27, జనవరి 2024, శనివారం

4వ సామాన్య ఆదివారం


ద్వితీయో 18:15-20
1కొరింతి 7:32-35
మార్కు1:21-28
ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క సేవకుల యొక్క అధికారం వారి యొక్క బాధ్యతల గురించి తెలియజేస్తున్నాయి. సేవకులు యొక్క అధికారము అంతయు కూడా దేవుని దగ్గర నుండి వచ్చినది. వారిని ఎన్నుకునే సందర్భంలోనే దేవుడు వారికి సంపూర్ణ అధికారం ఇస్తున్నారు.
ఈనాటి మొదటి పఠణంలో మోషే ప్రవక్త ఆయన మరణము గురించి తెలియజేసినప్పుడు  వారు మేము ఒక గొప్ప నాయకుడిని కోల్పోతున్నాము అనేటటువంటి భయములో ఉన్న సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలకు ఊరటనిచ్చుటకు  ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసేటటువంటి మాట ఏమిటంటే తనలాంటి ప్రవక్తని ప్రజల మధ్యకు దేవుడు పంపిస్తానని తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా మనందరం కూడా ఎవరు ప్రవక్త అని తెలుచుకోవాలి. 
ప్రవక్త అనగా దేవుని స్వరము, దేవుని మార్గములను బోధించేవాడు, దేవునికి మానవునికి మధ్య వారధిగా నిలబడే వ్యక్తి , పరలోక సత్యమును బోధించే వ్యక్తి, అన్యాయమును ఎదిరించే వ్యక్తి, అందుకనే ఈనాటి మొదటి పఠణంలో ప్రభువు ఇస్రాయేలు ప్రజలకు మోషే ప్రవక్త వంటి వాడిని పంపిస్తామంటున్నారు. మరి మోషే ఎలాంటి ప్రవక్త? ఆయన కూడా ప్రజల నుండి వచ్చినవాడే, ఆయన కూడా బలహీనుడే ,అయినప్పటికీ  దేవునికి అతి సమీపమున జీవించి ఉన్నారు. మోషే ప్రవక్త దేవుని యొక్క పిలుపుని అందుకున్న తర్వాత ఇజ్రాయేల్ ప్రజలను నడిపించుటకు ఆయన ఒక నాయకుడిగా అదే విధముగా ఒక మార్గం చూపరీగా నిలిచి ఉన్నారు దేవుని యొక్క పరమ రహస్యములను ప్రజలకు బోధిస్తూ జీవించారు. అలాగే ప్రతి ఒక్క ప్రవక్త కూడా మోషే ప్రవక్త వలే మార్గ చూపరిగా ఉంటూ ప్రజలను దేవుని వైపు నడిపించాలి. ఆయన తన జీవితంలో గుర్తుపెట్టుకోవలసిన రెండు ప్రధానమైన అంశములు ఏమిటి అంటే తాను ఎల్లప్పుడూ దేవుడికి దగ్గర అయి ఉండాలి అదేవిధంగా తాను దేవుడి యొక్క మాటను మాత్రమే బోధించాలి. తన సొంత ప్రణాళికలు కానీ తన సొంత ఆలోచన గానీ తెలియజేయకూడదు కేవలము దేవుడు చెప్పవలసినది మాత్రమే మనము తెలియజేయాలి అది ప్రవక్త యొక్క ముఖ్యమైన బాధ్యత. అలా వారు చేయకపోతే దేవుని యొక్క శిక్ష కూడా వస్తుంది.
మోషే ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలకు కూడా తెలియజేసే అంశము ఏమిటి అంటే వారు ఆ ప్రవక్త యొక్క మాటను వినాలి.
 ఆ ప్రవక్త యొక్క మాట సంపూర్ణంగా దేవుని యొక్క మాట కాబట్టి దానిని తమ యొక్క జీవితములో ఆచరించి జీవించాలి అది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత మరి ఈనాడు ఎంతమంది దేవుని సేవకులు యొక్క మాటను వారి హెచ్చరికలను ఆలకించి విధేయత చూపుతున్నామా?
ఈనాటి రెండవ పఠణంలో కూడా పునీత పౌలు గారు సమర్పణ జీవితం గురించి తెలియజేస్తున్నారు. వివాహ జీవితంలో ఉన్నటువంటి భార్యాభర్తలు వారికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ లేనందున దేవునికి తముతాము పూర్తిగా సమర్పించుకోలేరు కానీ ఎవరైతే పౌలు గారి వలే సమస్తమును కూడా దేవునికి త్యాగం చేసి జీవిస్తున్నారో వారందరూ  తమయొక్క జీవితమును తాము దేవునికి సమర్పించుకొని జీవిస్తారు.
ఈనాటి సువిశేష  పఠణంలో ఏసుప్రభు యొక్క అధికారం గురించి తెలియజేయబడుతుంది ఆయన బోధన అధికారంతో కూడుకున్నటువంటిది. ఏసుప్రభువు యొక్క బోధనలో ఎటువంటి సందేహాలు లేవు ఆయన సమస్తము మీద అధికారం కలిగినటువంటి దేవుడు కాబట్టి తన తండ్రి చిత్తమును సంపూర్ణంగా ఎరిగి ఎటువంటి భయము లేకుండా ఒక మధ్యవర్తిగా తన తండ్రి సందేశములను ప్రజలకు తెలియజేశారు. ఏసుప్రభు యొక్క అధికారము తన తండ్రి నుండి వచ్చినది సృష్టికి పూర్వం నుండి తండ్రి దగ్గర ఉన్నటువంటి కుమారుడు ఈ యొక్క అధికారం ను కలిగి ఉన్నారు ఆయన అధికారము మంచి కొరకు మాత్రమే ఆయన అధికారము సేవ కొరకు మాత్రమే ఆయన అధికారం వినయముతో కూడుకున్నది కాబట్టి ఈరోజు మనము కూడా ధ్యానించవలసిన అంశం ఏమిటి అంటే దేవుడు మనకు ఇచ్చిన అధికారం ఒక యజమానుడిగా నాయకుడిగా ఇచ్చిన అధికారమును మనము సద్వినియోగపరచుకొని జీవించాలి.
Fr. Bala Yesu OCD

20, జనవరి 2024, శనివారం

మూడవ సామాన్య ఆదివారం

మూడవ సామాన్య ఆదివారం
యోనా 3:1-5
1కొరింతి 7:29-31
మార్కు 1:14-21
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణములు ప్రభు యొక్క రాకడ కొరకై హృదయ పరివర్తనం చెంది జీవించాలి అనే అంశము గురించి బోధిస్తున్నాయి. హృదయ పరివర్తనం మరియు పాపమునకు పశ్చాత్తాప పడటం ఒక కొత్త జీవితం నాంది పలుకుతుంది.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు యోనా ప్రవక్తను నినెవే పట్టణమునకు హృదయ పరివర్తనం బోధించుటకు పంపిన విధానమును చదువుకుంటున్నాం. దేవుని యొక్క పిలుపును మొదటిగా స్వీకరించినప్పుడు యోనా ప్రవక్త నీనెవే వెళ్ళుటకు నిరాకరించారు ఎందుకంటే నినెవే వాసులు ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా జీవించి అనేక సందర్భంలో యుద్ధంలో ఆధిపత్యమును సాధించారు. అందుకనే యోనా నినెవే పట్టణవాసులు నాశనమైతే బాగుండు అని భావించి ఆయన తర్షీషునకు ప్రయాణం ప్రారంభించాడు కానీ తన ప్రయాణం గమ్యమునకు చేరలేదు మార్గమధ్యంలోని దేవుడు ఆయనను పంపవలసిన గమ్యమునకు పంపిస్తున్నారు. యోనా ప్రవక్త నినెవే పట్టణము చేరి అక్కడ ప్రభువు యొక్క హృదయ పరివర్తన సందేశమును ప్రకటించగానే రాజు దగ్గర నుండి చిన్నపిల్లల వరకు కూడా దేవుని యొక్క సందేశము శ్రద్ధగా ఆలకించి, స్వీకరించి వారు హృదయ పరివర్తన మనకు చేయవలసిన ప్రతి పనిని కూడా చేస్తున్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటి అంటే వారు అన్యులు అయినప్పటికీ కేవలం ఒకే ఒక దైవ సందేశమును ఆలకించగానే హృదయ పరివర్తనము చెందటానికి సిద్ధపడుతున్నారు మరి మనము దేవుని  యొక్క వాక్యము విన్న సందర్భంలో హృదయ పరివర్తనము చెందటానికి సిద్ధపడుచున్నాము. నినెవే వాసులు మరణము వస్తుంది అని విన్న వెంటనే గోనె దాల్చి, బూడిద పూసుకొని ఉపవాసం చేసి ఉన్నారు. మనం మరణము గురించి కూడా ధ్యానించినట్లయితే ప్రతి ఒక్కరు హృదయ పరివర్తనం చెంది జీవిస్తారు.
ఈనాటి రెండవ పఠణములో పునీత పౌలు గారు ఇక సమయము లేదు అని తెలుపుచున్నారు కావున హృదయ పరివర్తనము చెంది చెడు మార్గములను విడిచి పుణ్యమార్గములను అలవర్చుకోవాలి. ఈ లోక సంబంధమైన వాంఛలతో కానీ ఆశలతో కానీ జీవించకుండా దేవుని కొరకు జీవించమని తెలుపుచున్నాను. దేవుని కొరకు జీవించాలి అంటే ఇప్పుడు మనము నడుస్తున్న చెడు మార్గము కానీ పాపపు మార్గము కానీ విడిచి పెట్టాలి అప్పుడే మనలో కొత్త జీవితం పుడుతుంది.
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు తన మొదటి సువార్త పరిచర్య  హృదయ పరివర్తనము అనే అంశము ద్వారా ప్రారంభించి ఉన్నారు. కాలము సంపూర్ణమైనది హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసించండి అని క్రీస్తు ప్రభువు పరిచర్య ప్రారంభించారు. హృదయ పరివర్తనం అనగా ఒక యు టర్న్ (U- Turn)తీసుకోవటమే ఎందుకంటే మనము మిస్సయినటువంటి మార్గమును మనము మరల అనుసరించటం.
 పాపము చేసిన సందర్భంలో దేవుని యొక్క మార్గమును విడిచి మన సొంత మార్గంలో ప్రయాణం చేస్తాం కాబట్టి ఈ యూటర్న్ అనేది మరొకసారి దేవుని యొక్క మార్గమును అనుసరించుటయే. హృదయ పరివర్తన ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం లేనియెడల మనందరం మన యొక్క జీవితమును యధావిధిగా కొనసాగిస్తూ ఉంటాం అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవలసిన అంశం ఏమిటంటే కాలము సంపూర్ణమైనది. కాలము సంపూర్ణమైనది అనగా దేవుని యొక్క కాలము ప్రారంభమైనది కాబట్టి దానికి అనుగుణంగా మనము హృదయ పరివర్తనం చెందాలి.
హృదయ పరివర్తనము మన యొక్క వ్యసనములు నుండి, పాపపు జీవితము నుండి, మూడు నమ్మకముల నుండి ఇంకా చెడు సుగుణముల నుండి హృదయ పరివర్తనం చెందాలి. హృదయ పరివర్తన ప్రతి ఒక్కరు కోరుకునే అంశం కొన్నిసార్లు దేవుడు ప్రజల హృదయ పరివర్తనం చెందాలనుకుంటారు, కొన్నిసార్లు బిడ్డలు తల్లిదండ్రులు హృదయ పరివర్తనం చెందాలనుకుంటారు మరి కొన్నిసార్లు భర్త భార్య హృదయ పరివర్తనం చెందాలనుకుంటారు అలాగే భార్య భర్త హృదయపరివర్తనం చెందాలనుకుంటారు ఈ విధంగా చాలామంది ఒకరి పట్ల ఒకరు  హృదయ పరివర్తనం కోరుకుంటారు కాబట్టి మనం హృదయ పరివర్తనం చెంది జీవించాలి.
Fr. Bala Yesu OCD

6, జనవరి 2024, శనివారం

క్రీస్తు సాక్షాత్కార పండుగ

క్రీస్తు సాక్షాత్కార పండుగ
యెషయా 60:1-6,ఎఫేసి 3:2-3, మత్తయి 2:1-12
ఈనాడు తల్లి శ్రీ సభ క్రీస్తు సాక్షాత్కార పండుగను కొనియాడుచున్నది. సాక్షాత్కారం అనగా క్రీస్తు ప్రభువు తనను తాను ఇతరులకు ఎరుకపరుచుట. తండ్రి దేవుడు తన కుమారుడిని ఈ లోకమునకు అంతట ఎరుకపరిచారు. ఆయన యొక్క పుట్టుక ద్వారా దేవుడు మొదటగా ఏసుప్రభువును తన తల్లిదండ్రులకు తరువాత గొల్లలకు ఎరుకుపరిచారు అటు తరువాత ముగ్గురు జ్ఞానులకు తన కుమారుడిని బయలుపరిచారు. క్రీస్తు సాక్షాత్కారము ద్వారా మానవలోకంలో దైవ సాక్షాత్కారం జరిగింది. దేవుడికి మానవునికి మధ్య ఉన్న తెర తొలగిపోయి దేవుడు మానవుడు ఒకటిగా కలిసి ఉన్నారు, ముఖాముఖిగా ఒకరినొకరు చూడగలుగుతున్నారు.
ఈ పండుగను మూడు విధాలుగా పిలుస్తారు
1. ముగ్గురు రాజుల పండుగని
2. విశ్వాసుల పండుగని
3. అన్యుల క్రిస్మస్ పండుగని
ఈ ముగ్గురు జ్ఞానులు అన్యులైనప్పటికీ వారు క్రీస్తు రాజును దర్శించడానికి మరియు ఆరాధించటానికి దూర ప్రాంతముల నుండి సుదీర్ఘమైన ప్రయాణం చేసి కష్టమైనా ఇష్టముగా మార్చుకొని వారు దివ్య బాల యేసును సందర్శించారు. ఈ జ్ఞానులు క్రీస్తు ప్రభువు చెంతకు చేరుటకు ఎటువంటి పవిత్ర గ్రంథమును చదవలేదు కేవలం ఒక నక్షత్రమును ఆధారముగా చేసుకొని వారి యొక్క ప్రయాణమును ప్రారంభించి రక్షకుడిని చేరుకున్నారు. ఈ ముగ్గురు జ్ఞానులు ఎవరనగా? కాస్పర్, మెల్కియోర్, బల్తజార్.
కాస్పర్ అనేటటువంటి జ్ఞాని అరేబియా దేశం నుంచి తన ప్రయాణం ప్రారంభించి దేవునికి సాంబ్రాణి సమర్పించారు. ఈ సాంబ్రాణి యాజకత్వమునకు గుర్తు ఏసుప్రభు నిత్య యాజకుడని గుర్తించి ఆయన అందరికీ రక్షణనిచ్చుటకై తన్ను తానే బలిగా సమర్పించుకుంటారని మరియు మన కొరకై తండ్రిని సంతోష పరుచుటకు ఒక యాజకునిలా ధూపము వేస్తూ మనలను ఆశీర్వదిస్తారు.
మిల్కియోర్ అనే జ్ఞాని ఏసుప్రభుకు బంగారమును సమర్పించారు. ఈ బంగారం యేసు ప్రభు యొక్క రాజరికమునకు గురుతుగా ఉన్నది. ఆయన మన అందరి యొక్క హృదయములను పరిపాలించే రాజు అందుకే ఆయనకు బంగారం కానుకగా సమర్పించారు
బల్తజార్ అనే జ్ఞాని పరిమళ ద్రవ్యమును యేసు ప్రభుకి సమర్పించారు అది ఆయన మరణమును సూచిస్తుంది. ఆయన మరణించిన తరువాత తన యొక్క శరీరమును మంచిగా ఉంచుటకు ఈ యొక్క పరిమళ ద్రవ్యమును సమర్పించారు. ముక్కు రంధ్రంలో పరిమళ ద్రవ్యమును ఉంచినట్లయితే ఆ యొక్క శరీరం చాలా కాలం నిలుస్తుంది.
ఈనాడు ఈ ముగ్గురు జ్ఞానుల పండుగను జరుపుకునే సందర్భంలో వారి జీవితము నుండి మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలి
- 1. ఏసుప్రభువును చూడాలన్న కోరిక. వీరి ప్రయాణం చీకటిలో జరిగినప్పటికీ వారు ఏసుప్రభుని చూడాలి అనేటటువంటి గాఢమైన కోరికను కలిగి ఉన్నారు కాబట్టి ఆయనను సందర్శించి ఉన్నారు. మనలో కూడా దేవుడు ఎడల ఒక గాఢమైన కోరిక ఉండాలి అది ఏమిటి అంటే ఆయనను చూడాలి, ప్రార్థించాలి, ఆయన సన్నిధికి రావాలి అని కోరిక మనలను నడిపించాలి.
2. వెదకుట- ఏసుప్రభు కోసం వెతుకుతూ ఉన్నారు చివరికి ఆయనను కనుగొన్నారు కాబట్టి మనలో కూడా వెదికే సుగుణం ఉండాలి.
3. పాత మార్గమును విడిచి కొత్త మార్గమును అనుసరించాలి. ఈ జ్ఞానులు కూడా చేసినది అదే.
4. దేవుడిని ఆరాధించారు. అన్యులైనప్పటికీ వారు ఏసుప్రభుని విశ్వసించి ఆయన రక్షకుడని గ్రహించి వారు ఎంత పెద్ద జ్ఞానులైనప్పటికీ కూడా ఆయన ముందు సాష్టాంగ పడి ప్రభువుని ఆరాధించారు.
5. విధేయత చూపుట. దేవుని యొక్క దూత వారికి ఆదేశించిన విధముగా వారు దేవుని యొక్క మాటలకు విధేయత చూపించి వారి యొక్క ప్రయాణమును కొనసాగించారు.
6. దేవునికి కానుకలు సమర్పించారు. ఈ ముగ్గురు జ్ఞానులు ఏసుప్రభువుకు విలువైన కానుకలను సమర్పించారు అలాగే మనము కూడా దేవునికి విలువైన కానుకలు సమర్పించాలి.
ఈనాడు ఈ ముగ్గురు జ్ఞానుల పండుగను కొనియాడే  సందర్భంలో మనము వీరిలో ఉన్న లక్షణములను కలిగి జీవించాలి.
Fr. Bala Yesu OCD

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...