18, మే 2024, శనివారం

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ 
అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23
ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు పండుగను వివిధ రకాలుగా పిలవవచ్చు శ్రీ సభ ప్రారంభమైన రోజు అని, పవిత్రాత్మ శిష్యులపై వేంచేసిన రోజు అని, క్రీస్తు నాధుడికి సాక్షులుగా జీవించమని కోరినటువంటి రోజు. 
పెంతుకోస్తు అనేటటువంటి పదము గ్రీకు భాష నుండి వచ్చినది గ్రీకు భాషలో దీనిని pentekoste అని అంటారు అనగా 50వ రోజు అని అర్థం.
పవిత్ర గ్రంథములో పవిత్రాత్మను వివిధ రకాల చిహ్నాలతో పోల్చుతారు; అగ్నితో, పావురంతో, గాలితో, నీటితో..
పెంతుకోస్తు యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఈ పండుగ ఒక ప్రధానమైన పండుగ. యూదులకు మూడు ముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నాయి. మొదటిగా పాస్కా పండుగ, రెండవదిగా పెంతుకోస్తు పండగ, మూడవదిగా గుడారాల పండుగ. ఈ మూడు పండుగలను వారు తప్పనిసరిగా చేసుకునేటటువంటి వారు. యెరుషలేముకు దాదాపు 20 మైళ్ళ దూరం ఉన్నటువంటి ప్రతి మగవారు యెరుషలేముకు వచ్చి ఈ మూడు పండుగలను తప్పనిసరిగా జరుపుకునేవారు.
ఈ మూడు పండుగలు వ్యవసాయానికి సంబంధించినటువంటి పండుగలు. 
పాస్కా పండుగ ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన సందర్భంలో వారి యొక్క విముక్తిగాను, స్వేచ్ఛకుగాను గురుతుగా ఈ పండుగను జరుపుకునేవారు.  ఇజ్రాయిల్ ప్రజలు దేవుడు మోషే ద్వారా సినాయి పర్వతం దగ్గర ఇచ్చిన 10 ఆజ్ఞలకు సూచనగా ఉన్న అంశమును బట్టి పెంతుకోస్తు పండుగ జరుపుకునేవారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యం నుండి బయలుదేరి సీనాయి పర్వతం దగ్గరకు చేరినప్పుడు దాదాపు అది 50వ రోజు, ఆ రోజే దేవుడు వారికి ఈ ఆజ్ఞల పలకను ఇచ్చారు. ఇశ్రాయేలీయులు పెంతుకోస్తు పండుగను సీనాయి సంఘటనను సూచించే పండుగా జరుపుకునేవారు. 
ఇక గుడారాల పండుగ అనేది ఇజ్రాయేలు ప్రజలు పాలస్తీనా దేశం చేరకముందు గుడారాల్లో నివసిస్తూ ఎడారిలో సంచరించిన కాలాన్ని సూచించే పండుగ జరుపుకోవడం ఆరంభించారు.
ఈ మూడు కూడా వ్యవసాయానికి సంబంధించినవి. ఈరోజు పెంతుకోస్తు పండుగ అనగా దేవునికి కృతజ్ఞత తెలిపేది కోతకాలమైన ఏడు వారాల తర్వాత దేవునికి కృతజ్ఞతలు తెలిపేవారు, దేవుడిచ్చిన పంటకు గాను మరియు ఆయన చేసిన అద్భుత కార్యములకు గాను కృతజ్ఞతలు తెలియజేసేవారు. ఈ పండుగ రోజున పండిన గోధుమ పంటను దేవునికి ప్రజలు అర్పించేవారు.మరియ తల్లి గర్భం ధరించే సందర్భంలో పవిత్రాత్మ ఆమెపై వేంచేశారు.
- ఏసుప్రభు జ్ఞాన స్నానం పొందినప్పుడు పవిత్ర ఆత్మ ఆయన మీద వేంచేశారు.
- శిష్యులు ప్రార్థించే సమయంలో వారి మీదకు పవిత్రాత్మ వేంచేసారు.
నూతన నిబంధన గ్రంథంలో పెంతుకోస్తు రోజున శిష్యుల యొక్క జీవితంలో ఒక మహాత్తరమైన కార్యము జరిగింది ఏమిటంటే వారు పవిత్రాత్మను పొందారు. 
పెంతుకోస్తు రోజున జరిగిన కార్యములు.
1. శిష్యుల మీదకు మరియు తల్లి మీదకు అగ్ని నాలుకలు వలే పవిత్రాత్మ  వేంచేశారు.
2. భయంతో ఉన్న శిష్యులు ధైర్యముతో నింపబడ్డారు. 
3. శిష్యులు సువార్త ప్రకటింపగా అన్యులు తమ సొంత భాషల్లో వారిని వినసాగారు. 
4. తొలి క్రైస్తవులు దేవునికి గట్టి సాక్షులుగా తయారయ్యారు.
పవిత్రాత్మ దేవుడు చేయు పనులు 
1. మనం దేవుని యొక్క ఆలయం అని తెలుపుతూ మనలో జీవిస్తారు. (1 కొరింతి 3:16)
2. మనకు ధైర్యం ఇస్తూ, బలపరస్తారు. ( అపో 1:8, 4:8)
3. మనల్ని దివ్య సంస్కారాల ద్వారా పవిత్ర పరుస్తారు. 
4. మనకు బోధిస్తారు 
5. మన యొక్క ప్రార్థన ఆలకిస్తారు 
6. మనకు వరములను దయ చేస్తారు. (1 కొరింతి 12:7, 11)
7. మన తరుపున న్యాయవాదిగా పోరాడుతారు. 
8. మనకు ఫలములను దయచేస్తారు.
9. ప్రార్థించుటకు సహాయం చేస్తారు. (రోమి 8:26-27)
10. మనల్ని నడిపిస్తారు (గలతి 5:16, 25, అపో 8:29, 13:2, 15:7, 9, రోమి 8:14)
11. దేవుని విషయంలుఅర్థం చేసుకొనుటకు సహాయపడతారు. ( అపో 13:2)
12. మనల్ని ప్రేమిస్తారు (రోమి 15:30)
13. మనం సాక్ష్యమిచ్చేలా సహాయపడతారు (యోహాను 15:26).
14. మనల్ని వెదకుతారు ( 1 కొరింతి 2:11)
ఇంకా పవిత్రాత్మ చేయు పనులు అనేకములు ఉన్నవి అయితే ఈరోజు మనం గుర్తుంచుకోవలసిన అంశం ఏమిటి అంటే పవిత్రాత్మకి అనుగుణంగా జీవించాలి. పవిత్రాత్మ ఏ విధముగా  శిష్యులను నడిపించారో అదేవిధంగా మనలను కూడా నడిపించుట నిమిత్తమై సిద్ధంగా ఉన్నారు కాబట్టి పవిత్రాత్మ స్వరమును ఆలకిస్తూ, నడుచుటకు ప్రయత్నం చేద్దాం.

Fr. Bala Yesu OCD

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...