13, ఏప్రిల్ 2024, శనివారం

పాస్కా 3 వ ఆదివారం

పాస్కా 3 వ ఆదివారం 
అపో 3:13-15,17-19, 1 యోహాను 2:1-5, లూకా 24:35-48
ఈనాటి దివ్య పఠణములు యేసు ప్రభువు యొక్క పునరుత్థానము నందు విశ్వాసం ఉంచి హృదయ పరివర్తనము చెంది జీవించాలి అని తెలియజేస్తున్నాయి. ఏసుప్రభు పునరుత్థానమై ఇది మూడవ ఆదివారం. ఆయన పునరుత్థానము అయిన తర్వాత  అనేక సందర్భాలలో శిష్యులకు దర్శనమిస్తూ, విశ్వాసులకు దర్శనమిస్తూ వారి యొక్క విశ్వాస జీవితమును బలపరుస్తూ ఉన్నారు.
ఈనాటి మొదటి పఠణంలో పేతురు గారు అందరి సమక్షంలో యెరుషలేములో సొలోమోను మండపం వద్ద  ధైర్యంగా చెప్పిన గొప్ప ప్రసంగం గురించి చదువుకున్నాం. పేతురు గారు కుంటివానికి స్వస్థత నిచ్చిన తర్వాత చేసిన బోధన ఈ రోజున విన్నాము.  పేతురు గారు యూదులకు యావే దేవునితో ఉన్నటువంటి గొప్ప సంబంధం గురించి తెలుపుచూ ఆ యొక్క బంధం ఈనాటికి కూడా ఏసుప్రభు ద్వారా కొనసాగించబడు చున్నదని తెలిపారు.  వారికి(యూదులకు) విశ్వాసం ఉన్నప్పటికీ లేనప్పటికీ  ఆయన మాత్రము దేవుని కుమారుడు అని తెలిపారు. ఈ మొదటి పఠణంలో పేతురు యూదులను ఉద్దేశించి చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే వారు నీతిమంతుడు, పవిత్రుడైన యేసు ప్రభువును నిరంకుశముగా శిక్షించారు అవమానపాలు చేశారు అలాగే మరణ దండనకు గురి చేశారు. ఆ సందర్భంలో అక్కడున్నటువంటి వారందరు  చేసినటువంటి పాపమును పేతురు గారు తెలుపుతూ, హృదయ పరివర్తనము చెందమని కోరారు. ఈ సందర్భంలో రెండు విషయాలు మనము అర్థం చేసుకోవాలి మొట్టమొదటిగా పాపము నుండి హృదయ పరివర్తనము చెందుట. రెండవదిగా దేవుని చెంతకు మరలిరావడం.
- పేతురు గారు యూదులు చేసినటువంటి పెద్ద తప్పిదమును ఖండించుటకు వెనుకంజ వెయ్యలేదు. ఆనాడు ఏ విధముగానయితే తప్పు చేసినటువంటి దావీదును సరి చేయుటకు నాతాను ప్రవక్త వెనుకంజ వేయలేదో, ఆహాబు చేసిన తప్పును ఖండించుటకు ఏలియా వెనుకంజ వేయలేదో, హేరోదు చేసిన తప్పును సరిదిద్దుటకు బప్తిస్మ యోహాను వెనుకంజ వేయలేదో అదేవిధంగా పేతురు గారు కూడా ధైర్యంతో చేసినటువంటి తప్పును సరిదిద్ధారు. జీవనకర్తను మీరు చంపి ఉన్నారు అని చాలా గట్టిగా  బోధించారు. ప్రభువు యొక్క పునరుత్థాన అనుభూతి మరియు పెంతుకోస్తు అనుభూతి శిష్యులకు బలమును, శక్తిని, మాటలను, అద్భుతములు చేయు శక్తిని దయచేశాయి అందుకనే వారు గొప్పగా పునరుత్థాన సందేశమును అందరికీ తెలియజేస్తూ వారి విశ్వాస జీవితాలను సరి చేస్తున్నారు.
- ప్రజలు(యూదులు )మంచి కోరుకొనుటకు బదులుగా చెడును ఆశించారు అనే అంశము కూడా పేతురు గారు స్పష్టంగా తెలియజేశారు ఎందుకంటే దొంగవాడు, అంతకుడైనటువంటి బరబ్బను విడుదల చేయమని కోరారు కానీ ఎటువంటి తప్పు చేయని నీతిమంతుడైన యేసు ప్రభువుని విడుదల చేయమని ఎవరు కోరలేదు దానికి బదులుగా ఆయనను మరణశిక్షకు గురి చేయమని పలికారు. కొన్ని కొన్ని సందర్భాలలో మన జీవితంలో కూడా మనం కూడా ఇతరులను నాశనం చేయుట కొరకు మన శత్రువులతోనైనా కలవడానికి ప్రయత్నం చేస్తాము. మంచిని ఎన్నుకొనటానికి బదులుగా చెడుని ప్రేమిస్తూ చెడు వైపు వెళ్తాం అది మన జీవితంలో చేసే పెద్ద తప్పు. హేరోదు ఏసుప్రభును చంపుట కొరకు శత్రువైన పిలాతుతో కలిశాడు దానివల్ల పాపం చేశారు. చాలా మంది యూదులు కూడా చేసినది ఇలాంటి తప్పే ఏసుప్రభుకు బదులుగా బరబ్బను విడుదల చేయమని అడిగారు. ఈ విధముగా వారు చేసినటువంటి తప్పులు తెలియజేస్తూ పేతురు గారు వారిని పాపమునుండి హృదయ పరివర్తనము చెందమని కోరారు.
- పాపము నుండి హృదయ పరివర్తనం చెందాలి. హృదయ పరివర్తనం అంటే కేవలం పశ్చాత్తాప పడటం మాత్రమే కాదు పూర్తిగా విడిచి పెట్టడం కూడా. పూర్తిగా మన పాపపు క్రియలు విడిచి పెట్టినప్పుడు మాత్రమే మనము హృదయ పరివర్తన చెందిన విధంగా పరిగణించబడతాం అప్పుడు మాత్రమే మన యొక్క పాపములు క్షమించబడతాయని పేతురు గారు తెలుపుచున్నారు. మరి ఈరోజుల్లో మనందరం కూడా మనల్ని సరిదిద్దునప్పుడు ఎలాంటి హృదయంతో తీసుకోగలుగుతున్నాం. హృదయ పరివర్తనం చెందగలుగుతున్నామా? దేవుని వైపు మరలి వస్తున్నామా? లేక ఇంకా మనము కఠినంగానే పాపంలో జీవిస్తూనే ఉన్నామా? అని మనం ధ్యానం చేసుకోవాలి.
రెండవ పఠణంలో యోహాను గారు పాపము చేయవద్దు అని తెలుపుతున్నారు. మనము ఒకవేళ  బలహీనత వలన పాపము చేసినప్పటికీ మన తరుపున న్యాయవాది ఏసుప్రభు ఉన్నారని తెలిపారు. మనలను శిక్షకు గురి చేయకుండా తండ్రి యొక్క క్షమ పొందుకునేలాగా ఏసుప్రభు చేస్తారని యోహాను గారు తెలిపారు. 
యోహాను గారు మనము దేవుడిని ఎరిగి ఉండాలి అని కూడా తెలుపుచున్నారు అనగా దేవునికి విధేయత చూపుతూ ఆయన యొక్క ఆజ్ఞలను పాటించిన యెడల మనందరం కూడా దేవుడిని ఎరిగినవారంగా పరిగణించబడుతుంటాం. దేవుడిని తెలుసుకున్న వారు ఆయనకు విధేయత చూపుతారు ఎందుకంటే దేవుడిని తెలుసుకున్న వారికి ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పది, ఎంత విశాలమైనది, ఎంతో లోతైనది, ఆయన ఎంత కనికరం, త్యాగం ఎంత గొప్పవి అని అర్థం అవుతుంది. వాస్తవానికి దేవుడిని ఎరిగినటువంటి వారు సాధ్యమైన వరకు పాపములో పడిపోకుండా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తారు అని యోహాను గారు స్పష్టంగా తెలియజేశారు కావున మనము కూడా దేవుడి యొక్క ఆజ్ఞలను సంపూర్ణంగా పాటిస్తూ పాపములు పడిపోకుండా జీవించాలి. 
ఈనాటి సువిషేశ భాగంలో ఎమ్మావు మార్గములో పునరుత్థాన ప్రభువుని తెలుసుకున్న శిష్యులు మిగతా శిష్యులకు జరిగిన సంఘటనలను తెలియచేసే సందర్భంలో ఏసుప్రభు వారి మధ్య ప్రత్యక్షమై మరొకసారి వారికి ధైర్యం ఇస్తూ తాను 'నేనే' అని తెలియజేశారు. ఏసుప్రభు శిష్యులకు పదే పదే దర్శనము ఎందుకు ఇస్తున్నారు అంటే వారి యొక్క విశ్వాసాన్ని బలపరచుట కొరకు అదే విధంగా వారి ఆయనకు సాక్షులుగా ఉండబోతున్నారు కాబట్టి వారు చూసినది మొత్తం నిజము అని వారు గ్రహించినప్పుడే దానిని ఇతరులకు గట్టిగా తెలియచేయగలరు కావున వారికి దర్శనమిచ్చారు. శిష్యులు ఎప్పుడూ కూడా ఒక మరణించిన వ్యక్తి మరలా శరీరంతో తిరిగి రావటం చూడలేదు కాబట్టి వారు ఏసుప్రభు యొక్క పునరుత్థానం విశ్వసించుట కొంచెం కష్టం అందుకే ప్రభువు వారికి పదేపదే దర్శనం ఇచ్చి వారి యొక్క విశ్వాస జీవితాన్ని బలపరిచారు. వారు ఏసుప్రభుకు సాక్షులుగా ఉండబోతున్నారు కాబట్టి వారికి  దర్శనం ఇచ్చారు. ఏసుప్రభు యొక్క పునరుత్థానమునకు మనం కూడా సాక్షులుగా జీవించాలి.
Fr. Bala Yesu OCD

లూకా 17:11-19

 సమరియుని కృతజ్ఞత  యేసు సమరియా, గలిలియా ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగనే పదిమంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదు...