపత్తుల నుండి కాపాడుచూ వారికి తన యొక్క ప్రేమను చూపిస్తున్నారు. 
ఈనాడు చదువుకున్న పరిశుద్ధ గ్రంథ పఠణములు నుంచి కొన్ని అంశములను ధ్యానం చేద్దాం. మొదటి పఠణంలో పేతురు గారు దేవుని చేత తన మంద కొరకు ఒక కాపరిగా ఎన్ను కనబడిన తర్వాత ఆయన చేసిన అద్భుతం గురించి వింటున్నాం. ఈ యొక్క అద్భుతము యేసు ప్రభువు యొక్క నామములో చేయబడినది అని స్పష్టముగా పేతురు తెలియజేస్తున్నారు. ఆయన సజీవుడుగా వారి మధ్య ఉన్నప్పుడు మాత్రమే కాదు అద్భుతములు చేసేది ఆయన మరణించి- పునరుత్థానమైన తర్వాత కూడా ఏసుప్రభు తన ప్రజల యందు అద్భుతములను చేస్తూ ఉన్నారు అని తెలుపుచున్నారు. ఏసుప్రభు యొక్క నామము శక్తివంతమైనదని, ఆ యొక్క నామములో అనేక అద్భుతములు కలవు అని స్పష్టంగా పేతురు వివరించారు. పేతురు కాపరిగా ఉంటూ కుంటివానికి ప్రభువు స్వస్థతనిచ్చారు. అనేక సంవత్సరాల నుండి కుంటివాడిగా నిర్భాగ్య జీవితం జీవిస్తున్నాడు అతడు. అతని యొక్క జీవితంలో ఆనందం లేదు జీవితము కృంగిపోయినది అట్టివానికి పేతురు సంతోషాన్ని దయచేసి, ఏసుప్రభు యొక్క నామమున స్వస్థత పరుస్తూ తనలో ఆనందము నింపుతున్నారు. పేతురు ఒక కాపరిగా తనకు అప్పచెప్పినటువంటి బాధ్యతను ఆయన నెరవేరుస్తూ దేవుడు యొక్క ప్రేమను అదేవిధంగా సందేశమును ఇతరులకు అందజేశారు. ఇది తనకు అప్పచెప్పినటువంటి బాధ్యత.
ఈనాటి రెండవ పఠణంలో యోహాను గారు దేవుడికి మానవుడు ఎడల ఉన్నటువంటి గొప్ప ప్రేమ గురించి తెలియజేస్తున్నారు. దేవుడు మనలను ప్రేమించి ఉన్నారు కాబట్టే మనము ఆయన యొక్క బిడ్డలుగా ఉంటున్నాం. ఈ లోకము ఆయనను ఎరుగదు కాబట్టి ఈ లోకమునకు దేవుని విలువ అదేవిధంగా మన యొక్క ప్రాధాన్యత తెలియదు. దేవుడు మనమ ఆయనకు సాక్షులుగా ఉండటం వలన ఒక రోజున ఆయనను ముఖాముఖిగా దర్శించే అవకాశంను ప్రభువు మనకు కల్పిస్తారు ఆ రోజున మనము కూడా ఆయన వలె చేయబడతాము అని యోహాను గారు తెలియజేస్తున్నారు. ఇది ఎప్పుడు సాధ్యము అంటే,  కేవలం మనం దేవుడిని ఎరిగి ఆయన యొక్క ఆజ్ఞలను పాటించి జీవించినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది.
ఏసుప్రభువు ఈనాటి సువిశేష భాగములో తన్ను తాను మంచి కాపరిగా పోల్చుకొని చెబుతున్నారు. పవిత్ర గ్రంథములో చాలామంది ప్రవక్తలు, భక్తులు కాపరులుగా ఉంటున్నారు. 
- ఆబేలు గొర్రెల కాపరి 
- అబ్రహాము గొర్రెల కాపరి
- మోషే గొర్రెల కాపరి 
- దావీదు గొర్రెల కాపరి 
- ఆమోసు ప్రవక్త కాపరి
- చాలామంది గొర్రెల కాపరులుగా ఉంటున్నారు. ఒక మందకు కాపరి తప్పనిసరిగా అవసరం లేదంటే ఆ గొర్రెలు విచ్చలవిడిగా జీవిస్తాయి.  ఏసుప్రభు మంచి కాపరి కాబట్టి ఆయనలో ఉన్నటువంటి కొన్ని లక్షలములను ధ్యానం చేద్దాం 
1) మంచి కాపరి తన మంద కొరకు ప్రాణములను త్యాగం చేస్తారు. ఏసుప్రభు ఆయన గొర్రెల దొడ్డి వద్ద గేటు (ద్వారము) వద్ద నిలబడి ఉంటాను అని తెలియజేస్తున్నారు (యోహాను 10: 7). ఆయన ద్వారము వద్ద నిలబడుతూ దొంగలు కానీ జంతువులు కానీ తన మంద దగ్గరకు రాకుండా ఆయనే వాటన్నిటిని రక్షిస్తారు. జీతగాండ్రు సొంత వాడు కాదు కాబట్టి ఆపద వచ్చినప్పుడు తన యొక్క మందను విడిచి వెళతారు కానీ మంచి కాపరి ఒక రక్షణ కవచంగా ఉంటూ తానే ఆపద భరిస్తూ ఆయన తనమందను అన్ని రకాల ఆటంకముల నుండి కాపాడుతారు. కేవలం మంచి కాపరి మాత్రమే తన మంద కొరకు ప్రాణాలు సైతం త్యాగం చేస్తారు ఇది ఎవరికి కూడా సాధ్యపడదు ఏసుప్రభు మంచి కాపరి కాబట్టి మన అందరి యొక్క మరణమునకు బదులు ఆయనే మరణించి తన ప్రాణమును త్యాగం చేసి మనకు జీవమును ప్రసాదించారు ఇది ఆయన యొక్క త్యాగానికి గుర్తు.
2). తన మంద గురించి కాపరికి స్పష్టముగా తెలియను. 
ఏసుప్రభుకి ప్రతి ఒక్కరి యొక్క  జీవిత స్థితిగతులు తెలుసు కాబట్టే ఎవరికీ ఏం అవసరమున్నదో దానిని బట్టి వారిని దీవిస్తున్నారు. ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు, అనారోగ్యాలు, బలహీనతలు తెలుసు కాబట్టి వారిని అర్థం చేసుకొని వారిని దీవించారు. 
3. మంచి కాపరి తన మందను పోషిస్తారు. యెషయా 40:11. మంచి కాపరి తన మందును నడిపించే సమయంలో వారికి కావలసిన పోషణను దయ చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో పై ప్రయాణం చేసే సందర్భంలో వారు ఆకలితో ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆకలని తీర్చారు. ఏసుప్రభువు కూడా తన యొక్క బోధనలను వినటానికి వచ్చినటువంటి వారిని అందరిని కూడా శారీరక మరియు ఆధ్యాత్మిక పోషణను దయ చేశారు. 
4. మంచి కాపరి తన మందను నడిపిస్తారు. (కీర్తన 23: 3)
తానే అన్నిటిలో సుమాతృకగా ఉంటూ తన మందను నడిపిస్తారు. పాత నిబంధన గ్రంథములో యావే దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఒక మార్గ చూపరిగా ఉంటూ వారిని ఎడారి గుండా నడిపించారు అలాగే ఏసుప్రభు కూడా తనను విశ్వసించే వారందరికీ కూడా పరలోక మార్గమును చూపిస్తూ, వారు వినయములో నడుచుటకు, విధేయతతో జీవించుటకు, క్షమ కలిగి ఉండటకు, ప్రేమ కలిగి ఉండుటకు ఒక మార్గమును తన యొక్క జీవితం ద్వారా చూపించారు, వారిని నడిపించారు. ఏసుప్రభు తన మందను నడిపించేది మంచి వైపుకు మాత్రమే అనగా పరలోకము వైపు మాత్రమే మనము ఆయన మందకు చెందిన వారమైతే ఆయన స్వరమును విని ఆయన మార్గంలో నడవాలి.
5. మంచి కాపరి తన మందను ప్రేమిస్తారు అలాగే తన ముందు పట్ల శ్రద్ధ వహిస్తారు.
మంచి కాపరి తన మందను ప్రేమించారు కాబట్టి ఆ మందను ఆపదల నుండి కాపాడుతారు అలాగే అవి దారి తప్పిన సమయంలో వారిని వెతికి తీసుకొస్తారు మరియు వారి యొక్క ఎదుగుదలకు అవసరమైనది మొత్తం కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు అందుకనే మంచి కాపరి తన మందును ప్రేమిస్తూ, శ్రద్ధ వహిస్తారు అని పిలుస్తారు. యేసు ప్రభువు కూడా మనలను ప్రేమించారు అలాగే మన యందు శ్రద్ధ వహించారు కాబట్టి మనకు అనేక సత్యములను తెలియజేశారు ప్రతి ఒక్కరు కూడా చేయవలసినది ప్రేమించాలి, శ్రద్ధ వహించాలి.
6. మంచి కాపరి తన మందను సరి చేస్తారు. ఎప్పుడైతే ఒక గొర్రె యజమానుడి యొక్క మాట వినకుండా ఇష్టం వచ్చిన రీతిలో నడుచుకున్నప్పుడు  కాపరి దానిని సరిచేస్తూ, వాటిలో ఉన్న చెడును కత్తిరించి వాటిని మంచి మార్గంలో నడిపిస్తారు. ఏసుప్రభు ఒక మంచి కాపరిగా ఉంటూ ఆయన అనేక మంది యొక్క జీవితాలను సరి చేస్తూ, ఆయన పరిచర్య చేసే సందర్భంలో ఏది సత్యమో, ఏది అనుసరించాలో తెలియచేస్తూ వారి యొక్క విశ్వాస జీవితాలను సరి చేశారు. 
7. మంచి కాపరి తన గొర్రెలను తన భుజముల మీద వేసుకుంటారు.
8. మంచి కాపరి తన మంద పట్ల కనికరం కలవారు. అవి గాయపడిన సందర్భంలో తానే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరుస్తూ వాటి యొక్క గాయములను నయం చేయుట కొరకై ప్రత్యేకంగా కృషి చేస్తారు.
దేవుడు మనలను కూడా మన యొక్క కుటుంబాలకు సంఘాలకు కాపరులుగా ఎన్నుకుంటున్నారు మరి మనము ఆయన వలె లక్షణములను కలిగి జీవించగలుగుతున్నామా ఒక కాపరిగా మనము ప్రేమించగలుగుతున్నామా, పెంచగలుగుతున్నామా, రక్షించగలుగుతున్నామా అని మనము ధ్యానము చేసుకొని మనము కూడా మంచి కాపరి వలె జీవించటానికి ప్రయత్నం చేయాలి. 

Fr. Bala Yesu OCD

13, ఏప్రిల్ 2024, శనివారం

పాస్కా 3 వ ఆదివారం

పాస్కా 3 వ ఆదివారం 
అపో 3:13-15,17-19, 1 యోహాను 2:1-5, లూకా 24:35-48
ఈనాటి దివ్య పఠణములు యేసు ప్రభువు యొక్క పునరుత్థానము నందు విశ్వాసం ఉంచి హృదయ పరివర్తనము చెంది జీవించాలి అని తెలియజేస్తున్నాయి. ఏసుప్రభు పునరుత్థానమై ఇది మూడవ ఆదివారం. ఆయన పునరుత్థానము అయిన తర్వాత  అనేక సందర్భాలలో శిష్యులకు దర్శనమిస్తూ, విశ్వాసులకు దర్శనమిస్తూ వారి యొక్క విశ్వాస జీవితమును బలపరుస్తూ ఉన్నారు.
ఈనాటి మొదటి పఠణంలో పేతురు గారు అందరి సమక్షంలో యెరుషలేములో సొలోమోను మండపం వద్ద  ధైర్యంగా చెప్పిన గొప్ప ప్రసంగం గురించి చదువుకున్నాం. పేతురు గారు కుంటివానికి స్వస్థత నిచ్చిన తర్వాత చేసిన బోధన ఈ రోజున విన్నాము.  పేతురు గారు యూదులకు యావే దేవునితో ఉన్నటువంటి గొప్ప సంబంధం గురించి తెలుపుచూ ఆ యొక్క బంధం ఈనాటికి కూడా ఏసుప్రభు ద్వారా కొనసాగించబడు చున్నదని తెలిపారు.  వారికి(యూదులకు) విశ్వాసం ఉన్నప్పటికీ లేనప్పటికీ  ఆయన మాత్రము దేవుని కుమారుడు అని తెలిపారు. ఈ మొదటి పఠణంలో పేతురు యూదులను ఉద్దేశించి చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే వారు నీతిమంతుడు, పవిత్రుడైన యేసు ప్రభువును నిరంకుశముగా శిక్షించారు అవమానపాలు చేశారు అలాగే మరణ దండనకు గురి చేశారు. ఆ సందర్భంలో అక్కడున్నటువంటి వారందరు  చేసినటువంటి పాపమును పేతురు గారు తెలుపుతూ, హృదయ పరివర్తనము చెందమని కోరారు. ఈ సందర్భంలో రెండు విషయాలు మనము అర్థం చేసుకోవాలి మొట్టమొదటిగా పాపము నుండి హృదయ పరివర్తనము చెందుట. రెండవదిగా దేవుని చెంతకు మరలిరావడం.
- పేతురు గారు యూదులు చేసినటువంటి పెద్ద తప్పిదమును ఖండించుటకు వెనుకంజ వెయ్యలేదు. ఆనాడు ఏ విధముగానయితే తప్పు చేసినటువంటి దావీదును సరి చేయుటకు నాతాను ప్రవక్త వెనుకంజ వేయలేదో, ఆహాబు చేసిన తప్పును ఖండించుటకు ఏలియా వెనుకంజ వేయలేదో, హేరోదు చేసిన తప్పును సరిదిద్దుటకు బప్తిస్మ యోహాను వెనుకంజ వేయలేదో అదేవిధంగా పేతురు గారు కూడా ధైర్యంతో చేసినటువంటి తప్పును సరిదిద్ధారు. జీవనకర్తను మీరు చంపి ఉన్నారు అని చాలా గట్టిగా  బోధించారు. ప్రభువు యొక్క పునరుత్థాన అనుభూతి మరియు పెంతుకోస్తు అనుభూతి శిష్యులకు బలమును, శక్తిని, మాటలను, అద్భుతములు చేయు శక్తిని దయచేశాయి అందుకనే వారు గొప్పగా పునరుత్థాన సందేశమును అందరికీ తెలియజేస్తూ వారి విశ్వాస జీవితాలను సరి చేస్తున్నారు.
- ప్రజలు(యూదులు )మంచి కోరుకొనుటకు బదులుగా చెడును ఆశించారు అనే అంశము కూడా పేతురు గారు స్పష్టంగా తెలియజేశారు ఎందుకంటే దొంగవాడు, అంతకుడైనటువంటి బరబ్బను విడుదల చేయమని కోరారు కానీ ఎటువంటి తప్పు చేయని నీతిమంతుడైన యేసు ప్రభువుని విడుదల చేయమని ఎవరు కోరలేదు దానికి బదులుగా ఆయనను మరణశిక్షకు గురి చేయమని పలికారు. కొన్ని కొన్ని సందర్భాలలో మన జీవితంలో కూడా మనం కూడా ఇతరులను నాశనం చేయుట కొరకు మన శత్రువులతోనైనా కలవడానికి ప్రయత్నం చేస్తాము. మంచిని ఎన్నుకొనటానికి బదులుగా చెడుని ప్రేమిస్తూ చెడు వైపు వెళ్తాం అది మన జీవితంలో చేసే పెద్ద తప్పు. హేరోదు ఏసుప్రభును చంపుట కొరకు శత్రువైన పిలాతుతో కలిశాడు దానివల్ల పాపం చేశారు. చాలా మంది యూదులు కూడా చేసినది ఇలాంటి తప్పే ఏసుప్రభుకు బదులుగా బరబ్బను విడుదల చేయమని అడిగారు. ఈ విధముగా వారు చేసినటువంటి తప్పులు తెలియజేస్తూ పేతురు గారు వారిని పాపమునుండి హృదయ పరివర్తనము చెందమని కోరారు.
- పాపము నుండి హృదయ పరివర్తనం చెందాలి. హృదయ పరివర్తనం అంటే కేవలం పశ్చాత్తాప పడటం మాత్రమే కాదు పూర్తిగా విడిచి పెట్టడం కూడా. పూర్తిగా మన పాపపు క్రియలు విడిచి పెట్టినప్పుడు మాత్రమే మనము హృదయ పరివర్తన చెందిన విధంగా పరిగణించబడతాం అప్పుడు మాత్రమే మన యొక్క పాపములు క్షమించబడతాయని పేతురు గారు తెలుపుచున్నారు. మరి ఈరోజుల్లో మనందరం కూడా మనల్ని సరిదిద్దునప్పుడు ఎలాంటి హృదయంతో తీసుకోగలుగుతున్నాం. హృదయ పరివర్తనం చెందగలుగుతున్నామా? దేవుని వైపు మరలి వస్తున్నామా? లేక ఇంకా మనము కఠినంగానే పాపంలో జీవిస్తూనే ఉన్నామా? అని మనం ధ్యానం చేసుకోవాలి.
రెండవ పఠణంలో యోహాను గారు పాపము చేయవద్దు అని తెలుపుతున్నారు. మనము ఒకవేళ  బలహీనత వలన పాపము చేసినప్పటికీ మన తరుపున న్యాయవాది ఏసుప్రభు ఉన్నారని తెలిపారు. మనలను శిక్షకు గురి చేయకుండా తండ్రి యొక్క క్షమ పొందుకునేలాగా ఏసుప్రభు చేస్తారని యోహాను గారు తెలిపారు. 
యోహాను గారు మనము దేవుడిని ఎరిగి ఉండాలి అని కూడా తెలుపుచున్నారు అనగా దేవునికి విధేయత చూపుతూ ఆయన యొక్క ఆజ్ఞలను పాటించిన యెడల మనందరం కూడా దేవుడిని ఎరిగినవారంగా పరిగణించబడుతుంటాం. దేవుడిని తెలుసుకున్న వారు ఆయనకు విధేయత చూపుతారు ఎందుకంటే దేవుడిని తెలుసుకున్న వారికి ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పది, ఎంత విశాలమైనది, ఎంతో లోతైనది, ఆయన ఎంత కనికరం, త్యాగం ఎంత గొప్పవి అని అర్థం అవుతుంది. వాస్తవానికి దేవుడిని ఎరిగినటువంటి వారు సాధ్యమైన వరకు పాపములో పడిపోకుండా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తారు అని యోహాను గారు స్పష్టంగా తెలియజేశారు కావున మనము కూడా దేవుడి యొక్క ఆజ్ఞలను సంపూర్ణంగా పాటిస్తూ పాపములు పడిపోకుండా జీవించాలి. 
ఈనాటి సువిషేశ భాగంలో ఎమ్మావు మార్గములో పునరుత్థాన ప్రభువుని తెలుసుకున్న శిష్యులు మిగతా శిష్యులకు జరిగిన సంఘటనలను తెలియచేసే సందర్భంలో ఏసుప్రభు వారి మధ్య ప్రత్యక్షమై మరొకసారి వారికి ధైర్యం ఇస్తూ తాను 'నేనే' అని తెలియజేశారు. ఏసుప్రభు శిష్యులకు పదే పదే దర్శనము ఎందుకు ఇస్తున్నారు అంటే వారి యొక్క విశ్వాసాన్ని బలపరచుట కొరకు అదే విధంగా వారి ఆయనకు సాక్షులుగా ఉండబోతున్నారు కాబట్టి వారు చూసినది మొత్తం నిజము అని వారు గ్రహించినప్పుడే దానిని ఇతరులకు గట్టిగా తెలియచేయగలరు కావున వారికి దర్శనమిచ్చారు. శిష్యులు ఎప్పుడూ కూడా ఒక మరణించిన వ్యక్తి మరలా శరీరంతో తిరిగి రావటం చూడలేదు కాబట్టి వారు ఏసుప్రభు యొక్క పునరుత్థానం విశ్వసించుట కొంచెం కష్టం అందుకే ప్రభువు వారికి పదేపదే దర్శనం ఇచ్చి వారి యొక్క విశ్వాస జీవితాన్ని బలపరిచారు. వారు ఏసుప్రభుకు సాక్షులుగా ఉండబోతున్నారు కాబట్టి వారికి  దర్శనం ఇచ్చారు. ఏసుప్రభు యొక్క పునరుత్థానమునకు మనం కూడా సాక్షులుగా జీవించాలి.
Fr. Bala Yesu OCD

6, ఏప్రిల్ 2024, శనివారం

పాస్కా రెండవ ఆదివారం

పాస్కా రెండవ ఆదివారం
క్రీస్తు దివ్య కారుణ్య పండుగ
అపో 4:32-35, 1యోహను 5:1-6, యోహాను 20:19-31
క్రీస్తునాధునియందు ప్రియమైన సహోదరీ సహోదరులారా ఈనాడు తల్లి శ్రీ సభ యేసు దివ్య కారుణ్య పండుగను కొనియాడుచున్నది. ప్రతి సంవత్సరం పాస్కా రెండవ ఆదివారమును దివ్యకారుణ్య ఆదివారంగా పిలుస్తూ ఉంటారు. పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు ఈ యొక్క పండుగను ప్రపంచమంతట కొన్ని ఆడాలి అని 2000 సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖున అధికారికంగా ప్రకటించారు. ఈరోజు ప్రత్యేక విధముగా మనము ధ్యానించవలసినటువంటి అంశము ఏమిటి అంటే దేవుని యొక్క" దయ". 
పవిత్ర గ్రంథము మొత్తం కూడా దేవుని యొక్క దయ గురించి తెలియజేస్తుంది ఇంకొక విధంగా చెప్పాలి అంటే దేవుని యొక్క ప్రేమ గురించి తెలియజేస్తుంది(దయ, ప్రేమ, కనికరము, జాలి అనేవి ఒకే అర్థాన్నిచ్చే పదాలు). ప్రభు యొక్క దయలేనిదే మనము ఇప్పుడు సజీవులుగా ఉండలేము. ఆయన యొక్క కృప అపారమైనది అని పౌలు గారు తెలియజేస్తున్నారు .ఎఫేసి 2:4. దేవుని యొక్క దయ, కనికరం ఎవరూ కూడా వర్ణించలేరు ఎందుకంటే ఆయన అందరి యొక్క పాపములను క్షమించి వారి మీద దయ చూపుతూ ఉంటారు. పునీత తోమస్ అక్వేనస్ గారు దయ గురించి ఈ విధంగా అంటారు "దైవ ప్రేమ మానవుని యొక్క దీనస్థితిని కలుసుకున్నప్పుడు దేవుని యొక్క దయ జన్మిస్తూ ఉన్నది"అంటే మానవుడు పాపము చేసి ఒక దీనస్థితిలో ఉన్న సమయంలో దేవుడు ప్రేమ చూపించి మనలను ఆదుకుంటారు అది ఆయన యొక్క దయకు నిదర్శనం. ఏసుప్రభు వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ యొక్క దీనస్థితిని చూసి నిరాశలో ఉన్న ఆమె చెంతకు వెళ్లి తన యొక్క ప్రేమతో ఆమెను కనికరించి తన పాపములను క్షమించారు. దేవుడు యొక్క దయ చాలా గొప్పది ఎందుకంటే మనందరం పాపము చేసిన సమయములో వెంటనే మనలను శిక్షించకుండా దేవుడు మనలని క్షమిస్తూ, మన మీద దయ చూపుతున్నారు.
పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క దయ గురించి చాలా ఎక్కువగా చెప్పబడింది;
- ఆదాము అవ్వ పాపము చేసిన సమయంలో దేవుడు వారిని మరణ దండనకు గురి చేయక తన యొక్క దయతో క్షమించి ఏదేను తోట నుండి బయటకు పిలిపించి కష్టపడి పని చేసి జీవితం కొనసాగించమని వారికి తెలియజేశారు వారు చేసినటువంటి పాపములను దేవుడు క్షమించారు కాబట్టే వారిని మరణ దండనకు గురి చేయలేదు.
- ఇశ్రాయేలు ప్రజలు దేవుడితో చేసుకున్నటువంటి ఒడంబడికను పాటించుటలో అనేకసార్లు విఫలమయ్యారు అయినా గాని దేవుడు వారిని మరణ దండనకు గురి చేయలేదు. కేవలము వారికి తెలియచేయుట కొరకై వారిని కొన్ని సంవత్సరముల పాటు బానిసత్వములోనికి పంపించారు అయినప్పటికీ వారిని ప్రేమిస్తూనే, వారి మీద దయ చూపుతూనే ఉన్నారు.
- ప్రభువు అనేకమార్లు తన యొక్క ప్రవక్తలను పంపిస్తూ ప్రజల జీవితాలను బాగు చేస్తున్నారు ప్రజల జీవితాలను సరి చేసుకొని, యావే దేవునికి విధేయులై జీవిస్తే దేవుడు దయతో కాపాడతారని ప్రవక్తలు తెలియజేశారు కొన్ని సందర్భాలలో ప్రజలు తమ జీవితాలను మార్చుకొని దేవుడికి ఇష్టకరంగా జీవించారు. ప్రవక్తల యొక్క బోధనలలో ప్రజలకు ప్రతిసారి గుర్తు చేసే విషయం ఏమిటి అంటే దేవుని యొక్క దయ అపారమైనది. (నిర్గమ 34:6-7)
- దేవుడికి ఇష్టమైన దావీదు రాజు తప్పుచేసి దేవుని యొక్క మన్నింపు కోరిన సందర్భంలో దేవుడు అతడిని క్షమించారు 2 సమూయేలు 11:12, 24:10
ఎవరైతే దేవుని యొక్క దయ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారో వారిని దేవుడు ఎప్పుడూ కూడా కరుణిస్తూనే ఉంటారు ఆ ప్రార్ధించినటువంటి సమయములో వ్యక్తి పశ్చాతాప హృదయముతో ప్రార్థించాలి అప్పుడు మాత్రమే దేవుని యొక్క దయను పొందుతారు. వాస్తవానికి దేవుని యొక్క కనికరము మనలను అంగీకరిస్తుంది,
- ఆయన కనికరము మనలను గౌరవిస్తుంది
- ఆయన కనికరము మనకు సహాయపడుతుంది
- ఆయన కనికరము మనకు సమృద్ధిని ఒసగును
- ఆయన కనికరము మనల్ని క్షమిస్తుంది
- ఆయన కనికరము మనకు సానుభూతి చూపుతుంది.
దేవుని యొక్క దయ గురించి కొన్ని అంశాలను ధ్యానం చేసుకోవాలి.
1. దేవుని దయ మన పాపములను క్షమిస్తూ ఉంది.
ఈనాడు విన్న సువిశేష భాగములో యేసు ప్రభువు తన శిష్యులకు దర్శనమిస్తూ వారి యొక్క విశ్వాస జీవితాన్ని బలపరుస్తూ బాధలలో ఉన్నటువంటి వారికి ధైర్యం ఇస్తూ, సంతోషాన్నిస్తూ ఉన్నారు అదే విధముగా వారు ఆయన యొక్క పునరుత్థానమును సంపూర్ణముగా విశ్వసించనటువంటి ఆ యొక్క సందర్భంలో వారి యొక్క పాపములను కూడా ఏసుప్రభు క్షమిస్తూ ఉన్నారు. వారి యొక్క హృదయ కాఠిన్యమును మన్నిస్తున్నారు. ఏసుప్రభు తోమాస్ మీద కూడా కనికరము చూపిస్తున్నారు ఎందుకంటే మిగతా శిష్యులు దేవుని యొక్క దర్శనము పొందిన తర్వాత ఆ చెప్పిన విషయమును తోమాస్ గారు విశ్వసించకుండా ఇంకా అవిశ్వాసములో ఉన్నటువంటి తోమాస్ యొక్క పాపాలు క్షమిస్తూ ఆయన మీద దేవుడు కనికరము చూపిస్తున్నారు.
2. దేవుని దయ మన పాపాలను మరచిపోయేలాగా చేస్తుంది.
దేవుడు మనం చేసినటువంటి పాపములు అన్ని కూడా మరచిపోయి మనలను మరల అంగీకరించి, దీవిస్తారు. ఏసుప్రభు యొక్క మరణ సమయములో శిష్యులు చాలామంది ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు అయినా దేవుడు వారందరి యొక్క పాపములను, బలహీనతలను మరచిపోయి మరల వారికి పదే పదే దర్శనమిస్తూ వారి యొక్క విశ్వాస జీవితాన్ని బలపరిచారు. ఒకవేళ దేవుడే మన పాపములను మరిచిపోకపోతే మనము ఎంతటి శిక్షను పొందేటి వారమో? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి.
3. దేవుని దయ మనలను శాంతితో నింపుతుంది
ఈనాడు విన్న సువిశేష భాగములో ఏసుప్రభు శిష్యుల యొక్క పాపములను క్షమించుట మాత్రమే కాదు చేసేది వారి హృదయాలలో ఉన్నటువంటి అలజడలను తీసివేసి, ఆందోళన తీసివేసి, భయాన్ని తీసివేసి వారి మీద దయ చూపుచు వారి యొక్క హృదయములను శాంతితో నింపుతున్నారు. దేవుడు మన పాపాలను క్షమించుట ద్వారా కూడా మనందరం ప్రశాంతముగా ఉండగలుగుతున్నాము. ఆయన శాంతి లేనిదే మనలో అశాంతి ఉంటుంది కాబట్టి దేవుడు మన మీద చూపించినటువంటి దయ మనము కూడా ఒకరి పట్ల ఒకరు చూపించాలి.
ఈనాడు విన్నటువంటి మొదటి పఠణంలో కూడా తొలి క్రైస్తవ సంఘం ఏ విధముగా ఒకరి పట్ల ఒకరు దయను కలిగి, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, ప్రేమించుకుంటూ, జీవించి ఉన్నారో తెలియజేస్తూ ఉన్నది. రెండవ పఠణంలో దేవుడిని ప్రేమిస్తూ జీవించేవారు కూడా పరస్పర సహాయము కలిగి ప్రేమించుకుని జీవించిన తెలియజేస్తున్నారు. ఈనాడు మనము యేసు దివ్య కారుణ్య పండుగను కొనియాడుతున్న సందర్భముగా మన మీద దేవుడు దయ చూపిన విధంగా మనం కూడా ఒకరి పట్ల ఒకరు దయ కనికరము చూపిస్తూ, ఒకరినొకరు క్షమించుకుంటూ జీవించాలి. దేవుడు మన యొక్క పాపాలు క్షమించిన విధంగా మనం కూడా దయతో ఇతరుల యొక్క పాపాలు క్షమించి వారిని కూడా అర్థం చేసుకొని జీవించాలి.
Fr. Bala Yesu OCD

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...