తపస్సు కాల రెండవ ఆదివారం
ఆది 22:1-2, 9-18, రోమి 8:31-34
మార్కు 9:2-10
తపస్సు కాలము అనగానే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది క్రీస్తు ప్రభువు మన కొరకు సమర్పించిన కల్వరి బలి. మన మీద ఉన్న ప్రేమ చేత ఏసుప్రభు తన జీవితాన్ని త్యాగం చేసి మనందరికీ కూడా రక్షణను స్వేచ్ఛను ప్రసాదించి ఉన్నారు. ఈనాటి దివ్య గ్రంథములు కూడా మనకు బోధించేటటువంటి అంశములు ఏమిటి అంటే అబ్రహాము సమర్పించిన బలి విధానము మరియు క్రీస్తు ప్రభువు యొక్క బలి
అదే విధముగా క్రీస్తు ప్రభువు యొక్క దివ్య రూప ధారణ. ఈ మూడు పఠణములలో మూడు పర్వతముల గురించి తెలియజేయబడ్డవి.
1. మోరియా పర్వతము
2. కల్వరి కొండ
3. తాబోరు పర్వతం
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు అబ్రహామును ఇస్సాకును బలిగా ఇవ్వమన్న వృత్తాంతము చదువుకున్నాం. ఈ మొదటి పఠణంలో మనము గమనించవలసిన అంశములు ఏమిటి అంటే
1. అబ్రహాము యొక్క విశ్వాస జీవితం.
2. అబ్రహాము యొక్క త్యాగం
3. అబ్రహాము యొక్క బాధ
4. దేవుని మీద ఆధారపడటం
5. అబ్రహం యొక్క ధైర్యం
6. అబ్రహాము యొక్క స్వేచ్ఛ
పవిత్ర గ్రంథములో దేవుడు ఎక్కడ ఎప్పుడు అబ్రహామును మినహా ఎవరిని కూడా మానవుని బలిగా ఇవ్వమని కోరలేదు. మొట్టమొదటిసారిగా దేవుడు అబ్రహామును తన కుమారుడిని బలిగా ఇవ్వమంటున్నారు ఈ వాక్యము చదివిన సందర్భంలో మనందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే ఎందుకు దేవుడు ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రిని తన కుమారుడిని బలిగా ఇవ్వమంటున్నారు. చాలామందికి ఇది న్యాయమా? అని అనిపించవచ్చు కానీ ఇది కేవలం అబ్రహాము యొక్క విశ్వాస జీవితమును పరీక్షించుట కొరకై ఎందుకంటే అబ్రహాముతో దేవుడు ఒక శాశ్వతమైనటువంటి ఒడంబడిక చేసుకోబోతున్నారు కాబట్టి ఆయన యొక్క విశ్వాస జీవితం ఇంకా స్థిరముగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశం నిమిత్తమై ప్రభువు అబ్రహామును పరీక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో విశ్వాస పరీక్షలు అవసరం (యాకోబు 1:12). ఈ మొదటి పఠణ ప్రారంభ వచనము మనకు ఈ అంశం గురించి తెలియజేస్తూ ఉన్నది ఇది కేవలము అబ్రహాము యొక్క విశ్వాస జీవితంను పరీక్షించుట కొరకై దేవుడు తన కుమారుడిని బలిగా ఇవ్వమని అంటున్నారు. వాస్తవానికి అబ్రహం దేవుని యొక్క స్వరమును ఆలకించి వెంటనే దానిని ఆచరణలో పెడుతున్నారు.
- దేవుడు అబ్రహాము యొక్క ఏకైక కుమారుడని, తాను ప్రేమించే కుమారుడిని సమర్పించమని సందర్భములో ఆయన దేవుడిని ప్రశ్నించలేదు, దేవుడితో ఎటువంటి వాదనకు దిగలేదు. ఆయన సంపూర్ణంగా దేవుడిని విశ్వసించి ఉన్నారు కాబట్టే మరొక ప్రశ్న ప్రభువుని అడగక వెంటనే దేవుని యొక్క మాట ప్రకారముగా జీవింప సాగారు. అబ్రహాముకు ఇస్సాకు విలువైనవాడు, చాలా ప్రేమను పెంచుకున్నాడు, తండ్రి కుమారుల బంధం బలముగా ఏర్పడిన సమయంలో ప్రభువు తన కుమారుడిని బలిగా సమర్పించమన్నప్పుడు ఆ తండ్రి యొక్క హృదయ వేదన ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి అయినప్పటికీ కేవలము దేవుడు అడిగారు అనేటటువంటి ఉద్దేశ్యంతో దేవుని కొరకు తన సమస్తమును, తన ఆశలు పెట్టుకున్నటువంటి కుమారుడిని కూడా సమర్పించుటకు వెనుకంజ వేయలేదు అందుకే అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని పిలుస్తుంటారు. ఈ గొప్ప కార్యము ద్వారా దేవుడు అబ్రహాము అతని యొక్క సంతతిని ఇంకా అధికముగా దీవిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు.
-ఈ యొక్క మొదటి పఠణంలో కేవలం అబ్రహాము యొక్క గొప్పతనమును మాత్రమే కాదు మనము ధ్యానించవలసినది మరియు ఇస్సాకు యొక్క ప్రేమ. తన తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ వలన ఇస్సాకు ఆయన చేతులను బంధించినప్పటికీ ఎటువైపు పారిపోకుండా తనను తాను తండ్రికి సమర్పించుకున్నాడు ఇది ఆయన తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనం. ఇస్సాకు కావలిస్తే ఆయన తండ్రి నుండి దూరంగా పారిపోవచ్చు కానీ అలా చేయకుండా తండ్రిని గౌరవిస్తూ ఆయన తనను తానే భలిగా అర్పించుట కొరకు సిద్ధమయ్యాడు. ఇస్సాకు బలి ఏసుప్రభు యొక్క కల్వరి బలికి సూచనగా ఉన్నది. ప్రభువు కూడా తనను తాను కల్వరి కొండ మీద మన నిమిత్తం తండ్రి నిమిత్తము సమర్పించుకుని ఉన్నారు.
- మోరియా పర్వతము మీద ఇస్సాకు బలిని దేవుడు మధ్యలో ఆపివేస్తూ ఈసాకుకు బదులుగా గొర్రె పిల్లను బలిగా అంగీకరించారు.
- రెండవ పఠణములో ఏసుప్రభు తాను కల్వరి మీద సమర్పించిన బలిని గురించి పునీత పౌలు గారు తెలియజేస్తున్నారు. కల్వరి కొండ మన రక్షణను జ్ఞాపకం చేస్తుంది, మనకు పాప క్షమాపణను దయచేసిన పర్వతం రక్షకుడు మనందరి యొక్క నిమిత్తమై మరణించి మనకు స్వేచ్ఛను జీవమును ప్రసాదించి ఉన్నారు కాబట్టి మనం హృదయ పరివర్తనము చెంది ఆయనను విశ్వసిస్తూ ఆయన యొక్క చిత్తానుసారంగా జీవించాలి.
-ఈనాటి సువిశేష భాగములో యేసు ప్రభువు యొక్క దివ్యరూపధారణ గురించి చదువుకుంటున్నాము.యేసు ప్రభువు యొక్క పరలోక మహిమ భూలోకంలో ఉన్నటువంటి శిష్యులకు తెలియచేయబడిన సందర్భంలో శిష్యులు పరలోకము నుండి తండ్రి స్వరమును ఆలకించారు. ఈయన నా ప్రియమైన కుమారుడు ఇతనిని ఆలకించండి. ఆలకించటం అనేది చాలా ప్రధానమైన కార్యం దేవుడు గురించి ఎక్కువగా తెలియాలంటే, దేవుడిని ఆరాధించాలన్న మనకు ఆలకించే మనసు ఉండాలి. పునీత పౌలు గారు అంటారు వినుటవలన విశ్వాసము కలుగును అని. కేవలం శ్రద్ధగా వినుట ద్వారానే మనలో విశ్వాసము పెంపొందించబడుతున్నది. వినుట ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది అంటే ఏసుప్రభు యొక్క సమయములో మరియు తన తరువాత తన యొక్క శిష్యులు శుభవార్తను ప్రకటించిన సందర్భంలో వారి చేతులలో పవిత్ర గ్రంథము లేదు కేవలం ఏ అంశములు అయితే వారు యేసు ప్రభువు నుండి విన్నారో అదే విధముగా ప్రజలు శిష్యుల నుండి విన్నారో వాటిని విశ్వసించి ఉన్నారు. కాబట్టి మన అందరి యొక్క జీవితంలో మనము దేవుని యొక్క వాక్యమును ఏ విధముగా ఆలకిస్తూ ఉన్నాం. ఆయన వాక్కును మనము ప్రేమతో విన్నప్పుడే దానిని మన జీవితంలో ఆచరించగలం.
మనలో ప్రేమ ఉన్న సందర్భంలోనే ఎదుటి వ్యక్తి యొక్క మాటలను మనము వినగలుగుతూ ఉంటాము. మన యొక్క రెండు చెవులను ఒకటిగా జత చేస్తే అవి ప్రేమ చిహ్నంగా మారుతాయి. దేవుని యొక్క వాక్యమును ప్రేమతో ఆలకించాలి,విశ్వాసముతో ఆలకించాలి, పూర్ణ హృదయముతో ఆలకించాలి. ఆ వాక్యము నా జీవిత యొక్క అభివృద్ధి కొరకే అనేటట్లుగా ఆలకించాలి. దేవుని యొక్క వాక్కును సహనముతో ఆలకించాలి అప్పుడే మన జీవితములో మార్పు అనేది వస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్కును ఆలకించి జీవించిన వారి యొక్క జీవితములు అభివృద్ధి చెందుతూ ఉన్నవి అదే దేవుని యొక్క వాక్కును నిరాకరించి జీవించిన వారి యొక్క జీవితములు శిక్షకు గురి అవుతూ ఉన్నవి ఈరోజు దేవుడు మనందరికీ కూడా ఆయన వాక్కును ఆలకించుమని తెలియచేస్తున్నారు మరి ఏమిటి ఆయన యొక్క వాక్కులు?
1. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమింపుము
2. నీ శత్రువులను ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయుము.
3. నీ తోటి వానితో సఖ్యపడు
4. అన్యాయం చేయకుండా న్యాయముతో జీవింపుము.
5. నన్ను అనుసరింప గోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని అనుసరించవలెను.
6. వినయం కలిగి జీవించమని తెలుపుచున్నారు. ఇంకా అనేకమైన వాక్కులు ఉన్నవి.
ఆయన చెప్పిన విధంగా మనము జీవించినట్లయితే. మనందరం కూడా రూపాంతరం చెందుతాం కాబట్టి ఆయన వాక్కు ఆలకించి అని ప్రకారంగా జీవించుదాం.
Fr. Bala Yesu OCD