30, మార్చి 2024, శనివారం

క్రీస్తు పునరుత్థాన సందేశం

క్రీస్తు పునరుత్థాన సందేశం

ఈనాడు తల్లి శ్రీ సభ క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థాన పండుగను కొని ఆడుచున్నది. ఒక్కసారి ఊహించండి మీ యొక్క డబ్బు మొత్తం కూడా స్టాక్ మార్కెట్లో, బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి మీరు లాభాల కోసం ఎదురు చూసినప్పుడు నీకు ఎదురు దెబ్బ తగిలి, నష్టం వచ్చిందనుకోండి మన పరిస్థితి ఏమిటి? మీరు ఎంతగానో ఊహించి ఉండవచ్చు లాభాలు వస్తాయని, అభివృద్ధి చెందుతారని,  పేరు ప్రతిష్టలు పెరిగితాయని కానీ అవి ఏమీ జరగకుండా ఆశలు అడి ఆశలైనపుడు మనం ఏవిధంగా తట్టుకోగలం. నష్టాలు వచ్చినా లాభాలు తర్వాత వస్తాయని మనం అనుకుంటామా లేక కృంగిపోతామా అది ఒక ప్రశ్నార్ధకం. ఏసుప్రభు యొక్క శిష్యులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ఒక్కసారిగా అవన్నీ కూలిపోయాయి.  మ్రాని కొమ్మల ఆదివారం రోజున ఆయనను మెస్సయ్యగా, స్వేచ్ఛ నిచ్చే వానిగా, ప్రజలను రక్షించే వానిగా వారు గుర్తించి, ప్రభువును యెరుషలేము వీధుల్లో గొప్పగా గౌరవిస్తూ ఆహ్వానించుకుంటూ వచ్చారు కానీ పవిత్ర శుక్రవారం రోజున ఆయన వారి యొక్క ఆశలకు భిన్నంగా సిలువ మీద నిస్సహాయం స్థితిలో మరణించుట చూసి శిష్యుల యొక్క ఆశలు అంతా కూడా ఆవిరైపోయాయి. 
వాస్తవానికి మరణంతో జీవితం అంతం అవటం లేదు అలాగే మరణంతో జీవితం నాశనంమగుట లేదు. మరణం తర్వాత జీవితం ఉందని క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం తెలియజేస్తుంది. అదే శాశ్వత జీవితం. ఆయన మరణంతో అంధకారంగా మారిన భూమి క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం ద్వారా ప్రకాశిస్తుంది. ఏసుప్రభు మరణమును జయిస్తున్నారు. ఏసుప్రభు యొక్క పునరుత్థానం మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితానికి పునాది ఎందుకంటే ఆయన పునరుత్థానం అవ్వనిదే మన యొక్క విశ్వాసం వ్యర్థం అని అపోస్తులు పలుకుతున్నారు. ప్రభువు యొక్క పునరుత్థానము ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు.
1. ఖాళీ సమాధి. 
ఈ భూలోకంలో చాలా మంది మరణించారు కానీ వారిలో ఎవరి సమాధి కూడా ఖాళీగా లేదు. మతాలను స్థాపించిన వారు ఉన్నారు,సమాజంలో పేరు ఉన్నవారు ఉన్నారు, అద్భుతాలు చేసిన వారున్నారు, కానీ వారి యొక్క సమాధి ఏది కూడా ఖాళీగా లేదు కేవలం క్రీస్తు ప్రభువు యొక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉంది ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. 
ఈ యొక్క ఖాళీ సమాధిని చూసినప్పుడు మనము నేర్చుకోవలసిన అంశం ఏమిటి అంటే ఆ సమాధి ఖాళీగా ఉన్న విధంగా మన హృదయాలు దేవుని కొరకు ఖాళీగా ఉన్నాయా లేదా ఇంకా మన హృదయాలను పాపమును, ద్వేషమును, కోపములను, కక్షులను ఉంచుకొని మన యొక్క హృదయాలను నింపుకుంటున్నామా. ప్రభువు యొక్క పునరుత్థానం మనందరినీ తనతో నింపుకొనమని తెలియజేస్తూ ఉన్నది.
2. దేవుడిని వెదకే వారికి ప్రభువు చేరువులోనే ఉంటా రు. 
మగ్ధల మరియమ్మ ఏసుప్రభువును వెతుకుతూ సమాధి దగ్గరకు చేరుకున్నది కాబట్టే ఆమెకు దేవుడు మొదటిగా దర్శనం ఇస్తున్నారు. ఆమె ఎంతగా దేవుడు ఎడల భక్తి, విశ్వాసము, ప్రేమ కలిగి ఉంటే అంతగా తెల్లగా తెల్లవారకముందే, తొలికోడి కోయకముందే పరిగెత్తుతూ ప్రభువు సమాధి వద్దకు వెళుతుంది ఆమె యొక్క నిస్వార్ధమైనటువంటి  వెతుకుటలో ప్రభు ఆమెకు దర్శనం ఇస్తున్నారు. ఎవరైతే దేవుని వెతుకుతూ వస్తూ ఉంటారు వారికి దేవుడు ఎప్పుడు దగ్గరగానే ఉంటారు. మరి మనం దేవుని వెతుకుచున్నామా, దేవుని సమీపిస్తున్నా మా? శిష్యులు కూడా ఏసుప్రభు కొరకు వెతుకుచున్నారు కాబట్టి వారికి కూడా దర్శనము ఇవ్వబడింది.
3. నూతన జీవం
పునరుత్థానం శిష్యుల యొక్క జీవితమును మార్చినది, మరీ ముఖ్యంగా పేతురు యొక్క జీవితమును మార్చినది ఎందుకనగా అప్పటివరకు కూడా భయంగా ఉన్నటువంటి పేతురు ఒక్కసారిగా ఏసుప్రభువు పునరుత్థానమయ్యారు అని తెలుసుకున్న తర్వాత వెంటనే ఆయన్ను కలుసుకొనుటకై పరిగెత్తుతూ వెళ్ళాడు ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. క్రీస్తు ప్రభువును ఏ విధంగానైనా చూడాలనుకున్నాడు అందుకని తెల్లవారుజామున సమాధి వద్దకు పరిగెడుతూ వస్తున్నారు.
4. నీవు కోల్పోయిన వ్యక్తి దగ్గరకు వెళ్ళటం
శిష్యులు, మగ్ధల మరియమ్మ వారి కోల్పోయినటువంటి గురువు దగ్గరకు వెళుతున్నారు. ఈ యొక్క తపస్సు కాలం ముగిసిన తర్వాత పునరుత్థానంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో మనము కూడా మన యొక్క మాటల వలన చాలా మందిని కోల్పోయివుంటాం కాబట్టి వారి దగ్గరికి వెళ్లి మనము వారితో సఖ్యపడాలి, కలిసిపోవాలి వారితో ఉండాలి.
5. సాక్షిగా ఉండుట
శిష్యులు మరియు మరదలా మరియ ఏసుప్రభు చూసిన తర్వాత ఆయన గురించి సాక్ష్యం చెబుతున్నారు జరిగిన విషయంలో మిగతా వ్యక్తులతో పంచుతున్నారు వారు ఏదైతే కనులారా చూశారో, తమ యొక్క జీవితంలో అనుభవించారు దానిని ఇతరులకు తెలియజేస్తున్నారు అదేవిధంగా మనం కూడా క్రీస్తు ప్రేమను తెలియజేయాలి.
ప్రభువు పునరుత్థానం, మనలో శాంతి సమాధానము తీసుకురావాలి అలాగే కృంగిపోయిన తర్వాత నిరాశ పడకుండా ముందుకు ఒక ఆశతో నమ్మకంతో వెళ్లడం నేర్చుకోవాలి.
Fr. Bala Yesu OCD

23, మార్చి 2024, శనివారం

మ్రాని కొమ్మల ఆదివారం

మ్రాని కొమ్మల ఆదివారం
యెషయా 50:4-7, ఫిలిప్పి 2:6-11, మార్కు 14:1-15,47
ఈనాడు తల్లి శ్రీ సభ మ్రాని కొమ్మల ఆదివారమును కొనియాడుచున్నది. ఏసుప్రభు యెరుషలేము పట్టణము వచ్చుచున్నాడని కొందరు విని ఆయనకు స్వాగతం పలకడానికి ఎదురెళ్ళారు. ఈ యొక్క మ్రాని కొమ్మల రోజు ఏసుప్రభు యొక్క జీవితంలో ప్రత్యేకమైనటువంటి రోజు ఒక విధముగా చెప్పాలంటే సంతోషకరమైన రోజు ఎందుకంటే ప్రజలు ఆయనను మెస్సయ్యగా గుర్తించి ఆయనకు ఘన స్వాగతం పలికారు. తమ యొక్క హస్తాలతో తాటి ఆకులను ధరించి ఏసు ప్రభువుకి ఎదురు వెళ్లి జయ జయ నినాదాలు తెలిపారు. ప్రజలందరూ ఏసుప్రభువును రాజుగా ఊహించుకుని, ఆయన వారికి స్వేచ్ఛనిస్తారు అని భావించారు. ఏసుప్రభువుకి ప్రజలు అంత ఘన ఆహ్వానం ఎందుకు పలికారంటే ఆయన యొక్క అద్భుత కార్యములు అదేవిధంగా ఆయన చూపించిన ఒక జీవిత నిదర్శనం(పేదవారి కొరకు పోరాడటం) ప్రజల జీవితంలో కొత్త ఆశలను నమ్మకాన్ని కలుగజేసినది. ప్రభువు పేదవారి పక్షమున పోరాడుట వలన అనేకమందిలో ఒక కొత్త నమ్మకం వచ్చినది. ఇతడు నిజముగా ప్రజల కోసం వచ్చారని ప్రజల సమస్యల నుండి కాపాడతారని వారి నమ్మకం అందుకే ఆయన రాజుగా చేయాలని ఆయనకు ఆహ్వానం పలికారు.
ఈనాటి పండుగను ఉద్దేశించి కొన్ని అంశములు ధ్యానం చేసుకోవాలి
1. ప్రవక్తల యొక్క ప్రవచనం నెరవేరినది.
మెస్సయ్య గాడిద పిల్ల మీద వస్తాడు అని ప్రవచనాలు తెలియచేయబడ్డాయి. జెకార్య 9:9. ఏసుప్రభు తన శిష్యులను పంపించి తన కొరకై ఒక ఇంటి యజమాని గాడిదను ఇవ్వమని అడగమని తెలిపారు (మార్కు 14.:13) ఆ యొక్క ఇంటి యజమానుడు కూడా శిష్యులు వచ్చి గాడిదను అడిగిన వెంటనే కట్టి ఉన్నటువంటి గాడిదను శిష్యులకి ఇస్తున్నారు ఎందుకంటే బహుశా ఆయన యేసు ప్రభువు యొక్క గొప్పతనం గురించి విని ఉండవచ్చు అందుకని వేరొక ఒక్క మాట మాట్లాడకుండా ఇది దేవుని కొరకు వినియోగించబడుతున్నది అని సంతోషముగా ఈ యొక్క గాడిదను శిష్యులకి ఇచ్చి పంపించారు.
ప్రభువు గాడిదను ఎన్నుకొనుట ఆయనకు ఇష్టం ఎందుకంటే పూర్వం గుర్రం కన్నా గాడిదలనే ముందుగా ప్రయాణాలకు వినియోగించేవారు( 2 సమూ13:29, 1 రాజులు 1:38). అదేవిధంగా పూర్వం రాజులు యుద్ధం చేయటానికి వెళ్లేటప్పుడు గుర్రం మీద వెళ్లేవారు కానీ ఎవరైతే శాంతిని నెలకొల్పాలనుకున్నారో వారు మాత్రము గాడిద మీద వెళ్లేవారు. ఏసుప్రభు మనలను తండ్రితో సమాధానపరుచుట కొరకే ఈ యొక్క గాడిద పిల్లను ఎన్నుకుంటున్నారు. గాడిదను ఎన్నుకొనుటకు కారణాలు
1. గాడిద శాంతికి గుర్తు
2. గాడిద ఎంత బరువునైనా మోయుటకు గుర్తు
3. గాడిద వినమ్రతకు గుర్తు
4. గాడిద యజమాని చెప్పినది చేయుటకు గుర్తు
5. గాడిద సేవకు గుర్తు
6. గాడిద బాధలు అనుభవించుటకు గుర్తు
పూర్వం చాలా మంది గాడిద మీద ప్రయాణం చేసి ఉన్నారు.
- సొలోమోను కూడా తన తండ్రి గాడిద మీద సింహాసనం అధిష్టించే రోజున వచ్చి ఉన్నారు.
1 రాజులు 1:38-41
- సౌలు కుమారుడు కూడా గాడిద మీదే వచ్చి ఉన్నారు 2 సమూ19:26
- ఏసుప్రభు తీసుకురమ్మన్న గాడిదను ఎవ్వరు ఎన్నడను వాడలేదు మొట్టమొదటిగా యేసు ప్రభువు మాత్రమే వాడుతున్నారు.
- ఏసుప్రభు ఈ యొక్క గాడిద పిల్లను విడుదల చేస్తున్నారు అప్పటివరకు కూడా అది కట్టి వేయబడినది అటు తరువాత ప్రభువు తన యొక్క ప్రమేయంతో విడుదల చేస్తున్నారు అదియే మన యొక్క జీవితంలో కూడా నెరవేర్చబడుతుంది పాపమునకు, వ్యసనములకు కట్టి వేయబడుచున్న మనలను దేవుడు తన యొక్క కుమారుడు యొక్క మరణము ద్వారా విముక్తులను చేస్తున్నారు కాబట్టి మనము దేవుని ప్రేమను గుర్తించి మారుమనస్సు పొందాలి.
2. హోసన్న అనగా-Save us now (ఇప్పుడు మమ్ము రక్షించు ప్రభు అని అర్థం) ఎలాంటి సందర్భంలో మనము ఇతరులను రక్షించమని అడుగుతాం?. మనలని మనము రక్షించుకోలేని సందర్భంలో అలాగే ఆపదలో చిక్కుకున్న సమయంలో మన యొక్క శక్తి సామర్థ్యం వలన సాధ్యము కాని విషయం తలంచుకున్నప్పుడు ఇతరుల యొక్క సహాయం కోరుతూ రక్షించమని అడుగుతూ ఉంటాం. ఏసుప్రభువు కాలంలో కూడా ప్రజలు ప్రార్ధించినది ఇదియే. ఇప్పటివరకు కూడా స్వేచ్ఛ లేకుండా బ్రతుకుచున్నటువంటి మమ్ములను రక్షించమని ప్రార్థిస్తున్నారు. వాస్తవానికి దేవునికి రక్షించమని ప్రార్థించిన ప్రతి వ్యక్తిని రక్షిస్తున్నారు.
- ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం లో ఉన్నప్పుడు మమ్ము రక్షించమని ప్రార్థించారు దేవుడు వారిని రక్షించారు. నిర్గమ 3:7
- ఇశ్రాయేలు ప్రజలు పాము కాటుకు గురైనప్పుడు రక్షించమని ప్రార్థించారు సంఖ్యా 21:7
- ఎస్తేరు తన ప్రజలను ఆపదనుండి రక్షించమని దేవునికి ప్రార్థించింది (ఎస్తేరు 4)
- భర్తిమయి అనే గుడ్డివాడు రక్షించమని ప్రార్థించారు. లూకా 18:38
- సిలువ మీద ఏసుప్రభు పక్కన ఉన్న దొంగ కూడా రక్షించమని ప్రార్థించారు. (లూకా 23:42)
ఇంకా చాలా సందర్భాలలో ప్రజలు రక్షించమని కోరినప్పుడు ప్రభువు తన ప్రజలను రక్షిస్తున్నారు. ఆయన యొక్క మరణము ద్వారా మనందరం కూడా రక్షించబడుతున్నాం.
3. ప్రభువు ముందు ఉండుట.
కేవలము మ్రాని కొమ్మల ఆదివారం రోజున యాజకుడు అందరికన్నా ముందుగా ప్రయాణమై పోవుతుంటారు. ఇది ఎందుకంటే దేవుడే మనకు ముందుండి అన్ని విషయాలలో నడుస్తారు. ఏసుప్రభు మనము అనుభవించేటటువంటి శ్రమలకు బదులుగా ఆయనే ముందుండి మన కొరకు అన్ని బాధలు పొందటానికి సిద్ధపడ్డారు. నిర్గమకాండంలో కూడా మనం చూస్తాం యావే దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు రాత్రి అగ్నిస్తంభముగా పగలు మేఘస్తంభంగా వారి ముందుండి నడిచారు. మనము అనుభవించవలసిన శ్రమలు మరణం నిందలు అవమానాలు అన్నీ కూడా ఏసుప్రభు మన కొరకై అనుభవించారు కాబట్టి ఈరోజు మనము ఆ ప్రభువు యొక్క ప్రేమను తెలుసుకొని మన జీవితంలను మార్చుకొనుటకు ప్రయత్నం చేయాలి. దేవుని ప్రేమ గొప్పది ఆ ప్రేమను అర్థం చేసుకొని మనం జీవించాలి.
Fr. Bala Yesu OCD

16, మార్చి 2024, శనివారం

తపస్సు కాలం ఐదవ ఆదివారం

తపస్సు కాలం ఐదవ ఆదివారం
యిర్మియ 31:31-34 హెబ్రీ 5:7-9, యోహాను 12:20-33

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు తన ప్రజలతో ఏర్పరచుకున్న నూతన ఒడంబడికను గురించి అదేవిధంగా ప్రభువు పొందబోవు మరణము గురించి తెలియజేస్తున్నాయి. ఏసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానమునకు దగ్గరవుతున్న వేళలో శ్రీ సభ మనమందరం ఆయన యొక్క మరణము, పునరుత్థానము గురించి ధ్యానించమని తెలుపుచున్నది.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు యిర్మియా ప్రవక్త ద్వారా తన ప్రజలతో ఏర్పరుచుకుంటున్న ఒక నూతన ఒడంబడిన గురించి తెలుపుచున్నారు. యిర్మియ ప్రవక్త క్రీస్తుపూర్వం 650 - 580  సంవత్సర మధ్యకాలంలో జీవించారు. ఆయన యొక్క పరిచర్య మొత్తం కూడా యెరూషలేములో జరిగినది. యిర్మియ ప్రవక్త ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడిని విస్మరించిన సందర్భంలో యూదుల మధ్య జీవించారు. యూదయ రాజ్యాన్ని అంధకారం ఆవరించినటువంటి సమయం అది. ప్రజలు పాపమునే ప్రేమించి దేవుడికి దూరమైన సందర్భంలో దేవుడు వారిని బాబిలోనియా  బానిసత్వమునకు పంపగా అక్కడ వారు జీవమును కోల్పోయిన విధముగా ఉన్న సమయంలో వారి బాధను చూసి దేవుడు, నూతన ఒడంబడిక ఏర్పరచుకుంటాన‌ని  తెలుపుచున్నారు. వాస్తవానికి ఎందుకు ఈ నూతన వడంబడిక? అని ధ్యానించినట్లయితే మనకు అర్థమయ్యే అంశము ఏమిటి అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మొదటి ఒడంబడిక నెరవేర్చుటలో విఫలమయ్యారు 2రాజలు దిన 36:14-16,21. అందుకే దేవుడు వారికి ఇంకొక అవకాశంను దయచేసి ఉన్నారు. ఇది ఆయన యొక్క మంచితనమునకు నిదర్శనం. పడిపోయినటువంటి తన ప్రజలు మరలా లేచి తనను అనుసరించాలి అన్నది ప్రభువు యొక్క కోరిక. అందుకని ఇంకొక ఒడంబడిక ద్వారా వారికి కొత్త జీవితం ఇస్తున్నారు. దేవుడు ప్రతి ఒక్కరి మార్పుకై అవకాశాన్ని ఇస్తూనే ఉంటూ ఉంటారు అందుకే ఆయన తన యొక్క సేవకులను పదేపదే వారి హృదయ పరివర్తనముకై పంపిస్తూ ఉంటారు. 
ఇశ్రాయేలు ప్రజలు దేవుడి యొక్క మాట ప్రకారంగా జీవించలేదు కాబట్టే ఆయన వారికి ఇంకొక అవకాశాన్ని దయచేసి ఒక నూతన క్షమించే ఒడంబడికను వారితో ఏర్పరచుకుంటున్నారు. పాత బడంబడిక రాతి పలక మీద దేవుని చట్టం రాయబడినట్లైతే, నూతన బడంబడిక ప్రతి ఒక్కరి యొక్క హృదయము మీద వ్రాయబడుతున్నది. రాతి పలక మీద రాసిన దేవుని చట్టం పగిలిపోవచ్చు, చెరిగిపోవచ్చు కానీ మానవుని యొక్క హృదయము మీద రాసినటువంటి దేవుని యొక్క చట్టము ఎన్నడూ మారదు, ఎవరూ కూడా దానిని ఎవరూ కూడా దానిని మన నుండి తీసివేయలేరు. ఇంతకుముందు  దేవుని చట్టం మనకు బయటగా ఉన్నది కానీ ఇప్పుడు మాత్రం దేవుని చట్టం మన హృదయాంతరంగంలోనే ఉన్నది ఆ చట్టం మనందరిని కూడా ప్రతినిత్యం ఎలా జీవించాలో? ఏమి చేయాలో ? అని ప్రేరేపిస్తూ ఉన్నది కావున ఇంకా ఎన్నడు మనము తప్పు చేయకుండా జీవిస్తాం. యిర్మియా ప్రవక్త యొక్క నూతన ఒడంబడిక  దేవుడు ఒక కొత్త జీవితానికి సూచనగా ఉన్నది అలాగే ఈ నూతన ఒడంబడిక యెహెజ్కేలు( 16:26-27)గ్రంథములో ఉన్న నూతన హృదయమును సూచిస్తున్నది దేవుడు మానవులలో ఉన్నటువంటి కఠిన హృదయమును తీసివేసి మాంసపు ముద్ద కలిగిన హృదయాన్ని దయచేస్తానని అంటున్నారు అనగా ప్రతి ఒక్కరికి కొత్త జీవితాన్ని దయచేస్తానంటున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో ఏసుప్రభు ఏ విధంగా తండ్రికి విధేయత చూపించి ఉన్నారో తెలియచేయబడినది. ఆయన తండ్రితో అన్నిటిలో సరిసమానమైనప్పటికీ కూడా ఆయన చిత్తమును ఈ భూలోకములో ఎంత కష్టమైనా నెరవేర్చి ఉన్నారు.
ఈనాటి సువిశేష భాగములో యేసు ప్రభువు మనము జీవించాలి(పవిత్రముగా దేవునితో) అంటే మరణించాలి అని (పాపానికి)  చెబుతున్నారు. కొందరు గ్రీకులు యేసు ప్రభువుని చూడటానికి వచ్చిన సందర్భంలో ఫిలిప్పుతో ఏసుప్రభు ని చూడాలి అని అడిగిన వేళ ఫిలిప్పు అంద్రెయ్యతో వారు ప్రభువుని చూడాలని తెలిపాడు. ప్రభువు దానికి గాను మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది అని తెలిపారు అదేవిధంగా ఏసుప్రభు ఈ విధంగా అంటున్నారు మనిషి కుమారుడు పైకి ఎత్తబడినప్పుడు అందరూ ఆయన వద్దకు ఆకర్షితులవుతారని అన్నారు. ఆయన మరణించక ముందే జ్ఞానానికి ప్రసిద్ధిగాంచినటువంటి గ్రీకు దేశస్తులే ఆయన యొక్క గొప్పతనమును చూడాలని ఏసుప్రభు చెంతకు వస్తున్నారు బహుశా వారు యూదా మతమును అనుచరించుటకు హృదయ పరివర్తనము చెందినటువంటివారై ఉండవచ్చు లేదా ఏసుప్రభు యొక్క గొప్పతనం విని ఆయనను చూడాలని అనుకుని ఉండవచ్చు. ఇది చాలా గొప్పదైన విషయం జ్ఞానులు సైతం దేవుడిని గుర్తించి ఆయన దగ్గరకు రావడం. ఈ యొక్క సందర్భంలో ఏసుప్రభు గోధుమ గింజ భూమిలో పడి నశించనంతవరకు అది అట్లే ఉండును కానీ నశిస్తే దాని నుండి కొత్త జీవము పుట్టును అని తెలిపారు. ఇక్కడ విత్తనము నశించితేనే తప్ప కొత్త జీవితం రావటం లేదు అదే విధంగా విత్తనము తనను తాను త్యాగం చేసుకుని మొక్కకు జన్మనిస్తుంది, ఉప్పు కూడా తనను తాను కరిగిపోతూ ఇతరులకు రుచిని అందజేస్తూ ఉన్నది అలాగే కొవ్వొత్తి కూడా  తాను కరిగిపోతూ ఇతరులకు వెలుగునిస్తుంది. 
వాస్తవానికి మనందరం కూడా నశించాలి. నశించుట అంటే మన యొక్క పాత జీవితానికి, 
- పాపపు జీవితానికి,
- స్వార్థానికి
- కోపానికి
- అసూయలకు
- సుఖ భోగాలకు
- ఈ లోక సంబంధమైన వాంఛలకు
- చెడు వ్యసనాలకు మనము మరణించినట్లయితే అప్పుడే మనలో కొత్త జీవితం కలుగుతుంది.
అదేవిధంగా ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు మన అందరిని కూడా ఆయనకు సాక్షులుగా ఉండమని తెలుపుచున్నారు. తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్యజీవమునుకై కాపాడుకొనును, నన్ను సేవింప గోరువాడు నన్ను వెంబడింపవలెను అని క్రీస్తు ప్రభువు తెలియచేశారు అనగా మన యొక్క జీవితం క్రీస్తు జీవితం వలే త్యాగ పూరితమైన జీవితంలా ఉండాలి.

Fr. Bala Yesu OCD

9, మార్చి 2024, శనివారం

తపస్సుకాలం నాలుగవ ఆదివారం

తపస్సుకాలం నాలుగవ ఆదివారం
2 రాజుల దినచర్య 36:14 -16, 19-23, ఎఫేసి 2:4-10, యోహాను 3:14-21
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని యొక్క దయార్ధ హృదయము గురించి తెలియజేయుచున్నవి. దేవుడు రక్షణను అందరికీ దయచేసి ఉన్నారు, తన యొక్క కుమారుడు యొక్క మరణ, పునరుత్థానము ద్వారా అయితే మన యొక్క రక్షణ నిమిత్తమై ప్రతినిత్యం మనందరం కూడా కృషి చేయాలి. ప్రభువు మనందరికీ కూడా రక్షణ ఉచితముగా ఇచ్చి ఉన్నారు అనే సత్యం తెలుసుకొని మనము కూడా ఆయనకు విశ్వాసపాత్రులుగా జీవించాలి. ఈ తపస్సు కాల నాలుగు ఆదివారాన్ని Gaudate Sunday అని పిలుస్తారు అనగా ఆనందించు ఆదివారము అని అర్థం. ప్రభువు యొక్క పునరుత్థానము దగ్గరలో ఉన్నది కాబట్టి మనందరం సంతోషించాలి.
ఈనాటి మొదటి పఠణంలో దేవుని యొక్క దయ గురించి తెలుపుచున్నారు అదేవిధంగా దేవుని యొక్క సహనం గురించి తెలుపుతున్నారు. రాజుల దినచర్య రెండవ గ్రంథము ఇశ్రాయేలు ప్రజల యొక్క మొదటి రాజు సౌలు రాజు దగ్గర నుండి (1030 B.C), యూదా ప్రజలు బాబిలోనియా (550) బానిసత్వము గురించి తెలుపుచున్నది. మొదటి రాజు దగ్గర నుండి బానిసత్వం వరకు కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా వారికి తోడై దీవించి వారి నడిపించారని తెలుపుచున్నది అదే విధముగా బానిసత్వం అనేది వారి యొక్క పాపము జీవితమునకు శిక్షగా దేవుడు వారికి ఇస్తున్నారు. యూదులు ఇతర ప్రజల నుండి ఆ గౌరవప్రదమైన ఆచారాలు నేర్చుకున్నారు. ఈరోజు విన్న ఈ భాగంలో ఏ విధముగా ఇస్రాయేలు ప్రజలు దేవుని నివాస మైనటువంటి యెరుషలేము దేవాలయమును, సొంత భూమిని కోల్పోయినటువంటి అంశమును చదువుకుంటున్నాము. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవాలయమునకు ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతను ఇవ్వలేదు ప్రభువు యొక్క పవిత్ర మందిరమును అమంగళము చేశారు. ఇది వారి యొక్క పాపపు జీవితమునకు, గర్వమునకు నిదర్శనం. దేవుడిని కాదని అన్య దైవముల వెంట వెళుతూ వారు ఈ యొక్క పాపపు క్రియలకు పాల్పడ్డారు. వారు ఎంత పాపం చేసినప్పటికీ దేవుడు మాత్రము వారి యొక్క హృదయ పరివర్తన నిమిత్తమై ప్రవక్త తర్వాత ప్రవక్తలను పంపుచున్నారు ఇది ఆయన యొక్క దయార్ధ హృదయమునకు నిదర్శనముగా ఉంటుంది ఆయన వారు మారాలనుకున్నారు కాబట్టి వారి కొరకు ప్రవక్తను పంపిస్తున్నారు. కొన్ని సందర్భాలలో ప్రజలు హృదయ పరివర్తనం చెందనప్పుడు వారిని శిక్షిస్తున్నారు, చెందినప్పుడు వారిని దీవిస్తున్నారు. ఈ యొక్క శిక్ష సరిదిద్దుటకే కానీ నాశనం చేయటానికి కాదు. ఆయన శిక్షలో ప్రేమ ఉంది ఆయన కోపములో అనురాగం ఉంది ఆయని యొక్క ప్రేమ, కరుణతో కూడుకున్నటువంటి ప్రేమ. ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి పారశీక దేశ రాజు అయిన సైరస్ ద్వారా ఇశ్రాయేలు ప్రజలను విముక్తులను చేస్తున్నారు వారు మరొకసారి సొంత భూమికి వెళ్లి, సొంత దేవాలయమునకు దేవాలయమును తిరిగి నిర్మించుటకు అవకాశము దయ చేస్తున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో కూడా దేవుని యొక్క కృప అపారమైనది అని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆయన మన పట్ల చూపిన ప్రేమ అమితమైనది అని తెలుపుతున్నారు. కేవలము దేవుని యొక్క కృప వలన ద్వారానే మనందరం కూడా రక్షించబడుతిమి. మనందరం కూడా క్రీస్తు ప్రభువుతో ఐక్యమై జీవించినట్లయితే దేవుని యొక్క రాజ్యములో, మనము ప్రభువుతో పాటు కూర్చుండ చేస్తారు. పౌలు గారు ఇదంతా కూడా దేవుడు మానవునికి ఉచితంగా ఇచ్చినటువంటి బహుమానం కాబట్టి ఆయన ఇచ్చిన వరమును మనము ఎప్పుడూ కూడా సద్వినియోగపరచుకుని జీవించాలని పలికారు.
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు నికోదేముతో సంభాషించిన అంశము గురించి తెలుపుచున్నది. నికోదేము ఒక ధనవంతుడు, పరిసయ్యుడు. ఆయనకు ఏసుప్రభు నందు విశ్వాసము ఉన్నది అందుకు కాబట్టే పరలోక సంబంధమైనటువంటి అంశములను గురించి చర్చించారు. నికోదేము ఏసుప్రభు తో సంభాషించేటప్పుడు ప్రభువు రక్షణము గురించి తెలియజేస్తున్నారు.
మోషే ప్రవక్త ఎడారిలో ఏ విధముగానైతే సర్పము నెత్తి ఉన్నారో ఆ సర్పమును చూసినటువంటి వారందరూ కూడా రక్షించబడితిరి. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4-9 వచనాలలో చదువుకునేది ఏమిటంటే ఇజ్రాయేల్ ప్రజలు మోషే ప్రవక్తకు దేవునికి విరుద్ధముగా మాట్లాడిన సందర్భంలో దేవుడు వారిని పాము కాటు ద్వారా శిక్షిస్తున్నారు. వారిని రక్షించుట నిమిత్తమై మరొకసారి దేవుడు మోషేను కంచు సర్పము చేయమని తెలుపుచున్నారు. ఈ యొక్క కంచు సర్ఫము వైపు ఎవరైతే పశ్చాతాపముతో చూస్తారో వారందరూ కూడా రక్షించబడుతారు అని ప్రభువు తెలుపుతున్నారు, వారు పశ్చాతాపంతో చూసిన విధముగానే రక్షింపబడ్డారు. అదే విధముగా ఏసుప్రభువు కూడా ఎత్తబడిన సందర్భములో మనందరం కూడా ఆయన యొక్క సిలువను చూసి పశ్చాతాపబడినప్పుడు మనము కూడా రక్షించబడతాము. ఆ సిలువ నాథుడు మనందరి యొక్క రక్షణకు కారణం అవుతారు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించారు కాబట్టి ఆయన మన మీద ఉన్నటువంటి ప్రేమవలన బారమైనటువంటి ఆ శిలువను మోసుకుని వెళ్లారు. ఆయన మనలను రక్షించుటకే వచ్చారు కానీ ఖండించుటకు రాలేదు కాబట్టి మనము కూడా ఆ యొక్క సిలువను చూస్తూ హృదయ పరివర్తనం చెందుతూ జీవించాలి. ఏసుప్రభును విశ్వసించేవారు ఖండింపబడరు కానీ ఎవరైతే విశ్వసింపరు వారు ఖండించబడి ఉన్నారు అని తెలుపుతున్నారు. ప్రభువు యొక్క శిలువను చూస్తూ ఆయన విశ్వసిస్తే ఆయన మన మీద చెప్పిన కరుణను ప్రేమను దయను మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క అనుదిన జీవితాల్లో కూడా ఇవి పాటించేలాగా మనం మారాలి అలాగే దేవుడు యొక్క వెలుగును మనందరం కూడా కలిగి ఆ వెలుగును ఇతరులకు పంచాలి.
Fr. Bala Yesu OCD

2, మార్చి 2024, శనివారం

తపస్సు కాలం మూడవ ఆదివారం

తపస్సు కాలం మూడవ ఆదివారం
నిర్గమ 20:1-17,  1 కొరింతి 1:22-25,  యో‌హాను 2:13-25
ఈనాడు పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసుకున్న ఒడంబడిక గురించి మరియు ఏసుప్రభు యెరూషలేము దేవాలయమును పవిత్ర పరుచుట గురించి బోధిస్తున్నాయి. గత  రెండు వారాలుగా మనము మొదటి పఠణంలో దేవుడు నోవాతో మరియు అబ్రహాముతో ఏర్పరచుకున్న ఒడంబడికను  గురించి ధ్యానించాం. ఈరోజు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసుకుంటున్న ఒక ఒడంబడికను చదువుకుంటున్నాము. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల చేయటమే కాక వారిని వాగ్దాత్మ భూమికి నడిపించాలి నుంచున్నారు మరియు వారిని శత్రువుల బారి నుండి కాపాడాలని నిర్ణయించుకున్నారు ఇది మాత్రమే కాదు ఈ యొక్క ఒడంబడిక ద్వారా యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు  స్వేచ్ఛనిస్తున్నారు,
వారికి రక్షణనిస్తున్నారు,
 ఇతరుల కన్నా వారిని ఇంకా అధికముగా దీవించుటకై తానే ఒక మార్గ చూపరిగా ఉంటానని తెలుపుచున్నారు. ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసుకునే ముందు వారికి పది ఆజ్ఞలను ప్రభువు దయచేసి చేస్తున్నారు. ఈ యొక్క ప్రతి ఆజ్ఞలకు విధేయులై జీవించినట్లయితే వారికి తాను దేవుడై ఉండి ఎల్లప్పుడూ కూడా వారిని ఆశీర్వదిస్తాను అని ప్రభువు తెలియచేస్తున్నారు. ఇజ్రాయేలు ప్రజలు దేవుడు ఒక్కసారిగా వారిని ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకొని రావటం ద్వారా ఆయన మీద అపారమైనటువంటి నమ్మకం పెరిగింది అందుకని ఒక మాటతో వారందరూ కూడా మేము దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులై జీవిస్తామని ఏక స్వరముతో పలికారు అప్పుడు దేవుడు మోషే ద్వారా పది ఆజ్ఞలు ఇస్తూ సీనాయి పర్వతం వద్ద ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసుకుంటున్నారు. 
ఈ పది ఆజ్ఞలు దేవుడు ఎలాంటి వారు అని తెలియచేస్తున్నాయి అలాగే ఒక విశ్వాసి తోటి వారి పట్ల ఏ విధముగా మెలగాలి అని తెలియచేస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క ఆజ్ఞలు మన యొక్క విశ్వాస జీవితంలో మంచిని అనుసరించుటకు, మంచి జీవితం జీవించుటకు సుచనగా ఉన్నాయి. దేవుడిచ్చిన ఈ యొక్క చట్టం ప్రజల యొక్క శ్రేయస్సు కొరకే ఎందుకంటే ప్రతి ఒక్క చట్టం ఉన్నది కూడా మన యొక్క అభివృద్ధి కొరకే. మనము ఏవిధంగా జీవించాలో, జీవించ కూడదో, ఏ విధంగా జీవిస్తే సమాజంలో మంచిగా గౌరవింపబడతాము అని చట్టం మనకు తెలియచేస్తుంది. ఈ యొక్క పది ఆజ్ఞల చట్టం మనలను గొప్పవారిగా తీర్చిదిద్దుతుంది. ఈ యొక్క పది ఆజ్ఞలలో రెండు భాగములు ఉన్నది మొదటిది దేవునికి సంబంధించినది. (1-3 ఆజ్ఞలు)
రెండవది తోటి మానవాళికి సంబంధించినది (4-10). ప్రభువు ఎవరైతే తన యొక్క ఆజ్ఞలకు విధేయులై వాటిని పాటిస్తూ జీవిస్తారో వారిని వేయి తరములు వరకు ఆశీర్వదిస్తానని పలుకుచున్నారు (నిర్గమ 20:6). చాలా సందర్భాలలో దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుటలో మనము విఫలం అయిపోతూ ఉంటాం ఎందుకంటే చాలా సార్లు దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మనం ఇవ్వము అలాగే పొరుగువారి ఎడల చూపించవలసిన ప్రేమను చూపించము. ఈ పది ఆజ్ఞలను మనము ఏ ఆజ్ఞ సంపూర్ణంగా మన జీవితంలో పాటించి ఉన్నాము. చాలా సందర్భాలలో మనం దేవుని యొక్క ఆజ్ఞలు మన జీవితంలో పాటించి లేక పోతున్నామా?. పది ఆజ్ఞలు చాలా విలువైనవి, వీటిని పాటించుట ద్వారా మన యొక్క జీవన శైలి మారుతుంది. ఏసుప్రభు ఇచ్చిన నూతన ఆజ్ఞ ఈ పది ఆజ్ఞల యొక్క సారాంశంగా శిష్యులకి ఇచ్చారు. ఒక్కొక్క ఆజ్ఞ మనం ధ్యానించినట్లయితే నిజంగా మనం దేవుడి విషయంలో విశ్వాసపాత్రులుగా ఉంటున్నామా? అలాగే మన యొక్క పొరుగు వారిని కూడా గౌరవించుకొని జీవిస్తూ ఉన్నామా?  అని మనకు అర్థమవుతుంది.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు ఏసుప్రభు యొక్క సిలువను గురించి తెలియజేస్తున్నారు. ప్రభువు యొక్క శిలువ గురించి ప్రకటించబడాలి. కొందరికి సిలువ అవమానకరంగా ఉండవచ్చు కానీ అదే సిలువ ద్వారా మనందరం కూడా రక్షించబడ్డాం అని పౌలు గారు తెలుపుతున్నారు.
ఈనాటి సువిశేష భాగంలో ఏసుప్రభు యెరూషలేము దేవాలయమును పవిత్ర పరచుట గురించి చదువుకుంటున్నాము. ఎప్పుడైతే ఏసుప్రభు యెరుషలేము దేవాలయంలో జరిగే వ్యాపారాలను ఖండించారు వారందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉంటున్నారు అది మాత్రమే కాక ఈ యొక్క దేవాలయమును పడగొట్టండి దీనిని మూడు రోజుల్లో నిర్మిస్తానని ఏసుప్రభు పలికారు అందుకుగాను అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కోపబడుచున్నారు ఎందుకంటే వాస్తవానికి ప్రతి ఒక్క యూదుడికి మూడు ప్రధానమైనటువంటి అంశాలు ముఖ్యం.
1. భూమి
2. రాజు
3. దేవాలయం 
యూదులకు సొంత భూమి లేదు ఎందుకంటే వారు రోమీయుల చేత పరిపాలింపబడ్డారు అదే విధంగా వారికి సొంత రాజు లేదు ఎందుకంటే రాజ్యాలు విడిపోయాయి కాబట్టి కేవలము వారికి ఉన్నది దేవాలయము మాత్రమే అందరూ కూడా వచ్చి ప్రార్థనలు చేసుకోవడానికి ఉన్న ఏకైక స్థలం దేవాలయం కాబట్టి ఆ స్థలమును కూడా కూల్చివేస్తే ఇక ఏది కూడా వారి సొంతమైనది లేదు కాబట్టి ఆ మాటలకు వారు కోపపడుతున్నారు అందుకే ప్రభువును హింసించాలనుకున్నారు. వాస్తవానికి ఏసుప్రభు యొక్క కోపం మంచిని ఉద్దేశించినది ఎందుకంటే దేవాలయము ప్రార్థించుటకు దేవుడిని ఆరాధించుటకు,స్తుతించుటకు, బలులు సమర్పించుటకు ఏర్పరచబడినది కానీ అక్కడ వ్యాపారం ద్వారా ప్రాముఖ్యత ఇవ్వవలసిన దానికి ఇవ్వకుండా అంతయు కూడా స్వార్థపూరితంగా మారినది అందుకని ఏసుప్రభు వారి యొక్క కపటత్వం చూసి వారిని ఖండిస్తున్నారు. ఏసుప్రభు యొక్క రాకతో మరొక్కసారి యెరుషలేము దేవాలయం తన యొక్క పూర్వ వైభవమును పొందుతుంది. తన రాకతో మరొకసారి ఆ దేవాలయమును పవిత్ర పరిచారు. మనము కూడా దేవుని యొక్క ఆలయము అని పునీత పౌలు గారు అన్నారు కాబట్టి దేవుడు కొలువై ఉండే మన యొక్క హృదయములను శరీరమును ఎల్లప్పుడూ కూడా పవిత్రంగా ఉంచుకొని జీవించాలి మన యొక్క జీవితములను పవిత్రంగా ఉంచుకోవాలి అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించాలి.
Fr. Bala Yesu OCD

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...