2, సెప్టెంబర్ 2023, శనివారం

22 వ సామాన్య ఆదివారం

 

22  సామాన్య ఆదివారం

యిర్మియ 20:7-9

 రోమియులు 12:1-2

 మత్తయి 16:21-27

ఈనాటి దివ్య పఠణాలు దేవుని యొక్క శిష్యరికం గురించి బోధిస్తున్నాయి. దేవుని యొక్క శిష్యులుగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి కొన్ని లక్షణాలు ఉండాలి, విధముగానయితే ప్రతి ఒక్క ఉద్యోగానికి ఒక క్వాలిఫికేషన్ అనేది ఉండాలో అలాగే ఏసుప్రభు యొక్క శిష్యులుగా ఉండాలి అంటే వారికి కూడా కొన్ని లక్షణాలు ఉండాలి అంశముల గురించే ఈనాడు పఠణాలు మనందరిని కూడా ధ్యానించమని కోరుతున్నాయి. 

ఈనాటి మొదటి పఠణంలో దేవుని యొక్క సేవకుడైన ఇర్మియ ప్రవక్త దైవ సందేశం అందించే సమయములో అనుభవించిన ఒక కష్టతరమైన సమయం గురించి తెలియజేస్తున్నాను.ఇర్మియ ప్రవక్త నీతిగా జీవిస్తూ సత్యమునకు సాక్షిగా ఉంటూ, దేవుని యొక్క సందేశమును రూడీగా ప్రకటించారు. యిర్మియ క్రీస్తుపూర్వం 650 నుండి 580 మధ్య యూదా లో ఉన్న యెరుషలేములో దేవుని యొక్క సందేశాన్ని అందజేశారు. ఇర్మియాను దేవుడు పిలిచిన సందర్భంలో నేను బాలుడను నీ సందేశమును బోధించలేను అని చెప్పిన సందర్భంలో యావే దేవుడు భయపడవలదు, నేను నీకు తోడై యుండును నీ నోటిలో నా మాటలు ఉంచుతాను అని అభయ వచనాలు చెప్పి తనకు ధైర్యం ఇచ్చి ప్రభు యొక్క సందేశమును యూదా ప్రజలకు అందచేయుటకు ఇర్మియాను యావే దేవుడు ఎన్నుకున్నారు

ఇర్మియ ప్రవక్త తన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చటంలో ఏమాత్రం వెనుదీయక ప్రభువు యొక్క వాక్కును ప్రజలకు వెలుగెత్తి చాటాడు ప్రజల యొక్క పాపపు జీవితాన్ని ధైర్యముగా ఖండించారు. రాజులకు సైతం నిర్భయంగా దేవుని యొక్క మాటలను బోధించి దేవుని యొక్క ప్రణాళికలు, మార్గములు చూపించాడు. విధముగా ఇర్మియా దేవుని యొక్క పని చేసే సందర్భంలో తన సొంత ప్రజలే తనను అర్థం చేసుకోలేదు. అందుకే ఆయనను విధముగానైనా సరే హతమార్చాలి అని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇర్మియ ప్రవక్త సంఘటనలన్నీ చూసిన సందర్భంలో తన యొక్క మానవ బలహీనత వలన దేవుడు తనను విడిచిపెట్టారు అని తనకు ఇచ్చిన వాగ్దానం మరచిపోయారు అని ఒక విధమైన బాధను వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటాను ఎటువంటి ఆపద కలగకుండా చేస్తాను అని చెప్పిన ప్రభువు యొక్క మాటలు విశ్వసించిన

అతడికి ఒక చేదు అనుభవము ఎదురైనది అది తన సొంత ప్రజలే తనను అర్థం చేసుకోకపోవడం, దేవుని యొక్క సందేశాన్ని స్వీకరించకపోవడం మరియు తనను హతమార్చాలి అనుకోవడం ఇర్మియ ప్రవక్తను చాలా బాధపెట్టాయి అందుకనే తాను దేవుడిని అడుగుచున్నారడు నన్ను విడిచి పెట్టావా అని ఇలాంటి ఒక సమయములో తాను కూడా పరిచర్యను ఆపివేయాలనుకున్నాడు కానీ దేవుని యొక్క వాక్కుమాత్రం తన యొక్క హృదయములో అగ్ని జ్వాల  రగిలిపోతున్నది. యొక్క వాక్కు తనను ప్రశాంతముగా ఉండనీయలేదు తనకు కష్టంగాఉన్నా సరే తన ప్రజలు నిరాకరించిన సరే దేవుని యొక్క సందేశం మాత్రము ప్రకటించుట ఆపుటలేదు ఇది కేవలం దేవుని యొక్క అనుభవం మాత్రమే

కాబట్టి ఇర్మియా విధముగా అయితే దేవుని యొక్క పని చేస్తూ ఉన్నారో కష్టమైనా, నిందలు ఎదురైనా, తిరస్కరణల ఎదురైనా, బాధలు ఎదురైనా మనం కూడా అలాగే ముందుకు సాగాలి దేవుని యొక్క పనిని కొనసాగించాలి. ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు మనందరిని కూడా పరిశుద్ధ జీవితం జీవించుటకు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేష పఠణంలో పేతురు గారు ఏసుప్రభు యొక్క సిలువ శ్రమల యొక్క పాటులను

 తృణీకరిస్తున్నారు. పోయిన వారం చదివిన సువిశేష పఠణంలో పేతురు గారిని యేసు ప్రభువు మెచ్చుకొనుట మనం చూస్తూ ఉన్నా ఎందుకంటే ఎవరు ఇవ్వనటువంటి గొప్ప సమాధానం పేతురు మాత్రమే ఇచ్చారు కాబట్టి అతడిని ఏసుప్రభు మెచ్చుకుంటున్నారు. తనమీద రాతి సంఘమును నిర్మిస్తాను అని కూడా ప్రభువు పలికారు. కానీ ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు తన యొక్క సిలువ శ్రమల గురించి చెప్పినటువంటి సందర్భంలో పేతురు గారు ఇవి మీకు సంభవింపకుండునుగాక అని దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధముగా ఆయన మాట్లాడుచున్నారు

ఏసు ప్రభు పేతురు గారితో ఛీ!పో! సైతాను అని కోప్పడుచున్నారు ఎందుకంటే పేతురు యొక్క మాటలు మెస్సయ్య యొక్క పనికి ఆటంకముగా ఉన్నవి. ఏసుప్రభువును గురించి ఇంకా శిష్యులకు ఒక పూర్తి అవగాహన రాలేదు అందుకని ఆయనను ఒక పొలిటికల్ మెస్సయ్యగానే అర్థం చేసుకుంటున్నారు రోమీయులను జయించి పాలస్తీనా ప్రజలకు విముక్తిని కలగచేస్తారు అని వారి యొక్క ఆలోచనలు అందుకని ఆయనకు ఇలాంటి మరణము సంభవించకూడదు అని పేతురు గారు ఏసుప్రభుతో సిలువ శ్రమలు మీకు సంభవింపకూడదు అని పలుకుచున్నారు. అందుకనే ఏసుప్రభు మనుష్యకుమారుడు సిలువ శ్రమలో అనుభవించకపోతే రక్షణ కలగదు అని తెలుపుచున్నారు.

చాలా సందర్భాలలో మనం కూడా పేతురు గారి వల్లే శ్రమలు మనకు వద్దు అని భావిస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా సంతోషాన్ని కోరుతూ ఉంటాం. కష్టం విలువ తెలియని సంతోషం విలువ కూడా తెలియదు. గోధుమ గింజ భూమిలో పడి నశించకపోతే అది మొక్కగా ఎదగలేదు అలాగే మనం కూడా కష్టాలు అనుభవించకపోతే సంతోషం యొక్క అంతరార్థం గ్రహించలేము.

 క్రీస్తు ప్రభువు ఎవరైతే తన యొక్క నిజమైన శిష్యులుగా ఉండాలి అనుకుంటున్నారో వారు మూడు లక్షణాలు కలిగి ఉండమని చెప్పుచున్నారు.

 మొట్టమొదటిగా తనను అనుసరించేటటువంటి తమ్ముతాము పరిత్యజించుకోమంటున్నారు. పరిత్యజించుట అంటే విడిచిపెట్టుట అనగా లోక సంబంధమైన ఆశలను, కోరికలను, స్వార్థమును అధికారమును, పక్కన పెట్టేసి దేవుని చిత్తము కొరకు త్యాగపూరితమైన జీవితం జీవించాలని ప్రభువు కోరుతున్నారు. ఏది అయితే దేవుని యొక్క పనికి ఆటంకం గా ఉంటుందో దానిని మనము విడిచిపెట్టటకు సిద్ధపడాలి కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి తల్లిదండ్రుల ప్రీతి కావచ్చు స్నేహితుల ప్రీతి కావచ్చు బంధుమిత్ర కావచ్చు అధికార ప్రతి కావచ్చు వీటన్నిటిని కూడా విడిచిపెట్టినప్పుడే క్రీస్తు ప్రభువుని వెంబడించగలం.

రెండవదిగా తనను అనుసరించే శిష్యులు సిలువను ఎత్తుకొని రమ్మంటున్నారు. సిలువ క్రైస్తవ జీవితంలో శ్రమలకు, అవమానాలకు గుర్తు రక్షణకు గుర్తు, నిందలకు గుర్తు, ఏసుప్రభువుని వెంబడించే వారందరు కూడా సిలువను ఎత్తుకొని రమ్మంటున్నారు అంటే ఎవరు కూడా తమ యొక్క బాధలను అవమానాలను కష్టాలను విడిచిపెట్టకుండా వాటన్నిటినీ చేకొని ప్రభువుని వెంబడించమని కోరుతున్నారు

అనేక సందర్భాలలో మన జీవితంలో సిలువను వదిలి వేస్తుంటాం కానీ క్రీస్తు ప్రభువు తన శిలువను ఎత్తుకొని మనందరి పాపాలు మోస్తూ కల్వరి కొండమీద తన ప్రాణములను త్యాగం చేసి మనకు రక్షణ ప్రసాదించి ఉన్నారు. అదే విధముగా ప్రతి ఒక్కరు కూడా సిలువను ఎత్తుకొని క్రీస్తు ప్రభువుని వెంబడించాలి కొన్నిసార్లు సిలువ భారం కష్టముగా ఉండవచ్చు అయినప్పటికీ కూడా దేవుని యొక్క సహాయంతో దానిని మోయాలి.

మూడవదిగా క్రీస్తు ప్రభువు యొక్క శిష్యులకు ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఆయనను అనుసరించుట. అనుసరించుట అంటే కేవలం మనకు నచ్చినది మాత్రమే పాటించుట కాదు యేసు క్రీస్తు ప్రభువు తన జీవితములో ఏది అయితే పాటించి జీవించి ఉన్నారు అదేవిధంగా మన జీవితంలో కూడా ఆయన మార్గములో నడుస్తూ ఆయన బోధించిన అంశములను పాటిస్తూ మనము ఒక ఆదర్శవంతమైన జీవితము జీవించాలి. ఏసుప్రభుని అనుసరించేటప్పుడు మనకు శోధనలు ఎదురవుతూ ఉంటాయి కానీ వాటన్నిటిని ఎదుర్కొని ప్రభువుని వెంబడించాలి.

అదే విధముగా ఈనాటి సువిశేషంలో యేసుప్రభు ఎవరైతే తన ప్రాణములను కాపాడుకోవాలని అనుకుంటున్నారో వారు దానిని కోల్పోతారంటున్నారు కానీ తన కొరకు ప్రాణములను సమర్పించేవారు దానిని పొందుతారని పలుకుచున్నారు అంటే విశ్వాస పరముగా ఎటువంటి భయము కూడా లేకుండా దేవుని కొరకు జీవించేవారు ఆయనలో ఎల్లప్పుడూ కూడా జీవిస్తూనే ఉంటారని తెలియచేస్తున్నారు. కొన్నిసార్లు కొంతమంది తమ యొక్క స్వార్థం కోసం విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి సైతం సిద్ధంగా ఉంటారు వారికి ప్రభువు చెప్పేది ఏమిటంటే తమ ప్రాణాలు కాపాడుకోవడానికి విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారు కాబట్టి వారి జీవితమును కోల్పోతారు, దేవుని యొక్క కనికరమును కోల్పోతారు అని తెలుపుచున్నారు. ఈరోజు ప్రభువు మనందరినీ కూడా పఠణాల ద్వారా ఆహ్వానిస్తూ నేర్చుకోమని పలికేటటువంటి అంశములు ఏమిటంటే మన విశ్వాస జీవితంలో దేవునికి సాక్షియ జీవించే తరుణంలో కష్టాలు బాధలు అనుభవించవచ్చు సందర్భంలో దేవుడిని విడిచిపెట్టకుండా నిందించకుండా ప్రభువుని అనుసరించాలి. ఉత్తమ శిష్యులుగా జీవించాలి.

Fr. Bala Yesu OCD

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...