23, సెప్టెంబర్ 2023, శనివారం

25 వ సామాన్య ఆదివారం

 

25 సామాన్య ఆదివారం

యెషయ 55:6-9

 ఫిలిప్పీ 1:20, 24,27

 మత్తయి 20:1-16

 

ఈనాటి దివ్య పఠణములు దేవుడు తన ప్రజలకు చేయు న్యాయమును గురించి  అలాగే మానవుల పట్ల ఆయన చూపే దయ గురించి కూడా తెలుపుచూ ఉన్నారు. ప్రభువు అందరి యెడల సమన్యాయంను చూపిస్తారు. ఎవరి పట్ల కూడా పక్షపాతం చూపించరు. కొన్ని కొన్ని సందర్భాలలో మనకు జరిగేటటువంటి సంఘటనలను బట్టి ఏది న్యాయమో? ఏది అన్యాయము? తెలియదు కాబట్టి మన యొక్క ఆలోచన ప్రకారం దానిని తీర్పు చేస్తాము. న్యాయం అందరికీ ఒకలాగై ఉండాలని వాదించడం సహజం కానీ చాలా సందర్భంలో మనం స్వార్ధంగా ఉండి మనకు అనుకూలంగా తీర్పు గాని, న్యాయం గాని ఇచ్చుకుంటాం. దేవుని యొక్క దృష్టిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు అందరూ కూడా ఆయనకు సరి సమానులే.

ఈనాటి మొదటి పఠణంలో యెషయా ప్రవక్త బానిసత్వం ముగించుకొని యూదాకు తిరిగి వెళ్లే యూదులకు  సంతోషకరమైన వార్తను తెలియచేస్తున్నారు, ప్రభువు వారికి చేరువలోనే ఉన్నారు అని. యెషయా తన ప్రజలకు ప్రతిసారి గుర్తు చేసే అంశం ఏమిటంటే దేవుడు  ఎలాంటి కష్ట సందర్భముల నుండి  వారిని కాపాడి ఉన్నారు తెలుసుకోమని  గుర్తు చేస్తున్నారు. యెషయా గ్రంథము 40 అధ్యాయము నుండి 55 అధ్యాయం వరకు బాబిలోనియా బానిసత్వం ముగించే అంశము గురించి ప్రవక్త  తెలుపుచున్నారు. ఈనాడు చదివిన మొదటి పఠణంలో ఇశ్రాయేలు ప్రజలకు ప్రభువు వారికి చేరువులో ఉండి విముక్తిని కలుగ చేస్తున్నారు అని తెలుపుచున్నారు. మాటలు వారిని విశ్వాసంలో బలవంతులుగా చేస్తుంది అలాగే దేవుని యందు నమ్మకమును కూడా పెంచుతుంది.

ప్రవక్త ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తున్నారు వారి యొక్క అవిశ్వాసనీయతయే వారిని బానిసత్వంలోకి నడిపించినది.యెషయ అంటున్నారు "ప్రభువు దొరికినప్పుడే ఆయనను వెదకుడు, ఆయన చేరువులో ఉన్నప్పుడే ఆయనకు ప్రార్థన చేయుడి". మాటల యొక్క అర్థం ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో మగ్గిపోయేటటువంటి సందర్భంలో దేవుడు మమ్ములను విడిచిపెట్టారు, మమ్ము మరచిపోయారు, మేము ఎవరూ లేనటువంటి అభాగ్యులము ఆలోచనతో ఉన్న సందర్భంలో దేవుడు వారికి చేరువులోనే ఉన్నారని గుర్తు చేస్తున్నారు. విముక్తిని కలుగ చేయటం అనేది దేవుడు తన ప్రజలకు దగ్గరగా ఉన్నారు అని అర్థం.

బానిసత్వం ఎందుకంటే వారు చేసిన తప్పుకు పశ్చాత్తాపడి దేవుని చెంతకు తిరిగి రావడం కొరకే. ఇశ్రాయేలు ప్రజలు తమ యొక్క ప్రాంతమునకు వెళ్లేటటువంటి శుభ ఘడియలలో ప్రవక్త గుర్తుచేసే ఇంకొక అంశం ప్రభువుని వెదకమని చెప్తున్నారు. దేవుడిని ఎప్పుడూ కూడా మనము వెదుకుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయనను మనము కనుగొనగలము. పవిత్ర గ్రంథంలో కొన్ని కొన్ని ఉదాహరణలు మనందరికీ కూడా అంశమును విశిదీకరిస్తాయి. ఆయన చేరువులో ఉన్నప్పుడు ఆయనను సమీపించుటకు కొన్ని ఉదాహరణలు:

1. జక్కయ్య ఏసుప్రభు తన ఇంటి గుండా వెళుతున్నారని ఆయనను సమీపించి ఉన్నారు.

2. భర్తిమయి ఏసుప్రభు మార్గము గుండా వెళుతున్నారని విని ఆయనను సంప్రదించారు.

3. పదిమంది కుష్ట రోగులు ప్రభువు చెరువులో ఉన్నప్పుడు ఆయనను సంప్రదించారు.

విధంగా చాలా మంది ప్రభువు చేరువులో ఉన్నప్పుడు ఆయనను సంప్రదించారు దాని ద్వారా వారు దేవుని యొక్క ఆత్మీయ అనుభూతుని, ఆశీర్వాదము పొందారు కాబట్టి మరొకసారి ప్రవక్త గుర్తుచేసే అంశం ఏమిటంటే దేవుడు చేరువులో ఉన్నప్పుడు ఆయనకు ప్రార్థన చేయమంటున్నారు. ప్రార్థన ద్వారా వారు మన యొక్క దేవుడు తమకు అండగా నిలబడుతున్నారు అనే నమ్మకమును కలిగిస్తుంది.

 

ప్రభువు యొక్క అనంతమైనటువంటి దయ కూడా మొదటి పఠణంలో మనకు అర్థమవుతుంది ఆయన దుర్మార్గులు తమ యొక్క పాపపు జీవితమును విడిచిపెట్టి వచ్చినప్పుడు వారి మీద దయ చూపిస్తానంటున్నారు అదేవిధంగా వారి పాపములను క్షమిస్తాను అంటున్నారు. మామూలుగా మనము దుర్మార్గులను క్షమించడానికి ఇష్టపడము కానీ ప్రభువు యొక్క విధానం మాత్రం అది కాదు ఎందుకంటే ఆయన మన అందరిని కూడా క్షమించేవారు, అంగీకరించేవారు. ప్రభు అంటున్నారు నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కాదు, మీ మార్గముల నా మార్గముల వంటివి కావు. దేవుని యొక్క ఆలోచనలు మానవుని యొక్క ఆలోచనలకు భిన్నంగా ఉంటాయి ఎందుకంటే మనందరం కూడా తప్పు చేసిన వాడు శిక్షించబడాలనుకుంటాం. కానీ ప్రభువు మాత్రం తప్పు చేసినటువంటి వ్యక్తి కూడా హృదయ పరివర్తనము చెంది రక్షణ పొందాలి అని భావిస్తూ ఉంటారు. తప్పు చేసిన వానిని మానవుడు క్షమించలేడు తనకు ద్రోహం చేసిన వారిని ప్రేమించలేడు మన్నించలేడు దేవుడు ప్రతినిత్యం కూడా పాపులను మన్నించటానికి సిద్ధంగా ఉంటారు.

మన యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలకు భిన్నంగా ఉంటాయి ఎందుకంటే దేవుడు నిస్వార్థముతో ఆలోచన చేస్తూ ఉంటారు. ఆయన ఎంతో దయ కలిగినటువంటి వారు. ఆయన స్వభావము ఉదారమైనది. మానవుల ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రేమ చాలా గొప్పదైనది, తల్లి తన బిడ్డను మరిచిపోయినా కానీ దేవుడు మాత్రం మనలను మరిచిపోరు అదేవిధంగా ప్రభువు మనందరి యొక్క పేర్లను తన యొక్క అరచేతిలో రాసుకొని మనలను అనునిత్యం గుర్తుంచుకుంటారు అంటే ప్రభువుని యొక్క మనస్సులో మనందరం కూడా ఎప్పుడూ ఉండేటటువంటి వ్యక్తులమే.(యెషయ 49:15-16, 43:1-4) కాబట్టి మనము మన జీవితంలో దేవుడిని అంటిపెట్టుకొని ఆయన వలె దయార్ధ హృదయాన్ని కలిగి జీవించాలి.(కీర్తన 145:8-9).

 

ఈనాటి రెండవ పఠణంలో పౌలు గారు అన్ని సమయములయందు ఆయనకు దేవుడు ఇచ్చిన అనుగ్రహములను వినియోగించి దేవునికి మహిమను, గౌరవమును చేకూర్చుతానని తెలుపుచున్నారు. దేవుని కొరకు మరణించుటకు సంతోషముగా ఉన్నాను అని తెలియజేస్తున్నారు. బహుశా పౌలు గారు ఈయన చెరసాలలో ఉండి యొక్క లేఖ రాసి ఉండవచ్చు అందుకనే ఆయన క్రీస్తు కొరకు మరణించుట సంతోషంగానే భావిస్తున్నానన్నారు.మన యొక్క జీవిత విధానము క్రీస్తు సందేశానుసారముగా ఉండాలి అన్నదే పౌలు గారి యొక్క ముఖ్యమైన సందేశం. కావున మన జీవితంలో ఉత్తమమైనటువంటి మార్గములను ఎన్నుకొని దేవుడు ఇచ్చిన అనుగ్రహాల ద్వారా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ అందరికీ సమన్యాయం చేస్తూ దేవుని వలె మంచిగా, దయ కలిగిన హృదయముతో జీవించాలి.

మన జీవితం ద్వారా దేవునికి గౌరవమును కలిగించాలి.

ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు పరలోక రాజ్యము విధముగా ఉంటుంది అలాగే దేవుని యొక్క జాలి హృదయం గురించి తెలుపుచున్నారు. ఒక యజమాని ద్రాక్ష తోటలో పనిచేయుట కొరకై వివిధ సమయాలలో కూలీలను పంపిస్తున్నారు. వారితో రోజుకు ఒక్కొక్క దినారం చొప్పున ఇస్తాను అని ఒప్పందం చేసుకున్నారు. యజమానుడు తన యొక్క ఉదార స్వభావంతో పని లేక సంతలో ఖాళీగా ఉన్నటువంటి వారందరికీ కూడా పనిని సమకూరుస్తున్నారు. ప్రాఃతకాల సమయమున కొందరిని, ఉదయం 9 గంటలకు కొందరిని, 12 గంటలకు కొందరిని,  3 గంటలకు కొందరిని మరియు 5 గంటలకు కొందరిని పనిచేయుటకు నియమిస్తున్నారు.

సాయం సమయమున యజమాని పనివారికి ఒక్కొక్కరికి ఒక దినారము చొప్పున  కూలినివ్వటం ప్రారంభించాడు. చివరిగా వచ్చిన వారికి ఒక దినారమిచ్చుట చూచిన వాళ్లు మొదటిగా పనిచేయడానికి వచ్చిన మనకు  ఎక్కువగా వస్తుంది అని ఆశించారు. యజమాని మాత్రం తాను ఇచ్చిన మాట ప్రకారంగా అందరికీ ఒక్కొక్క దినానము చొప్పున ఇస్తూ సమన్యాయమును చేసి ఉన్నారు. ఎవరికి ఎటువంటి అన్యాయం చేయలేదు. ఒక విధంగా ఆలోచన చేస్తే యజమాని ఒక్క ప్రవర్తన కొద్దిగా వింతగా ఉంటుంది ఎందుకంటే చివరి ఘడియల్లో వచ్చిన వారికి కూడా ఒక దినారం ఇవ్వటం చాలా అరుదు. అయితే దానిలో ఒక అర్థం దాగి ఉన్నది అది ఏమిటంటే కాలంలో కూలి వాని యొక్క వేతనం ఒక రోజుకు ఒక దినారం.

ఒక దినారం ఒక రోజుకు ఒక కుటుంబ పోషణకు సరిపోయే కూలితో సమానం. యజమాని తన పనివారలకు అంతకు తక్కువ కూలిస్తే రోజు వారి కుటుంబాలు ఆకలితో అలమటించాల్సిందే. కూలి వారి యొక్క స్థితి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి అదే విధముగా వారికి రోజు పని దొరకడం కష్టం కాబట్టి యజమాని కనీసం దినారముతోనైనా కుటుంబములు తన వలన సంతృప్తిగా భోజనం చేసి ఉండాలి అన్నదే ఆయన యొక్క ఆశ. సువిశేష వచనములను ఒకసారి గమనించినట్లయితే కూలి పని చేసేవారు డబ్బులు లేనందున ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు అంటే వారు ఎంత పేదరికంలో ఉన్నారు అర్థం చేసుకోవాలి.

మనం కూడా కొన్ని కొన్ని సార్లు సిటీల్లో, సంతలలో చూస్తూ ఉంటాం పనిచేయటానికి అందరు కూడా ఒక స్థలంలో ఉంటారు యజమానులు వచ్చి వారిని పిలుచుకుని వెళ్తుంటారు ఇది ఉదయం సమయంలో మాత్రమే జరుగుతుంది కానీ ఇక్కడ చెప్పబడినటువంటి వ్యక్తులు మాత్రము ఉదయము నుండి సాయంకాలం ఐదు గంటలు వరకు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు వారికి సంపాదన ఎంత అవసరమో, విలువైనదో మనము గ్రహించుకోవాలి.

ఎదురుచూసిన వారికి తగినటువంటి ప్రతిఫలము యజమానుడు ఇస్తున్నాడు. ఎదురు చూసే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రతి ఫలము దొరుకుతుంది. రక్షకుని కొరకు ప్రజలు ఎదురు చూశారు వారికి రక్షకుడు దొరికారు అలాగే పని కోసం ఎదురుచూసే వారికి పని దొరుకుతున్నది వాస్తవముగా చెప్పాలంటే యజమానుడు ఎవరికినీ అన్యాయం చేయలేదు ఎందుకంటే వారితో ఆయన చేసుకున్నటువంటి ఒప్పందము ప్రకారమే ఆయన ప్రతి ఒక్కరితో న్యాయంగా ప్రవర్తించారు. కానీ ఉదయం నుండి రోజంతా పనిచేసిన వారికి అసూయ కలిగినది స్వార్థంతో వారు ఆలోచించి ఉన్నారు. యజమానుడి యొక్క మాటలు మరచిపోయాయి అందుకని మనసులో గొనుగుతున్నారు. ఆకలితో అలమటించే సోదరుడికి కూడా అన్నం దొరికిందని సంతోషించకుండా ఎదుటి వ్యక్తి లబ్ది పొందాడు అని సహనంతో ఉన్నారు. మనం కూడా ఎదుటి వ్యక్తి అభివృద్ధి చెందుతూ ఉంటే సహించలేకపోతుంటాం. అందుకే మనం గ్రహించవలసింది ఏమిటంటే దేవుడు మనకన్నా మిన్నగా ఆలోచన చేస్తూ ఉంటారు. అందరి యెడల ప్రేమ కలిగి ఉంటారు.

 దేవుడు ఎల్లప్పుడూ తాను చేసినటువంటి వాగ్దానములకు విధేయుడై జీవిస్తారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసి ఉన్నారు "నేను మీకు తండ్రినై ఉంటానని" ఆయన వాగ్దానం నెరవేర్చి ఉన్నారు కానీ ప్రజలే మరచిపోయారు దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. దేవుడు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం చేస్తున్నారు.

యొక్క ఉపమానములో యజమానుడి యొక్క ఉదార స్వభావము మనకు అర్థమవుతుంది. ఆయనకు దారాళంగా ఇచ్చేటటువంటి మనస్సు ఉన్నది.

సువిశేష భాగములో మనము గమనించుకోవలసిన ఇంకొక విషయం ఏమిటంటే ఎప్పుడు వచ్చాము అన్నది ముఖ్యం కాదు ఎలా  పని చేసాము, జీవించాము అన్నది ముఖ్యం. ఉదాహరణకు పుట్టు క్రైస్తవుల కన్నా కొత్తగా క్రీస్తుని తెలుసుకున్నటువంటి విశ్వాసులే మిన్న. మొదటి వారు కడపటి వారందరూ అని ప్రభువు అంటున్నారు అంటే ఎవరైతే చివరిగా వచ్చినా మంచిగా జీవిస్తారో వారు తప్పనిసరిగా దేవుని దృష్టిలో మంచి వారిగా, ప్రదములుగా పరిగణింపబడతారు అని అర్థం.

కాబట్టి మనము కూడా ఉదార స్వభావం కలిగి ఉండాలి, తోటి సోదరుల పట్ల దయ కలిగి ఉండాలి. ఎవరికి అన్యాయం చేయకుండా న్యాయముగా జీవించుటకు ప్రయత్నం చేయాలి.

Fr. Bala Yesu OCD

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...