17, ఫిబ్రవరి 2024, శనివారం

తపస్సు కాల మొదటి ఆదివారం

తపస్సు కాల మొదటి ఆదివారం
ఆది 9:8-15, 1పేతురు 3:18-22, మార్కు1:12-15
ఈ తపస్సు కాల మొదటి ఆదివారం మనందరికీ, దేవుడు నోవాతో ఏర్పరచుకున్న ఒడంబడికను గురించి మరియు ఏసుప్రభు ఎడారిలో శోధింపబడుటను తెలుపుచున్నది.
ఈనాటి మొదటి పఠణములో దేవుడు నోవాతో ఏర్పరచుకున్న ఒడంబడిక గురించి తెలుపుతూ ఉన్నది. ఈ తపస్సు కాల మొదటి మూడు ఆదివారాలు దేవుడు మానవులతో ఏర్పరచుకున్న మూడు ఒడంబడికలను గురించి తెలుపుచున్నవి. దేవుడు మొదటిగా నోవాతో, రెండవదిగా అబ్రహాముతో,  మూడవదిగా ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడికను ఏర్పరచుకున్నారు. ఈనాటి మొదటి పఠణములో దేవుడు నీటి ద్వారా నోవాను రక్షించిన విధానమును తెలుసుకుంటున్నాము. 
1. భూమి మీద ఉన్న ప్రజలు పరమదృష్టిలై పాపములో జీవించారు. దేవునితో సంబంధం లేకుండా పాపమును ప్రేమిస్తూ, విచ్చలవిడిగా జీవించటం ప్రారంభించారు. (ఆది 6:5-12) దేవున్ని ధిక్కరిస్తూ వచ్చారు, కాల క్రమేనా ప్రపంచంలో పాపము ఎక్కువైనది, ఈసందర్భంలో దేవుడు మరియొకసారి నోవా కుటుంబం ద్వారా ఈ సృష్టిని నూత్నీకరించారు.
 దేవుడు సృష్టిని మొత్తము నాశనము చేయలేదు ఎందుకంటే నోవా కుటుంబం మరియు దేవుడు నోవాతో తన ఓడలోకి చేర్చబడిన జంతువులు పక్షులు కూడా ఆ జలప్రళయం నుండి రక్షించబడినవి. భూమి మీద పాపం పెరిగిపోయినప్పుడు మరియొకసారి దేవునితో కొత్త జీవితం జీవించుటకు నోవా కుటుంబం రక్షిస్తున్నారు. ఈ జలప్రళయము దేవుడు శిక్షగా వచ్చినది ఏదో ఒక్కసారి తప్పు చేసినందుకు కాదు కానీ వారు ప్రతిసారి కూడా చెడు పనులు చేయాలని ఆశతో ఉన్నారు. దేవుడంటే విశ్వాసము, భయము లేకుండా జీవించే సందర్భంలో పరిపూర్ణంగా వారు దేవుని మార్గము నుండి వైదొలిగినప్పుడు మాత్రమే దేవుడు వారిని శిక్షించారు.
2.ప్రభువు వారి పాపములను శిక్షించినప్పటికీ వారి యెడల దయ, కనికరము కలవారని మనం గుర్తించాలి. వాస్తవానికి ఏ వ్యక్తియు పాపములో మరణించుట దేవునికి ఇష్టము లేదు.(2 పేతురు 3:9) కాబట్టి దేవుడు వారి యొక్క హృదయ పరివర్తనం కోసం ఎంతగా ప్రయత్నించి ఉండి ఉంటారని మనము ఆలోచించాలి. దేవుడు అప్పటినుండి ఇప్పటివరకు కూడా ఏదియు మొత్తము(completely) నాశనం చేయలేదు. ఎందుకంటే ఆయన నోవాతో చేసుకున్నటువంటి ఒడంబడిక అటువంటిది. నోవా ఒడంబడిక ద్వారా దేవుడు ఈ భూమిని, భూమి మీద ఉన్న ప్రాణికోటిని రక్షిస్తారు దానిని ఇక ఎన్నటికీ నాశనం చేయరని తెలుపుచున్నారు
3.చరిత్రలో చాలా సందర్భాలలో అంటూ వ్యాధులు వచ్చాయని మనము చదువుకున్నాం 2020లో కూడా కరోనా వచ్చింది కానీ ఆ సమయములో ఈ ప్రపంచం మొత్తం నాశనం అయిపోలేదు కొంతమంది తమ యొక్క ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడు ఏ వ్యాధులు వచ్చినా గాని అది ఈ ప్రపంచం అంతంమెందించే లాగా ఉండుటలేదు. కొంత నష్టం మాత్రమే జరుగుతుంది. అది కేవలము దేవుడు నోవా కు ఇచ్చిన వాగ్దానమునకు నిదర్శనం.
దేవుడు ఏ విధంగానైతే జల ప్రళయం నుండి నోవా కుటుంబమును జంతువులను రక్షించి ఉన్నారు అదే విధముగా మనందరినీ కూడా జ్ఞాన స్నానం అనే నీటి ద్వారా రక్షిస్తున్నారు. ఈరోజు దేవుడు మనల్ని మన కుటుంబమును ఒక నూతన సృష్టిగా చేయబోతున్నారు కాబట్టి మనము ఆయనకు విధేయులై నోవావలే విశ్వాస పాత్రులుగా జీవించాలి. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత పేతురు గారు ఏసుప్రభు తన యొక్క సిలువ శ్రమల, మరణ, పునరుత్థానము  ద్వారా మనలను రక్షించినారు అని తెలుపుచున్నారు. దేవుడు జ్ఞాన స్నానంతో ప్రతి ఒక్కరితో ఒడంబడికను ఏసుప్రభు ద్వారా చేశారు. జ్ఞాన స్నానము మనలను జన్మ పాపము నుండి కాక మనము క్రీస్తునందు జన్మించేలాగా చేస్తూ ఉన్నది. జ్ఞాన స్నానము మనందరినీ రక్షిస్తూ ఉన్నది.
ఈనాటి సువిశేష భాగములో యేసు ప్రభువు  పొందిన శోధనల గురించి తెలియజేయబడుతున్నది. ఇక్కడ ఐదు అంశాలు మనము గుర్తుపెట్టుకోవాలి
1. పవిత్ర ఆత్మ యేసు ప్రభువుని ఎడారికి తీసుకొని పోయారు.
2. 40 రోజులు ఎడారిలో ఉంటూ  ఉపవాసం చేశారు.
3. ఆయన  మృగముల మధ్య నలభై రోజులు ఉన్నారు
4. సైతాను ఏసుప్రభువును శోధించినది.
5. దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు.
ఈ ఐదు అంశాలలో ముఖ్యమైనవి; ఏసుప్రభు శోధింపబడుట మరియు శోధనలను జయించుట.
ప్రతి ఒక్కరి జీవితంలో శోధనలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే సైతాను యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే మనం దేవుడిని మరిచిపోయేలాగా చేయడం అలాగే దేవునికి అవిధేయత చూపించేలాగా చేయుట అందుకనే ప్రతిసారి కూడా మనలను శోధిస్తూ ఉన్నది. ఏసుప్రభువును కూడా ఎడారిలో శోధించినది ఎందుకంటే ఆయన కూడా తండ్రి చిత్తమును విడిచి పెట్టేసి తన స్వార్థం కోసం జీవిస్తాడేమో అని సైతాను శోధించినది మరియు ఇశ్రాయేలు ప్రజలను ఎడారిలో శోధించినప్పుడు వారు ఏ విధంగానైతే మానవ బలహీనత వలన పడిపోయారో అదే విధముగా ఏసుప్రభువు కూడా మానవ దైవ స్వభావములో ఉన్నప్పుడు పడిపోతాడు అనే ఉద్దేశంతో సైతాను ప్రభువును శోధించినది. మార్కు సువార్తికుడు ఏ విధమైనటువంటి శోధనలు ఏసుప్రభుకి కలిగాయి అని స్పష్టముగా తెలియ చెప్పలేదు కానీ ఆయన శోధించబడ్డారు అని తెలిపారు. మత్తయి మరియు లూకా సువార్తికులు యేసు ప్రభువుని సైతాను మూడు అంశములమీద శోధించినది అని తెలుపుచున్నారు. మార్కు సువార్తలో ఏసుప్రభు శోధించబడ్డారు అని మాత్రమే తెలిపారు ఎందుకంటే శోధనలు ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి అది ఒక్కొక్క వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి భిన్నముగా ఉంటాయి అని తెలియజేయుటకే ఏ విధమైన శోధన అని మార్కు సువార్తికుడు చెప్పలేదు. కాబట్టి మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు మనము దేవుని యొక్క శక్తితో ముందుకు సాగి శోధనలను జయించాలి అప్పుడే మనకు దేవుడు తన యొక్క అనుగ్రహాలను ఒసుగుతారు. చాలా సందర్భాలలో సైతాను మనలను శోధించినప్పుడు మనము పడిపోతాము సైతాను వివిధ రకాలుగా మనలను శోధిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏ సమయంలో ఎవరిని ఎక్కడ శోధించాలో సైతాన్ కి బాగా తెలుసు కాబట్టి మనము ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఏసుప్రభు ఏ విధంగానైతే ప్రార్ధన జీవితము ద్వారా శోధనలు జయించారో మనము కూడా దేవుని శక్తితో శోధనలు జయించాలి. శోధనలు జయించినప్పుడు దేవుడు మనతో ఒక ఒడంబడికను ఏర్పరచుకుంటారు అలాగే మనలను ఆశీర్వదిస్తాను. ఈ ఒడంబడిక ద్వారా దేవుడు మనలను నూతన సృష్టిగా చేస్తున్నారు. కాబట్టి శోధనలను జయించుటకు దేవుని యొక్క సహాయం కోరుతూ ప్రార్థిద్దాం.
Fr. Bala Yesu OCD

23వ సామాన్య ఆదివారం

23వ సామాన్య ఆదివారం  యెషయా 35:4-7, యాకోబు 2: 1-5, మార్కు 7: 31- 37 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మెస్సయ్య కాలములో జరిగినటువంటి అద్భుతములను గుర...