25, మే 2024, శనివారం

త్రియేక దేవుని పండుగ

త్రియేక దేవుని పండుగ 
ద్వితీయో 4:32-34, 39-40
రోమి 8:14-17, మత్తయి28:16-20
ఈనాడు తల్లి శ్రీ సభ త్రియేక దేవుని పండుగను కొన్ని యాడుచున్నది. ప్రతి ఆదివారం కూడా వీరి ముగ్గురి పండుగ ఎందుకనగా, పితదేవుడు ఆదివారం రోజున సృష్టిని ప్రారంభించారు. పుత్రుడైన దేవుడు ఆదివారం రోజున మరణమును గెలిచి పునరుత్థానం అయ్యారు. పవిత్రాత్మ దేవుడు శిష్యుల మీదకు పెంతుకోస్తు ఆదివారం రోజున వేంచేశారు కావున ప్రతి ఆదివారము వీరి ముగ్గు పండుగను జరుపుకుంటాం. ఈరోజు ప్రత్యేకంగా దైవార్చన ఆదివారం ప్రకారం వీరి యొక్క రక్షణ పాత్రను ప్రత్యేకంగా ధ్యానించమని శ్రీ సభ కోరుచున్నది. 
మనం ఉదయం లేచిన దగ్గర నుండి నిద్రించే వరకు పితా, పుత్ర పవిత్రాత్మ నామమున ప్రార్థన చేస్తూ ఉంటాము వారి ద్వారానే ఏ కార్యమైనా తలపెడుతుంటాం, వారి ద్వారానే ఏ దివ్య సంస్కారమైనా అందచేయబడుతుంది. ఈ ముగ్గురు వ్యక్తులు అన్నిటిలో సరిసమానులు, శాశ్వతమైన వారు, ఒకే స్వభావము కలిగి ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాలలో ఆలోచిస్తే ఇది మానవ ఆలోచనలకు అందనిది సత్యం. పునీత ఆగస్టీను గారు కూడా ఈ యొక్క పరమ రహస్యమును తన యొక్క జ్ఞానముతో అర్థం చేసుకోవాలని ప్రయత్నించారు కానీ అది సాధ్యపడలేదు. దేవుని పరమ రహస్యం మన యొక్క ఆలోచనల ద్వారా అర్థం చేసుకోవాలి అంటే సాధ్యపడని విషయం అయినప్పటికీ దేవుడే తనను అర్థం చేసుకున్నటకై నూతన నిబంధన గ్రంధంలో ప్రత్యేక విధముగా కొన్ని ఉదాహరణలతో వారు ముగ్గురు  వ్యక్తులు కానీ  ఒకే స్వభావం కలిగిన త్రియేక దేవుడు. సృష్టి ప్రారంభం కాకము నుపే వీరి ముగ్గురు కలిసి ఉన్నారు. 
తండ్రి సృష్టిని చేశారు (ఆది1:3)
ఆదిలో వాక్కుగా ఏసుప్రభువు ఉన్నారు (యోహాను 1:1)
దేవుని యొక్క ఆత్మ నీటిపై తిరుగు చుండెను (ఆది 1:2).
ఒకరు సృష్టిని చేస్తే మరొకరు సృష్టిని రక్షించారు ఇంకొకరు సృష్టిని పవిత్ర పరిచారు. 
- ఏసుప్రభు యొక్క జన్మమునకు ముందు గాబ్రియేలు దూత మరియమాతకు మంగళవార్త చెప్పిన సందర్భంలో పితా,పుత్రా,పవిత్రాత్మ ముగ్గురు ప్రత్యక్షమై ఉన్నారు. తండ్రి దేవుడు గాబ్రియేలు దూతను పంపించారు. పుత్రుడైన యేసు ప్రభువు మరియ తల్లి గర్భమందు శరీర రక్తముల ద్వారా రూపం పొందుకున్నారు. పవిత్రాత్మ మరియు తల్లి మీద వేంచేసి వచ్చారు.
- ఏసుప్రభు జ్ఞాన స్నానం పొందిన తర్వాత ఆకాశము తెలవబడి, తండ్రి పావుర రూపమున ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను గూర్చి నేను ఆనందిస్తున్నాను అని పలికారు.
- తాబోరు కొండమీద కూడా పితా,పుత్ర, పవిత్రాత్మ ముగ్గురు ఉన్నారు.
- ఏసుప్రభు యొక్క మోక్షారోహణ సమయంలో కూడా పితా,పుత్రా,పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం ఇవ్వమని కోరారు .
త్రియేక దేవుని పండుగ జరుపుకుంటున్న సందర్భంలో మనం నేర్చుకోవలసిన అంశములు ఏమిటి అంటే 
1. త్రియేక దేవుని వలె మనము ఒకరితో ఒకరము బంధము కలిగి జీవించాలి. 
2. త్రియేక దేవుని వలె ఒకరికి ఒకరు సహకరించుకోవాలి 
3. త్రియేక దేవుని వలె ప్రేమ కలిగి జీవించాలి. 
4. త్రియేక దేవుని వలె కలసి మెలసి జీవించాలి 
5. త్రియేక దేవుని వలె అర్థం చేసుకుని ఉండాలి.
6. త్రియేక దేవుడు ముగ్గురు వ్యక్తులు అయినప్పటికీ వారు ఒకే  దేవుడు అని తెలుపుటకు మనకు కొన్ని ఉదాహరణలు ఉన్నవి. 
1. సూర్యుడు, సూర్యకిరణాలు, వేడి ఈ మూడు కూడా ఒకటే. 
2. నీరు,ఆవిరి, మంచు ఈ మూడు కూడా ఒకదానికి చెందినవే.
3. ఒక ఆపిల్ పండు యొక్క తోలు, కండ, విత్తనం మొత్తం కూడా ఒకటే (ఆపిల్) ఈ యొక్క ఉదాహరణలు మూడు భిన్నమైనవి ఒకటిగా ఉంటుంది.
ఈరోజు మన విశ్వాస సంబంధమైన త్రియేక దేవుని పండుగను కొనియాడుతున్న సందర్భంగా మనందరం కూడా పితా పుత్ర పవిత్రాత్మ వలే కలిసిమెలిసి జీవించుట ప్రయత్నించుదాం 

Fr. Bala Yesu OCD

18, మే 2024, శనివారం

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ 
అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23
ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు పండుగను వివిధ రకాలుగా పిలవవచ్చు శ్రీ సభ ప్రారంభమైన రోజు అని, పవిత్రాత్మ శిష్యులపై వేంచేసిన రోజు అని, క్రీస్తు నాధుడికి సాక్షులుగా జీవించమని కోరినటువంటి రోజు. 
పెంతుకోస్తు అనేటటువంటి పదము గ్రీకు భాష నుండి వచ్చినది గ్రీకు భాషలో దీనిని pentekoste అని అంటారు అనగా 50వ రోజు అని అర్థం.
పవిత్ర గ్రంథములో పవిత్రాత్మను వివిధ రకాల చిహ్నాలతో పోల్చుతారు; అగ్నితో, పావురంతో, గాలితో, నీటితో..
పెంతుకోస్తు యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఈ పండుగ ఒక ప్రధానమైన పండుగ. యూదులకు మూడు ముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నాయి. మొదటిగా పాస్కా పండుగ, రెండవదిగా పెంతుకోస్తు పండగ, మూడవదిగా గుడారాల పండుగ. ఈ మూడు పండుగలను వారు తప్పనిసరిగా చేసుకునేటటువంటి వారు. యెరుషలేముకు దాదాపు 20 మైళ్ళ దూరం ఉన్నటువంటి ప్రతి మగవారు యెరుషలేముకు వచ్చి ఈ మూడు పండుగలను తప్పనిసరిగా జరుపుకునేవారు.
ఈ మూడు పండుగలు వ్యవసాయానికి సంబంధించినటువంటి పండుగలు. 
పాస్కా పండుగ ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన సందర్భంలో వారి యొక్క విముక్తిగాను, స్వేచ్ఛకుగాను గురుతుగా ఈ పండుగను జరుపుకునేవారు.  ఇజ్రాయిల్ ప్రజలు దేవుడు మోషే ద్వారా సినాయి పర్వతం దగ్గర ఇచ్చిన 10 ఆజ్ఞలకు సూచనగా ఉన్న అంశమును బట్టి పెంతుకోస్తు పండుగ జరుపుకునేవారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యం నుండి బయలుదేరి సీనాయి పర్వతం దగ్గరకు చేరినప్పుడు దాదాపు అది 50వ రోజు, ఆ రోజే దేవుడు వారికి ఈ ఆజ్ఞల పలకను ఇచ్చారు. ఇశ్రాయేలీయులు పెంతుకోస్తు పండుగను సీనాయి సంఘటనను సూచించే పండుగా జరుపుకునేవారు. 
ఇక గుడారాల పండుగ అనేది ఇజ్రాయేలు ప్రజలు పాలస్తీనా దేశం చేరకముందు గుడారాల్లో నివసిస్తూ ఎడారిలో సంచరించిన కాలాన్ని సూచించే పండుగ జరుపుకోవడం ఆరంభించారు.
ఈ మూడు కూడా వ్యవసాయానికి సంబంధించినవి. ఈరోజు పెంతుకోస్తు పండుగ అనగా దేవునికి కృతజ్ఞత తెలిపేది కోతకాలమైన ఏడు వారాల తర్వాత దేవునికి కృతజ్ఞతలు తెలిపేవారు, దేవుడిచ్చిన పంటకు గాను మరియు ఆయన చేసిన అద్భుత కార్యములకు గాను కృతజ్ఞతలు తెలియజేసేవారు. ఈ పండుగ రోజున పండిన గోధుమ పంటను దేవునికి ప్రజలు అర్పించేవారు.మరియ తల్లి గర్భం ధరించే సందర్భంలో పవిత్రాత్మ ఆమెపై వేంచేశారు.
- ఏసుప్రభు జ్ఞాన స్నానం పొందినప్పుడు పవిత్ర ఆత్మ ఆయన మీద వేంచేశారు.
- శిష్యులు ప్రార్థించే సమయంలో వారి మీదకు పవిత్రాత్మ వేంచేసారు.
నూతన నిబంధన గ్రంథంలో పెంతుకోస్తు రోజున శిష్యుల యొక్క జీవితంలో ఒక మహాత్తరమైన కార్యము జరిగింది ఏమిటంటే వారు పవిత్రాత్మను పొందారు. 
పెంతుకోస్తు రోజున జరిగిన కార్యములు.
1. శిష్యుల మీదకు మరియు తల్లి మీదకు అగ్ని నాలుకలు వలే పవిత్రాత్మ  వేంచేశారు.
2. భయంతో ఉన్న శిష్యులు ధైర్యముతో నింపబడ్డారు. 
3. శిష్యులు సువార్త ప్రకటింపగా అన్యులు తమ సొంత భాషల్లో వారిని వినసాగారు. 
4. తొలి క్రైస్తవులు దేవునికి గట్టి సాక్షులుగా తయారయ్యారు.
పవిత్రాత్మ దేవుడు చేయు పనులు 
1. మనం దేవుని యొక్క ఆలయం అని తెలుపుతూ మనలో జీవిస్తారు. (1 కొరింతి 3:16)
2. మనకు ధైర్యం ఇస్తూ, బలపరస్తారు. ( అపో 1:8, 4:8)
3. మనల్ని దివ్య సంస్కారాల ద్వారా పవిత్ర పరుస్తారు. 
4. మనకు బోధిస్తారు 
5. మన యొక్క ప్రార్థన ఆలకిస్తారు 
6. మనకు వరములను దయ చేస్తారు. (1 కొరింతి 12:7, 11)
7. మన తరుపున న్యాయవాదిగా పోరాడుతారు. 
8. మనకు ఫలములను దయచేస్తారు.
9. ప్రార్థించుటకు సహాయం చేస్తారు. (రోమి 8:26-27)
10. మనల్ని నడిపిస్తారు (గలతి 5:16, 25, అపో 8:29, 13:2, 15:7, 9, రోమి 8:14)
11. దేవుని విషయంలుఅర్థం చేసుకొనుటకు సహాయపడతారు. ( అపో 13:2)
12. మనల్ని ప్రేమిస్తారు (రోమి 15:30)
13. మనం సాక్ష్యమిచ్చేలా సహాయపడతారు (యోహాను 15:26).
14. మనల్ని వెదకుతారు ( 1 కొరింతి 2:11)
ఇంకా పవిత్రాత్మ చేయు పనులు అనేకములు ఉన్నవి అయితే ఈరోజు మనం గుర్తుంచుకోవలసిన అంశం ఏమిటి అంటే పవిత్రాత్మకి అనుగుణంగా జీవించాలి. పవిత్రాత్మ ఏ విధముగా  శిష్యులను నడిపించారో అదేవిధంగా మనలను కూడా నడిపించుట నిమిత్తమై సిద్ధంగా ఉన్నారు కాబట్టి పవిత్రాత్మ స్వరమును ఆలకిస్తూ, నడుచుటకు ప్రయత్నం చేద్దాం.

Fr. Bala Yesu OCD

11, మే 2024, శనివారం

మోక్షరోహణ పండుగ

మోక్షరోహణ పండుగ 
అపో 1:1-11, ఎఫేసీ1:17-23, మత్తయి 28:16-20
ఈనాడు తల్లి శ్రీ సభ క్రీస్తు ప్రభువు యొక్క మోక్షరోహణ పండుగను కొనియాడుతున్నది. ఏసుప్రభు పునరుత్థానమైన తర్వాత  శిష్యులకు 40 రోజులు దర్శనమిస్తూ, ధైర్యమనిస్తూ, బలపరుస్తూ వారిని సువార్త సేవకై సంసిద్ధం చేసిన తర్వాత పవిత్రాత్మను పంపుట నిమిత్తమై ఆయన మోక్షమునకు వెళుచున్నారు. ప్రభువు ఎక్కడినుండి వచ్చారో మరలా తిరిగి అక్కడికే వెళుచున్నారు. యోహాను 16 :28. మోక్షరోహణం అనేది క్రీస్తు ప్రభువు యొక్క పట్టాభిషేకము అని చెప్పవచ్చు అనగా ఆయన ఈ భూలోకంలో తన తండ్రి అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేరుస్తూ పరలోకంలో ఉన్న పితదేవుని ఎదుట విజేతగా నిలిచి ఉన్నారు. తండ్రి తన కుమారున్ని సింహాసనం పై కూర్చుండబెట్టి పరలోక భూలోకాలకు రాజుగా పట్టాభిషేకం చేస్తున్నారు. ఆయన భూలోక పరలోకానికి అధిపతి అయినప్పటికీ మోక్షరోహణ పట్టాభిషేకం ఆయన యొక్క విజయమునకు సూచనగా ఉన్నది. ప్రభువు పాపమును, సైతాను జయించి ఉన్నారు కాబట్టి తన కుమారునికి ఇచ్చిన గొప్ప బహుమానం, ఇది ఆయన ప్రేమకు చిహ్నం.
ఈనాటి మొదటి పఠణములో ఏసుప్రభు తన శిష్యులను పవిత్రాత్మను పొందు వరకు యెరూషలేమును విడిచి వెళ్ళవద్దని ఆజ్ఞాపించారు. అదేవిధంగా పవిత్రాత్మను పొందిన తర్వాత 'మీరు నాకు సాక్షులై ఉండాలి' అని ప్రభువు తెలిపారు (అపో 1:8). ఏసుప్రభు పరలోకమునకు వెళ్ళుచుండగా ఆయనతో పాటు ఇద్దరు దేవదూతలు కూడా వుంటిరి,వారు ఏసుప్రభు మరల తన యొక్క మహిమతో భూలోకమునకు వేంచేస్తారు అని వాగ్దానమిచ్చారు. ఈ మొదటి పఠణము ద్వారా మనము గమనించవలసిన విషయం ఏమిటి అంటే "సహనంతో ఉండటం", "వేచి ఉండటం"దాదాపు మూడు సంవత్సరాలు తన శిష్యులతో పాటు కలసి పరిచర్య చేసి ప్రభువు తండ్రి చిత్తము నెరవేర్చిన తర్వాత ఒక్కసారిగా ఆయన భౌతికంగా వారి నుండి దూరంగా వెళ్లే సమయంలో శిష్యులు భయపడకుండా, అలజడలకు నిరాశ చెందకుండా, కష్టాలలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఏసుప్రభువు వారికి భౌతికంగా దూరంగా ఉండే సమయంలో తన శిష్యులను సహనంగా ఉండమని ప్రభువు తెలియచేస్తున్నారు. మన యొక్క జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో సహనంగా ఉండాలి అప్పుడే మనము ఎక్కువగా దీవించబడతాం. పునీత అవిలాపురి తెరేసమ్మ గారు సహనము సమస్తమును పొందును అని తెలియచేస్తున్నారు. ఆనాడు శిష్యులు అన్ని సమయాలలో సహనంగా ఉన్నారు కాబట్టే వారు పవిత్రాత్మను పొంది దేవునికి సాక్షులుగా ఉన్నారు.
ఈనాటి రెండవ పఠణములో పునీత పౌలు ఏసుప్రభు మహిమను పొందుటకు గల కారణం గురించి తెలుపుచున్నారు. ఆయన యొక్క త్యాగజీవితం దానికి నిదర్శనం. మనకు కొరకు తండ్రి సమస్తము తన కుమారుని పాదముల కింద ఉంచెను, సమస్తముపై ఆయనకు అధికారము ఉన్నది ఆయనను శ్రీ సభకు శిరస్సుగా అనుగ్రహించెను (ఎఫేసి 1: 22). ఒక విధముగా చెప్పాలి అంటే రెండవ పఠణం మనందరం కూడా మోక్షరోహణము అవుతాము అని తెలుపుచున్నది అది ఎప్పుడంటే మనము సంపూర్ణంగా ఈ లోకమును జయించినప్పుడు, అలాగే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చినపుడు. క్రీస్తు ప్రభువు మనవలె మానవ స్వభావం కలవారు ఆయన పరలోక మహిమను పొందారు అంటే అది మనం కూడా పొందగలము అని అర్థం. క్రీస్తు ప్రభువు మన మధ్యకు మనలాగ వచ్చి అన్నిటిలో సుమాతృకగా నిలచి మనకు పరలోక దారి చూపారు. ఆయనతో పాటు మనం ఐక్యమై, సజీవులుగా,సత్ప్రవర్తనతో, ఆజ్ఞలు పాటిస్తూ జీవించినట్లయితే తప్పనిసరిగా ఆయన మహిమలో కూడా భాగస్తులు అవుతాము. అలాగే మనము క్రీస్తు బాధల్లో పాలుపంచుకున్నప్పుడు ఆయన మహిమలో కూడా మనము భాగస్తులుకాగలం. (రోమి8:18).
ఈనాటి సువిషేశ భాగములో ఏసుప్రభు మోక్షమునకు వెళ్లేటప్పుడు తన శిష్యులకు ఒక గొప్ప బాధ్యతను ఇస్తున్నారు అది ఏమిటంటే ప్రపంచమంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను ప్రకటించమని తెలుపుచున్నారు, పిత, పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమివ్వమని శిష్యులకు తెలిపారు. ఏసుప్రభు తన శిష్యులను నమ్మి ఉన్నారు కాబట్టి వారికి గొప్ప బాధ్యతను అప్పచెప్పి వెళ్తున్నారు. శిష్యులు ఆయన మరణం అప్పుడు చల్లా చెదిరిపోయినప్పటికీ, ఆయనను మోసం చేసినప్పటికీ మరలా వారికే దర్శనమించి, వారి చేతుల్లోనే సువార్త ప్రకటించే బాధ్యతను, శ్రీ సభను అప్పచెప్పుతున్నారు. ఆయన వారి యెడల నమ్మకముంచారు కాబట్టి అంత బాధ్యతను అప్పచెప్పారు. చాలా సందర్భాలలో దేవుడు మనల్ని నమ్ముతారు కానీ మనము దేవుడిని నమ్మలేం.
ఏసుప్రభు తన తండ్రి చెంతకు తిరిగి వెళ్ళినప్పటికీ కూడా ఆయన మనతోనే ఉంటాను అని సెలవిచ్చుచున్నారు అనగా ‌ దివ్య సప్రసాదం ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా, పవిత్ర గ్రంథం ద్వారా, ప్రార్థించుట ద్వారా ఆయన మనతోనే ఉంటారు. 
ప్రభువు యొక్క మోక్షారోహణం మనకు తెలియచేసే అంశములు ఏమిటి అంటే 
1. పవిత్రాత్మను పొందు వరకు వేచి ఉండుట 
2. దేవుని మహిమను పొందాలి అంటే క్రీస్తు ప్రభువు వలే జీవించాలి 
3. దేవుడు అప్పచెప్పిన బాధ్యతలు శిష్యులు నెరవేర్చిన విధంగా మనం కూడా నెరవేర్చాలి. 
4. దేవుడు మనతో ఉన్నాడు అని ధైర్యంతో ముందుకు సాగాలి. 
5. దేవుని యొక్క శుభవార్తను ప్రకటించాలి. 
6. పవిత్ర జీవితం జీవించాలి.

Fr. Bala Yesu OCD

4, మే 2024, శనివారం

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం 
అపో 10:25-26, 34-35,44-48
1యోహను 5:7-10
యోహాను 15:9-17

ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు ఆయన ప్రేమలో ఐక్యమై ఉండుట గురించి తెలియజేస్తున్నాయి. దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది ఆయన ప్రేమ స్వరూపుడు కాబట్టి మనలను ప్రతినిత్యం ప్రేమిస్తూనే ఉన్నారు. 
ఈనాటి మొదటి పఠణంలో దేవుని యొక్క ప్రేమ అన్యులకు ఏ విధంగా అందచేయబడినది అనే అంశమును అపోస్తుల కార్యములు ద్వారా చదువుకుంటున్నాం. అన్యుడైనటువంటి కొర్నేలి ఆయన పేతురు గారిని కలుసుకున్న సందర్భంలో పేతురు దేవుడు ఎటువంటి పక్షపాతం చూపించని వారని, ఆయనకు అందరూ కూడా అంగీకార యోగ్యులే, అందరినీ సమదృష్టితో చూస్తారు అని తెలియజేస్తున్నారు. ఎవరైతే దేవునికి భయపడుచు, సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారు ఏ జాతికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా ప్రభువుకు అంగీకారులే. దేవుని యందు భయభక్తులు చూపుట అంటే ఆయన ఎడల విశ్వాసము కలిగి మంచి మార్గంలో నడుస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి జీవించటమే. దేవుడికి భయపడినప్పుడు మనము పాపము చేయలేము. దేవునికి భయపడుచు మనము పరలోకం గురించి ఆలోచన చేసిన సందర్భంలో మంచి జీవితాన్ని ఈ భూలోకంలో జీవిస్తాం. సత్ప్రవర్తన కలిగి ఉండుట అంటే మానవ యొక్క జీవితంలో ఎటువంటి స్వార్థం లేకుండా, ఎవరినీ మోసం చేయకుండా, సోదర భావంతో, నిర్మలమైన మనసుతో సహాయం చేస్తూ జీవించటం అలాంటి వారందరూ దేవునికి దేవుని ఇష్టమైనవారు. 
దేవుని ఆజ్ఞలను పాటించుచు ధర్మ మార్గంలో జీవించేవాడు ఏ జాతికి చెందిన ఏ వర్గానికి చెందిన దేవుని మిత్రుడే అని తెలిపారు అందుకుగాను దేవుడు కొర్నేలి కుటుంబమును ఎన్నుకొని ఆ కుటుంబ సభ్యులను  తన మిత్రులుగా చేసుకున్నారు. 
ఈనాటి రెండవ పఠణంలో దేవుడు ప్రేమ స్వరూపి అని తెలుపుచున్నారు. ప్రేమ దేవుడు నుండి పుట్టినది కావున మనము కూడా పరస్పరము ప్రేమ కలిగి ఉండాలి అని తెలుపుచున్నారు. ప్రేమించువాడు దేవుడిని తెలుసుకున్నవాడిగా పరిగణింపబడతాడు (1 యోహాను 4: 7). ప్రేమించకుండా జీవించేవారు ఇంకా దేవుడిని తెలుసుకొనకుండానే ఉన్నారు అని యోహాను గారు తెలుపుచున్నారు. యోహాను గారు దేవుని యొక్క అచంచలమైన ప్రేమను గ్రహించి ఆయన మనము కూడా ప్రేమించే వారిగా జీవించాలని తెలుపుతున్నారు. 
ఎందుకు ప్రేమ గురించి ఎక్కువగా మాట్లాడుచున్నారు, అనగా ప్రేమకు ఉన్న శక్తి ఈ లోకంలో  దేనికి లేదు. ప్రేమ సమస్తమును భరించునని, సహించునని, పౌలు గారు తెలుపుచున్నారు. 1 కొరింతి 13: 4-8). 
మనము దేవునుండి జన్మించిన వారము కాబట్టి పరస్పర ప్రేమ కలిగి జీవించాలి. 
- ప్రేమ వలన యేసు ప్రభువు మన కొరకై సిలువను మోసారు 
- భూలోకానికి మానవ మాత్రుడుగా వచ్చారు
- పాపులతో కలిసి జీవించారు
- శిష్యుల పాదాలకు కడిగారు
- సుంకరులతో - పాపులతో కలిసి భుజించారు 
- అనేక మందిని తాకి స్వస్థ పరిచారు. 
- ముఖం మీద ఉమ్ము వేసినా సరే, ఏమీ అనలేదు ఇది మొత్తం కూడా ప్రేమకు ఉన్నటువంటి శక్తి. 
- ప్రేమ అన్నిటిని అర్థం చేసుకుని జీవించేలా సహాయపడుతుంది.
-యోహాను గారు మనం ప్రేమిస్తేనే దేవుడిని తెలుసుకున్న వారమని అంటున్నారు కాబట్టి ఈరోజు మనల్ని మనము ప్రశ్నించుకోవాలి నేను ప్రేమిస్తున్నాన? నేను దేవుని తెలుసుకున్నాన? ప్రేమించకుండా ఇంకా ద్వేషాలతో, పగలతోనే ఉండేవారు దేవుడిని ఎరుగునటువంటివారే.
ఈనాటి సువిశేష భాగములో కూడా ఏసుప్రభు తన శిష్యులతో తన ప్రేమ యందు నెలకొని ఉండమని, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించమని, నేను తండ్రి ఆజ్ఞలను పాటించినట్లే మీరును నా ఆజ్ఞలు పాటించమని ప్రభువు తెలుపుచున్నారు. 
- ఆయన ప్రేమ ఎలాంటిది? అంటే తన స్నేహితుల కొరకు ప్రాణం నుంచి అంత గొప్ప ప్రేమ ( యోహాను 15:13). ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా తన స్నేహితుల కొరకు ఏసుప్రభు శ్రమించిన, ప్రాణాలర్పించిన  విధముగా త్యాగం చేసిన విధంగా ఉండరు. ఏసుప్రభు  వీరు కేవలం శిష్యులే అని వ్యత్యాసం చూపించకుండా వారిని తన స్నేహితులుగా పిలిచారు. పాత నిబంధన గ్రంథంలో మోషే తనను తాను దేవుని సేవకుడిగా పిలుచుకున్నారు (ద్వితి 34:5), యెహోషువ సేవకుడిగా పిలుచుకొనుబడ్డారు (యెహోషువ 24:29), దావీదు రాజు కూడా ప్రభువుని సేవకుడిగా పిలవబడ్డారు (కీర్తన 89:20). వారు దేవుని సేవకులుగా పిలవబడుటకు ఇష్టపడ్డారు అయితే ఇక్కడ ఏసుప్రభు తన శిష్యులను కేవలం సేవకులుగా మాత్రమే కాక స్నేహితులయ్యే గొప్ప అవకాశం దయచేస్తున్నారు. స్నేహితుల అవ్వటం అంటే దేవునికి అతి సన్నిహితంగా జీవించటం. స్నేహితులకు తన స్నేహితుడు మొత్తము కూడా బయలపరుస్తారు, చాలా దగ్గర సంబంధం కలిగి జీవించే విధంగా ఉంటారు కాబట్టి ఏసుప్రభువు మనం కూడా ఆయనకు స్నేహితులయ్యే అవకాశాన్ని దయచేసి ఉన్నారు కాబట్టి ఆయనే ఒక ఆజ్ఞలను పాటించి జీవించాలి.
-  మనలో ప్రేమ ఉన్నప్పుడు బేధాభిప్రాయాలు చూపించు. మనలో ప్రేమ ఉన్నప్పుడు అందరిని సరి సమానులుగా చూస్తూ ఉంటా యేసు ప్రభువు కూడా చేసినది అది. 
- ఆయన మనలను ప్రేమించారు కాబట్టే మన యొక్క పాపాలన్నీ కూడా క్షమిస్తున్నారు. ఎదుటి వారు చేసిన తప్పిదములు క్షమించాలి అంటే మనలో తప్పనిసరిగా ప్రేమ ఉండాలి లేకపోతే క్షమించను మనలో ఉన్న ప్రేమ వలనే ఇతరులను క్షమించ గలుగుతాం. (లూకా 15)
- మనము ఏసుప్రభు ఇచ్చిన ప్రేమ ఆజ్ఞ పాటించిన యెడల ఆయన ప్రేమలో నెలకొని ఉంటాము అప్పుడు మన యొక్క ఆనందము, సంతోషము పరిపూర్ణమగును. అదేవిధంగా దేవుని యొక్క ప్రేమ ఆజ్ఞ పాటించుట ద్వారా మనము దేవునికి స్నేహితులవుతున్నాం.  ఒక మానవునికి ఇంతకన్నా గొప్ప దీవెన మరి ఏది ఉండదు. ఎందుకంటే సామాన్యులమైనటువంటి మనందరిని కూడా ఆయన స్నేహితులుగా ఉండే అవకాశం ప్రభువు కల్పిస్తున్నారు. దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే దేవుడు మనకు దగ్గరవుతారు, దేవుని దీవెనలు పొందుతాం, మన యొక్క ప్రార్థనలు ఆలకించబడతాయి కావున మనం దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ జీవించుదాం.
Fr. Bala Yesu  OCD

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...